ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళనాడులోని రామేశ్వరంలో రూ.8,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఈ రోజు రామనాథస్వామి ఆలయంలో ప్రార్థనలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను: ప్రధాని

రామేశ్వరానికి కొత్త పంబన్ వంతెన సాంకేతిక పరిజ్ఞానం, సంప్రదాయాల మేళవింపు: ప్రధాన మంత్రి

ఈ రోజు దేశవ్యాప్తంగా మెగా ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి: ప్రధాని

భారతదేశ అభివృద్ధికి బ్లూ ఎకానమీ కీలకంగా మారనుంది; ఈ రంగంలో తమిళనాడు శక్తిని ప్రపంచం చూస్తుంది: ప్రధాని

తమిళ భాష, వారసత్వం ప్రపంచంలోని ప్రతి మూలకు చేరేలా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది: ప్రధాన మంత్రి

Posted On: 06 APR 2025 4:44PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని రామేశ్వరంలో రూ.8,300 కోట్లకు పైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ముందుగా, ఆయన భారత్‌లో తొలి వెర్టికల్ లిఫ్ట్ సముద్ర రైలు వంతెన అయిన కొత్త పంబన్ రైలు వంతెనను ప్రారంభించారు. రోడ్ బ్రిడ్జ్ వద్ద నుంచి ఒక రైలును, ఓ నౌకను ప్రారంభించారు. వంతెన కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూశారు. అనంతరం రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈరోజు శ్రీరామనవమి శుభదినమని అన్నారు. ఈరోజు ఉదయం అయోధ్యలోని భవ్య రామ మందిరంలో రామ్ లల్లా నుదుటిన సూర్యుని దివ్య కిరణాలు మహత్తర తిలకంగా అభిషేకించాయని తెలిపారు. “భగవాన్ శ్రీరాముని జీవితం, ఆయన ఉత్తమ పాలనా స్ఫూర్తి దేశ నిర్మాణానికి ఒక గొప్ప పునాది” అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని సంగం నాటి సాహిత్యంలో కూడా భగవాన్ శ్రీరాముడి ప్రస్తావన ఉందని ఆయన అన్నారు. రామేశ్వరంలోని పవిత్ర భూమి నుంచి దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

“ఈ రోజు రామనాథస్వామి ఆలయంలో ప్రార్థన చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని శ్రీ మోదీ తెలిపారు. ఈ ప్రత్యేక రోజున రూ.8,300 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అంకితం చేయడం తనకు లభించిన అవకాశంగా పేర్కొన్నారు. ఈ రైలు, రోడ్డు ప్రాజెక్టులు తమిళనాడులో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. గొప్ప మార్పును తెచ్చే ఈ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా తమిళనాడు ప్రజలను ఆయన అభినందించారు.

 

రామేశ్వరం భారతరత్న డాక్టర్ కలాం జన్మస్థలమని, ఆయన జీవితం విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మికత పరస్పరం ఎలా పూరకంగా ఉన్నాయో నిరూపించిందని ప్రధాని పేర్కొన్నారు. “రామేశ్వరానికి కొత్త పంబన్ వంతెన సాంకేతికత, సంప్రదాయాల మేళవింపునకు చిహ్నం” అని ఆయన అన్నారు. వేలాది ఏళ్ల చరిత్ర కలిగిన నగరం ఇప్పుడు 21వ శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతంతో అనుసంధానమైందని ఆయన అన్నారు. ఇంజనీర్లు, కార్మికుల అంకిత భావాన్ని, కృషిని ఆయన అభినందించారు. ఈ వంతెన భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ సముద్ర రైలు వంతెన అని, దీని కింద పెద్ద నౌకలు ప్రయాణించగలవని, అదే సమయంలో వేగవంతమైన రైలు ప్రయాణానికి వీలు కల్పిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. కొత్త రైలు సర్వీసును, ఓడను జెండా ఊపి ప్రారంభించిన ఆయన ఈ అద్భుతమైన ప్రాజెక్టుకు గాను తమిళనాడు ప్రజలకు అభినందనలు తెలిపారు.

 

ఈ వంతెన కోసం అనేక దశాబ్దాలుగా డిమాండ్ ఉందని, ప్రజల ఆశీర్వాదంతో, ఈ పనిని పూర్తి చేసే భాగ్యం లభించిందని ఆయన అన్నారు. పంబన్ వంతెన సులభ వ్యాపారానికి, సులభ ప్రయాణానికి రెండింటికీ మద్దతు ఇస్తుందని, ఇది లక్షలాది మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని ఆయన చెప్పారు. రామేశ్వరం నుంచి చెన్నైకి, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ కొత్త రైలుసర్వీసు కనెక్టివిటీని పెంచుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ సౌకర్యం తమిళనాడులో వాణిజ్య, పర్యాటక రంగాలకు మేలు చేస్తుందని, యువతకు కొత్త ఉద్యోగ, వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు.

 

"గత 10 సంవత్సరాలలో, భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసింది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు, ఈ వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణాలలో ఒకటి దేశంలోని గణనీయమైన ఆధునిక మౌలిక సదుపాయాలు అని చెప్పారు. గత దశాబ్ద కాలంలో రైల్వేలు, రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, నీరు, గ్యాస్ పైప్ లైన్లు వంటి మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్ దాదాపు ఆరు రెట్లు పెరిగిందని ఆయన చెప్పారు. నేడు, దేశవ్యాప్తంగా మెగా ప్రాజెక్టులు వేగంగా పురోగతి చెందుతున్నాయని, ఉత్తరాన, జమ్మూ కాశ్మీర్ లో నిర్మించిన చీనాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనలలో ఒకటని ఆయన పేర్కొన్నారు. అలాగే పశ్చిమాన ముంబయిలో దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతు ఉందని తెలిపారు. తూర్పున అస్సాంలోని బోగీబీల్ బ్రిడ్జి ప్రగతికి నిదర్శనంగా నిలుస్తుందని, దక్షిణాదిన ప్రపంచంలోని అతికొద్ది వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిల్లో ఒకటైన పంబన్ బ్రిడ్జి పూర్తయిందని వివరించారు. తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు కూడా పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. దేశంలో తొలి బులెట్ రైలు పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు దేశ రైలు వ్యవస్థను మరింత అధునాతనం చేస్తున్నాయని తెలిపారు.

 

భారతదేశంలోని ప్రతి ప్రాంతం ఒకదానితో ఒకటి అనుసంధానమైనప్పుడు, అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గం మరింత బలపడుతుందని, ఇది ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన దేశం, ప్రాంతంలోనూ జరిగే విషయమేనని ప్రధాని స్పష్టం చేశారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం దగ్గరవుతున్నప్పుడే దేశ సంపూర్ణ సామర్థ్యం బయటపడుతుందని చెప్పారు. ఈ కనెక్టివిటీ తమిళనాడుతో సహా దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

"అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారతదేశం చేస్తున్న ప్రయాణంలో తమిళనాడు ప్రధాన పాత్ర పోషిస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారు., తమిళనాడు సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ, భారతదేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు. 2014కి ముందు కాలంతో పోల్చితే గత పదేళ్లలో తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మూడింతలు ఎక్కువ నిధులను కేటాయించినట్టు తెలిపారు. ఈ పెరిగిన నిధులు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో సహాయపడినట్టు ఆయన వివరించారు.

 

తమిళనాడులో మౌలిక సదుపాయాల అభివృద్ధి భారత ప్రభుత్వ ప్రాధాన్య అంశమని స్పష్టం చేసిన శ్రీ మోదీ, గత దశాబ్ద కాలంలో తమిళనాడు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెరిగిందని గుర్తు చేశారు. 2014కు ముందు తమిళనాడులోని రైల్వే ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లు దాటిందని తెలిపారు. రామేశ్వరం స్టేషన్ సహా రాష్ట్రంలోని 77 రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోందన్నారు.

 

గత పదేళ్లలో గ్రామీణ రోడ్లు, రహదారుల అభివృద్ధిలో ఎంతో పురోగతి సాధించామని, 2014 నుంచి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, తమిళనాడులో 4,000 కిలోమీటర్ల రహదారులు నిర్మాణమయ్యాయని, చెన్నై ఓడరేవును కలిపే ఎలివేటెడ్ కారిడార్ గణనీయమైన మౌలిక సదుపాయాలకు మరొక ఉదాహరణ అని ప్రధాని అన్నారు. ఈ రోజు సుమారు రూ.8 వేల కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. ఈ ప్రాజెక్టులు తమిళనాడులోని వివిధ జిల్లాల మధ్య కనెక్టివిటీని పెంపొందిస్తాయని, ఆంధ్రప్రదేశ్ తో కూడా సంబంధాలను మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు.

 

చెన్నై మెట్రో వంటి ఆధునిక ప్రజారవాణా వ్యవస్థలు తమిళనాడులో ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతున్నాయని, విస్తృతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి వివిధ రంగాలలో కొత్త ఉద్యోగాల సృష్టికి దారి తీస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

గత దశాబ్ద కాలంలో భారతదేశంలో సామాజిక మౌలిక సదుపాయాలపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టామని శ్రీ మోదీతెలిపారు. తమిళనాడులోని కోట్లాది కుటుంబాలు ఈ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందాయని సంతోషం వ్యక్తం చేశారు. పీఎం ఆవాస్ యోజన కింద తమిళనాడులో నిర్మించిన 12 లక్షలకు పైగా పక్కా ఇళ్లతో సహా గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లను పేద కుటుంబాలకు అందించామని తెలిపారు. గత దశాబ్ద కాలంలో దాదాపు 12 కోట్ల గ్రామీణ కుటుంబాలకు తొలిసారిగా పైపుల ద్వారా మంచినీరు అందిందని చెప్పారు. ఇందులో తమిళనాడులోని కోటి 11 లక్షల కుటుంబాలకు తొలిసారిగా కుళాయి నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు.

 

" ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడం మా ప్రభుత్వ నిబద్ధత" అని ప్రధానమంత్రి అన్నారు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద, తమిళనాడులో కోటికి పైగా చికిత్సలు జరిగాయని, రాష్ట్రంలోని కుటుంబాలకు రూ.8,000 కోట్లు ఆదా అయ్యాయని పేర్కొన్నారు. తమిళనాడులో 1,400కు పైగా జన ఔషధి కేంద్రాలు ఉన్నాయని, అక్కడ 80 శాతం వరకు రాయితీపై మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ చౌకైన మందుల వల్ల ప్రజలకు రూ.700 కోట్లు ఆదా అయ్యాయని పేర్కొన్నారు.

 

యువ భారతీయులు ఇకపై డాక్టర్లు కావడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు, ఇటీవలి సంవత్సరాల్లో తమిళనాడుకు 11 కొత్త వైద్య కళాశాలలు వచ్చాయని గుర్తు చేశారు. పేద కుటుంబాలకు చెందిన ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడేలా తమిళ భాషలో వైద్య విద్య కోర్సులను ప్రారంభించాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

 

“పన్నుల ద్వారా వచ్చిన ప్రతి రూపాయి పేద ప్రజలకూ ఉపయోగపడేలా చూడడమే మంచి పాలన లక్ష్యం,” అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి క్రింద తమిళనాడులోని చిన్న రైతులకు ఇప్పటివరకు సుమారు రూ.12,000 కోట్లు అందినట్లు తెలిపారు. అలాగే, తమిళనాడు రైతులు ప్రధాని ఫసల్ బీమా యోజన ద్వారా కూడా లాభం పొందారని, దీనిలో ఇప్పటివరకు రూ.14,800 కోట్ల మేర పరిహారాలుగా చెల్లింపులు జరిగినట్లు ఆయన వివరించారు.

“భారతదేశ అభివృద్ధిలో బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషించనుంది, ఈ రంగంలో తమిళనాడుకు ఉన్న శక్తిని ప్రపంచం గుర్తించనుంది,” అని శ్రీ మోదీ ప్రకటించారు. తమిళనాడు మత్స్యకారుల కృషిని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాలను బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు అందిస్తున్నదని తెలిపారు. గత ఐదేళ్లలో పీఎం మత్స్య సంపద యోజన కింద తమిళనాడుకు గణనీయమైన నిధులు వచ్చాయని అన్నారు. సీవీడ్ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లలో వందల కోట్ల రూపాయల పెట్టుబడులుసహా మత్స్యకారులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. మత్స్యకారుల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత దశాబ్ద కాలంలో శ్రీలంక నుంచి 3,700 మందికి పైగా మత్స్యకారులను తిరిగి తీసుకొచ్చామని, ఒక్క గత ఏడాదిలోనే 600 మందికి పైగా వచ్చారని మోదీ పేర్కొన్నారు.

 

భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని ప్రస్తావిస్తూ, దేశం గురించి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహం కనిపిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ఆకర్షణకు భారత సంస్కృతి, మృదు శక్తి కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. “తమిళ భాష, వారసత్వం ప్రపంచం నలుమూలలకూ చేరాలని కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అని ఆయన తెలిపారు. 21వ శతాబ్దంలో ఈ మహోన్నత పరంపరను మరింత ముందుకు తీసుకెళ్లాలనే విశ్వాసం తనలో ఉందని ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన రామేశ్వరం భూమి, తమిళనాడు రాష్ట్రం- దేశాన్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూ, శక్తినిస్తూ ఉండగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

 

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ, బలమైన, సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలన్న లక్ష్యానికి ప్రతి బీజేపీ కార్యకర్త నిరంతరం శ్రమిస్తున్నాడని శ్రీ మోదీ తెలిపారు. దేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, మంచి పాలనను దేశ ప్రజలు ప్రత్యక్షంగా గుర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి మూలలో బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ పేదలకు సేవలందిస్తున్న తీరు గర్వకారణమని అన్నారు. లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్. ఎన్. రవి, కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తదితరులు పాల్గొన్నారు

నేపథ్యం

 

నూతన పంబన్ రైలు వంతెనను, రామేశ్వరం-తాంబరం (చెన్నై) కొత్త రైలు సర్వీసును ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ వంతెనకు లోతైన సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. రామాయణం ప్రకారం, రామసేతు నిర్మాణం రామేశ్వరానికి సమీపంలోని ధనుష్కోడిలో ప్రారంభమైంది.

 

ప్రధాన భూభాగంతో రామేశ్వరాన్ని కలిపే ఈ వంతెన, భారత ఇంజినీరింగ్ ప్రతిభకు అంతర్జాతీయ అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. దీనిని రూ.700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. దీని పొడవు 2.08 కిలోమీటర్లు కాగా, ఇందులో 99 స్పాన్లు, 72.5 మీటర్ల వెర్టికల్ లిఫ్ట్ స్పాన్ ఉంది, ఇది 17 మీటర్ల ఎత్తుకు లేచి నౌకలు సాఫీగా సాగిపోయే సౌకర్యాన్ని కల్పిస్తూనే, రైలు రాకపోకలను నిరంతరంగా కొనసాగించగలదు. ఈ వంతెనను స్టెయిన్‌లెస్ స్టీల్ రీఫోర్స్మెంట్, అధిక ప్రమాణాల రక్షణ పూత, పూర్తిగా వెల్డెడ్ జాయింట్లతో నిర్మించడంతో దీర్ఘకాల మన్నికతో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో రాకపోకల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ వంతెనను ద్విచక్ర రైలు పట్టాల (డ్యూయల్ రైల్ ట్రాక్స్) కోసం రూపకల్పన చేశారు. ఉప్పెన వంటి వాతావరణంలో దీర్ఘకాలం నష్టరహితంగా ఉండేందుకు, దీనికి ప్రత్యేకమైన పాలిసిలోక్సేన్ కోటింగ్ చేశారు. ఇది తుప్పుపట్టకుండా రక్షిస్తుంది.

 

 

ప్రధానమంత్రి తమిళనాడులో రూ.8,300 కోట్లకు పైగా విలువ గల పలు రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని దేశానికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల్లో 28 కిలోమీటర్ల పొడవు గల వాలాజపేట్ – రాణిపేట్ సెక్షన్ (ఎన్హెచ్ -40) నాలుగు లైన్ల విస్తరణకు శంకుస్థాపనచేశారు. , అలాగే ఎన్హెచ్-332లోని 29 కిలోమీటర్ల పొడవైన 4 లేన్ల విల్లుపురం - పుదుచ్చేరి సెక్షన్ ను, 57 కిలోమీటర్ల పొడవైన పూండియాంకుప్పం - జాతీయ రహదారి -32 లోని సత్తనాథపురం సెక్షన్ ను, ఎన్హెచ్ -36 లోని 48 కి. మీ చోళపురం - తంజావూరు సెక్షన్ ను జాతికి అంకితం చేశారు. ఈ రహదారులు అనేక పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను కలుపుతాయి, నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. వైద్య కళాశాల, ఆసుపత్రి, ఓడరేవులకు వేగవంతమైన రవాణాను అందిస్తాయి, అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులను సమీప మార్కెట్లకు రవాణా చేయడానికి స్థానిక రైతులకు సాధికారతను అందిస్తాయి, స్థానిక తోలు, చిన్న తరహా పరిశ్రమల ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి.

 

 

 

***

MJPS/SR


(Release ID: 2119709) Visitor Counter : 9