ప్రధాన మంత్రి కార్యాలయం
ముద్ర యోజన లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ
* ఏ నిర్ధిష్ట సమూహానికి పరిమితం కాకుండా యువత తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ముద్ర యోజన లక్ష్యం: ప్రధాని
* ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడంలో, స్వావలంబన సాధించడంలో ముద్ర యోజన గుణాత్మక ప్రభావాన్ని చూపిస్తోంది: పీఎం
* ఔత్సాహిక పారిశ్రామిక రంగంపై సమాజ అభిప్రాయాన్ని మార్చే నిశ్శబ్ద విప్లవాన్ని ముద్ర యోజన తీసుకొచ్చింది: పీఎం
* ముద్ర పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ శాతం మహిళలే: పీఎం
* ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేసిన రుణాల సంఖ్య 52 కోట్లు, ఇది అంతర్జాతీయ స్థాయిలో సాధించిన అసమాన విజయం: పీఎం
Posted On:
08 APR 2025 12:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పథకం లబ్ధిదారులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. న్యూఢిల్లీలోని 7, లోకకల్యాణ్ మార్గ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులను ఇంటికి ఆహ్వానించడంలో సాంస్కృతిక ప్రాధాన్యాన్ని, వారి రాక తీసుకొచ్చే పవిత్రత గురించి చెబుతూ ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. తమ అనుభవాలను పంచుకోవాలని వారిని కోరారు. పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, ఔషధాలు, సేవలు అందించే వ్యాపారితో శ్రీ మోదీ సంభాషించారు. ఈ సందర్భంగా కష్ట సమయాల్లో తమ సామర్థ్యాన్ని నమ్మిన వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం గురించి ప్రధాని వివరించారు. తమకు రుణం మంజూరు చేసిన బ్యాంకు అధికారులను ఆహ్వానించి.. తమ ప్రగతిని వారికి చూపించాలని సూచించారు. ఇలాంటి చర్యలు కలలను నిజం చేసుకోవాలనుకొనే వారికి తోడ్పాటును అందించాలనే అధికారుల నిర్ణయానికి మరింత విశ్వాసాన్ని జోడిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా లబ్ధిదారులు సాధించిన వృద్ధిని, విజయాన్ని చూసి వారు గర్వపడతారని మోదీ అన్నారు.
కేరళకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రీ గోపీ కృష్ణతో ప్రధాని మాట్లాడారు. గృహాలు, కార్యాలయ అవసరాలకు అనువైన పునరుత్పాదక ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించి, ఉద్యోగావకాశాలు కల్పించేలా విజయవంతమైన వ్యాపారవేత్తగా మారేందుకు ముద్ర యోజన అతడిపై ఎలా ప్రభావం చూపిందో ప్రధాని వివరించారు. లబ్ధిదారుని గురించి మరిన్ని వివరాలు పంచుకుంటూ.. ముద్ర యోజన గురించి తెలుసుకున్న అనంతరం దుబాయ్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారని తెలిపారు. పీఎం సూర్యఘర్ యోజన ద్వారా సౌరఫలకాలు ఏర్పాటు చేసే ప్రక్రియ రెండు రోజుల్లోనే పూర్తయిందని వెల్లడించారు. పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారుల నుంచి వస్తున్న స్పందన గురించి ప్రధాని తెలుసుకున్నారు. అధిక వర్షాలు, దట్టంగా పెరిగిన చెట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కేరళ ప్రజలు ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో రూ.3,000 వచ్చే విద్యుత్ బిల్లులు ఇప్పుడు రూ. 240 నుంచి రూ.250కి పరిమితమవతున్నాయని, తన నెలవారీ ఆదాయం రూ. 2.5 లక్షలు దాటిందని శ్రీ కృష్ణ తెలిపారు.
అనంతరం, చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్తతో ప్రధాని ముచ్చటించారు. హౌజ్ ఆఫ్ పుష్ప పేరుతో ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంట్లో వంట చేయడం దగ్గర నుంచి విజయవంతంగా కెఫె వ్యాపారం ప్రారంభించే వరకు సాగిన తన ప్రయాణాన్ని ఆమె వివరించారు. లాభాల మార్జిన్లు, ఆహార వ్యయ నిర్వహణపై చేసిన అధ్యయనం తన వ్యాపారం విజయవంతమవడంలో సహకరించిందని ఆమె తెలిపారు. భయంతో యువత సవాళ్లను స్వీకరించలేకపోతున్నారని, ఉద్యోగాలు చేసేందుకే ప్రాధాన్యమిస్తున్నారని ఆమె అన్నారు. దీనికి స్పందించిన ప్రధానమంత్రి సవాళ్లను స్వీకరించే సామర్థ్యం గురించి వివరించారు. 23 ఏళ్ల వయసులో సవాళ్లను స్వీకరించి, సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ తన వ్యాపారాన్ని హౌజ్ ఆఫ్ పుష్ప వ్యవస్థాపకురాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. చదువుతున్న, కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న తన స్నేహితుల మధ్య రాయపూర్లో జరిగిన చర్చల గురించి వివరిస్తూ.. ఔత్సాహిక పారిశ్రామిక రంగంపై వారికున్న ఆసక్తి, సందేహాల గురించి తెలియజేశారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ప్రభుత్వం అందిస్తున్న రుణాలపై యువతలో అవగాహన లోపించిందని ఆమె అన్నారు. ముద్ర, పీఎంఈజీపీ తరహా రుణ పథకాలు గణనీయమైన అవకాశాలను అందిస్తున్నాయని, ఈ పథకాలను అధ్యయనం చేసి, ధైర్యంగా అడుగు ముందుకేయాలని తోటి యువతకు సూచించారు. వృద్ధిని, విజయాన్ని కోరుకొనేవారికి ఆకాశమే హద్దని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉద్యోగం కోసం వెతుక్కోవడం దగ్గరి నుంచి ఇతరులకు ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి చేరుకున్న తన ప్రయాణం గురించి కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన బేక్ మై కేక్ యజమాని శ్రీ ముదస్సిర్ నక్ష్‌బంది వివరించారు. బారాముల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 42 మందికి స్థిరమైన ఉద్యోగాలను తాను కల్పించినట్లు పేర్కొన్నారు. ముద్ర రుణం తీసుకోక ముందు అతని ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానమంత్రి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తన ఆదాయం వేలల్లో ఉండేదని ఇప్పుడు అది లక్షలు, కోట్లకు చేరుకుందని తెలిపారు. ముదస్సిర్ వ్యాపార కార్యకలాపాల్లో యూపీఐ విస్తృతంగా వినియోగిస్తున్నారని ప్రధాని అన్నారు. యూపీఐ ద్వారా 90 శాతం లావాదేవీలు జరుగుతుండగా, మిగిలిన 10 శాతం మాత్రమే నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్న ముదస్సిర్ పరిశీలనను ప్రధాని గుర్తించారు.
వాపిలో ఉద్యోగిగా పనిచేయడం దగ్గర నుంచి సిల్వసాలో వ్యాపారిగా మారిన తన ప్రయాణం గురించి శ్రీ సురేష్ ప్రధానమంత్రికి వివరించారు. అవసరాలు తీర్చుకొనేందుకు ఉద్యోగం ఒక్కటే సరిపోదని గుర్తించి 2022లో సొంతంగా వ్యాపారం ప్రారంభించానని సురేష్ తెలిపారు. తాను సాధించిన విజయంతో తన స్నేహితుల్లో కొంతమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ముద్ర రుణాలకు దరఖాస్తు చేయాలని భావిస్తున్నారని తెలిపారు. ఇలాంటి విజయగాథలు ఇతరులను సైతం వ్యాపార రంగం వైపు నడిచేలా స్ఫూర్తి నింపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
ప్రధానమంత్రి నాయకత్వంలో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి రాయబరేలీకి చెందిన మహిళా వ్యాపారవేత్త ధన్యవాదాలు తెలియజేశారు. అనుమతులు, నిధులు పొందే ప్రక్రియ గతంలో క్లిష్టంగా ఉండేదని, ప్రసుతం అది సులభతరమైందని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడంలో తన వంతు సాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. భావోద్వేగంతో నిండిన ఆమె కథను, ఏడు నుంచి ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తూ నెలకు రూ.2.5 నుంచి రూ.3.5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్న ఆమె బేకరీ వ్యాపారాన్ని ప్రధాని ప్రశంసించారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి వచ్చిన శ్రీ లవకుశ్ మెహ్రా 2021లో రూ.5లక్షల రుణంతో ఫార్మాసూటికల్ వ్యాపారాన్ని ప్రాంరభించారు. ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ తన రుణాన్ని రూ.9.5 లక్షలకు పెంచుకున్నారు. తద్వారా మొదటి ఏడాది నుంచి రూ. 12 లక్షల వార్షికాదాయంతో రూ. 50 లక్షల టర్నోవర్ సాధించినట్టు తెలిపారు. ఏ నిర్ధిష్ట సమూహానికి పరిమితం కాకుండా యువత తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ముద్ర యోజన లక్ష్యమని ప్రధానమంత్రి తెలియజేశారు. లవకుశ్ సాధించిన తాజా విజయాల గురించి కూడా వివరించారు. వాటిలో రూ. 34 లక్షలతో ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు రూ.1.5 లక్షలకు పైగా నెలవారీ ఆదాయం ఉన్నాయి. గతంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో రూ.60,000 నుంచి రూ.70,000 వరకు మాత్రమే వచ్చేవని వెల్లడించారు. ఈ విజయాన్ని సాధించేందుకు లవకుశ్ చేసిన కృషిని ప్రధాని ప్రశంసిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ముద్ర యోజన అందించే ప్రయోజనాల గురించి ఇతరుల్లో అవగాహన కల్పించాలని పథకం లబ్ధిదారులను కోరారు.
21 ఏళ్ల వయసులోనే ఆదిత్య లాబ్ ప్రారంభించిన గుజరాత్‌లోని భావనగర్‌కు చెందిన మెకట్రానిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థి స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ప్రధాని తెలుసుకున్నారు. ఈ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త కిశోర్ విభాగంలో రూ. 2 లక్షల ముద్ర రుణాన్ని వినియోగించుకొని 3డీ ప్రింటింగ్, రివర్స్ ఇంజినీరింగ్, ర్యాపిడ్ ప్రొటోటైపింగ్, రోబోటిక్స్‌లో తన వ్యాపారాన్ని ప్రారభించారు. పనిదినాల్లో కళాశాలకు వెళుతూ, వారాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్యార్థి అంకితభావాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. కుటుంబ సహకారంతో రిమోట్ విధానంలో పనిచేస్తూ నెలకు రూ. 30,000 నుంచి రూ. 35,000 వరకు ఆర్జిస్తున్నారు.
కూరగాయల మార్కెట్లో పనిచేయడం దగ్గర నుంచి వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించడం వరకు సాగిన తన కథను మనాలీకి చెందిన మహిళా వ్యాపారవేత్త పంచుకున్నారు. 2015-16లో రూ.2.5 లక్షల ముద్ర రుణంతో తన వ్యాపారాన్ని ప్రారంభించానని ఆమె తెలిపారు. దాన్ని రెండున్నరేళ్లలోనే తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. అనంతరం వరుసగా రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 15 లక్షల రుణాన్ని తీసుకొని తన వ్యాపారాన్ని కూరగాయల దుకాణం నుంచి రేషన్ షాపు నిర్వహణ వరకు విస్తరించారు. వీటి ద్వారా ఆమెకు ఏడాదికి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అంకింత భావాన్ని, వారిపై ముద్ర యోజన చూపిస్తున్న సానుకూల ప్రభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
అనంతరం గృహిణి స్థాయి నుంచి జనపనార సంచుల వ్యాపారిగా మారిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త విజయగాథను ప్రధానమంత్రి తెలుసుకున్నారు. గ్రామీణ స్వయం ఉపాధి సంస్థలో శిక్షణ అనంతరం కెనరా బ్యాంకు నుంచి 2019లో రూ. 2 లక్షల హామీరహిత ముద్ర రుణాన్ని పొందారు. ఆమె సంకల్పాన్ని, ఆమె సామర్థ్యంపై బ్యాంకుకున్న నమ్మకాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జ్యూట్ శిక్షణ నిపుణురాలిగా, వ్యాపారవేత్తగా రెండు పాత్రలను సమర్థంగా పోషిస్తున్న తీరును, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారా గ్రామీణ మహిళల సాధికారతకు ఆమె చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు. ఔత్సాహిక పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో, స్వావలంబన సాధించంలో ముద్ర యోజన చూపిస్తున్న గుణాత్మక ప్రభావాన్ని ప్రధానమంత్రి వివరించారు.
పౌరులకు ముఖ్యంగా మహిళలకు సాధికారత కల్పించడంలో, దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడంలో ముద్ర యోజన చూపిస్తున్న గుణాత్మక ప్రభావాన్ని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అణగారిన వర్గాలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఆర్థిక సాయం అందించిందో వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికరంగం గురించి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకొస్తూ ముద్ర యోజన తీసుకొచ్చిన నిశ్శబ్ధ విప్లవం గురించి శ్రీ మోదీ వివరించారు. ఈ పథకం మహిళలకు ఆర్థికసాయంతో పాటు, తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలను అందిస్తోంది. ఈ రుణాల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే అని పేర్కొన్నారు. రుణాల దరఖాస్తులు, అనుమతులు, తిరిగి చెల్లించడంలో మహిళలే ముందున్నారని తెలిపారు.
ముద్ర రుణాలను బాధ్యతాయుతంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యక్తుల్లో క్రమశిక్షణ పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. నిధుల దుర్వినియోగాన్ని, ఫలితమివ్వని ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ.. జీవితాన్ని, కెరీర్‌ను నిర్మించుకొనే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందని తెలిపారు. ఎలాంటి హామీ లేకుండా ఇప్పటి వరకు రూ.33లక్షల కోట్ల రుణాలను ముద్ర యోజన ద్వారా అందించామని ప్రధానమంత్రి తెలిపారు. సంపన్న వర్గాల వారికి ఇచ్చిన మొత్తం ఆర్థిక సాయాన్ని ముద్ర యోజన అధిగమించిందని తెలిపారు. ఉద్యోగాలను సృష్టించడంలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో రుణాలను సమర్థంగా ఉపయోగించుకున్న యువత ప్రతిభపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ముద్ర యోజన పథకం ద్వారా జరిగిన ఉద్యోగ కల్పన దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా తోడ్పడిందని శ్రీ మోదీ అన్నారు. సామాన్యుల ఆదాయం పెరిగి, వారి జీవన ప్రమాణాలు మెరుగై, వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఖర్చు చేస్తుండటాన్ని ప్రధాని గమనించారు. ఈ పథకం ద్వారా కలిగిన సామాజిక ప్రయోజనాల గురించి సైతం ఆయన వివరించారు.
ఈ అంశంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి గురించి వివరిస్తూ.. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా పదేళ్ల తర్వాత కూడా ఈ పథకం అమలవుతున్న తీరు గురించి తాము అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు, సంఘాలను సంప్రదించి ఈ పథకం అభివృద్ధిని సమీక్షిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ఉన్న అవకాశాలన గుర్తించి, అవసరమైన సంస్కరణలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ముద్ర రుణాల పరిధిని విస్తరించడంలో ప్రభుత్వానికున్న నమ్మకాన్ని వివరిస్తూ.. ప్రారంభంలో రుణ పరిమితి రూ.50,000 నుంచి రూ. 5 లక్షలకు ఇప్పుడు రూ. 20 లక్షలకు చేరుకున్నాయని అన్నారు. దేశ పౌరుల పారిశ్రామిక స్ఫూర్తి, వారి సామర్థ్యాలపై ఉంచిన నమ్మకాన్ని ఈ రుణపరిమితి పెంపు తెలియజేస్తుందని శ్రీ మోదీ తెలిపారు. ఇది పథకం అమలుతో మరింత బలోపేతమైందని వివరించారు.
ముద్ర యోజనను వినియోగించుకొని సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా ఇతరులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ తెలియజేశారు. కనీసం అయిదు నుంచి పది మందిలో విశ్వాసం నింపి, ఈ దిశగా నడిచేలా ప్రేరేపించి వారికి మద్దతు అందించాలని లబ్ధిదారులను ప్రధానమంత్రి కోరారు. ఈ పథకం ద్వారా మంజూరు చేసిన రుణాల సంఖ్య 52 కోట్లు అని, ఇది అంతర్జాతీయ స్థాయిలో సాధించిన అసమాన విజయమని పేర్కొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను పని చేసిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘గరీబ్ కల్యాణ్ మేళా’ ద్వారా ప్రదర్శించిన వీధినాటకాలు పేదరికం అధిగమించేలా ప్రజల్లో ఎలా స్ఫూర్తి నింపాయో తెలియజేశారు. ఆర్థిక స్వాతంత్రం సంపాదించిన తర్వాత ప్రభుత్వం నుంచి తాము పొందిన ప్రయోజనాలను తిరిగి ఇచ్చేస్తున్న వారి గురించి, వారి ప్రయాణం గురించి ఆయన పంచుకున్నారు. గుజరాత్‌లోని ఒక గిరిజన సమూహానికి చెందిన వ్యక్తిని ఉదాహరణగా వివరిస్తూ, స్వల్ప రుణ సాయంతో సంప్రదాయ సంగీతాన్ని ప్రదర్శించే స్థాయి నుంచి ప్రొఫెషనల్ బ్యాండ్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారని వివరించారు. ఈ చిన్న ప్రయత్నాలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా పెద్ద మార్పులకు ఎలా దారి చూపిస్తాయని అన్నారు. ఇలాంటి స్ఫూర్తిదాయక కథలు తనకు స్ఫూర్తినిస్తాయని, జాతి నిర్మాణం, అభివృద్ధిలో ఉమ్మడి ప్రయత్నాల సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తాయని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలు, పరిస్థితులను అధ్యయనం చేయడానికి ముద్ర యోజన ఒక సాధనంగా పనిచేస్తుందన్న తన నమ్మకాన్ని ప్రధాని మోదీ మరోసారి స్పష్టంగా తెలియజేశారు. ఈ పథకం విజయం పట్ల తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, లబ్ధిదారులు తిరిగి సమాజానికి ఇవ్వాలని, సమాజ సేవ చేయడం ద్వారా సంతృప్తి దొరకుతుందని అన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌధరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2120191)
Visitor Counter : 32
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam