సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహాకుంభ్ 2025: 40 లక్షలకు పైగా భక్తులకు 233 నీటి ఏటియంల ద్వారా 24/7 తాగునీటి సరఫరా
పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం ప్లాస్టిక్ రహిత వ్యవస్థ
Posted On:
05 FEB 2025 7:14PM by PIB Hyderabad
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025కు దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మేళా జరుగుతున్న ప్రాంతంలో మొత్తం 233 వాటర్ ఏటీయంలను ఏర్పాటు చేశారు. ఇవి ఎలాంటి ఆటంకం లేకుండా 24 గంటలూ పనిచేస్తాయి. వీటి ద్వారా యాత్రికులు ప్రతిరోజూ స్వచ్ఛమైన ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) నీటిని పొందుతున్నారు. జనవరి 21, 2025 నుంచి ఫిబ్రవరి 1, 2025 వరకు 40 లక్షల మంది భక్తులు ఈ నీటి ఏటీయంల ద్వారా లబ్ధి పొందారు.
భక్తుల సౌకర్యార్థం ఈ నీటి ఏటీయంల ద్వారా ఉచిత తాగునీటి సరఫరా జరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆరంభంలో రూపాయికి లీటరు ఆర్వో నీటిని అందించారు. దీనికోసం రూపాయి నాణేన్ని ఏటీయంలో వేయడం లేదా యూపీఐ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చేసేవారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన నీటిని యాత్రికులకు అందించేందుకు ఈ సేవలను పూర్తిగా ఉచితం చేశారు. ప్రతి వాటర్ ఏటీయం దగ్గర ఒక ఆపరేటర్‌ను నియమించారు. నీటి కోసం మీట నొక్కగానే స్వచ్ఛమైన తాగునీరు యాత్రికులకు లభించేలా వారు జాగ్రత్త వహిస్తారు. తాగునీటి కోసం యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడటంతో పాటు అంతరాయం లేకుండా నీటి సరఫరా కొనసాగేలా చూసుకుంటారు.
మహాకుంభ్‌లో ఏర్పాటు చేసిన నీటి ఏటీయంలు అధునాతన టెక్నాలజీ సాయంతో పనిచేస్తాయి. వీటి పనితీరు పూర్తిగా యంత్ర పరిజ్ఞానం ఆధారంగానే సాగుతుంది. వీటిలో సెన్సర్-ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమర్చారు. ఇది ఏటీయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే గుర్తిస్తుంది. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే జలమండలి టెక్నీషియన్లు దానికి మరమ్మతులు చేసి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తారు. మహాకుంభకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఒక్కో వాటర్ ఏటీయం 12,000 నుంచి 15,000 లీటర్ల ఆర్వో నీటిని ప్రతిరోజూ సరఫరా చేస్తోంది. అన్ని వాటర్ ఏటీయంల్లో సిమ్-ఆధారిత సాంకేతికత ఏర్పాటు చేసి కేంద్రీయ పర్యవేక్షణా వ్యవస్థకు అనుసంధానం చేశారు.
నీటి వినియోగం, నీటి మట్టం నిర్వహణ, నీటి నాణ్యత, పంపిణీ చేసిన నీటి పరిమాణాన్ని నిరంతరం పర్యవేక్షించే వీలును ఈ సాంకేతికత కల్పిస్తుంది. యాత్రికుడు నీటి ఏటీయంను వినియోగించుకున్న ప్రతిసారి లీటరు నీటిని బాటిల్లో నింపుకోవచ్చు. గతంలో జరిగిన కుంభమేళాల్లో సంగమంతో సహా ఇతర ఘాట్ల పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు పేరుకుపోయి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సారి కుంభమేళాలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరాతో పాటుగా, పర్యావరణ పరిరక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
మహాకుంభ్ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నీటి సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వాటర్ ఏటీయంలను నిరంతరం పర్యవేక్షించడానికి, సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలను నియమించారు. అలాగే భవిష్యత్తులో జరిగే కుంభమేళా, ఇతర ధార్మిక ఉత్సవాల్లో శుద్ధమైన తాగునీరు అందించడానికి ఈ తరహా కార్యక్రమాలను అవలంబించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ చొరవ మహాకుంభ్ 2025ను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, పర్యావరణహితంగా మార్చింది. భవిష్యత్తులో జరిగే ఉత్సవాలకు చారిత్రక ఉదాహరణగా నిలిపింది.
***
(Release ID: 2100491)
Visitor Counter : 36