సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
తొలి ప్రపంచ దృశ్య శ్రవ్య వినోద సదస్సుకు ముందు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, పాడ్ కాస్టర్లు, యానిమేషన్ మేకర్లు, గేమ్ డెవలపర్ల వంటి కంటెంట్ క్రియేటర్లకు అత్యున్నత అవార్డులను ప్రకటించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ బజార్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గజేంద్ర సింగ్ షెకావత్: క్రియేటర్లు, సంస్థలను ఒక్కచోట చేర్చే ఇ-మార్కెట్ ప్లేస్
వేవ్స్ కోసం ‘వాహ్ ఉస్తాద్’ పేరిట శాస్త్రీయ (క్లాసికల్), భారతీయ (సెమీ క్లాసికల్) సంగీత పోటీ, ఖాదీకి ప్రాచుర్యం సహా మరో మూడు పోటీల ప్రారంభం; పర్యాటకం – సాంస్కృతిక వారసత్వ ప్రాచుర్యం కోసం మరో పోటీ
అంతర్జాతీయ సృజన రాజధానిగా భారత్ ను నిలిపే లక్ష్యంతో వేవ్స్.. వివేకానుందుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న భారత సాంస్కృతిక వారసత్వం: శ్రీ అశ్వినీ వైష్ణవ్
కళా ప్రియుల వేదిక వేవ్స్.. సుసంపన్నమైన మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటేలా ప్రేరణ ఇస్తుంది: శ్రీ గజేంద్ర షెకావత్
Posted On:
27 JAN 2025 7:22PM by PIB Hyderabad
ప్రపంచ దృశ్య శ్రవ్య వినోద సదస్సు (వేవ్స్) సన్నాహాలు కీలక దశకు చేరుకున్నాయి. సదస్సు ప్రారంభానికి ముందు ఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ పలు ముఖ్య కార్యక్రమాలను ప్రారంభించింది. కేంద్ర సమాచార - ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక - పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు.
సమాచార - ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ అరుణీశ్ చావ్లా, భారత చలనచిత్ర దర్శకుడు శ్రీ శేఖర్ కపూర్, ప్రసార భారతి సీఈవో శ్రీ గౌరవ్ ద్వివేది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ రాజధానిగా భారత్!
ప్రపంచ దృశ్య శ్రవ్య వినోద సదస్సు (వేవ్స్)ను దావోస్ ఆర్థిక వేదిక మాదిరిగా అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచేలా నిలపాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా.. భారత సృజన ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యాన్ని మరింత ప్రముఖంగా చాటే విస్తృతమైన వ్యూహంలో ఈ కార్యక్రమం భాగమని కేంద్ర సమాచార - మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. సంప్రదాయం, కథాకథనం, సాంస్కృతిక ప్రాధాన్యాలతో సుసంపన్నమై.. అంతర్జాతీయంగా ‘ఆరెంజ్ ఎకానమీ’గా ఇది ప్రసిద్ధి చెందింది.
‘‘షికాగో... స్వామి వివేకానందుడి ప్రసంగంలో ప్రతిధ్వనించిన మన సుసంపన్నమైన సంస్కృతిని యోగా, సంస్కృతి, సృజనాత్మకత, ఆయుర్వేదం వంటి కార్యక్రమాల ద్వారా నేడు మన ప్రధానమంత్రి అంతర్జాతీయ వేదికపై ముందుకు తీసుకెళ్తున్నారు’’ అని శ్రీ అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ‘‘సృజనరంగ ఆర్థిక వ్యవస్థకు భారత్ ను అంతర్జాతీయ రాజధానిగా నిలిపే దిశగా చేస్తున్న కృషికి విస్తృతి వేవ్స్’’ అని ఆయన అన్నారు.
వేవ్స్ బజార్ ను, 3 క్రియేట్ ఇన్ ఇండియా పోటీలను కేంద్ర మంత్రులు ప్రారంభించారు. వేవ్స్ పురస్కారాలను, మరో పోటీని కూడా ప్రకటించారు.
వేవ్స్ బజార్: సృజన రంగ ఆర్థిక వ్యవస్థ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడం
ఈ కార్యక్రమంలో భాగంగా వేవ్స్ బజార్ ను ప్రారంభించారు. భారత్ లో విస్తారంగా ఉన్న సృజనాత్మక ప్రతిభను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించేలా రూపొందించిన అంతర్జాతీయ ఇ-మార్కెట్ గా ఈ వేదిక సంచలనాత్మకం కానుంది. కంటెంట్ ను, ప్రదర్శన కోసం రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించడంతోపాటు భౌగోళిక హద్దులను అధిగమించేలా అర్ధవంతమైన అనుసంధానాలను నిర్మించడానికి ఈ వేదిక అవకాశం కల్పిస్తుంది. తగిన సాధనాలు, వనరులను అందించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలను ఇది సులభతరం చేస్తుంది. తమ పరిధిని పెంచుకుంటూ వృద్ధిని సాధించడంతోపాటు విజయాలను సొంతం చేసుకునే దిశగా సృజనకారులు, వాణిజ్య రంగ భాగస్వాములకు ఇది తోడ్పాటును అందిస్తుంది.
సినిమా, టీవీ, సంగీతం, ఇ స్పోర్ట్స్, యానిమేషన్, దృశ్య చిత్రణ, గేమింగ్, కామిక్స్ వంటి వివిధ వినోద రంగాలకు చెందిన సృజనకారులు, కొనుగోలుదారులు, సమన్వయకర్తలను ఏకం చేసే విప్లవాత్మక వేదిక వేవ్స్ బజార్ అని ఈ సందర్భంగా సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారు. భౌగోళిక అంతరాలను అధిగమించి తమ కళను ప్రదర్శించేలా ఇది సృజనకారులకు అవకాశాలను అందిస్తుంది. వాణిజ్య సంస్థల మధ్య అర్ధవంతమైన సంభాషణలకూ ఆస్కారం ఉంటుంది.
తమ కళలను సాకారం చేసుకోవడానికి అవసరమైన సహకారాన్ని సృజనకారులకు అందిస్తూ.. బ్రాండ్లతో సమన్వయం, నిధులు, పంపిణీపరమైన చేయూతను కూడా వేవ్స్ బజార్ అందిస్తుంది. భారత్ లో వర్ధమాన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు ఈ సమగ్రమైన ఇ-మార్కెట్ సదుపాయం ముఖ్యమైన సాధనం కాబోతోంది. తమ ఉత్పత్తులు, భావాలు, నైపుణ్యాల విషయంలో సృజనకారులకు ఈ వేదిక మార్కెట్ ను అందుబాటులోకి తెస్తుంది.
వేవ్స్ పురస్కారాలు
వచ్చే నెల 15న ప్రారంభమవుతున్న నామినేషన్లతో వేవ్స్ అవార్డుల ప్రక్రియ మొదలవుతుంది. వివిధ సృజనాత్మక విభాగాల్లో అత్యున్నత ప్రతిభను చాటేలా ఏర్పాటు చేసిన వేవ్స్ పురస్కారాల్లో గేమ్ ఆఫ్ ది ఇయర్, ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్, అడ్వర్టైజింగ్ కాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ వంటి కేటగిరీలున్నాయి. ప్రత్యేకంగా ఎంపిక చేసిన అవార్డులు, జీవన సాఫల్య గౌరవ పురస్కారాలు.. సాంకేతిక రంగం, విశేషమైన సామాజిక ప్రభావం వంటి అంశాల్లోనూ అవార్డులు ఉన్నాయి.
క్రియేట్ ఇన్ ఇండియా పోటీల్లో భాగంగా మూడు కొత్త పోటీలు
క్రియేట్ ఇన్ ఇండియా పోటీల కింద మూడు కొత్త పోటీలను ప్రారంభించడం మరో విశేషం – ‘రీసొనేట్: ఈడీఎం పోటీ’ ‘ప్రపంచమంతటిటో ఖాదీని ధరింపజేయడం (మేక్ ద వరల్డ్ వేర్ ఖాదీ)’, ‘వాహ్ ఉస్తాద్’.
1.వాహ్ ఉస్తాద్
సాంస్కృతిక శాఖ, దూరదర్శన్ సహకారంతో సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న, విశిష్టమైన ‘ఢిల్లీ ఘరానా’ ద్వారా నడిచే ‘వాహ్ ఉస్తాద్’ తమ అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించేలా శాస్త్రీయంగా శిక్షణ పొందిన, యువ గాయకులకు వేదికను అందిస్తుంది. 18 సంవత్సరాల వయస్సు నిండిన గాయకులకు ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ భాగస్వామ్యం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ఇది రెండంచెల పోటీ. వేవ్స్ లో జరిగే గ్రాండ్ ఫినాలెతో ముగుస్తుంది. ప్రసార భారతి వెబ్ సైట్ https://prasarbharati.gov.in/wah-ustad/ లో నమోదు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది.
2. ‘ప్రపంచమంతటితో ఖాదీని ధరింపజేయడం (మేక్ ది వరల్డ్ వేర్ ఖాదీ)’
ఖాదీని అంతర్జాతీయ బ్రాండ్‌గా నిలిపే వినూత్న ప్రచారాలను రూపొందించేలా ప్రకటన నిపుణులు, ఫ్రీలాన్సర్లను ఈ పోటీ ఆహ్వానిస్తుంది. అంతర్జాతీయ భాగస్వామ్యమూ, అందుబాటులో ఉన్న ఈ పోటీ దేశంలోనూ అంతర్జాతీయంగానూ ఖాదీకి ప్రాచుర్యం కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. పోటీలో పాల్గొనేవారు వివిధ రూపాల్లో (ఉదా: డిజిటల్, ముద్రణ, వీడియో, అనుభవపూర్వక) వినూత్న డిజైన్లను రూపొందించాల్సి ఉంటుంది. ఈ పోటీ సృజనాత్మక ఆలోచనలను, ఖాదీ బ్రాండ్ ఇమేజీని పెంచే దిశగా వ్యూహాత్మక విధానాలనూ ప్రోత్సహిస్తుంది. వినియోదారుల దృష్టినీ ఆకర్షిస్తుంది.
3. రీసొనేట్:
ఈడీఎం పోటీ: - భారతీయ సంగీత సంస్థ (ఐఎంఏ) దీనిని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కళాకారులు, కంపోజర్లు, సంగీతకారులు, ప్రదర్శకులను ఆహ్వానించి ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ (ఈడీఎం) ప్రొడక్షన్ లో తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తోంది. అన్ని దేశాల ప్రజలకూ ఈ చాలెంజ్ అందుబాటులో ఉంటుంది.
భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, పర్యటకాన్ని ప్రోత్సహించేలా కొత్త పోటీలు
భారతీయ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్నీ పర్యాటక విశేషాలను చాటే చలనచిత్రాలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర సమాచార - ప్రసార శాఖ మంత్రి ఓ కొత్త చాలెంజిని కూడా ప్రకటించారు. ఘనమైన దేశ సాంస్కృతిక రంగంలో లోతుగా పరిశోధించేలా.. జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు దానిని కళ్లకు కట్టేలా ప్రదర్శించేలా ఈ పోటీ చలనచిత్ర దర్శకులను ప్రోత్సహిస్తుంది. సృజనాత్మకతను, ఆవిష్కరణలను, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ పోటీల లక్ష్యం.
వేవ్స్: భారత సాంస్కృతిక కౌశలాన్ని అంతర్జాతీయంగా చాటుతున్న ప్రదర్శన
ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, కథకులు, సంగీతకారులు, కంటెంట్ సృజనకారులకు నిలయంగా ఉండి.. మతపరమైన వైవిధ్యాలకు ప్రభావవంతమైన ఉదాహరణగా భారత్ నిలుస్తుందని అభివర్ణించారు. ‘‘మన సాంస్కృతిక వారసత్వం వైభవోపేతమైన గతానికి నిదర్శనం మాత్రమే కాదు.. అంతర్జాతీయ వేదికపై మన భవితకు వెన్నెముక వంటిది’’ అని శ్రీ షెకావత్ వ్యాఖ్యానించారు. ఈ సుసంపన్నమైన సాంస్కృతిక విశేషాలకు మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్స్ ను ప్రారంభించింది. భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించి ఆర్థికంగా సాధికారత కల్పించడమనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన చేతనాత్మకమైన వేదిక ఇది.
ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్ విశేష పురోగతి సాధిస్తున్న వేళ మన సాంస్కృతిక సంపద గొప్ప ఆస్తి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ.. వేవ్స్ ద్వారా భారత సాంస్కృతిక వైవిధ్యం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని శ్రీ షెకావత్ అన్నారు. సాంస్కృతిక సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ప్రామాణిక ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఇది నిలుపుతుందన్నారు. భారత సాంస్కృతిక శక్తిని చాటడంలో, దానిని పెంపొందించడంలో వేవ్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోంది. మన సృజనకారులకు వేదికను అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్నీ గుర్తింపునూ పొందేలా వారికి దోహదం చేస్తుంది.
క్రియేట్ ఇన్ ఇండియా పోటీలు
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచ దృశ్య శ్రవ్య వినోద సదస్సు (వేవ్స్)కు మూలస్తంభమైన క్రియేట్ ఇన్ ఇండియా పోటీలకు భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక, నిపుణులైన సృజనకారుల నుంచి విశేష స్పందన లభించింది. 70 వేల మందికి పైగా నమోదు చేసుకోగా, రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ పోటీ విభిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు, బృందాల దృష్టిని ఆకట్టుకుంది. తద్వారా సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు అనుకూలమైన శక్తిమంతమైన వ్యవస్థలను ఏర్పరుస్తోంది. ఇప్పటివరకు 31 క్రియేట్ ఇన్ ఇండియా పోటీలను ప్రారంభించగా.. అందులో 25 పోటీల్లో నమోదు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. 22 పోటీల్లో పాల్గొనేందుకు విదేశీయులూ ఆసక్తి చూపుతున్నారు.
కథల కాణాచి భారతదేశం
భారత్ కంటెంట్ తయారీలో, వినియోగం రెండింటిలోనూ భారత్ ముందంజలో ఉందని ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు. ‘‘సినిమాల నుంచి గేమింగ్ వరకూ భారత్ డిజిటల్ కంటెంట్ నిలయంగానే కాకుండా.. సాంస్కృతిక, డిజిటల్ కంటెంట్ల ఉత్పత్తి కేంద్రంగా ఉంది. ఇది భారత ‘సామాజిక విలువ (సాఫ్ట్ పవర్)’ను పెంచుతుందని, విస్తృతమైన సృజనాత్మక శక్తికి ప్రదర్శన వేదికగా నిలవబోయే వేవ్స్ సదస్సు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు. సృజనాత్మక ఆర్థిక పరిధిలో భారత్ తన సత్తా చాటేందుకు ఈ కార్యక్రమం కీలకమైన వేదికగా నిలవనుందని స్పష్టం చేశారు.
సువర్ణావకాశం
ఆడియో, వీడియో, వినోదాలను ఒకే వేదికపైకి తెచ్చే ఈ తరహా వేడుక దేశంలో ఇదే మొదటిది. దీనివల్ల దేశంలోని సృజనకారులు అంతర్జాతీయంగా సంబంధాలను ఏర్పరచుకోవాలన్న లక్ష్యంతోనే వేవ్స్ కు రూపకల్పన చేశారు. తద్వారా విదేశీ సృజనకారులతో కలసి పనిచేయడంతోపాటు తమ సృజన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. వేవ్స్ లో పాల్గొని ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవాలని కేంద్ర సమాచార - ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖల మంత్రి శ్రీ వైష్ణవ్ కళాకారులకు విజ్ఞప్తి చేశారు.
(Release ID: 2097313)
Visitor Counter : 8
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam