ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కువైట్‌లో ‘హలా మోదీ’ కార్యక్రమం: భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


కువైట్‌లో ప్రవాసీ భారతీయులు చూపిన ప్రేమాదరణలు అసాధారణం: ప్రధానమంత్రి


43 సంవత్సరాల తరువాత, భారతదేశ ప్రధాని ఒకరు కువైట్‌లో పర్యటిస్తున్నారు: ప్రధానమంత్రి


భారత్, కువైట్‌ల మధ్య ఉన్న సంబంధం నాగరికతలు, సముద్రాలు, ఇంకా వాణిజ్య పరమైన సంబంధం: ప్రధాని


భారత్, కువైట్ ఒకదానికొకటి వెన్నంటి నిలబడుతూ వచ్చాయి: ప్రధానమంత్రి

నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు ప్రపంచంలో ఉన్న డిమాండును తీర్చేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉంది: ప్రధాని



స్మార్ట్ డిజిటల్ వ్యవస్థలు భారత్‌లో ఇప్పుడు విలాస వస్తువులు ఎంతమాత్రం కావు,

అవి సామాన్యుడి నిత్య జీవనంలో ఓ విడదీయరాని భాగం: ప్రధానమంత్రి



భవిష్యత్తులో ప్రపంచ అభివృద్ధికి కూడలిగా, ప్రపంచ వృద్ధికి ఇంజన్‌గా భారత్ రూపొందుతుంది: ప్రధాని



ఒక ‘విశ్వమిత్ర’గా, ప్రపంచానికి మరింత మేలు చేయాలనే దృక్పథంతో భారత్ ముందుకు కదులుతోంది: ప్రధానమంత్రి

Posted On: 21 DEC 2024 8:09PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ నగరంలో షేక్ సాద్ అల్-అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ‘హలా మోదీ’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కువైట్‌లోని విభిన్న వర్గాలకు చెందిన భారత జాతీయులు హాజరయ్యారు.

ప్రధానికి అసాధారణ ప్రేమాభిమానాలతోనూ, ఉత్సాహంతోనూ సముదాయ సభ్యులు స్వాగతం పలికారు. సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, భారత్-కువైట్ సంబంధాలను భారతీయ సముదాయం సుసంపన్నం చేసిందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచడంలో భారతీయ సముదాయం కీలక పాత్రను పోషిస్తోందని ఆయన అన్నారు. కువైట్ అమీరు తనకు వినయపూర్వక ఆహ్వానాన్ని అందించినందుకు ఆయనకు ప్రధాని ధన్యవాదాలు తెలియజేస్తూ, 43 సంవత్సరాల తరువాత ఒక భారతీయ ప్రధాని యుగాలనాటి మైత్రిని మరింత బలపరచడానికి కువైట్‌లో పర్యటిస్తున్నారన్నారు.

కువైట్ అభివృద్ధికి భారతీయ సముదాయం కష్టపడి పనిచేస్తున్నారు, అనేక విజయాలను సాధిస్తూ, వారి తోడ్పాటును అందిస్తున్నారంటూ ప్రధాని ప్రశంసలు కురిపించారు. వీటికి స్థానిక ప్రభుత్వమూ, సమాజమూ విస్తృత స్థాయిలో గుర్తింపునిచ్చాయని ఆయన అన్నారు. భారతీయ సముదాయం  సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొన్నందుకు కువైట్ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కువైట్‌లోనూ, గల్ఫ్‌లో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ కార్మికులకు మద్దతును అందించడానికి భారత్ దృఢ నిబద్ధతను ప్రధాని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం చేపట్టిన ఈ-మైగ్రేట్ (E-Migrate) పోర్టల్, తదితర టెక్నాలజీ-ఆధారిత కార్యక్రమాలను గురించి వివరించారు.

భారత్ అనుసరిస్తున్న‘‘విశ్వబంధు’’ (ప్రపంచానికి మిత్రుడు) దృక్పథాన్ని గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారత్ సాధిస్తున్న సత్వర ప్రగతినీ, మార్పులనూ, ప్రత్యేకించి టెక్నాలజీ, మౌలిక సదుపాయాల కల్పన, నిరంతర సుస్థిరత్వ సాధన వంటి రంగాల్లో సాధించిన పురోగతిని ఆయన వివరంగా తెలియజేశారు. భారత్ ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందడంతోపాటు, ఫిన్‌టెక్ రంగంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా, అంకుర సంస్థల(స్టార్ట్-అప్) రంగంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద శక్తిగా ఉందని, ప్రపంచమంతటా అన్నింటికన్నా డిజిటల్ మాధ్యమంతో ముడిపడ్డ సమాజాల్లో ఒకటిగా పేరుతెచ్చుకొందని ఆయన తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలను అందరి అందుబాటులోకీ తీసుకుపోవడం, అభివృద్ధి సాధన ప్రక్రియలో మహిళలకు నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ ఉండడం, వృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలవారికీ అందేటట్టు చూడడం వంటి విజయాలను ఆయన ఒక్కటొక్కటిగా ప్రధానంగా చెప్పారు. ‘వికసిత్ భారత్’, ‘న్యూ కువైట్’ అనే రెండు దేశాల ఉమ్మడి ఆకాంక్షలను గురించి ప్రస్తావిస్తూ, కలిసి పనిచేయడానికి భారత్‌కు, కువైట్‌కు చాలా అవకాశాలున్నాయని స్పష్టంచేశారు. భారత్‌కున్న నైపుణ్య సామర్థ్యాలు, నవకల్పన ఇరు దేశాల మధ్య కొత్త భాగస్వామ్యాలను ఇప్పటికన్నా మరింత పెంచగలవని ఆయన అన్నారు.

భారతదేశంలో 2025 జనవరిలో నిర్వహించనున్న ప్రవాసీ భారతీయుల దినోత్సవంలోనూ, మహా కుంభ్‌లోనూ పాల్గొనాల్సిందిగా ప్రవాసీ సముదాయం సభ్యులను ప్రధాని ఆహ్వానించారు.

 
 

(Release ID: 2087099) Visitor Counter : 5