ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శతజయంతి ఉత్సవాలు త్వరలో జరుగనుండగా

కపూర్ కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ


‘సాఫ్ట్ పవర్’ అనే మాట ఇంకా వాడుకలోకి రాక మునుపే, భారతదేశంలో దానిని స్థాపించింది శ్రీ రాజ్ కపూరే: ప్రధానమంత్రి


మధ్య ఆసియాలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకున్న

అంతులేని అవకాశాలను వినియోగించుకొనే దిశలో కృషి చేయాల్సిన అవసరం ఉంది;

మధ్య ఆసియాలో నవతరం చెంతకు చేరుకొనేందుకు ప్రయత్నాలు చేసి తీరాలి: ప్రధానమంత్రి

Posted On: 11 DEC 2024 8:47PM by PIB Hyderabad

మనం దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శత జయంతిని ఒక ఉత్సవంలా జరుపుకోనున్న తరుణంలో కపూర్ కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనసారా మాట్లాడారు.  ఈ ప్రత్యేక సమావేశం భారతీయ చలనచిత్ర రంగానికి శ్రీ రాజ్ కపూర్ అందించిన అనన్య సేవలతోపాటు చిరస్థాయిగా నిలిచే ఆయన వారసత్వాన్ని సైతం సమ్మానించేదిగా ఉంది.  ఈ సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యులతో ప్రధాని అరమరికలు లేకుండా మాట్లాడారు.

శ్రీ రాజ్ కపూర్ శతజయంతి ఉత్సవాలను త్వరలో నిర్వహించుకోనున్న సందర్భంగా కపూర్ కుటుంబంతో భేటీ కావడానికి ప్రధానమంత్రి తన అమూల్య కాలాన్ని వెచ్చించినందుకు శ్రీ రాజ్ కపూర్ కుమార్తె రీమా కపూర్ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు.  ఆమె శ్రీ రాజ్ కపూర్ సినిమా పాటలోని కొంత భాగాన్ని పాడి వినిపించారు.  ఈ సమావేశంలో కపూర్ కుటుంబానికి శ్రీ మోదీ పంచిన ప్రేమను, వాత్సల్యాన్ని, ఆదరణను పూర్తి భారతదేశం గమనిస్తోందని ఆమె అన్నారు.  కపూర్ కుటుంబ సభ్యులకు ప్రధాని స్వాగతం పలికారు. శ్రీ రాజ్ కపూర్ విశిష్ట సేవలను ఆయన ప్రశంసించారు.

శ్రీ రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమ సువర్ణభరిత యాత్రాగాథకు సంకేతంగా నిలుస్తాయని శ్రీ మోదీ అభివర్ణించారు.  ‘నీల్ కమల్’ సినిమాను 1947లో రూపొందించారు, ప్రస్తుతం మనం 2047 వైపు  పయనిస్తున్నాం, ఈ 100 సంవత్సరాల్లో తోడ్పాటు మహత్తరమైంది అని శ్రీ మోదీ అన్నారు.  దౌత్య సంభాషణల్లో ‘సాఫ్ట్ పవర్’ అనే మాట వినపడుతూ ఉంటుందని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, ఈ పదం పుట్టక మునుపే శ్రీ రాజ్ కపూర్ భారతదేశంలో ‘సాఫ్ట్ పవర్’ను సగర్వంగా నిలబెట్టారని శ్రీ  మోదీ ప్రధానంగా చెప్పారు.  భారతదేశానికి సేవలు చేయడంలో శ్రీ రాజ్ కపూర్ అందించిన విస్తృత తోడ్పాటుకు ఇది ఒక నిదర్శనమని ప్రధాని అన్నారు.

ఎన్నో సంవత్సరాలు గడిచినా శ్రీ రాజ్ కపూర్ ఇప్పటికీ మధ్య ఆసియా ప్రజలను మంత్రముగ్ధులను చేస్తున్నారని ప్రధాన మంత్రి చెబుతూ, ఒక చలనచిత్రాన్ని రూపొందించాల్సిందిగా కపూర్ కుటుంబానికి విజ్ఞప్తి చేశారు.  ఆ చిత్రాన్ని ప్రత్యేకించి మధ్య ఆసియా ప్రేక్షకలోకాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించాలని ఆయన అన్నారు.  వారి జీవనంపై శ్రీ రాజ్ కపూర్ ప్రభావం ఎంతో ఉందని ప్రధాని చెప్పారు.  భారతీయ సినిమాకు మధ్య ఆసియాలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి;  ఈ అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని కపూర్ కుటుంబానికి శ్రీ మోదీ స్పష్టం చేశారు.  శ్రీ రాజ్ కపూర్‌ను గురించి చాటిచెప్పే ఒక చలనచిత్రాన్ని తీయాలని, ఆ చిత్రం మధ్య ఆసియాలో నవతరం ప్రేక్షకుల చెంతకు చేరేటట్టు మనం తప్పక ప్రయత్నించాలని, ఒక లంకెలా ఉండేటట్లుగా ఆ చిత్రాన్ని తీర్చిదిద్దాల్సిందిగా ప్రధాని కోరారు.

ప్రపంచం నలుమూలల నుంచి తమపై కురుస్తున్న ప్రేమ, ప్రతిష్టల్లో తడిసిముద్దవుతున్నామన్న భావనను రీమా కపూర్ వ్యక్తం చేస్తూ, శ్రీ రాజ్ కపూర్‌ను ‘సాంస్కృతిక దూత’ అని పిలవొచ్చన్నారు.  అదే సందర్భంలో, ప్రధానమంత్రి భారతదేశానికి ఒక ‘గ్లోబల్ అంబాసిడర్’గా ఉంటున్నారని ఆమె ప్రశంసించారు.  ప్రధానిని చూసుకొని కపూర్ కుటుంబసభ్యులంతా గర్విస్తున్నారని ఆమె అన్నారు.  ప్రస్తుతం దేశం కీర్తి గొప్ప శిఖర స్థాయిలకు ఎదిగిందని శ్రీ మోదీ ఉద్ఘాటిస్తూ, యోగను ఒక ఉదాహరణగా ప్రస్తావించారు.  ప్రపంచ దేశాలన్నిటా యోగపై చర్చించుకొంటున్నారని ఆయన చెప్పారు.  ఇతర దేశాల నేతలతో తాను సమావేశమైనప్పుడు యోగను గురించి, యోగ ప్రాముఖ్యాన్ని గురించి వారితో తాను చర్చించినట్లు కూడా ఆయన తెలిపారు.

పరిశోధన చేయడమనే పని చాలా ఆసక్తిని రేకెత్తించే అంశమని ప్రధానమంత్రి చెబుతూ ఎన్నో విషయాల్ని నేర్చుకొనే అవకాశాన్నిచ్చే ఈ ప్రక్రియను పరిశోధనలో నిమగ్నమైన వ్యక్తి ఆస్వాదిస్తారని పేర్కొన్నారు.  శ్రీ రాజ్ కపూర్‌పై పరిశోధన చేసి ఒక చలనచిత్రాన్ని రూపొందించిన ఆయన మనుమడు శ్రీ అర్మాన్ జైన్‌కు ఆ సినిమా తాతయ్య జీవనయాత్ర అనుభూతులను గురించి తెలుసుకొనే అవకాశాన్ని ప్రసాదించిందని ప్రధాని అన్నారు. శ్రీ అర్మాన్ జైన్‌ను ఆయన అభినందించారు.

సినిమాకు ఉన్న శక్తిని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకొంటూ,  ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో ఇదివరకటి జన్ సంఘ్ పార్టీ ఓటమి పాలైన సంఘటనను ప్రస్తావించారు. అప్పుడు నేతలందరూ కలిసి శ్రీ రాజ్ కపూర్ సినిమా ‘ఫిర్ సుబహ్ హోగీ’ని చూద్దామని నిర్ణయించుకొన్నారని ప్రధాని తెలిపారు. ‘ఫిర్ సుబహ్ హోగీ’ అనే మాటలకు ఉదయం మళ్లీ వస్తుందని అర్థం.  పార్టీ ఇప్పుడు మళ్ళీ ఉదయాన్ని చూసింది అని ఆయన అన్నారు.  చైనాలో తాను పర్యటించినప్పుడు అక్కడ వినిపించిన ఒక పాట రికార్డింగును శ్రీ రిషి కపూర్‌కు పంపించానని, ఆ పాటను విని శ్రీ రిషి కపూర్ మురిసిపోయారని కూడా శ్రీ మోదీ గుర్తుచేశారు.

శ్రీ రాజ్ కపూర్‌ను గుర్తుకు తెస్తూ ఒక కార్యక్రమాన్ని కపూర్ కుటుంబం ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ప్రధానికి శ్రీ రణ్‌బీర్ కపూర్ చెప్పారు.  ఈ విషయంలో సాయపడినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్ఎఫ్‌డీసి, ఎన్ఎఫ్ఏఐకి శ్రీ రణ్‌బీర్ కపూర్ ధన్యవాదాలు తెలియజేశారు.  శ్రీ రాజ్ కపూర్‌కు చెందిన 10 చలన చిత్రాలను కపూర్ కుటుంబం మెరుగుపరిచి అందజేసిందని, వాటిని భారతదేశమంతటా సుమారు 40 నగరాలలో 160 థియేటర్ల ప్రదర్శించనున్నారని శ్రీ రణ్‌బీర్ కపూర్  వివరించారు.  ప్రీమియర్ షోను డిసెంబరు 13న ముంబయిలో నిర్వహించనున్నట్లు ప్రధానికి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి తరలిరావల్సిందిగా యావత్ చలనచిత్ర పరిశ్రమను తాము ఆహ్వానించామన్నారు.


 

 

 

***

MJPS/SR


(Release ID: 2083773) Visitor Counter : 5