మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డిసెంబర్ 11న ప్రారంభం కానున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7వ సంచిక
సంస్థాగత స్థాయిలో జరిగిన ఇంటర్నల్ హ్యాకథాన్లలో 150 శాతం వృద్ధి నమోదుతో అతి పెద్ద సంచికగా నిలిచింది
Posted On:
06 DEC 2024 1:33PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 51 కేంద్రాల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) ఈ నెల 11న ఏకకాలంలో ప్రారంభమవుతుంది. కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇది మన దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను అందించేందుకు జాతీయస్థాయి వేదికను విద్యార్థులకు కల్పిస్తుంది. తద్వారా ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే ఆలోచనా విధానాన్ని యువతలో పెంపొందిస్తుంది. గత ఎడిషన్లలో మాదిరిగానే మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశ్రమలు ఇచ్చిన సమస్యలు లేదా విద్యార్థి ఆవిష్కరణల కేటగిరీలో 17 అంశాలపై సమర్పించిన ఆలోచనలపై విద్యార్థి బృందాలు పనిచేస్తాయి.
54 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల నుంచి ఎస్ఐహెచ్ 2024కి 250కి పైగా సవాళ్లను సమర్పించారు. ఈ ఏడాది సంస్థాగత స్థాయిలో నిర్వహించిన ఇంటర్నల్ హ్యాకథాన్లలో 150శాతం మేర పెరుగుదల కనిపించింది. ఎస్ఐహెచ్ 2023లో 900 నుంచి ఎస్ఐహెచ్ 2024 నాటికి ఈ సంఖ్య 2247కు పెరిగింది. ఫలితంగా ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో అతి పెద్ద ఎడిషన్‌గా ఇది నిలిచింది. ఎస్ఐహెచ్ 2024లో సంస్థాగత స్థాయిలో 86,000 విద్యార్థి బృందాలు పాల్గొంటే వాటిలో సుమారుగా 49,000 బృందాలు (ప్రతి బృందంలోనూ ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు మెంటార్లు ఉంటారు) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాల అధికారులకు, వేర్వేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఎస్ఐహెచ్ గ్రాండ్ ఫినాలే వ్యవహరిస్తుంది. విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రోత్సహించే విలక్షణమైన వేదిక ఇది.
జాతీయ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్న రంగాలతో అనుసంధానించిన 17 ప్రధాన అంశాల్లో సవాళ్లను గుర్తించి పరిష్కరించారు. అవి ఆరోగ్యరక్షణ, రవాణా వ్యవస్థ – సరకు రవాణా, స్మార్ట్ టెక్నాలజీలు, వారసత్వం-సంస్కృతి, సుస్థిరత, విద్య-నైపుణ్యాభివృద్ధి, నీరు, వ్యవసాయం-ఆహారం, నూతనంగా ఉద్భవిస్తున్న టెక్నాలజీలు, విపత్తు నిర్వహణ.
విద్యార్థులను, నిపుణులను వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా నడిపిస్తూ భారతదేశ ఆవిష్కరణల వ్యవస్థపై ఎస్ఐహెచ్ తనదైన ప్రభావం చూపిస్తోంది. ఈ విజయాన్ని తెలియజేసే మరో ముఖ్యమైన అంశం ఎస్ఐహెచ్ పూర్వ విద్యార్థుల వ్యవస్థ. వీరికోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ (https://alumni.mic.gov.in/)లో వారి విజయగాథలు, వారు తీసుకొచ్చిన మార్పులను పొందుపరిచారు. ఇప్పటి వరకు ఎస్ఐహెచ్ పూర్వ విద్యార్థులు 100కు పైగా అంకుర సంస్థలను ప్రారంభించారు. వాటిలో కొన్ని బలమైన సామాజిక అంశాలపై పనిచేస్తున్నాయి.
***
(Release ID: 2082963)
Visitor Counter : 8
Read this release in:
Odia
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada