ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 26 NOV 2024 9:01PM by PIB Hyderabad

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, అటార్నీ జనరల్ శ్రీ వెంకటరమణి, బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కపిల్ సిబల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ఇతర గౌరవ అతిథులు, సోదరసోదరీమణులారా!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీకు, పౌరులందరికీ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడం  యావత్ జాతికి గర్వకారణం. భారత రాజ్యాంగానికి, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను.

స్నేహితులారా,


గొప్ప ప్రజాస్వామ్య ఉత్సవాన్ని మనం జరుపుకొంటున్న నేపథ్యంలో, ఇదే రోజున ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిగాయన్న సంగతి మరచిపోకూడదు. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను. భారత దేశ భద్రతను సవాలు చేసే ఏ ఉగ్రవాద సంస్థకైనా సరే తగిన సమాధానం ఇవ్వాలన్న ఈ దేశ సంకల్పాన్ని మరోసారి మీకు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

రాజ్యాంగ పరిషత్తులో విస్తృత సమావేశాలు జరిగిన సందర్భంలో భారత దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. ఆ చర్చలపై మీ అందరికీ మంచి అవగాహన ఉంది. ఆ సమయంలో ‘‘రాజ్యాంగం న్యాయవాదుల పత్రం మాత్రమే కాదు- దాని స్ఫూర్తి యుగాల వరకు కొననసాగుతుంది’’ అని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. బాబాసాహెబ్ ప్రస్తావించిన ఆ స్ఫూర్తి సర్వోన్నతమైనది. రాజ్యాంగంలోని నిబంధనలు మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగినట్లుగా వాటిని అర్థం చేసుకునే వీలు మనకి కల్పించాయి. స్వతంత్ర భారతంలో కాలం గడిచే కొద్దీ దేశ ఆకాంక్షలు, కలలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని, దేశం, ప్రజల అవసరాలు, ఎదుర్కొనే సవాళ్లు మారతాయని మన రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. అందుకే వారు రాజ్యాంగాన్ని న్యాయ సంబంధమైన ప్రతిగా మాత్రమే పరిగణించకుండా, కాలానుగుణంగా రూపాంతరం చెందే నిరంతంర ప్రవాహంగా రూపొందించారు.

స్నేహితులారా,

మన రాజ్యాంగం వర్తమాన, భవిష్యత్ కాలాలకు మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. గడచిన 75 ఏళ్లలో దేశం ఎదుర్కొన్న ఏ సవాలుకైనా మన రాజ్యాంగం తగిన పరిష్కారం చూపించింది. ప్రజాస్వామ్యానికి పెను సవాలు విసిరిన ఆత్యయిక పరిస్థితిలోనూ మన రాజ్యాంగం బలంగా ఉదయించింది. దేశానికి చెందిన ప్రతి అవసరానికి, ప్రతి అంచనాకు తగినట్టుగా మన రాజ్యాంగం వ్యవహరించింది. ఈ శక్తే జమ్ము కశ్మీర్లోనూ బాబాసాహెబ్ రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చేలా చేయగలిగింది. మొట్టమొదటిసారిగా అక్కడ రాజ్యాంగ దినోత్సవాలు జరుగుతున్నాయి.

మిత్రులారా,

ప్రస్తుతం భారత్ పరివర్తనాత్మక దశలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనకు దారి చూపిస్తూ, మార్గనిర్దేశకత్వం వహించే వెలుగుదివ్వెగా రాజ్యాంగం వ్యవహరిస్తుంది.

స్నేహితులారా,

ఆకాంక్షలను, సంకల్పాలను నెరవేర్చుకోవడమే భారత్ ముందున్న మార్గం. ప్రస్తుతం ప్రతి పౌరుడూ ఒకే లక్ష్యంతో ఏకమయ్యారు – అదే ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్). ‘వికసిత్ భారత్’ అంటే నాణ్యమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ప్రతి పౌరుడూ అనుభవించే దేశమని అర్థం. ఇదే సామాజిక న్యాయం సాధించేందుకు గొప్ప వాహకం. రాజ్యాంగ స్ఫూర్తికి కూడా ఇదే ప్రధానం. అందుకే ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించే దిశగా గత పదేళ్లలో ఎన్నో చర్యలు తీసుకున్నాం. గతంలో బ్యాంకు సేవలకు దూరంగా ఉన్న 53 కోట్ల మందికి పైగా భారతీయులు గడచిన దశాబ్ధంలో ఖాతాలు తెరిచారు. తరతరాలుగా ఇళ్లు లేని నాలుగు కోట్ల మంది నిరాశ్రయులకు గత పదేళ్లలో పక్కా ఇళ్లు నిర్మించారు. గడచిన పదేళ్లలో10 కోట్ల మంది మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందారు. దీని కోసం వారు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం మన ఇంట్లో సులభంగా కుళాయి తిప్పితే నీరు వచ్చేస్తుంది. కానీ స్వాంతంత్య్రం  సిద్ధించిన 75 ఏళ్ల తర్వాత కూడా 3 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి నీటి సౌకర్యం ఉంది. మిలియన్ల మంది ప్రజలు ఇప్పటికీ కుళాయి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. మా ప్రభుత్వం 5-6 ఏళ్ల వ్యవధిలో 12 కోట్లకు పైగా గృహాలకు కుళాయి నీటిని అందించి పౌరులు, ముఖ్యంగా మహిళల జీవితాలను సులభతరం చేసి తద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా,

మీ అందరికీ తెలుసు, మన రాజ్యాంగ రాతప్రతిలో భగవాన్ రాముడు, సీతా మాత, హనుమాన్, బుద్ధుడు, మహావీరుడు, గురు గోవింద్ సింగ్, భారతీయ సంస్కృతికి చెందిన చిహ్నాల చిత్రాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఈ చిత్రాలు మానవ విలువల ప్రాధాన్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఈ విలువలే ఆధునిక భారత విధానాలు, నిర్ణయాలకు మూలాధారం. భారతీయులకు సత్వరమే న్యాయాన్ని అందించేందుకు నూతన న్యాయ సంహిత అమల్లోకి వచ్చింది. శిక్ష ఆధారిత వ్యవస్థ ఇప్పుడు న్యాయ ఆధారిత వ్యవస్థగా రూపాంతరం చెందింది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు నారీ శక్తి వందన్ అధీనియంతో చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు, హక్కులు లభించేలా చర్యలు తీసుకున్నాం. అదనంగా, దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకున్నాం.

స్నేహితులారా,

ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే అంశంపై దేశం ప్రధానంగా దృష్టి సారించింది. గతంలో పెన్షన్ తీసుకునేవారు బ్యాంకులకు వెళ్లి తాము బతికే ఉన్నామని నిరూపించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే డిజిటల్ లైఫ్ ధ్రువపత్రాలను సమర్పించే సౌకర్యం సీనియర్ సిటిజన్లకు కల్పించాం. దీని ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 1.5 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు లబ్ధి పొందారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తున్న దేశం భారత్. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు సైతం ఆరోగ్య సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది జన ఔషధి కేంద్రాల ద్వారా 80 శాతం రాయితీతో ఔషధాలు చౌకగా లభిస్తాయి. మన దేశంలో టీకాలు వేయించుకున్నవారు 60 శాతం కంటే తక్కువ ఉన్న సమయం ఉండేది. అప్పడు ఏటా మిలియన్ల మంది చిన్నారులు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండేవారు. ఇప్పుడు భారత్ ఇమ్యునైజేషన్‌లో 100 శాతానికి చేరుకుంది. మిషన్ ఇంద్రధనుష్‌కు ధన్యవాదాలు. మారుమూల గ్రామాల్లోని చిన్నారులకు సైతం నిర్ణీత సమయానికి టీకాలు వేస్తున్నారు. ఈ చర్యలు పేద, మధ్యతరగతి ప్రజల భయాలను గణనీయంగా తగ్గించాయి.

మిత్రులారా,

ప్రస్తుతం దేశం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి మరో ఉదాహరణ ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం. దేశంలోని 100కు పైగా వెనుకబడిన జిల్లాలను ఆకాంక్షాత్మక జిల్లాలుగా పునర్నిర్వచించాం. ఇక్కడ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వేగవంతమైంది. ఈ రోజు మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ ఆకాంక్షత్మక జిల్లాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఈ విధానం ఆధారంగా ఆకాంక్షాత్మక విభాగాల కార్యక్రమాన్ని ప్రారంభించాం.

స్నేహితులారా,

దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను తొలగించేందుకు ప్రస్తుతం దేశం ప్రధాన దృష్టి సారించింది. కొన్నేళ్ల క్రితం విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో దాదాపు 2.5 కోట్ల గృహాలు చీకట్లో మగ్గిపోయేవి. ఇప్పుడు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో కాంతి నిండింది. 4జీ, 5జీ కనెక్టివిటీ పెంచడానికి మారుమూల ప్రాంతాల్లో సైతం వేల సంఖ్యలో మొబైల్ టవర్లు ఏర్పాటు చేశాం. గతంలో అండమాన్ లేదా లక్ష ద్వీపాలను సందర్శించినట్లయితే అక్కడ బ్రాండ్ బ్యాండ్ సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడు సముద్ర గర్భం ద్వారా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారా ఈ దీవుల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, భూముల విషయంలో తలెత్తే వివాదాల గురించి మనకు తెలుసు. భూ రికార్డుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు సైతం సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్ ముందడుగు వేసింది. ప్రధానమంత్రి స్వామిత్వ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గృహాలను డ్రోన్ మ్యాపింగ్ చేసి, నివాసితులకు చట్టబద్ధమైన ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాం.

మిత్రులారా,

దేశ ప్రగతికి ఆధునిక మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయడం అవసరం. సమయానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం ద్వారా మాత్రమే జాతి వనరులను రక్షించుకోవడంతో పాటు వాటి వినియోగాన్ని గణనీయంగా విస్తరించవచ్చు. ఈ ఆలోచనతోనే ప్రగతి అనే వేదిక ఏర్పాటైంది. దీని ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై క్రమం తప్పకుండా సమీక్షలు జరుగుతాయి. వీటిలో 30-40 ఏళ్లుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సమీక్షలకు నేనే అధ్యక్షత వహిస్తాను. ఇప్పటి వరకు 18 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను సమీక్షించి, వాటిని పూర్తి చేయడంలో ఎదురైన ఇబ్బందులను పరిష్కరించామని తెలిస్తే మీరు సంతోషిస్తారు. సకాలంలో పూర్తయిన ప్రాజెక్టులు ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపిస్తాయి. ఈ ప్రయత్నాలు అన్నీ దేశ ప్రగతిని వేగవంతం చేయడంతో పాటు రాజ్యాంగంలోని ప్రధాన విలువలను బలోపేతం చేస్తున్నాయి.

స్నేహితులారా,

డాక్టర్ రాజేంద్రప్రసాద్ చెప్పిన మాటలతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇదే రోజున, నవంబర్ 26, 1949లో రాజ్యాంగ పరిషత్ ముగింపు సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ.. ‘‘ప్రస్తుతం భారత్‌కు వ్యక్తిగత ఆసక్తుల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే, నిజాయతీ కలిగిన సమూహం కంటే మరేదీ అవసరం లేదు’’ అని అన్నారు. ‘దేశమే ముందు, అన్నికంటే దేశమే ప్రధానం’ అనే స్ఫూర్తి కొన్ని శతాబ్ధాల పాటు భారత రాజ్యాంగాన్ని సజీవంగా ఉంచుతుంది. రాజ్యాంగం నాకు అప్పగించిన పని ప్రకారం, దాని పరిమితులకు లోబడి ఉండటానికే ప్రయత్నించాను. నేను వాటిని అతిక్రమించలేదు. రాజ్యాంగం నాకు పని అప్పగించింది కాబట్టే, నిర్ణీత పరిమితులకు అతిక్రమించకుండా నా ఆలోచనలను తెలియజేశాను. ఇక్కడ ఓ చిన్న సైగ చాలు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు.

ధన్యవాదాలు.


 

***


(Release ID: 2106346) Visitor Counter : 18