ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
2025-26 సీజనుకు ముడి జనపనార కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) ప్రకటన
Posted On:
22 JAN 2025 3:09PM by PIB Hyderabad
2025-26 మార్కెటింగ్ సీజనును దృష్టిలో పెట్టుకొని ముడి జనపనారకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ)ను ఖరారు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) సమావేశం ఆమోదం తెలిపింది.
ముడి జనుము (టీడీ-3 గ్రేడు)కు ఎంఎస్‌పీని 2025-26 సీజనుకు ఒక్కొక్క క్వింటాలుకు రూ.5,650గా ఖరారుచేశారు. ఇది అఖిల భారత స్థాయిలో ఉత్పత్తి సంబంధిత వెయిటెడ్ ఏవరేజ్ ఖర్చులపైన 66.8 శాతం రాబడినిస్తుంది. అఖిల భారత స్థాయిలో వెయిటెడ్ ఏవరేజ్ ఉత్పాదక వ్యయంతో పోలిస్తే తక్కువలో తక్కువగా 1.5 రెట్ల వద్ద ఎంఎస్‌పీని ఖాయపరచాలన్న సూత్రాన్ని 2018-19 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 మార్కెటింగ్ సీజనుకుగాను ముడి జనుముకు ఆమోదం తెలిపిన ఎంఎస్‌పీ ఈ ప్రకటనకు అనుగుణంగా ఉంది.
మార్కెటింగ్ సీజను 2025-26కు గాను ముడి జనుము ఎంఎస్‌పీలో అంత క్రితం 2024-25మార్కెటింగ్ సీజనుకు ప్రకటించిన దానితో పోలిస్తే ఒక్కో క్వింటాలుకు రూ.315 మేర వృద్ధి ఉంది. భారత ప్రభుత్వం 2014-15లో ముడి జనుము క్వింటాలుకు రూ.2400గా ఉన్న ఎంఎస్‌పీని 2025-26కు ప్రతి క్వింటాలుకు రూ.5,650కి పెంచింది. అంటే దీనిలో క్వింటాలు ఒక్కింటికి రూ.3250 మేర పెంపు (2.35 రెట్లు) ఉందన్న మాట.
జనుమును పండించిన రైతులకు 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో చెల్లించిన ఎంఎస్‌పీ రూ.1300 కోట్లుగా ఉంది. కాగా 2004-05 నుంచి 2013-14 మధ్య చెల్లించింది రూ.441 కోట్లే.
నలభై లక్షల వ్యవసాయ కుటుంబాల బతుకుతెరువు జనుము పరిశ్రమపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉంది. దాదాపుగా 4 లక్షల మంది శ్రామికులు జూట్ మిల్లుల్లో, జనుము వ్యాపార కార్యకలాపాల్లో ఉపాధిని పొందుతున్నారు. 82 శాతం మంది జనపనార రైతులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. కాగా, జనుము ఉత్పత్తిలో అసోం, బిహార్‌లు చెరో 9 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ధరల పరంగా మద్దతిచ్చే కార్యకలాపాలను చేపట్టడానికి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా తన పాత్రను నిర్వహించడాన్ని కొనసాగించనుంది. ఈ తరహా కార్యకలాపాల్లో ఏవైనా నష్టాలు ఎదురైతే, వాటిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించి భర్తీచేస్తుంది.
***
(Release ID: 2095155)
Visitor Counter : 18
Read this release in:
Marathi
,
Kannada
,
Malayalam
,
Tamil
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati