ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వామిత్వ యోజన కార్డుల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో ప్రధాన మంత్రి సంభాషణ, ప్రసంగం ఆంగ్ల ఆనువాదం

Posted On: 18 JAN 2025 6:04PM by PIB Hyderabad

కార్యక్రమ సమన్వయకర్త: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన లబ్ధిదారులైన స్వామిత్వ కార్డుదారులతో సంభాషించే కార్యక్రమంలో మొదటగా మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాకు చెందిన మనోహర్ మేవాడ గారిని గౌరవనీయులైన ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆహ్వానిస్తున్నాను.


మనోహర్ మేవాడ - సమస్కారం సర్.


ప్రధాన మంత్రి - నమస్కారం మనోహర్ గారు, హలో.


మనోహర్ మేవాడ - హలో సర్. నా పేరు మనోహర్ మేవాడ.


ప్రధాన మంత్రి - ఎలా ఉన్నారు?


మనోహర్ మేవాడ – చాలా బాగున్నాను సర్.


ప్రధాన మంత్రి - సరే, మీ కుటుంబంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు?


మనోహర్ మేవాడ - నా కుటుంబంలో నేను, నా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నాం. నా కుమారుల్లో ఒకరికి వివాహమైంది, కోడలు ఉంది. నాకు మనవడు కూడా ఉన్నాడు.


ప్రధాన మంత్రి – మనోహర్ గారూ, మీరు ఆస్తికి సంబంధించిన దస్త్రాలపై రుణం తీసుకున్నారని నాకు చెప్పారు. ఈ రుణం మీకు ఏమేరకు  సహాయపడింది? దీని వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? దేశం నలుమూలల నుంచి ప్రజలు మీ మాటలు వింటున్నారు కాబట్టి మీ అనుభవాన్ని చెప్పండి మనోహర్ గారు.


మనోహర్ మేవాడ - స్వామిత్వ యోజన కింద నాకు ఆస్తి కార్డు వచ్చింది సర్. నేను సంతోషంగా ఉన్నాను. నా కుటుంబం కూడా సంతోషంగా ఉంది. నేను మీకు నమస్కారం చేస్తున్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


ప్రధాన మంత్రి – మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వివరంగా చెప్పండి.


మనోహర్ మేవాడ – వివరంగా చెప్పాలంటే.. నాకు ఆస్తి కార్డు వచ్చింది.  నేను దాని మీద  డెయిరీ ఫారం కోసం పది లక్షల రుణం తీసుకున్నాను.


ప్రధాన మంత్రి - పది లక్షలు!


మనోహర్ మేవాడ – అవును, పది లక్షల రుణం తీసుకున్నాను సర్.


ప్రధాన మంత్రి – మరి దానితో మీరేం చేశారు?


మనోహర్ మేవాడ - సర్, నేను డెయిరీ ఫారం తెరిచాను. డెయిరీ ఫారంలో నేను పనిచేస్తాను, నా పిల్లలు కూడా పనిచేస్తారు.  వ్యవసాయం కూడా చేస్తాను, డెయిరీ ఫారం కూడా చూసుకుంటాను.


ప్రధాన మంత్రి - మీకు ఎన్ని పశువులు ఉన్నాయి?


మనోహర్ మేవాడ - నాకు ఐదు ఆవులు, ఒక గేదె ఉంది. మొత్తం నాకు ఆరు పశువులు ఉన్నాయి. అది నా వ్యాపారం. దాని వల్ల నాకు చాలా లాభం వస్తోంది.


ప్రధాన మంత్రి - ఇంతకు ముందు రుణం వచ్చేందుకు ఆధారం లేదు. ఇప్పుడు మీకు ఇంటి పత్రాలు ఉన్నాయి కాబట్టి మీకు రుణం వచ్చింది!


మనోహర్ మేవాడ - సర్, ఇంతకు ముందు నా దగ్గర ఇంటికి సంబంధించిన పత్రాలు లేవు, కాబట్టి రుణం తీసుకోవడం వీలు కాలేదు. ఇప్పుడు నా వద్ద ఇంటి పత్రాలు ఉన్నాయి, కాబట్టి ఈ రోజు దానిమీద రుణం తీసుకోవడం వల్ల ప్రయోజనం కలిగింది. ఎందుకంటే నేను ఏ బ్యాంకుకు వెళ్లినా, నాకు రుణం లభిస్తుంది.


ప్రధాన మంత్రి - సరే, అప్పు కూడా పూర్తిగా ఖర్చు అయిపోయి పిల్లలు అప్పులపాలవుతారు. అలా జరగదు కదా!


మనోహర్ మేవాడ - లేదు, పిల్లలు అలా కారు సర్. ఎందుకంటే నేను ఏం చేస్తున్నానో నా పిల్లలు కూడా అది చేస్తారు.


ప్రధాన మంత్రి - లేదా! మీరు బాగా సంపాదిస్తున్నారా?


మనోహర్ మేవాడా - సర్, సంపాదన బానే ఉంటోంది.


ప్రధాన మంత్రి - రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నారా!


మనోహర్ మేవాడ - అవును


ప్రధాన మంత్రి - మీరు రుణాన్ని కూడా తిరిగి చెల్లిస్తూనే ఉండి ఉంటారు!


మనోహర్ మేవాడ - అవును సర్. నా వాయిదా సుమారు రూ. 16000 ఉంటుంది. నా ఆదాయం నెలకు 30 వేల రూపాయలు. నేను దాని నుండి వాయిదా చెల్లిస్తాను. నా ఇంటి ఖర్చులను కూడా నేను దాని నుంచే చేస్తాను.


ప్రధాన మంత్రి - మనోహర్ గారు.. ఇది చాలా బాగుంది. మీ కేంద్ర ప్రభుత్వ పథకం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు తగ్గాయి.. ఇది నాకు చాలా సంతోషకరంగా ఉంది. స్వామిత్వ యోజన ద్వారా మీలాంటి లక్షలాది కుటుంబాల ఆదాయం కూడా పెరుగుతుండటం చాలా సంతోషంగా ఉంది.


మనోహర్ మేవాడ - అవును సార్.


ప్రధాన మంత్రి - దేశంలోని ప్రతి పౌరుడు గర్వంతో తలెత్తుకోవాలి, వాళ్ల జీవితాలు సులభతరం కావాలన్నదే మా ప్రభుత్వ ప్రాధాన్యత. ఆ ఆలోచనకు పొడిగింపే ఈ యాజమాన్య పథకం. మీకు అభినందనలు మనోహర్ గారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ కూడా చెప్పండి.  ప్రతి ఒక్కరూ తమ కార్డును తయారు చేయించుకొని, దానిపై రుణం కూడా తీసుకొని ఏదో ఒక వ్యాపారం చేయాలని తెలియజేయండి. ఈ విషయాన్ని కచ్చితంగా అందరికీ చెప్పండి. సరే, మీకు చాలా ధన్యవాదాలు మనోహర్ గారు.


మనోహర్ మేవాడ - సర్, నా తరఫున, అలాగే నా కుటుంబం తరఫున మీకు చాలా ధన్యవాదాలు, నమస్కారం సర్.


ప్రధాన మంత్రి - ధన్యవాదాలు.


కార్యక్రమ సమన్వయకర్త: ఇప్పుడు రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాకు చెందిన స్వామిత్వ పథకం లబ్ధిదారు, కార్డు పొందిన  పొందిన రచన గారు ఈ చర్చలో పాల్గొంటారు.


రచన - గౌరవనీయ ప్రధాన మంత్రికి నా నమస్కారాలు.


ప్రధాన మంత్రి - హలో రచన గారు, నమస్కారం. రచన గారు.. మీరు ఏం చేస్తుంటారు? మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? ఈ స్వామిత్వ పథకం గురించి మీకు ఎలా తెలిసిందో చెప్పండి.


రచన - సర్, మా కుటుంబంలో, నా భర్త నరేష్ కుమార్ బిష్ణోయ్. నాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.


ప్రధాన మంత్రి - మరి ఈ పథకం గురించి చెప్పండి.


రచన - సర్, నేను ఇక్కడ 20 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. నాకు ఒక చిన్న ఇల్లు ఉంది, దానికి సంబంధించి నా వద్ద ఎటువంటి పత్రాలు లేవు. ఇప్పుడు కూడా నాకు స్వామిత్వ పథకం కింద ఈ కార్డు వచ్చింది కాబట్టి, నేను 7 లక్షల 45 వేలు రుణం తీసుకున్నాను. దానితో నేను కూడా ఒక దుకాణం పెట్టుకున్నాను. అందులో సరుకులు విక్రయిస్తుంటాను. నా పిల్లల ఉన్నత చదువుల కలను నెరవేర్చాను.


ప్రధాన మంత్రి: కాబట్టి కార్డు పొందడానికి ముందు, మీకు ఆస్తి గురించి ఎలాంటి పత్రం లేదు! మీ వద్ద ఏది కూడా లేదు!


రచన - లేదు సార్, నా దగ్గర ఏం లేదు.


ప్రధాని: అప్పుడు సమస్యలు వచ్చి ఉండాలి! ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు.


రచన - నేను చాలా ఆందోళన చెందాను సర్, నాకు స్వామిత్వ కార్డు లభించింది సర్. నేను, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం.


ప్రధాన మంత్రి - సరే, మీరెప్పుడైనా ఆలోచించారా! 20 సంవత్సరాలు గడిచిపోయాయి. మీ దగ్గర ఏం లేదు,  మీరు ఆశను విడిచిపెట్టే ఉంటారు. ఇలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?


రచన - సర్, ఇలా జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు, నేను 20 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నాను సర్.


ప్రధాన మంత్రి - సరే, స్వామిత్వ యోజన నుంచి మీరు ఏ ఇతర ప్రయోజనాలను పొందారో చెప్పగలరా?


రచన - చెబుతాను సర్.  దీని ద్వారా నాకు ఎస్‌బీఎం యోజన లభించింది. సర్, నేను రూ .8 లక్షల ముద్ర రుణం కూడా తీసుకున్నాను. నేను రాజీవ్కాతో కూడా అనుసంధానమై ఉన్నాను. నా కుటుంబానికి ఆయుష్మాన్ కార్డు కూడా అందింది.


ప్రధాన మంత్రి - వ్యాపారం బాగా జరుగుతోందా!


రచన - చాలా బాగుంది జరుగుతోంది సర్. నేను ఎంఎన్ఆర్‌ఈజీఏ పని కూడా చేస్తున్నాను.


ప్రధాని: సరే, మీరు రూ. 15 లక్షల రుణం తీసుకున్నారు. మీరు దుకాణం నడుపుతున్నారు. మీరు ఎంఎన్ఆర్ఈజీఏలో కూడా పనిచేస్తున్నారు. మీ భర్త కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి!


రచన- సర్, ఆయన  డ్రైవర్.రోషన్ - సర్, నాకు స్వామిత్వ కార్డు వచ్చింది కాబట్టి, దానిపై రుణం తీసుకోగలిగాను. ఇంతకు ముందు రుణం వచ్చేది కాదు. అంటే నాకు పెద్ద ఇల్లు ఉంది, నాకు గ్రామంలో పాత పెద్ద ఇల్లు ఉంది. ఇప్పుడు ఆస్తికి సంబంధించిన కార్డు ఉంది కాబట్టి రుణం వచ్చింది. బ్యాంకు నుంచి రూ.9 లక్షల రుణం తీసుకున్నా. ఆ డబ్బులో కొంత మొత్తం ఇల్లు కట్టుకున్నాను, ఇంకొంత మొత్తంతో పొలంలో సాగుకు ఏర్పాట్లు చేసుకున్నాను. దానివల్ల నా పంట దిగుబడి పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. రెండు మూడేళ్ల క్రితం నాకు ఒకే పంట వచ్చేది, కానీ ఇప్పుడు నాకు మూడు పంటలు వస్తున్నాయి. నా ఆదాయం కూడా పెరిగింది, వ్యవసాయం నుంచి నాకు మంచి లాభం కూడా వస్తోంది.


ప్రధాన మంత్రి - మంచిది. మీ వద్ద ఇప్పుడు ఇంత బలమైన దస్త్రాలు, పత్రాలు ఉన్నాయి కదా.. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడంలో మీకు ఏదైనా సమస్య ఎదురైందా? దీన్ని తీసుకురండి, దాన్ని తీసుకురండి, ఇంకేదో తీసుకురండి.. ఇలా జరిగిందా?


రోషన్ - సర్, ఇంతకు ముందు పత్రాలలో చాలా సమస్యలు ఉండేవి. ఇది తీసుకురండి, అది తీసుకురండి ఇలా  బ్యాంకు సిబ్బంది ప్రతి పత్రం కోసం నన్ను పరిగెత్తేలా చేసేవారు. కానీ నేను స్వామిత్వ కార్డు అందుకున్నప్పటి నుంచి ఎలాంటి పత్రం కూడా అవసరం లేకుండా అయింది. స్వామిత్వ కార్డు ఒక్కటే అన్నింటికి సరిపోతుంది.


ప్రధాన మంత్రి - మీకు ఆత్మవిశ్వాసం ఉంది!


రోషన్ - ఇందుకు మీకు చాలా ధన్యవాదాలు సర్.


ప్రధాన మంత్రి - బ్యాంకు వాళ్లకు కూడా పూర్తి విశ్వాసం ఉంది!


 రోషన్ - అవును సర్, బ్యాంకు వాళ్లకు కూడా దానిపై చాలా నమ్మకం ఉంది. దానిపై రుణాలు సులభంగా లభిస్తాయి.


ప్రధాన మంత్రి - కానీ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నందున, మీరు రుణాన్ని ఎలా తిరిగి చెల్లిస్తారు?


రోషన్ - సర్, నేను వ్యవసాయంలో కూరగాయలు పండిస్తాను.  దాని నుంచి నాకు కూడా లాభం వస్తోంది. మరో రెండు మూడు పంటలు ఉన్నాయి. దాని వల్ల లాభం కూడా ఉంది. నీటి పారుదల సాధనాలు ఉండటం వల్ల ఇతర పంటలు కూడా బాగా వస్తాయి, కాబట్టి ఎక్కువ లాభం ఉంది, కాబట్టి నేను సులభంగా రుణం తీర్చగలను సర్.


ప్రధాన మంత్రి - మంచిది రోషన్ గారు.. కేంద్ర ప్రభుత్వ ఏ ఇతర పథకాల నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారు?


రోషన్ - సర్, నేను కేంద్ర ప్రభుత్వ ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనాన్ని పొందుతున్నాను. పీఎం సమ్మాన్ నిధి పథకం ప్రయోజనాన్ని పొందుతున్నాను, పీఎం పిక్ బీమా యోజన ప్రయోజనాన్ని పొందుతున్నాను. ఇలా చాలా పథకాల ప్రయోజనాన్ని నేను పొందుతున్నాను సర్.


ప్రధాన మంత్రి - సరే రోషన్ గారు.  స్వామిత్వ యోజన ద్వారా ప్రజలకు ఇన్ని రకాల సహాయం అందుతుండటం సంతోషించదగ్గ విషయం. యాజమాన్య పథకం తీసుకురాగానే…. రోషన్ ఏదో చెబుతున్నారు…


రోషన్ - అవును సర్, స్వామిత్వ యోజన వల్ల ప్రజలు చాలా ప్రయోజనం పొందుతున్నారు.  మా గ్రామంలో కొందరు దుకాణం తెరిచేందుకు రుణం తీసుకున్నారు. ఇంతకు ముందు వారు ఏమీ చేయలేకపోయేవారు. వ్యవసాయంపై రుణాలు పొందలేకపోయేవారు. వారి ఇళ్లపై కూడా రుణాలు పొందలేకపోయారు. కానీ స్వామిత్వ కార్డు కారణంగా ప్రతి ఒక్కరూ సులభంగా రుణాలు పొందుతున్నారు. ఈ కారణంగా ప్రజలు తమ చిన్న చిన్న వ్యాపారాలు, వ్యవసాయం కూడా చేస్తున్నారు. కాబట్టి వారి ఆదాయం రెట్టింపు అయింది.  సర్, వారు తమ కుటుంబాలను, పిల్లలను సులభంగా పోషించుకోగలుగుతున్నారు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.


ప్రధాన మంత్రి - సరే రోషన్ గారు.. మీ గ్రామంలోని ఇతర ప్రజలు కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారని మీరు వివరించారు. గ్రామంలోని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఇల్లు కట్టుకున్నారు, వ్యవసాయాన్ని మెరుగుపరిచారు, మీ ఆదాయం కూడా రెట్టింపు అయింది. ఇల్లు కట్టినప్పుడు,  కాంక్రీట్ పైకప్పు ఉన్నప్పుడు.. అప్పుడు గ్రామంలో హోదా కూడా పెరుగుతుంది.. అలాగే మీది కూడా...


రోషన్ - అవును సర్, దీని క్రెడిట్ అంతా మీకే చెందుతుంది. నేను మీకు చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సర్.


ప్రధాన మంత్రి- నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాగ్ పూర్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు.


రోషన్ - ధన్యవాదాలు.

 

 

ప్రధానమంత్రి – ఇప్పుడు ఎవరితో మాట్లాడబోతున్నాం?

 

కార్యక్రమ సమన్యకర్త: ఇప్పుడు ఒడిశా లోని రాయగడ జిల్లాకు చెందిన యాజమాన్య ఆస్తి కార్డు పొందిన మరో లబ్దిదారు శ్రీమతి గజేంద్ర సంగీత గారితో సర్.

 

సంగీత – గౌరవ ప్రధానమంత్రి గారికి నా నమస్కారాలు.

 

ప్రధానమంత్రి – నమస్కారం సంగీత గారు.

 

సంగీత – నమస్కారమండీ.

 

ప్రధానమంత్రి – సంగీత గారు, మీరు ఏమి పని చేస్తుంటారు.

 

సంగీత – నేను కుట్టుపని చేస్తాను, అంటే నేను దర్జీగా పనిచేస్తుంటాను.

 

ప్రధానమంత్రి – సరే, మరి మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు?

 

సంగీత – మా కుటుంబంలో నేను, నాభర్త అలాగే మా ఇద్దరు పిల్లలు సహా మొత్తం నలుగురం. మా కుమార్తె ఎమ్.కామ్ చివరి సంవత్సరం చదువుతోంది, కుమారుడు ఆంధ్ర ప్రదేశ్‌లోని కడపలో పనిచేస్తున్నాడు అలాగే నా భర్త కూడా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

 

ప్రధానమంత్రి – సరే సంగీత గారు, మరి ఇంటి ఆస్తి హక్కులు పొందడమంటే, ఇంటి స్వాధీన పత్రాలు పొందడంలా కాదు, అంటే ప్రభుత్వం ఇంటి కాగితాలు ఇచ్చిన తరువాత, మళ్లీ ఆస్తి హక్కు పత్రం ఇచ్చింది కదా, దానితో మీ జీవితంలో పెద్ద మార్పు ఏమైనా వచ్చిందా?

 

సంగీత – అవును సర్, చాలా పెద్ద మార్పే వచ్చింది. ఇంతకుముందు ఇలాంటి శాశ్వత యాజమాన్య పత్రాలేవీ లేవు, ఇప్పుడు శాశ్వత హక్కులు కల్పిస్తూ అందుకున్న పత్రాలతో మేం ఈ ఊరివాసులమనే విశ్వాసం పెరిగింది అలాగే ఇది మాకు చాలా సంతోషంగా ఉంది.

 

ప్రధానమంత్రి – ఇప్పుడు ఈ పత్రాలను అందుకున్న తరువాత మీరు ఏమి చేశారు.

 

సంగీత – అవును సర్, ఇటీవలే మేము పత్రాలను అందుకున్నాం. నేను ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనాకు దరఖాస్తు చేశాను కాని మంజూరు కాలేదు. నేను చిన్న చిన్న ఇంటిపనులు కూడా చేసుకుంటాను.

 

ప్రధానమంత్రి – మీరు ఇప్పటివరకు బ్యాంకు నుంచి రుణం తీసుకోలేదా?

 

సంగీత – అవును సర్, ఇప్పటిదాకా నేను బ్యాంకు రుణమే తీసుకోలేదు, కాని ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్నాను.

 

ప్రధానమంత్రి – కాని మీరు బ్యాంక్‌ను సంప్రదించారా, మీరు రుణం తీసుకోవాలనుకుంటున్నారా?

 

సంగీత – అవును సర్, నేను ఇప్పుడు రుణం తీసుకోవాలనుకుంటున్నాను.

 

ప్రధానమంత్రి – రుణం తీసుకున్న డబ్బుతో మీరు ఏమి చేస్తారు?

 

సంగీత – రుణం తీసుకుని నేను నా వ్యాపారాన్ని కొంత విస్తరించాలనుకుంటున్నా, నాటైలరింగ్ వ్యాపారాన్ని కూడా విస్తరించాలనుకుంటున్నాను సర్.

 

ప్రధానమంత్రి – కాబట్టి మీ వ్యాపారంపై మీరు మరింత శ్రద్ధ పెడతారన్నమాట.

 

సంగీత – అవును సర్, కొంత డబ్బు పొదుపు చేస్తే అది నా పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది.

 

ప్రధానమంత్రి – మంచిది సంగీత గారు, మీ వ్యాపారాన్ని అలాగే మీ ఇంటిని కూడా విస్తరించండి, మీకు నా శుభాకాంక్షలు. యాజమాన్య పథకం (స్వామిత్వ)తో మీ అతిపెద్ద సమస్య ముగిసిపోయింది. మీరు మీ ఇంటి ఆస్తి పత్రాలు పొందారు అలాగే మీరు స్వయం సహాయక సంఘ సభ్యురాలిగా కూడా ఉన్నారు. సంగీత గారు మీరేదో చెబుతున్నారు, మీరేదో అన్నారు.

 

సంగీత – గత 60ఏళ్లుగా శాశ్వత యాజమాన్య పత్రాలు మా దగ్గర లేవు సర్, ఈ పథకం వల్ల ఇప్పుడు అవి మాకు లభించాయి, నాకు చాలా సంతోషంగా ఉంది సర్.

 

ప్రధానమంత్రి – సరే, మీ ఆశీర్వాదాలే నాకు అతిపెద్ద బలం. మీరు స్వయం సహాయక సంఘంలో కూడా పనిచేస్తున్నారు అలాగే మా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు సహకారం అందిస్తూనే ఉంది. చూడండి, ఈ యాజమాన్య పథకం మొత్తం గ్రామ రూపురేఖలను మార్చేస్తుంది. సరేనండి, చాలామంది మాట్లాడడం కోసం వేచి ఉన్నారు, సోదరా, ఇప్పుడు ఇంకా ఎవరితో మాట్లాడాల్సి ఉంది.

 

కార్యక్రమ సమన్వయకర్త – జమ్మూకాశ్మీర్. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన మరో యాజమాన్య కార్డు లబ్దిదారు, ఆస్తి కార్డు అందుకున్న శ్రీ వీరేంద్ర కుమార్ గారితో సంభాషించనున్నారు.

 

ప్రధానమంత్రి – నమస్కారం వీరేంద్ర గారు.

 

వీరేంద్ర – నమస్కారం సర్.

 

ప్రధానమంత్రి – వీరేంద్ర గారు, దయచేసి మీ గురించి చెప్పండి.

 

వీరేంద్ర – ప్రధానమంత్రి గారు, నేను ఒక రైతును, ఆస్తి కార్డు అందుకోవడంతో నేనూ, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. తరతరాలుగా మేం ఇక్కడే ఉంటున్నాం కానీ ఇప్పుడు ఈ ఆస్తి హక్కు పత్రాలు పొందడంతో నా మనస్సు గర్వంతో నిండిపోయింది. ప్రధానమంత్రి గారూ, అందుకు మీకు చాలా ధన్యవాదాలు.  

 

ప్రధానమంత్రి – సరే, ఇంతకుముందు ఎలాంటి కార్డులు, పత్రాలు లేవు అలాగే ఇతర గ్రామాల వారికి కూడా అవి లేవు.

 

వీరేంద్ర – సర్, మా ఊళ్లో ఎవరి వద్దా ఇప్పటివరకు అలాంటి పత్రాలు లేవు. 100ఏళ్లకు పైగా అనేక తరాలు ఈ ఊళ్లోనే ఉంటున్నా, ఎవరికీ పత్రాలు లేవు. ఇప్పుడు గ్రామంలోని ప్రతిఒక్కరూ స్వామిత్వ పథకం కింద అందుకున్న పత్రాలతో సంతోషంగా ఉన్నారు.

 

ప్రధానమంత్రి – సరే, మీరు ఇప్పుడు ఆస్తి కార్డు పొందారు కదా, ఇది మీ జీవితంలో ఎలాంటి మార్పు కలిగించింది?

 

వీరేంద్ర – నేను ఆస్తి కార్డు అందుకున్నా, అయితే నా భూముల్లో ఒకటి వివాదంలో ఉండేది. ఈ ఆస్తి కార్డు వల్ల నా భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు పరిష్కారమైంది. ఇప్పుడు, ఈ ఆస్తి కార్డు కారణంగా నా భూమిని తనఖా పెట్టి నేను బ్యాంకు రుణం తీసుకోగలను అలాగే నా ఇంటిని బాగు చేసుకోవడంతో పాటు నా కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా బలోపతం చేసుకోగలను.

 

ప్రధానమంత్రి – సరే, మీ గ్రామంలో స్వామిత్వ పథకం ద్వారా ఇతరులు కూడా ప్రయోజనం పొందారా? దీనిలో ఏవైనా సమస్యలు కూడా ఉన్నాయా?

 

వీరేంద్ర – అవును సర్, మార్పు కచ్చితంగా వచ్చింది ప్రధానమంత్రి గారు. స్వామిత్వ పథకం కింద మేం అందుకున్న ఆస్తి కార్డులతో, మా గ్రామంలో భూములు, ఆస్తులకు సంబంధించిన వివాదాలన్నీ చాలా వరకు పరిష్కారమైనాయి, ఇప్పుడు ప్రతి గ్రామస్తుని యాజమాన్య హక్కులు స్పష్టంగా నిర్ణయమైనాయి, కాబట్టి గ్రామస్తులు వారి భూమి, ఆస్తిని తనఖా పెట్టి బ్యాంకు రుణం పొందుతున్నారు అలాగే మరెన్నో పథకాలను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి గ్రామస్తులందరి తరపున నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

 

ప్రధానమంత్రి – వీరేంద్ర గారు, మీతో మాట్లాడడం బాగుంది, నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, మీరు స్వామిత్వ పథకం కింద అందుకున్న కార్డును కేవలం ఇంటి పత్రాలుగా మాత్రమే చూడకుండా, వాటిని మీ అభివృద్ధి కోసం ఒక మార్గంగా ఉపయోగించుకుంటున్నారు. నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది శీతాకాలం కాబట్టి జమ్మూకాశ్మీర్ ప్రజలంతా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంది, మీకు నా అభినందనలు.

 

వీరేంద్ర – ధన్యవాదాలు సర్.

 

కార్యక్రమ సమన్వయకర్త – ఇప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి ప్రసంగించాలని సవినయంగా అభ్యర్థిస్తున్నాం.

 

నమస్కారం!

 

ఈరోజు దేశంలోని గ్రామాలకు, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చాలా చారిత్రాత్మకమైన రోజు. అనేక రాష్ట్రాల గౌరవనీయ గవర్నర్లు ఈ కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాతో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా మాతో ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ కార్యక్రమాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు కూడా ఉన్నారు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు.

 

వేలాది గ్రామపంచాయతీలతో అనుబంధం ఉన్న నా సహచరులు, స్వామిత్వ యోజన పథకం ద్వారా లబ్ది పొందిన లక్షలాది మంది లబ్దిదారులు, మీరంతా ఈ భారీ కార్యక్రమంలో ఈరోజు ఉత్సాహంగా పాలుపంచుకున్నందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నాను.

 

మిత్రులారా,

 

గ్రామాల్లో నివసించే ప్రజలకు వారి ఇంటి కోసం చట్టపరమైన పత్రాలను ఇవ్వడానికి ఐదేళ్ల క్రితం స్వామిత్వ యోజనను ప్రారంభించాం. కొన్ని చోట్ల దీనిని ఘరౌని అని, కొన్ని చోట్ల అధికార్ అభిలేఖ్ అని, ఇంకొన్ని చోట్ల ఆస్తి కార్డు అని, మరికొన్ని చోట్ల దీనిని మల్మట్ట పత్ర అని, ఇంకా కొన్ని చోట్ల దీనిని నివాస భూమి లీజు అని పిలుస్తారు. వివిధ రాష్ట్రాల్లో పేర్లు భిన్నంగా ఉన్నా ఇవన్నీ యాజమాన్య ధ్రువీకరణ పత్రాలే. గత ఐదేళ్లలో, సుమారు 1.5 కోట్ల మందికి ఈ యాజమాన్య కార్డులు ఇవ్వబడ్డాయి. ఈరోజు, ఈ కార్యక్రమంలో, 65 లక్షలకు పైగా కుటుంబాలు ఈ యాజమాన్య కార్డులను పొందాయి. అంటే, యాజమాన్య పథకం కింద, గ్రామంలోని దాదాపు 2.25 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్ల కోసం చట్టపరమైన శాశ్వత హక్కుల పత్రాలను పొందారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను, అలాగే వారికి నా శుభాకాంక్షలు. నేటి కార్యక్రమంలో భూమికి సంబంధించిన ప్రభుత్వ పత్రాలను అందుకున్న వారు, దానిని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో, నేను ఇప్పుడే కొందరు లబ్దిదారులతో జరిపిన సంభాషణల ద్వారా మీకు కచ్చితంగా తెలుస్తుంది.

 

మిత్రులారా,

 

21వ శతాబ్దంలోని ఈ ప్రపంచంలో, వాతావరణ మార్పు, నీటి కొరత, ఆరోగ్య సంక్షోభం, అంటువ్యాధుల వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. కానీ ప్రపంచం ముందు మరో అతిపెద్ద సవాలు కూడా ఉంది. ఆ సవాలే ఆస్తి హక్కులు, ఆస్తి కోసం అధికారిక పత్రాలు. చాలా సంవత్సరాల క్రితం, ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అనేక దేశాల్లో భూ సంబంధ ఆస్తులపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలకు చట్టపరమైన శాశ్వత యాజమాన్య ఆస్తి పత్రాలు లేవని వెల్లడించింది. పేదరికం తగ్గాలంటే, ప్రజలకు ఆస్తి హక్కులు ఉండటం చాలా ముఖ్యమని ఐక్యరాజ్యసమితి స్పష్టంగా పేర్కొంది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్త ఆస్తి హక్కుల సవాలుపై పుస్తకం కూడా రాశారు. గ్రామాల్లో ప్రజలకు ఉన్న చిన్న ఆస్తి కూడా నిర్జీవ మూలధనమేనని ఆయన ఆ పుస్తకంలో చెప్పారు. అంటే, ఈ ఆస్తి ఒక రకమైన నిర్జీవ ఆస్తి. ఎందుకంటే గ్రామస్తులు, పేద ప్రజలు, ఆ ఆస్తి ద్వారా ఎటువంటి లావాదేవీలు చేయలేరు. ఇది కుటుంబ ఆదాయాన్ని పెంచడంలో ఏవిధంగానూ సహాయపడదు.

 

మిత్రులారా,

 

ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ పెద్ద సవాలు మన దేశంలో కూడా ఉంది. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. దేశంలోని గ్రామాల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉన్నప్పటికీ, దానికి అంత విలువ పొందలేని పరిస్థితి మీకు కూడా తెలుసు. కారణం ఏమిటంటే, ప్రజల వద్ద వారి ఇళ్లకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు ఉండవు, కాబట్టి ఇంటి యాజమాన్యానికి సంబంధించి వివాదాలు ఉండేవి. చాలా చోట్ల, శక్తిమంతమైన వ్యక్తులు ఇళ్లను ఆక్రమించుకునేవారు. చట్టపరమైన పత్రాలు లేకుండా అలాంటి ఆస్తికి బ్యాంకులు కూడా ఎలాంటి రుణాలు ఇవ్వవు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. గత ప్రభుత్వాలు ఈ దిశలో కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది, కానీ వారు పెద్దగా ఏమీ చేయలేదు. అందువల్ల, 2014లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆస్తి పత్రాల సవాలును పరిష్కరించాలని మేం నిర్ణయించుకున్నాం, ఏ ప్రభుత్వం కూడా తన గ్రామ ప్రజలను ఇంత ఇబ్బందుల్లో పడవేయలేదు. అయితే మేం అందరి అభివృద్ధిని కోరుకుంటున్నాం, అందరి నమ్మకాన్ని కూడా కోరుకుంటున్నాం, మా సహచర మంత్రి రాజీవ్ రంజన్ గారు దానిని చాలా బాగా వివరించారు. అందుకే, మేం స్వామిత్వ యోజనను ప్రారంభించాం. డ్రోన్ల సహాయంతో, దేశంలోని ప్రతి గ్రామంలో ఇళ్ల భూమిని మ్యాపింగ్ చేయాలని, గ్రామస్తులకు వారి నివాస ఆస్తికి సంబంధించిన పత్రాలను ఇవ్వాలని మేం నిర్ణయించాం.

 

ఈ రోజు మనం ఈ పథకం ప్రయోజనాలను చూస్తున్నప్పుడు, గ్రామంలోని పేదల కోసం మేం పని చేయగలిగామనే సంతృప్తి మాకు లభిస్తుంది. నేను స్వామిత్వ యోజన లబ్ధిదారులతో మాట్లాడుతున్నాను. ఈ పథకం వారి జీవితాలను ఎలా మార్చిందో వారు చెబుతున్నారు, వారు ఇప్పుడు వారి ఆస్తిపై బ్యాంకుల నుంచి రుణ సహాయం కూడా పొందుతున్నారు. ఒక చోట మీకు ఆస్తి ఉంది, మీరు అక్కడ నివసించారు కానీ పత్రాలు లేవు, ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది అందుకే మేం ఈ పనిని చేస్తున్నాం, వారితో చర్చల్లో గమనించిన వారి ముఖాల్లోని సంతృప్తి, ఆనందం, విశ్వాసం, కొత్తగా ఏదైనా చేయాలనే కలలతో, ఈ సంభాషణ నాకు చాలా ఆనందదాయకంగా అనిపించింది, ఇది గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను.

 

సోదరసోదరీమణులారా,

 

మన దేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో దాదాపు సగం గ్రామాలను డ్రోన్ల ద్వారా సర్వే చేశారు. చట్టపరమైన యాజమాన్య పత్రాలు పొందిన తర్వాత, లక్షలాది మంది తమ ఇళ్ళు, ఆస్తులను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ డబ్బుతో, వారు గ్రామంలో తమ సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. వీటిలో చాలా చిన్న, మధ్యతరగతి రైతు కుటుంబాలే ఉన్నాయి. వారికి, ఈ ఆస్తి కార్డులు ఆర్థిక భద్రతకు పెద్ద హామీగా మారాయి. మా దళిత, వెనుకబడిన, గిరిజన కుటుంబాలు అక్రమ ఆక్రమణలు, న్యాయస్థానంలో సుదీర్ఘ వివాదాల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడ్డాయి అలాగే ప్రభావితమయ్యాయి. ఇప్పుడు, చట్టపరమైన ఆధారం లభించిన క్రమంలో, వారు ఈ సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతున్నారు. అన్ని గ్రామాల్లో ఆస్తి కార్డులు అందజేసిన తర్వాత, రూ.100 లక్షల కోట్లకు పైగా విలువైన ఆర్థిక కార్యకలాపాలు జరిగినట్లు అంచనా. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత మూలధనం జోడించబడుతుందో మీరు ఊహించవచ్చు.

 

మిత్రులారా,

 

నేడు మన ప్రభుత్వం పూర్తి నిజాయితీతో గ్రామ స్వరాజ్య సాధన కోసం ప్రయత్నిస్తోంది. యాజమాన్య పథకంతో, గ్రామాభివృద్ధి ప్రణాళిక, అమలు ఇప్పుడు చాలా మెరుగుపడుతోంది. నేడు మనకు స్పష్టమైన మ్యాప్‌లు ఉన్నాయి, జనాభా ఉన్న ప్రాంతాలేవో మనం తెలుసుకుంటున్నాం, కాబట్టి అభివృద్ధి పనుల ప్రణాళిక కూడా కచ్చితమైనదిగా ఉంటుంది అలాగే తప్పుడు ప్రణాళిక కారణంగా జరిగే వృధా, అవరోధాల నుంచి కూడా మనకు ఉపశమనం లభిస్తుంది. ఏ భూమి పంచాయతీకి చెందినది, ఏ భూమి పచ్చిక బయలు అనే దానిపై చాలా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు, ఆస్తి హక్కులను పొందడం ద్వారా, గ్రామ పంచాయతీల సమస్యలు కూడా పరిష్కృతమవుతాయి, అవి ఆర్థికంగా కూడా బలంగా మారతాయి. గ్రామంలో అగ్నిప్రమాదాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి అనేక విపత్తులు జరుగుతున్నాయి. ఆస్తి కార్డులు పొందడం ద్వారా, విపత్తు నిర్వహణ మెరుగ్గా ఉంటుంది, విపత్తు సంభవించినప్పుడు తగిన క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.

 

మిత్రులారా,

 

రైతుల భూమికి సంబంధించి కూడా అనేక వివాదాలు ఉన్నాయని మనకు తెలుసు. భూమి పత్రాలు పొందడంలో ఇబ్బందులు ఉన్నాయి. పదే పదే పట్వారీ వద్దకు వెళ్లాలి, తహసీల్ చుట్టూ తిరగాలి. దీనివల్ల అవినీతికి కూడా మార్గం సుగమం అవుతుంది. ఈ సమస్యలను తగ్గించడానికి, భూమి రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నాం. యాజమాన్యం, భూ-ఆధార్ - ఈ రెండు వ్యవస్థలు గ్రామాల అభివృద్ధికి ఆధారం కానున్నాయి. భూ-ఆధార్ ద్వారా భూమికి ప్రత్యేక గుర్తింపు కూడా ఇచ్చాం. దాదాపు 23 కోట్ల భూ-ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. దీనితో, ఏ ప్లాట్ ఎవరికి చెందుతుందో తెలుసుకోవడం సులభం. గత 7-8 ఏళ్ల కాలంలో, దాదాపు 98 శాతం భూ రికార్డులు డిజిటలైజ్ చేశాం. చాలా భూముల మ్యాప్‌లు ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులో ఉన్నాయి.

 

మిత్రులారా,

 

భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది, భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉంది అని మహాత్మ గాంధీ చెప్పేవారు. గత దశాబ్దంలో పూజ్య బాపూజీ బోధించిన ఈ భావాన్ని గ్రహించాం. గత పదేళ్లలో విద్యుత్ సౌకర్యం పొందిన 2.5 కోట్లకు పైగా కుటుంబాల్లో ఎక్కువ మంది గ్రామాలకు చెందినవారే. గత పదేళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం పొందిన 10 కోట్లకు పైగా కుటుంబాల్లో ఎక్కువ మంది గ్రామాల నుంచి వచ్చినవారే. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పొందిన 10 కోట్ల మంది సోదరీమణుల్లో ఎక్కువ మంది గ్రామాల్లో నివసించువారే. గత ఐదేళ్లలో కుళాయి నీరు పొందిన 12 కోట్లకు పైగా కుటుంబాలు కూడా గ్రామాల నుంచి వచ్చినవే. బ్యాంకు ఖాతాలు తెరిచిన 50 కోట్లకు పైగా ప్రజల్లో ఎక్కువ మంది గ్రామాల నుండే వచ్చారు. గత దశాబ్దంలో 1.5 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు నిర్మించగా, వాటిలో సింహభాగం గ్రామాల్లోనే ఉన్నాయి, గ్రామాల ప్రజల ఆరోగ్యానికి అవి సేవ చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల వరకు, మన గ్రామాలు, గ్రామాల్లోని కోట్లాది మంది ప్రజలు ఇటువంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉన్నారు. మన దళిత, వెనుకబడిన అలాగే గిరిజన సమాజంలోని కుటుంబాలు అత్యంత వెనుకబడి ఉండేవి. ఇప్పుడు ఈ కుటుంబాలు ఈ సౌకర్యాలన్నింటి నుంచి ఎంతో ప్రయోజనం పొందుతున్నాయి.

 

మిత్రులారా,

 

గత దశాబ్ద కాలంలో గ్రామాల్లో మంచి రహదారుల ఏర్పాటు కోసం విశేష కృషి జరిగింది. 2000 సంవత్సరంలో, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రారంభమైంది. అప్పటి నుంచి, గ్రామాల్లో దాదాపు 8.25 లక్షల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాం. చాలా సంవత్సరాల్లో నిర్మించినవి 8.25 లక్షల కిలోమీటర్లు…. ఇప్పుడు మీరే చూడండి, పదేళ్ల కాలంలోనే, మేము దాదాపు 4.75 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించాం, అంటే, దానిలో సుమారు సగం విస్తీర్ణం గల రహదారులను కేవలం పదేళ్లలో నిర్మించాం. ఇప్పుడు సరిహద్దులో ఉన్న మారుమూల గ్రామాల అనుసంధానాన్ని పెంచడానికి మేం వైబ్రంట్ విలేజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం.

 

అలాగే మిత్రులారా,

 

రహదారులు మాత్రమే కాకుండా, గ్రామాలకు ఇంటర్నెట్ అందించడం కూడా మా ప్రాధాన్యంగా ఉంది. 2014కి ముందు, దేశంలోని 100 కంటే తక్కువ పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ కనెక్షన్‌తో అనుసంధానమయ్యాయి. గత పదేళ్లలో, మేం 2 లక్షలకు పైగా పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ కనెక్షన్‌తో అనుసంధానించాం. 2014 కి ముందు, దేశంలోని గ్రామాల్లో లక్ష కంటే తక్కువ కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. గత పదేళ్లలో, మా ప్రభుత్వం 5 లక్షలకు పైగా కొత్త కామన్ సర్వీస్ సెంటర్‌లను నిర్మించింది. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు, ఈ గణాంకాలతో, ఈ సౌకర్యాలు సైతం గ్రామాలకు చేరుకున్నాయి, ఆధునికత సైతం చేరింది. గతంలో నగరాల్లో ప్రజలు చూసే సౌకర్యాలు ఇప్పుడు గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇది గ్రామాల్లో సౌకర్యాలను మెరుగుపర్చడం మాత్రమే కాదు, ఆర్థిక బలాన్ని సైతం కలిగించింది.

 

మిత్రులారా,

 

2025 సంవత్సరం కూడా గ్రామాల కోసం, రైతుల కోసం పెద్ద నిర్ణయాలతో ప్రారంభమైంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద, ఇప్పటివరకు, రైతులు దాదాపు 1.75 లక్షల కోట్ల రూపాయల క్లెయిమ్, బీమా మొత్తాలను అందుకున్నారు. ప్రపంచంలో ధరలు బాగా పెరిగిన డీఏపీ ఎరువుల విషయంలో కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. రైతులకు చౌకగా ఎరువులు అందించడానికి  ప్రభుత్వం మళ్ళీ వేల కోట్ల రూపాయలు కేటాయించింది. గత దశాబ్దంలో, రైతులకు చౌకగా ఎరువులు అందించడానికి సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇది 2014కి ముందు దశాబ్దంతో పోలిస్తే దాదాపు రెట్టింపు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఇప్పటివరకు దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు చేరాయి. ఇది రైతు సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

 

మిత్రులారా,

 

అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో మహిళా శక్తి పాత్ర ఎంతగానో ఉంది. అందుకే, గత దశాబ్దంలో, ప్రతి ప్రధాన పథకం మన మాతృమూర్తులు, సోదరీమణుల సాధికారత లక్ష్యంగా రూపొందించాం. బ్యాంక్ సఖి, బీమా సఖి వంటి పథకాలు గ్రామాల్లోని మహిళలకు కొత్త అవకాశాలను కల్పించాయి. లఖ్‌పతి దీదీ యోజన దేశంలోని 1.25 కోట్లకు పైగా మహిళలను లక్షాధికారులుగా మార్చింది. స్వామిత్వ యోజన మహిళల ఆస్తి హక్కులను కూడా బలోపేతం చేసింది. అనేక రాష్ట్రాల్లో, ఆస్తి కార్డుల్లో భర్తతో పాటు భార్యల పేర్లు కూడా చేర్చాం. కొన్ని చోట్ల, మొదటి పేరు భార్యది ఉంటే, మరికొన్ని చోట్ల ఇది రెండో పేరుగా ఉంది, అయితే అది ఇద్దరి భాగస్వామ్యాన్ని సూచించేదిగా ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇచ్చిన ఇళ్లు సైతం చాలావరకు మహిళల పేరు మీదనే ఇచ్చాం. మ్యాపింగ్ కోసం స్వామిత్వ యోజనలో ఉపయోగించిన మహిళల డ్రోన్‌లు నేడు మహిళలకు ఆస్తి హక్కులు ఇవ్వడంలో కూడా సహాయపడుతుండటం చాలా మంచి యాదృచ్చికం. నమో డ్రోన్ దీదీ యోజనతో, గ్రామంలోని సోదరీమణులు డ్రోన్ పైలట్లుగా మారుతున్నారు. వారు డ్రోన్లతో వ్యవసాయంలో సహాయం చేస్తూ, అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు.

 

మిత్రులారా,

 

స్వామిత్వ యోజన ద్వారా, మన ప్రభుత్వం భారత గ్రామీణ జీవితాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యాన్ని గ్రామ ప్రజలకు అందించింది. మన గ్రామాలకు, మన పేదలకు సాధికారత లభిస్తే, అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా మన ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది. గత దశాబ్దంలో గ్రామాలు, పేదల ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యల కారణంగా, 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు. స్వామిత్వ వంటి పథకాలతో, గ్రామాలను బలమైన అభివృద్ధి కేంద్రాలుగా మార్చగలమని నాకు నమ్మకం ఉంది. మరోసారి, మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు!

 

గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో ప్రసంగించారు.

 

 

**** 


(Release ID: 2094368) Visitor Counter : 17