రాష్ట్రపతి సచివాలయం
డిసెంబర్ 29 నుంచి రాష్ట్రపతి నిలయంలో 15 రోజుల పాటు పుష్ప, ఉద్యానోత్సవాలు
Posted On:
18 DEC 2024 2:25PM by PIB Hyderabad
సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 29 నుంచి 15 రోజుల పాటు ‘ఉద్యాన్ ఉత్సవ్’ పేరుతో పుష్ప, ఉద్యానోత్సవం జరగనుంది. వ్యవసాయ - రైతు సంక్షేమ విభాగం, హైదరాబాద్ లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మేనేజ్), భారత వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ప్రకృతి వనరుల ఆవశ్యకతను చాటడం, ప్రజా భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. వివిధ అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించడం, సదస్సులో పాల్గొనడం ద్వారా.. వ్యవసాయం, ఉద్యాన అంశాల్లో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధిపై ప్రజలు అవగాహన పెంచుకోవచ్చు.
ఉద్యాన్ ఉత్సవ్ సన్నాహాలు, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము బుధవారం సమీక్షించారు. రాష్ట్రపతి నిలయంలోని సందర్శకుల సేవా కేంద్రంలో తినుబండారాల మిట్టీ కేఫ్ ను, సావనీర్ షాప్ ను ఆమె ప్రారంభించారు. ప్రాంగణంలోని కంపోస్టు విభాగాన్ని కూడా ఆమె సందర్శించి కంపోస్టు తయారీ ప్రక్రియను పరిశీలించారు. తోటలోని వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కంపోస్టింగ్ యూనిట్ ఆదర్శంగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి దక్షిణాది పర్యటన సమయంలో తప్ప, ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయంలో ప్రజల సందర్శనకు అనుమతి ఉంటుంది. https://rashtrapatibhavan.gov.in ద్వారా సందర్శకులు అనుమతి పొందవచ్చు.
***
(Release ID: 2085701)
Visitor Counter : 87