భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
ప్యారిస్ లో కృత్రిమ మేధ సదస్సు-2025 నేపథ్యంలో కృత్రిమ మేధో విధానంపై భారత- ఫ్రాన్సు సమావేశం
Posted On:
11 FEB 2025 12:27AM by PIB Hyderabad
కృత్రిమ మేధపై విధాన రూపకల్పన దిశగా భారత-ఫ్రాన్సు దేశాల సమావేశాన్ని భారత ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు (పీఎస్ఏ) కార్యాలయం 2025 ఫిబ్రవరి 10న సైన్సెస్ పో ప్యారిస్ విశ్వవిద్యాలయంలో నిర్వహించింది. కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సు-2025కు అనుబంధంగా దీనిని ఏర్పాటు చేశారు. దీనిలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియాఏఐ మిషన్ తోపాటు సైన్సెస్ పో ప్యారిస్ పాల్గొన్నాయి.
నిపుణుల మధ్య చర్చను ప్రభుత్వానికి ప్రధాన వైజ్ఞానిక సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ప్రారంభించారు. ప్రపంచ కృత్రిమ మేధ విధానంలోనూ, పాలనలోనూ భారత ప్రాధమ్యాలను వివరించారు. కృత్రిమ మేధను బాధ్యతాయుత పద్ధతిలో అభివృద్ధిపరచడం, దాని వాడకంలో కూడా బాధ్యతను కలిగి ఉండడం, అది అందించే లాభాలను సమానంగా పంచుకోవడం, కృత్రిమ మేధ పాలనకు సంబంధించి సాంకేతికపరమైన, చట్టపరమైన స్వరూపాన్ని స్వీకరించడం, అవసరమైన డేటాను ఇచ్చిపుచ్చుకోవడం, కృత్రిమ మేధకు సంబంధించి సురక్షిత రీతుల్ని అనుసరించడం, పరిశోధన, నవకల్పనల్లో సహకరించుకోవడం వంటివి ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలుగా ఉన్నాయి. విభిన్నమైన విధానపర వైఖరులు, సాంకేతికత ప్రధాన కార్యక్రమాల్ని అమలుపరచడం అనే అంశాల్లో సమన్వయాన్ని నెలకొల్పుకొనే సామర్ధ్యాల్ని భారత్, ఫ్రాన్సు సంపాదించాలని ఆయన సూచించారు. ద్వైపాక్షిక స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా పరస్పర పూరక జ్ఞానం, నైపుణ్యాల ప్రయోజనాల్ని అందుకోవచ్చని ఆయన చెప్పారు.

భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సైబర్ డిప్లొమసీ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ అమిత్ ఎ. శుక్లా, అంబాసిడర్ ఫర్ డిజిటల్ అఫైర్స్, ఫ్రెంచ్ మినిస్ట్రీ ఫర్ యూరోప్ అండ్ ఫారిన్ అఫైర్స్ శ్రీ హెన్రీ వర్డియర్ సమావేశ సహాధ్యక్షులుగా వ్యవహరించారు. (అ) డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాధ్యమం కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవడం, (ఆ) కృత్రిమ మేధకు సంబంధించిన ఆధారభూత నమూనాలు; (ఇ) ప్రపంచ శ్రేణి కృత్రిమ మేధ పాలనలతోపాటు (ఈ) ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల్ని కనుగొనడంలో కృత్రిమ మేధను ఉపయోగించుకోవడం వంటి ప్రాధాన్య రంగాలపై వారు మాట్లాడారు. మధ్యవర్తిత్వ యంత్రాంగానికి తావులేని సరిహద్దుల ఆవలి డేటా ప్రవాహానికీ, డేటాకు సంబంధించిన సార్వభౌమత్వంపై పొంతన కుదిరే అభిప్రాయాలకూ ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని గురించి కూడా ప్రస్తావించారు.


తరువాత ఈ కింద పేర్కొన్న వారు మాట్లాడారు: డాక్టర్ ప్రీతి బంజల్ (భారత ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు కార్యాలయంలో సలహాదారు, సైంటిస్ట్ జి); శ్రీమతి కవితా భాటియా (సైంటిస్టు ‘జి’, గ్రూప్ కోఆర్డినేటర్, ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీ, భాషిణి, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ); శ్రీ క్లెమెంట్ బాచీ (ఇంటర్నేషనల్ డిజిటల్ పాలిసీ లీడ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ఫైనాన్స్); హెలెన్ కోస్టా (ప్రాజెక్ట్ డైరెక్టర్, ఫ్రెంచ్ మినిస్ట్రీ ఫర్ ఇకాలాజికల్ ట్రాన్సిషన్); శ్రీ అభిషేక్ అగర్వాల్ (సైంటిస్ట్ ‘డి’, ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ గ్రూప్, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ); శ్రీ శరద్ శర్మ (సహ వ్యవస్థాపకుడు, ఐస్పిరిట్ (iSPIRT) ఫౌండేషన్; శ్రీ ఫ్రాన్సిస్ రూసో (ఏఐ, ఐస్పిరిట్ ఫౌండేషన్లకు అంతర్జాతీయ సాంకేతిక నిపుణుడు); డాక్టర్ సరయు నటరాజన్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, సెంటర్ పోర్ లా సెక్యూరిట్ డి ఎలైఏ); శ్రీ చార్‌బేల్-రాఫెల్ సెగెరీ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంటర్ పోర్ లా సెక్యూరిట్ డె ఎల్ఐఏ; శ్రీ సౌరభ్ సింగ్ (అధిపతి, డిజిటల్ అండ్ ఏఐ పాలిసీ, ఏడబ్ల్యూఎస్ ఇండియా అండ్ సౌత్ ఏషియా); శ్రీ అలెగ్జాండర్ మారియాని (సైన్సెస్ పో ప్యారిస్‌లో అంతర్జాతీయ వ్యవహారాల మేనేజరు); శ్రీ కపిల్ వాస్వానీ (మైక్రోసాఫ్ట్ రిసర్చ్ ప్రధాన పరిశోధకుడు); శ్రీ సును ఇంజినీర్ (ఔత్సాహిక పారిశ్రామికవేత్త, సహ వ్యవస్థాపకుడు, ట్రాన్స్ఫార్మింగ్, లీగల్); శ్రీ వివేక్ రాఘవన్ (సహ వ్యవస్థాపకుడు, సర్వమ్ ఏఐ).
ఈ వక్తలు టెక్నో-లీగల్ ఫ్రేంవర్క్‌ల ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూనే కృత్రిమ మేధ వనరుల లభ్యతను ప్రజాస్వామ్యీకరించాలని, సామర్థ్యాలను పెంచాలని ప్రధానంగా చెప్పారు. సర్వసత్తాక కృత్రిమ మేధ నమూనాలు, కృత్రిమ మేధ సేవలను ఉపయోగించుకోవడంలో నైతికతకు పెద్దపీటను వేయడం, ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం లభించిన సాంకేతికతలను, ప్రమాణాలను వాడుకొనే పద్ధతుల్ని స్పష్టంగా నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఎల్ఎల్ఎమ్స్, ఫెడరేటెడ్ ఏఐ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ సంబంధిత పరిశోధన, డేటాసెట్స్, ఉన్నత పనితీరును కనబర్చే కంప్యూటింగ్ వనరుల వరకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొంటూ ఆ సమాచారాన్ని వాడుకొనే సౌలభ్యం వంటి అంశాలపైనా చర్చించారు. భారత్, ఫ్రాన్సుల మధ్య సహకారం విషయంపై ముఖ్యమైన అంశాలు కూడా సమావేశంలో చోటుచేసుకొన్నాయి. స్వదేశీ నమూనాల్ని రూపొందించి నవకల్పనను ప్రోత్సహిస్తూ నష్టభయాల్ని కనీస స్థాయికి తగ్గించడానికి సంతులిత పాలన దృష్టి కోణాన్ని అవలంబించడంపైనా చర్చించారు. కృత్రిమ మేధ సంబంధిత పరిశోధన, డేటాసెట్స్, అంకుర సంస్థలలో దేశాల సరిహద్దులకు అతీతంగా సహకరించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడంతోపాటు కృత్రిమ మేధను స్థిర ప్రాతిపదికన వినియోగించుకోవడం, తక్కువ స్థాయి ఇంధన వాడకంతో కూడిన కంప్యూటింగ్.. ఈ అంశాలపైన సైతం దృష్టిపెట్టారు. సమాజంపై కృత్రిమ మేధ ప్రసరించే ప్రభావం, డేటా గవర్నెన్స్, కృత్రిమ మేధ సురక్ష నెట్‌వర్క్‌లను తీర్చిదిద్దడంలో ప్రపంచ శ్రేణి సంస్థల పాత్ర వంటివి కూడా చర్చనీయాంశాల్లో భాగమయ్యాయి.

గత నెలలో 25వ తేదీన బెంగళూరులోని ఐఐఎస్‌సీలో టెక్నాలజీ డైలాగ్ 2025 ను నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఒకటో రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రస్తావించిన కీలక ఉద్దేశాలను అమలులో పెట్టడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ఒకటో రౌండ్‌టేబుల్‌లో ఏఐ సమ్మిళిత స్వరూపాలు, వివిధ డేటాసెట్లు, మౌలిక వ్యవస్థ, నైపుణ్యాలు, ఇతర ప్రాథమిక మోడళ్లపై ప్రధానంగా చర్చించారు. అంతేకాకుండా పాలన, నవకల్పన, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, స్థిరత్వం, ఆరోగ్యం, విద్య రంగానికి సంబంధించిన సహకారం, డేటాపరంగా సమన్వయం.. వీటిని కూడా చర్చించారు. ఈ రెండు చర్చల్లోనూ కృత్రిమ మేధను నైతికత ప్రధానంగాను, బాధ్యతాయుతంగాను వినియోగించడంతోపాటు రంగంవారీ లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించారు.
మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కింది లింకును చూడగలరు:
https://technologydialogue.in/ai-rt-feb.html
***
(Release ID: 2101800)
Visitor Counter : 52