మంత్రిమండలి
azadi ka amrit mahotsav

2025 సీజన్ కోసం ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)

Posted On: 20 DEC 2024 8:10PM by PIB Hyderabad

2025 సీజన్‌లో ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సాగుదారులకు గిట్టుబాటు ధరలను అందించడం కోసం 2018-19 కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఎంఎస్పీని ప్రకటించింది. దీని ప్రకారం అవసరమైన అన్ని పంటలకూ పంట ఉత్పత్తి వ్యయం కన్నా కనీసం ఒకటిన్నర రెట్ల స్థాయిలో ఎంఎస్పీని స్థిరపరుస్తారు. ఈ ఉత్పత్తి వ్యయాన్ని దేశవ్యాప్త సగటును ఉపయోగించి నిర్ణయిస్తారు. దాని ప్రకారం, 2025 సీజనుకు సగటు నాణ్యత ఆధారంగా మిల్లుకు వేసిన ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 11582గా నిర్ణయించారు. దాంతోపాటు గుండ్రని ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 12100గా నిర్ణయించారు.

మిల్లుకు వేసిన ఎండు కొబ్బరికి మద్దతు ధర 2014 మార్కెట్ సీజన్ లో క్వింటాలుకు రూ. 5250 ఉండగా దానిని 2025 సీజన్ లో రూ.11852కు, గుండ్రని ఎండు కొబ్బరి మద్దతు ధర 2014 మార్కెట్ సీజన్ ప్రకారం క్వింటాలుకు రూ. 5500 ఉండగా దానిని 2025 సీజన్ లో రూ. 12100 కు ప్రభుత్వం  పెంచింది.

అధిక ఎంఎస్పీ కొబ్బరి రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర అందించడమే కాకుండా.. దేశీయంగా, అంతర్జాతీయంగా కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచడానికి వారికి ప్రోత్సాహం అందిస్తుంది.

మద్దతు ధర పథకాల కింద.. ఎండు కొబ్బరి, పొట్టు తీసిన కొబ్బరి సేకరణ కోసం కేంద్ర నోడల్ సంస్థలుగా భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్), జాతీయ సహకార సంఘాల వినియోగదారుల సమాఖ్య (ఎన్ సీసీఎఫ్) కొనసాగుతాయి.  


(Release ID: 2086971) Visitor Counter : 112