ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2025-26: నౌక, విమానయాన రంగాలకు ఊతం
రూ 25 వేల కోట్ల సముద్రరంగ అభివృద్ధి నిధి ఏర్పాటుకు ప్రతిపాదన
120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించేలా సవరించిన ఉడాన్ పథకం
రాబోయే పదేళ్లలో 4 కోట్ల ప్రయాణికులకు సేవలు
బీహార్ కు కొత్త విమానాశ్రయాలు, వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం
Posted On:
01 FEB 2025 1:11PM by PIB Hyderabad
సముద్ర రంగానికి దీర్ఘకాలిక ఆర్థిక సహాయం కోసం, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రూ. 25వేల కోట్ల మూలధనంతో సముద్రరంగ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈరోజు పార్లమెంటులో తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రకటించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈ మూలధనాన్ని సముద్రరంగానికి మద్దతును విస్తరించడానికి, పోటీని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తామన్నారు. ఈ నిధిలో 49 శాతం వరకు నిధులు ప్రభుత్వం సమకూర్చనుండగా, మిగిలిన మొత్తాన్ని ఓడరేవులు, ప్రైవేట్ రంగం నుంచి సమీకరిస్తామని తెలిపారు.
సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారతీయ యార్డుల్లో షిప్‌బ్రేకింగ్ కోసం క్రెడిట్ నోట్స్ సహా ఖర్చుపరమైన నష్టాలను పరిష్కరించడానికి ఓడల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించే విధానాన్ని పునరుద్ధరిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అలాగే, నిర్ధిష్ట పరిమాణం కంటే పెద్ద నౌకలను మౌలిక సదుపాయాల సమతుల్యత గల మాస్టర్ జాబితా (హెచ్ఎమ్ఎల్)లో చేర్చాలని కూడా ప్రతిపాదించారు. ఓడల పరిధి, కేటగిరీలు, సామర్థ్యాన్ని పెంచడానికి 'ఓడల నిర్మాణ క్లస్టర్‌ల' ఏర్పాటును సులభతరం చేయాలని కూడా కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇందులో అదనపు మౌలిక సదుపాయాల సౌకర్యాలు, నైపుణ్యం, మొత్తం వ్యవస్థను అభివృద్ధి చేయు సాంకేతికత ఉంటాయి. నౌకానిర్మాణం పూర్తయేందుకు సుదీర్ఘ కాలం అవసరమని అంగీకరించిన ఆర్థికమంత్రి, ముడి పదార్థాలు, విడిభాగాలు, వినియోగ వస్తువులు లేదా ఓడల తయారీకి సంబంధించిన భాగాల కోసం సాధారణ కస్టమ్స్ సుంకం మినహాయింపును మరో పదేళ్ల పాటు కొనసాగించాలని ప్రతిపాదించారు. మరింత పోటీతత్వాన్ని పెంచడానికి షిప్ బ్రేకింగ్ కోసం కూడా ఇదే మినహాయింపును ఆమె ప్రతిపాదించారు.

ప్రాంతీయ అనుసంధాన పథకం ఉడాన్‌ను ప్రశంసిస్తూ, శ్రీమతి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఉడాన్ 1.5 కోట్ల మధ్యతరగతి ప్రజల వేగవంతమైన ప్రయాణ ఆకాంక్షలను తీర్చడానికి వీలు కల్పించిందన్నారు. ఈ పథకం 88 విమానాశ్రయాలను అనుసంధానించింది అలాగే 619 మార్గాల్లో కార్యకలాపాలను సాగించింది. ఆ విజయంతో ప్రేరణ పొంది, 120 కొత్త గమ్యస్థానాలకు ప్రాంతీయ అనుసంధానాన్ని విస్తరించడానికి, రాబోయే పదేళ్లలో 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించడానికి సవరించిన ఉడాన్ పథకం ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే ఈ పథకం కొండ ప్రాంతాలు, ఆకాంక్షాత్మక, ఈశాన్య ప్రాంత జిల్లాల్లో హెలిప్యాడ్‌లు, చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా మద్దతు ఇస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అధిక విలువ కలిగి, పాడయ్యే అవకాశం గల ఉద్యానవన ఉత్పత్తులు సహా ఎయిర్ కార్గో కోసం మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్, గిడ్డంగుల ఏర్పాటును ప్రభుత్వం సులభతరం చేస్తుందని ఆమె సభలో తెలియజేశారు. కార్గో స్క్రీనింగ్, కస్టమ్స్ ప్రోటోకాల్‌లను కూడా క్రమబద్ధీకరించి వినియోగదారుల హితంగా మారుస్తామన్నారు.
బీహార్ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి బీహార్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును సులభతరం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. పాట్నా విమానాశ్రయ సామర్థ్యం విస్తరణ, బిహ్తాలో ఉన్న విమానాశ్రయ అభివృద్ధి కి అదనంగా వీటిని చేపట్టనున్నట్లు తెలిపారు. బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50వేల హెక్టార్లకు పైగా భూమిని సాగు చేస్తున్న అనేకమంది రైతులకు ప్రయోజనం కలిగించే వెస్టర్న్ కోసి కెనాల్ ఈఆర్ఎమ్ ప్రాజెక్టుకు సైతం ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
***
(Release ID: 2098786)
Visitor Counter : 125
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam