సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వేవ్స్-2025కు చిలీకి ఆహ్వానం: చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ పర్యటన సందర్భంగా ఆ దేశ మంత్రి కరోలినా అరెడోండోను కలిసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్

Posted On: 02 APR 2025 4:27PM by PIB Hyderabad

చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ అయిదు రోజుల భారత పర్యటనలో భాగంగా.. ఆ దేశ సంస్కృతి, కళలు, వారసత్వ మంత్రి శ్రీమతి కరోలినా అరెడోండోతో కేంద్ర సమాచార, ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ సమావేశమయ్యారు.
 

వేవ్స్-2025కు చిలీని ఆహ్వానించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్

ప్రధానంగా మే 1 నుంచి 4 వరకు జరగబోయే ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)తోపాటు పలు అంశాలపై గౌరవ మంత్రి చర్చించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించిన గౌరవ మంత్రి.. భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని చాటేలా ఉన్న చిత్రపటాన్ని శ్రీమతి కరోలినా అరెడోండోకు బహూకరించారు.

చిలీ రాయబార కార్యాలయ మూడో కార్యదర్శి శ్రీ మార్టిన్ గోర్మాజ్ సహా ఆ దేశ ప్రతినిధి బృంద సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ శ్రీ లక్మీ చంద్ర, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (చలనచిత్రాలు) డాక్టర్ అజయ్ నాగభూషణ్ ఎం.ఎన్ కూడా పాల్గొన్నారు.

మరింత బలోపేతమవనున్న భారత్ – చిలీ సహకారం


చిలీ అధ్యక్షుడు శ్రీ గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ ఏప్రిల్ 1 నుంచి 5 వరకు అధికారికంగా భారత పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 76 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన చేపట్టారు. న్యూఢిల్లీతో పాటు ఆగ్రా, ముంబయి, బెంగళూరు నగరాల్లో అధ్యక్షుడు బోరిక్ పర్యటించనున్నారు. అధ్యక్షుడు బోరిక్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించడం లక్ష్యంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా చర్చలను ప్రారంభించాలని గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, చిలీ అధ్యక్షుడు శ్రీ గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ అంగీకారానికి వచ్చారు. ఖనిజాలు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, వ్యవసాయం వంటి కీలక రంగాలను పరస్పర సహకారానికి అపార అవకాశాలున్న రంగాలుగా గుర్తించి, వాటిపై చర్చించారు.

యోగా, ఆయుర్వేదానికి చిలీలో పెరుగుతున్న ప్రజాదరణ.. రెండు దేశాల మధ్య సాంస్కృతిక వినిమయానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఆరోగ్య రక్షణ అంశం ఆశాజనకమైన మార్గంగా నిలిచింది. విద్యార్థి వినిమయ, ఇతర కార్యక్రమాల ద్వారా.. సాంస్కృతిక, విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇద్దరు నేతలూ స్పష్టం చేశారు.  

 

***


(Release ID: 2117919) Visitor Counter : 10