ఆర్థిక మంత్రిత్వ శాఖ
నియంత్రణల తొలగింపే ఆర్థికసర్వే 202425 అంతర్గత ఇతివృత్తమన్న ప్రవేశిక
ఒక స్పర్ధాత్మక, నవకల్పన సహిత ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే దేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికీ, ప్రోత్సహించడానికీ, వాటికి సక్రమ మార్గాన్ని వేయడానికీ అన్ని విధాలైన ప్రయత్నాలూ చేయాల్సి ఉంది: ఆర్థిక సర్వే
‘‘ఉద్గారాలను తగ్గించడానికి బదులు వాతావరణ మార్పులపై భారత్ తప్పక తన దృష్టిని సారించాలి’’
దేశమంతటా అగ్రగామి విద్యాసంస్థల్లో శ్రేష్ఠత్వ సాధన కోసం కృత్రిమ మేధలో ఉన్నత శ్రేణి కేంద్రాలను (సీఓఈ) ఏర్పాటు చేయాలని సూచించిన సర్వే
ఫ్యాక్టరీ తయారీ తినుబండారాలపై ఆహార సమాచారాన్నిచ్చే లేబుళ్లను తప్పనిసరి చేయడం ద్వారా
భారతదేశ యువతలో మానసిక, భావోద్వేగ, భౌతిక అవసరాలను తీర్చాలని తెలిపిన సర్వే..
Posted On:
31 JAN 2025 2:18PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వే 2024-25 ప్రవేశిక (ప్రిఫేస్)ను ఈ రోజు పార్లమెంటుకు సమర్పించారు. ఇదివరకు ఎన్నడూ చూసి ఎరుగని ప్రపంచ సవాళ్ల నడుమ ఆర్థిక వృద్ధినీ, ఉద్యోగకల్పనను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచడానికి ప్రభుత్వ నియంత్రణలను తగ్గించడం ద్వారా పరిపాలన పట్ల తాత్విక దృక్పథాన్ని అనుసరించాలని ఆర్థిక సర్వే ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ఊహించిన దాని కన్నా శరవేగంగా ప్రపంచం మార్పులకు లోనవుతోందని, 2024 సంవత్సరంలో ప్రపంచం అంతటా, ముఖ్యంగా ఐరోపాలో, మూడు ప్రధాన ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా, ఇండొనేషియాల్లో ఎన్నికల నేపథ్యంలో... రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు చోటుచేసుకొన్నాయనీ సర్వే పీఠికలో అభిప్రాయపడ్డారు.
నియమాల తొలగింపు ఉద్దీపనను అందించగలుగుతుంది
‘‘ఇప్పుడు అనుసరిస్తున్న మార్గం నుంచి వైదొలగి, వ్యాపార సంస్థలు వాటి ముఖ్య లక్ష్య సాధనపై తమ దృష్టిని కేంద్రీకరించగలిగేటట్లుగా వాటికి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రభుత్వాలూ అనుమతినిస్తే అది చెప్పుకోదగ్గ తోడ్పాటును అందించగలుగుతుందని, అలా చేస్తే నవకల్పనల (ఇన్నొవేషన్స్)ను, పోటీతత్వాన్నీ ప్రోత్సహించవచ్చని’’ ఆర్థిక సర్వే చెబుతోంది.
మన దేశ జనాభాలో కష్టపడి పనిచేసే వయోవర్గం వారు అధికంగా ఉన్నందువల్ల ప్రయోజనాలను అందుకోవాలంటే అందుకోసం భావి రెండు దశాబ్దాల్లో వృద్ధి సగటును పెంచడానికి డీరెగ్యులేషన్ స్టిమ్యులస్‌ను (నియమాల తొలగింపు రూపేణా ఓ ఉద్దీపనాన్ని ఇవ్వడం) సర్వే సూచించింది.
నష్టభయం (రిస్క్) ఎదురవగల నియమావళిని అమలుపరచడానికి ప్రభుత్వం సిద్ధపడి, ‘నిరపరాధి అని రుజువు కానంత వరకు దోషి’గా ప్రతిపాదిస్తున్న సూత్రాన్ని ‘దోషిగా రుజువయ్యేంత వరకు నిరపరాధి’ అని నిబంధనలలో మార్పును చేయాలని కూడా సర్వే కోరింది. దుర్వినియోగాన్ని నివారించడానికి అమలుపరుస్తున్న షరతులకు మరిన్నింటిని జతకలపడం వాటిని అర్థం చేసుకోవడాన్ని కష్టంగా మార్చివేస్తుందనీ, పదేపదే నిబంధనలు తీసుకురావడం వల్ల పరిస్థితి జటిలమై, ఆ నిబంధనలను వాటిని ప్రవేశపెట్టిన ఉద్దేశాలకు, పరమార్ధానికీ దూరం చేసేశాయని వ్యాఖ్యానించింది.
పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి దాని తాలూకు ప్రయోజనాలను పొందాలంటే నమ్మకం పునాదిగా ఉండే సమాజాన్ని ఆవిష్కరించడం అవసరం. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతోపాటు, 90వ దశకంలో బెంగళూరులో ఎదిగిన అంకుర సంస్థల వ్యవస్థలతో సమానమైందేనంటూ సర్వే అభివర్ణించింది. ఇదే జరిగితే, ‘‘భారతదేశ ప్రజానీకం సవాళ్లకు ఎదురీది, ఆ సవాళ్లను 2047కల్లా వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశగా పయనించడంలో తమకు లభించిన అవకాశాలుగా మార్చుకో గలుగుతుంద’’న్నది.
వ్యూహాత్మక పెట్టుబడులకు బాటను పరచడం
అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన, వృద్ధి లోకి వస్తున్న మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు రూపొందిన క్రమంలో, ప్రపంచదేశాలలో వ్యాపారం అమాంతం పురోగమించే దశను దాటిపోయామనీ, భారత్ పోటీపడే, నవకల్పన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారాలంటే దేశ, విదేశ పెట్టుబడులను మరింత ఎక్కువగా ఆకర్షించడానికీ, ప్రోత్సహించడానికీ, వాటికి మార్గాన్ని సుగమం చేయడానికీ సకల విధాలుగానూ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందనీ సర్వే తెలిపింది. దేశంలో సరఫరా హారం సామర్థ్యాన్నీ, దృఢత్వాన్నీ పటిష్టపరచడానికి ప్రైవేటు రంగం వ్యూహాత్మకంగా పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలంలో దేశానికి చేయూతను అందించగలుగుతాయని కూడా సర్వే సూచించింది.
సర్వే పీఠిక ప్రపంచ సవాళ్లను గురించి ప్రస్తావిస్తూ, రాబోయే కాలంలో దేశం వెలుపలి వృద్ధి కారకాల కంటే దేశీయ వృద్ధి చోదకాలే కాస్త అధిక ప్రాముఖ్యం కలిగి ఉంటాయంది.
వాతావరణ మార్పు, ఇంధన వినియోగంలో నూతన పద్ధతుల వైపు మళ్లడం
వాతావరణ మార్పుల నేపథ్యంలో పోటీతత్వాన్ని పెంచుకోవడంలో ఇంధనాన్ని తక్కువ ఖర్చులోనే సమకూర్చే, ఇంధన భద్రతను కల్పించే ప్రభుత్వ విధానాల పాత్ర చాలా ముఖ్యం అని సర్వే ప్రధానంగా చెప్పింది. సంప్రదాయ శిలాజ జనిత ఇంధన వనరుల వినియోగం నుంచి కొత్త పద్ధతులలోకి మారడానికి భారత్ తనదైన సొంత బాటను ఏర్పరచుకోవాలనీ, విద్యుత్తు వాహన రంగం (ఈవీ) ఆర్థికంగా మేలైందనీ, పునర్వినియోగ శక్తి, బొగ్గు విస్తారంగా లభ్యం అవుతున్నాయనీ వివరించింది. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, లాభసాటి అయిన రీతిన ఇంధన మార్పు దిశగా పయనించడానికి ఇండియాకున్న అపార జనాభా, పరిమిత భూ లభ్యతలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ప్రజారవాణా మరింత సమర్థ ప్రత్యామ్నాయమని సర్వే విశ్లేషించింది.
ఇంధన భద్రత, ఇంధన వనరుల వినియోగం రంగంలో భారత్ ఆవిష్కరించాలనుకుంటున్న ప్రణాళికలు భౌగోళిక అశక్తతలను లెక్కలోకి తీసుకోవాలనీ, కీలక దిగుమతుల విషయంలో బయటి వనరులపై ఎక్కువగా ఆధారపడడాన్ని భారత్ మానుకోవాలనీ సర్వే తెలిపింది. ఉద్గారాలను తగ్గించుకోవాలనే ధ్యాసకన్నా సరికొత్త పద్ధతులను అనుసరించడంపైన భారత్ శ్రద్ధ తీసుకోవాలనీ సర్వే సూచించింది.
విద్య, నైపుణ్యాలను నేర్పించడం
కృత్రిమ మేథ, నైపుణ్యాల సాధన వంటి ఆధునిక సాంకేతికత ప్రయోజనాలను దేశ యువత అందిపుచ్చుకోవాలనీ, యువత సాంకేతిక పురోగతుల విషయంలో ఒక అడుగు ముందే ఉండేటట్టు చూసి ఉద్యోగకల్పనపై ప్రతికూల ప్రభావాన్ని కనీస స్థాయికి తగ్గించడానికి గాని, లేదా పూర్తిగా తొలగించడానికి గాని యువతకు శక్తిని విద్యయే అందించాలి అనీ సర్వే చెప్పింది. ప్రైవేటు రంగంలోనవకల్పన (ఇన్నొవేషన్)కూ, వృద్ధిలోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్న రంగాలలో పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కీ ఉత్తేజాన్ని ఇవ్వడానికి రూ.1 లక్ష కోట్ల ఆర్థిక సహాయ మూలనిధితో దేశవ్యాప్తంగా అగ్రగామి విద్యాబోధన సంస్థల్లో శ్రేష్ఠత్వ సాధనకు గాను కృత్రిమ మేధ కేంద్రాలను (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఫర్ ఎక్స్‌లెన్స్.. సీఓఈ) ఏర్పాటు చేయాలని కూడా సర్వే సూచించింది.
కృత్రిమ మేధ
ఈ సర్వే కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో సర్వే సమతుల దృష్టికోణాన్ని పాటించింది. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంలా ఏఐ అన్నింటికీ వర్తించదు. అలాగే అన్ని దేశాలకూ అది సమానంగా వర్తించదు. ముఖ్యంగా శ్రమశక్తి సమృద్ధిగా ఉన్న భారత్ వంటి దేశానికి కూడా ఇదే సూత్రం అని సర్వే పేర్కొంది.
మంచి తిండి: ఆరోగ్యవంతమైన జీవనం
కొవ్వు, ఉప్పు, చక్కెర స్థాయులు అధికంగా (హెచ్ఎఫ్ఎస్ఎస్) ఉంటున్న అల్ట్రా-ప్రాసెస్‌డ్ ఫూడ్స్ సేవనం దేశంలో పెచ్చుపెరుగుతూ ఆందోళనకర స్థాయిలకు చేరుకొంటున్న నేపథ్యంలో దేశంలో యువతీయువకుల్లో ఉన్న అపార శక్తి నుంచి సత్ఫలితాల్ని పొందాలంటే వారి మానసిక, భావోద్వేగ, భౌతిక అవసరాలను తీర్చడం కోసం వస్తువుల తయారీలో ప్రామాణిక నియమాలను తు.చ. తప్పక అమలుపరచేలా చూడాలని సర్వే హితవు పలికింది. ఈ విధమైన పోకడను అడ్డుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా స్వీయ నియంత్రణను పాటించినా ఏమంత పెద్ద ఫలితాలు లభించలేదని సర్వే వెల్లడించింది.
మహిళలకు, రైతులకు, యువతతోపాటు పేదలకు విధానాల పరంగా ప్రాధాన్యం
అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు అందేలా చూడాలంటే ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలకు, రైతులకు, యువతకు, పేదలకు మరింతగా ప్రాతినిధ్యం ఉండేలా చూడడం కీలకం అని సర్వే చెప్పింది. యువతపరంగా చూసినప్పుడు, విద్య బోధన, నైపుణ్యాలను అలవర్చడం, వారి శారీరక, మానసిక ఆరోగ్య రక్షణపై దృష్టి పెట్టాలంది. పేదలను వలయం అంచుల నుంచి ఆర్థిక కార్యకలాపాల కేంద్ర స్థానం వద్దకు తీసుకురావడానికి గాను వారికి సాధికారతను కల్పించడం ద్వారా వారి ఆదాయాన్నీ, జీవన ప్రమాణాలనూ పెంచాలని సర్వే చెప్పింది. పేద ప్రజల జీవనోపాధులను, అవకాశాలనూ మెరుగుపరచడానికి నిర్దిష్ట మద్దతును అందించాలంది. మహిళల విషయంలో, వారికి అనుకూలంగా ఉండే చర్యలను తీసుకోవడంతోపాటు శ్రమశక్తిలో వారి ప్రాతినిధ్యానికి అడ్డుగా నిలుస్తున్న చట్టపరమైన, నియమాల పరమైన అవరోధాలను తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాతకు సర్వే సలహా ఇచ్చింది.
పారిశ్రామిక కార్యకలాపాలు
‘వ్యాపార నిర్వహణలో సౌలభ్యం’ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రమాణాల సాధనలో మంచి మార్కులను తెచ్చుకొన్న రాష్ట్రాలకూ, పారిశ్రామిక కార్యకలాపాల విస్తరణకూ మధ్య చక్కని పరస్పర సంబంధం ఉందని సర్వే తెలిపింది. అభివృద్ధి కోసం తపిస్తున్న రాష్ట్రాలు వాటి పారిశ్రామికీకరణ సంబంధిత స్కోరును పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా సర్వే పేర్కొంది.
ప్రభుత్వం చొరవ తీసుకొని ఎయిర్ కండీషనర్ల రంగంలో ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పథకాన్ని (పీఎల్ఐ స్కీము) అమలులోకి తీసుకురావడంతో దేశీయ ఉత్పాదకత మంచి ఫలితాలను ఆవిష్కరించిన సంగతిని కూడా సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది.
దేశం బయటి నుంచి ఎదురయ్యే సవాళ్లు
సమీప భవిష్యత్తులో భారతదేశం ఎదుర్కోబోయే సవాళ్లను కూడా ఈ సర్వే అంచనా వేసింది. ఆంక్షలను విధించేందుకు అవకాశాలున్న వ్యాపార విధానాల వల్ల ఎదురయ్యే ముప్పు ఆ సవాళ్లలో ఒకటి. ఈ తరహా విధానాలు మన దేశ ఎగుమతులను కుదించేయడంతోపాటు కరెంట్ ఖాతా లోటును పెంచేయగలవు.
***
(Release ID: 2098093)
Visitor Counter : 91