ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ అభివృద్ధి ప్రయాణంలో వ్యవసాయమే తొలి చోదక శక్తి: బడ్జెట్ 2025-26


బిహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు

అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్

10 లక్షల జెర్మ్ ప్లాజమ్ లైన్లతో రెండో జీన్ బ్యాంక్ ఏర్పాటు

పత్తి ఉత్పాదకత కోసం ఐదేళ్ల మిషన్

కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

అసోంలోని నామ్ రూప్ లో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్లాంట్ ఏర్పాటు

మత్స్య సంపద సుస్థిర వినియోగానికి కొత్త విధానం లో అండమాన్,నికోబార్, లక్షద్వీప్లపై ప్రత్యేక దృష్టి

Posted On: 01 FEB 2025 1:27PM by PIB Hyderabad

వ్యవసాయ రంగం దేశాభివృద్ధికి తొలి చోదక శక్తిగా పేర్కొంటూ, కేంద్ర బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ వృద్ధి, ఉత్పాదకతను వేగవంతం చేయడానికి పలు చర్యలను ప్రకటించగా, ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి.

బీహార్ లో మఖానా బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన శ్రీమతి సీతారామన్, ఇది మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు,మార్కెటింగ్ ను మెరుగుపరుస్తుందని, అలాగే ఈ రంగంలో నిమగ్నమైన ప్రజలను రైతు ఉత్పత్తి దారుల సంస్థలు (ఎఫ్ పిఒ) గా నిర్వహించడానికి మద్దతు ఇస్తుందని చెప్పారు. మఖానా బోర్డు రైతులకు సహాయ సహకారాలు, శిక్షణను అందించడం తో పాటు, సంబంధిత ప్రభుత్వ పథకాల ద్వారా వారికి లభించాల్సిన ప్రయోజనాలు వారికి చేరేలా  కృషి చేస్తుందని ఆమె తెలిపారు.

 


పరిశోధనలను మరింత బలోపేతం చేయడానికి దిగుబడి పెంచడానికి, కీటకాల నిరోధకత, వాతావరణ అనుకూలత కలిగిన విత్తనాల అభివృద్ధి, విస్తరణ లక్ష్యంతో అధిక దిగుబడినిచ్చే విత్తనాల జాతీయ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే, జూలై 2024 తర్వాత ప్రవేశించిన 100కి పైగా విత్తన రకాల వాణిజ్య లభ్యతను పెంచడం కూడా ఈ మిషన్ లక్ష్యం.

జన్యు వనరుల సంరక్షణకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు మద్దతు అందిస్తూ, భవిష్యత్ ఆహార, పోషక భద్రత కోసం 10 లక్షల జర్మ్‌ప్లాసం లైన్లతో రెండో జీన్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

‘పత్తి ఉత్పాదకత మిషన్’ ను ప్రకటిస్తూ, శ్రీమతి సీతారామన్ ఈ ఐదేళ్ల మిషన్ పత్తి రైతుల ఉత్పాదకతను, సుస్థిరత్వాన్ని పెంచడంలో ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు, పొడవు పింజ పత్తి రకాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. రైతులకు ఉత్తమ శాస్త్రీయ, సాంకేతికత మద్దతు అందించడం ద్వారా ఈ మిషన్ లక్షలాది మంది పత్తి రైతులకు ప్రయోజనం కలిగించనుంది, టెక్స్ టైల్ రంగం కోసం ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ 5ఎఫ్ విజన్ కు అనుగుణంగా, ఈ మిషన్ రైతుల ఆదాయాలను పెంచడానికి సహాయపడుతుందని, అలాగే \దేశ సంప్రదాయ జౌళి రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి నాణ్యమైన పత్తి రకాలను నిరంతరం అందించడానికి దోహదపడతుందని మంత్రి అన్నారు.

సుమారు 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు స్వల్పకాలిక రుణాలను సులభతరం చేయడంలో కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసిసి) ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కెసిసి ద్వారా తీసుకునే రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

అసోంలోని నామ్ రూప్ లో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూరియా ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది యూరియా సరఫరాను మరింత పెంచుతుందని, తూర్పు ప్రాంతంలో ఇటీవలే తిరిగి తెరిచిన మూడు యూరియా ప్లాంట్లతో పాటు యూరియా ఉత్పత్తిలో ఆత్మనిర్భరతను సాధించడానికి సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు.



రూ.60 వేల కోట్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులతో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని పేర్కొంటూ,అండమాన్,నికోబార్, లక్షద్వీప్ లపై ప్రత్యేక దృష్టి సారించి భారత ప్రత్యేక ఆర్ధిక ప్రాంతం (ఈఈజడ్) నుంచి, అధిక సముద్ర ప్రాంతం నుంచి సుస్థిర చేపల పెంపకానికి అనువైన యంత్రాంగాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  ఇది సముద్ర రంగంలో ఇంతవరకు నిబిడీకృతంగా సామర్థ్యాన్ని వెలికి తీస్తుంది.

 

****


(Release ID: 2098709) Visitor Counter : 87