ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని రామేశ్వరంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం
Posted On:
06 APR 2025 5:14PM by PIB Hyderabad
వణక్కం!
నా ప్రియమైన తమిళ సోదర సోదరీమణులారా!
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, డాక్టర్ ఎల్.మురుగన్ గారు… తమిళనాడు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదరసోదరీమణులారా నమస్కారం.
మిత్రులారా,
నేడు శ్రీరామనవమి పర్వదినం. కొద్దిసేపటి క్రితం అయోధ్యలోని బ్రహ్మాండమైన రామ మందిరంలో సూర్యకిరణాలు రామున్ని తిలకంతో గొప్పగా అలంకరించాయి. శ్రీరాముని జీవితం, ఆయన రాజ్యం నుంచి వచ్చిన సుపరిపాలన స్ఫూర్తి దేశ నిర్మాణానికి గొప్ప పునాదిగా నిలుస్తున్నాయి. ఈ రోజు శ్రీరామనవమి నాడు అందరం కలిసి జై శ్రీరామ్ అని నినదిద్దాం. జై శ్రీరామ్! జై శ్రీరామ్! సంగం కాలం నాటి తమిళ సాహిత్యంలో కూడా శ్రీరాముని ప్రస్తావన ఉంది. ఈ పవిత్ర భూమి రామేశ్వరం నుంచి నా తోటి దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు రామనాథస్వామి ఆలయంలో పూజలు చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన రోజున ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఈ రైలు, రోడ్డు ప్రాజెక్టులు తమిళనాడులో అనుసంధానాన్ని పెంచుతాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తమిళనాడులోని నా సోదర సోదరీమణులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఇది భారతరత్న డాక్టర్ కలాంకు చెందిన ప్రాంతం. శాస్త్రీయ పరిజ్ఞానం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి పరస్పరం తోడ్పడతాయని ఆయన జీవితం మనకు తెలియజేసింది. అదే తరహాలో కొత్త పంబన్ వంతెన సాంకేతికత, సంప్రదాయం సంగమంగా ఉంటుంది. వేల సంవత్సరాల పురాతనమైన ఒక పట్టణం 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంతో అనుసంధానమైంది. ఇక్కడ పనిచేసిన ఇంజినీర్లు, కార్మికులకు నా ధన్యవాదాలు. ఈ వంతెన భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. దీని కింద పెద్ద నౌకలు ప్రయాణించొచ్చు. రైళ్లు కూడా వేగంగా వెళ్లగలవు. కొద్దిసేపటి క్రితం కొత్త రైలు సర్వీసును, ఓడను ప్రారంభించాను. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి రాష్ట్ర ప్రజలను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ఎన్నో దశాబ్దాలుగా ఈ వంతెన నిర్మించాలనే డిమాండు ఉంది. మీ ఆశీస్సులతో ఈ పని పూర్తి చేసే సౌభాగ్యం మాకు లభించింది. పంబన్ వంతెన సులభతర వాణిజ్యం, సులభతర ప్రయాణం.. రెండింటికీ సహాయపడుతుంది. లక్షలాది మంది ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. కొత్త రైలు రామేశ్వరం నుంచి చెన్నై, దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఇది తమిళనాడులో వ్యాపార వాణిజ్యం, పర్యాటకం రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుంది. యువతకు కొత్త ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయి.
మిత్రులారా,
గత పదేళ్లలో భారత్ తన ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసుకుంది. ఈ తరహా వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణం మన ప్రపంచ స్థాయి ఆధునిక మౌలిక సదుపాయాలు. గత దశాబ్ద కాలంలో రైల్వేలు, రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, నీరు, గ్యాస్ పైప్‌లైన్ల బడ్జెట్‌ను దాదాపు ఆరు రెట్లు పెంచాం. నేడు దేశం మెగా ప్రాజెక్టుల విషయంలో శరవేగంగా పురోగతి సాధిస్తోంది. ఉత్తరాది వైపు చూస్తే ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనల్లో ఒకటైన చీనాబ్ వంతెన జమ్మూకాశ్మీర్‌లో నిర్మాణమైంది. పశ్చిమాన దేశంలో అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతు ముంబయిలో నిర్మాణమైంది. తూర్పున అస్సాంలోని బోగీబీల్ వంతెన ఒక గొప్ప ప్రస్థానంగా నిలుస్తోంది. దక్షిణాదిన ప్రపంచంలోని అతికొద్ది వర్టికల్ లిఫ్ట్ వంతెనల్లో ఒకటైన పంబన్ వంతెన పూర్తి అయింది. అదేవిధంగా తూర్పు, పశ్చిమ ప్రత్యేకమైన సరకు రవాణా కారిడార్లు కూడా నిర్మాణమవుతున్నాయి. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు రైల్వే నెట్‌వర్క్‌ను మరింత అధునీకరిస్తున్నాయి.
మిత్రులారా,
భారత్‌లోని ప్రతి ప్రాంతం బాగా అనుసంధానమైనప్పుడు, అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గం బలోపేతం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఇదే జరిగింది. నేడు దేశంలోని ప్రతి రాష్ట్రం మరింత అనుసంధానం అవుతున్నందున, భారతదేశపు నిజమైన సామర్థ్యం బయటకి వస్తోంది. ఈ పురోగతి మన తమిళనాడుతో సహా దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తోంది.
మిత్రులారా,
వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) దిశగా సాగే ప్రయాణంలో తమిళనాడుది కీలక పాత్ర. తమిళనాడు ఎంత బలంగా ఉంటే భారత్ ఎదుగుదల అంత వేగంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. 2014కు ముందుతో పోలిస్తే గత దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడుకు కేటాయించిన నిధులు మూడు రెట్లు పెరిగాయి. డీఎంకే ప్రభుత్వం భాగంగా ఉన్న ఇండి కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల కంటే మూడు రెట్లు ఎక్కువ నిధులు మోదీ ప్రభుత్వం తమిళనాడుకు ఇచ్చింది. ఇది తమిళనాడు ఆర్థిక, పారిశ్రామిక వృద్ధికి ఎంతో ఊతమిచ్చింది.
మిత్రులారా,
తమిళనాడులో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గత దశాబ్ద కాలంలో తమిళనాడు రైల్వే బడ్జెట్‌ను ఏడు రెట్లు పెంచాం. అయినప్పటికీ కొంతమందికి కారణం లేకుండా చేయడ౦ అలవాటుగా ఉంది. వారు ఈ విషయాల గురి౦చి ఏడుస్తూనే ఉ౦టారు. 2014కు ముందు తమిళనాడులో రైల్వే ప్రాజెక్టులకు వార్షిక కేటాయింపులు రూ. 900 కోట్లు మాత్రమే. ఆ సమయంలో ఇండి కూటమికి ఎవరు ఇంఛార్జ్‌గా ఎవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ. 6,000 కోట్లు దాటింది. రామేశ్వరం స్టేషన్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 77 రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తోంది.
మిత్రులారా,
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గత పదేళ్లలో గ్రామీణ దారులు, రహదారుల్లో అద్భుతమైన పురోగతి సాధించాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2014 నుంచి తమిళనాడులో 4 వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మాణమయ్యాయి. చెన్నై పోర్టును కలిపే ఎలివేటెడ్ కారిడార్ ఆధునిక మౌలిక సదుపాయాల విషయంలో ఒక అద్భుతం. నేడు దాదాపు రూ. 8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు తమిళనాడులోని వివిధ జిల్లాల మధ్య అనుసంధానాన్ని పెంచడంతో పాటు అంధ్రప్రదేశ్‌తో రోడ్డు మార్గాలను బలోపేతం చేస్తాయి.
మిత్రులారా,
చెన్నై మెట్రో వంటి ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలు రాష్ట్రంలో ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతున్నాయి. ఇన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అభివృద్ధి చేసినప్పుడు.. అవి వివిధ రంగాల్లో కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రాజెక్టులు మన యువతకు కొత్త ఉపాధి అవకాశాల ద్వారాన్ని తెరుస్తాయి.
మిత్రులారా,
గత దశాబ్ద కాలంలో సామాజిక మౌలిక సదుపాయాలపై భారతదేశం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. తమిళనాడులోని లక్షలాది పేద కుటుంబాలు దీని ద్వారా లబ్దిపొందడం సంతోషంగా ఉంది. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు ఇచ్చాం. పీఎం ఆవాస్ యోజన కింద తమిళనాడులో 12 లక్షలకు పైగా పేద కుటుంబాలకు శాశ్వత గృహాలు అందించాం. గత పదేళ్లలో దాదాపు 12 కోట్ల గ్రామీణ కుటుంబాలకు తొలిసారిగా గొట్టాల ద్వారా మంచినీటి సదుపాయం అందించాం. ఇందులో తమిళనాడులో కోటి 11 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కుళాయి నీరు తొలిసారిగా వారి ఇళ్లకు చేరింది. ఇది తమిళనాడు తల్లులు, సోదరీమణులకు గొప్ప ఉపశమనం కలిగించింది.
మిత్రులారా,
మన దేశ ప్రజలకు నాణ్యమైన, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందించడం అనేది మా ప్రభుత్వ నిబద్ధత. ఆయుష్మాన్ భారత్ ప్రభావాన్ని పరిశీలిస్తే.. ఈ పథకం కింద తమిళనాడులో ఇప్పటికే కోటికి పైగా చికిత్సలు జరిగాయి. దీని ఫలితంగా తమిళనాడు కుటుంబాలకు రూ. 8,000 కోట్లు ఆదా అయ్యాయి. ఈ పథకం లేకపోతే వారి జేబుల నుంచి ఇంత మొత్తం ఖర్చు అయ్యేది. 8 వేల కోట్ల రూపాయలు నా తమిళనాడు సోదర సోదరీమణుల జేబుల్లో ఉండటం చాలా పెద్ద లెక్క. తమిళనాడులో 1,400కు పైగా జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ మందులు 80% తక్కువకు లభిస్తాయి. ఈ అందుబాటు ధరల్లోని మందుల కారణంగా ఆరోగ్య సంరక్షణ విషయంలో తమిళనాడులోని నా సోదర సోదరీమణులుకు 700 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. అందుకే నేను నా తమిళనాడు సోదరసోదరీమణులను కోరేది ఇదే… మీరు మందులు కొనాల్సి వస్తే ఎల్లప్పుడూ జన ఔషధి కేంద్రానికే వెళ్లండి. ఒక్క రూపాయి ఖరీదు చేసే మందులు ఇక్కడ కేవలం 20, 25, 30 పైసలకు కొనుగోలు చేయొచ్చు.
మిత్రులారా,
భారతీయ యువత ఇకపై డాక్టర్లు కావడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది మా లక్ష్యం. గత కొన్నేళ్లలో తమిళనాడుకు 11 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి.
మిత్రులారా,
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ప్రాంతీయ భాషల్లో వైద్య విద్యను అందించడం ప్రారంభించాయి. ఇప్పుడు ఆంగ్లంలో చదవని నిరుపేద తల్లుల పిల్లలు కూడా డాక్టర్లు కావచ్చు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా డాక్టర్లు కావాలన్న తమ కలను సాకారం చేసుకునేలా తమిళంలో మెడికల్ కోర్సులను ప్రవేశపెట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
మిత్రులారా,
పన్ను చెల్లింపుదారులు ఇచ్చిన ప్రతి రూపాయి నిరుపేద వాళ్లకు కూడా ప్రయోజనం చేకూర్చేలా చూడటం మా సుపరిపాలన మంత్రం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద తమిళనాడులోని చిన్న రైతులకు దాదాపు రూ. 12,000 కోట్లు అందాయి. దీనితో పాటు పీఎం ఫసల్ బీమా యోజన కింద తమిళనాడు రైతులకు రూ.14,800 కోట్ల క్లెయిమ్‌లు అందాయి.
మిత్రులారా,
భారతదేశ వృద్ధి మన నీలి ఆర్థిక వ్యవస్థ గణనీయంగా దోహదపడుతోంది. ఈ రంగంలో తమిళనాడు సామర్థ్యం ప్రపంచానికి తెలుసు. రాష్ట్రంలోని మత్స్యకార సమాజం చాలా కష్టపడి పనిచేస్తోంది. తమిళనాడులో మత్స్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటానికి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. పీఎం మత్స్య సంపద యోజన కింద గత ఐదేళ్లలో తమిళనాడుకు వందల కోట్లు అందాయి. మత్స్యకారులకు కావాల్సిన అన్ని ఆధునిక సౌకర్యాలు అందేలా చూసుకుంటున్నాం. సీవీడ్ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు ఇలా మౌలిక సదుపాయాలు ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతోంది. మీ భద్రత, రక్షణ గురించి కూడా మేం చాలా శ్రద్ధతో ఉన్నాం. విపత్కర సమయాల్లో మత్స్యకారులకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కృషి ఫలితంగా గత పదేళ్లలో శ్రీలంక నుంచి 3,700 మందికి పైగా మత్స్యకారులు సురక్షితంగా వచ్చారు. వీరిలో 600 మందికి పైగా మత్స్యకారులకు గత ఏడాదిలోనే విముక్తి లభించింది. మన మత్స్యకారుల్లో కొందరికి మరణశిక్ష విధించిన విషయం కూడా మీకు గుర్తుండే ఉంటుంది. కానీ వారిని సజీవంగా తీసుకురావడానికి, మన దేశంలోని వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి మేం అవిశ్రాంతంగా పనిచేశాం.
మిత్రులారా,
నేడు ప్రపంచానికి భారత్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. భారత్ గురించి గతంలో కంటే ఎక్కువగా తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం మన గొప్ప సంస్కృతి, శక్తి. తమిళ భాష, తమిళ వారసత్వం ప్రపంచంలోని ప్రతి మూలకు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. తమిళనాడుకు చెందిన కొందరు నాయకుల నుంచి నాకు లేఖలు వచ్చినప్పుడు నేను కొన్నిసార్లు అశ్చర్యపోతుంటాను. ఎందుకంటే ఒక్కరు కూడా తమిళంలో వారి సంతకం చేయరు. తమిళం గర్వించదగ్గ విషయం. ఈ గొప్ప భాషను గౌరవించడానికి ప్రతి ఒక్కరూ తమిళంలో కనీసం సంతకాలు చేయాలని నేను కోరుతున్నాను. 21వ శతాబ్దంలో ఈ గొప్ప సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. పవిత్రమైన రామేశ్వరం, తమిళనాడు మనల్ని ఉత్తేజపరుస్తాయనడంలో సందేహం లేదు. ఈ రోజు జరిగిన అద్భుతమైన యాదృచ్ఛికతను చూడండి. ఇవాళ శ్రీరామనవమి పర్వదినం. మనం రామేశ్వరం అనే పవిత్రమైన చోట ఉన్నాం. ఇవాళ కొత్త పంబన్ బ్రిడ్జిని ప్రారంభించాను. పాత పంబన్ బ్రిడ్జిని వందేళ్ల క్రితం గుజరాత్‌లో జన్మించిన ఓ వ్యక్తి నిర్మించాడు. వందేళ్ల తర్వాత నేడు కొత్త పంబన్ బ్రిడ్జిని గుజరాత్‌లో జన్మించిన ఓ వ్యక్తి మళ్లీ ప్రారంభించారు.
మిత్రులారా,
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పవిత్రమైన రామేశ్వరంలో ఉండటం అనేది నా మనస్సును చాలా కదిలిపోయింది. నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ధృడమైన, సుసంపన్నమైన, వికసిత్ భారత్ దార్శనికతపై మేం చేస్తున్న పని ప్రతి భాజపా కార్యకర్త అవిశ్రాంత కృషి ద్వారా ముందుకు సాగుతోంది. వీళ్లలో మూడు, నాలుగు తరాలు భరతమాత సేవకే తమ జీవితాలను అంకితం చేశాయి. బీజేపీ ఆశయాలు, లక్షలాది మంది భాజపా కార్యకర్తల కృషి వల్ల ఈ రోజు దేశానికి సేవ చేసే అవకాశం మనకు రావటం అనేది నాకు గర్వకారణం. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వాల సుపరిపాలనను దేశ ప్రజలు చూస్తున్నారు. జాతీయ ప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో నలు దిశల్లో భాజపా కార్యకర్తలు ప్రజలతో లోతైన అనుబంధం కలిగి ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ పేదలకు సేవ చేస్తున్నారు. వారి అంకితభావాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. లక్షలాది మంది భాజపా కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఇవాల్టి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీ అందరినీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
నద్రీ! వణక్కం! మీండుం సంధిప్పోం!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఇది.
***
(Release ID: 2119706)
Visitor Counter : 8
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada