సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికల ప్రస్తుత చట్టాలను పటిష్ట పరచాలి,
ఈ విషయంలో సాంఘిక ఏకాభిప్రాయాన్ని సాధించాలి:
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి
సాంప్రదాయక పత్రికారంగంలో సంపాదకీయ నియంత్రణలు,
జవాబుదారుతనాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్రను పోషించాయి;
సామాజిక మాధ్యమాల్లో ఇలా జరగడంలేదు: శ్రీ అశ్వనీ వైష్ణవ్
Posted On:
27 NOV 2024 1:50PM by PIB Hyderabad
ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్ ఫాం (వేదిక)ల విషయంలో అమలవుతున్న చట్టాలను తక్షణం బలపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ప్రధానంగా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో భాగంగా ఈ రోజు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ప్రసంగించారు.
సంపాదకీయ నియంత్రణల నుంచి అడ్డూ అదుపూ లేని వ్యక్తీకరణల వరకు
ఈ విషయమై కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ‘‘మనం సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికల కాలంలో జీవిస్తున్నాం. అయితే పత్రికా రంగంలో ఒకప్పుడు సంపాదకీయ విభాగాల పరంగా నియంత్రణ విధానాన్ని అవలంబిస్తూ వచ్చారు. దీనితో విషయపరంగా సరైన కథనాలు, జవాబుదారుతనమంటూ ఉండేవి. కాలం గడుస్తూ ఉన్న కొద్దీ, ఈ విధమైన అదుపు సన్నగిల్లింది’’ అన్నారు. ఆ తరహా సంపాదకీయ శ్రద్ధ లోపించిన కారణంగా, సామాజిక మాధ్యమాలు ఒకవైపు పత్రికా స్వేచ్ఛకు ఒక ప్లాట్‌ఫాంగా మారనైతే మారాయి గానీ, మరో వైపు ఈ మాధ్యమాలు పట్ట పగ్గాలు లేని అభిప్రాయాల వ్యక్తీకరణకు కూడా చోటిస్తున్నాయి. దీంతో తరచుగా అసభ్య కంటెంటుకూ ఆస్కారం ఉంటోందని ఆయన అన్నారు.
కచ్చితమైన చట్టాలపై ఏకాభిప్రాయం
ఈ విధమైన వేదికలు పుట్టుకు వచ్చిన భౌగోళిక ప్రాంతాలకు, భారతదేశానికి మధ్య సంస్కృతి పరంగా చూసినప్పుడు స్పష్టమైన తేడాలు ఉన్నాయని శ్రీ వైష్ణవ్ అంగీకరించారు. ‘‘ఈ వేదికలను సృష్టించిన ప్రాంతాల దృష్టికోణాల కన్నా భారతదేశంలోని సాంస్కృతిక దృష్టికోణాలు ఎంతో విభిన్నమైనవి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న చట్టాలను మరింత కఠినతరంగా మలచడం దేశానికి తప్పనిసరి. మరి, ఈ విషయంలో అందరూ కలసికట్టుగా ఏకాభిప్రాయానికి రావాలంటూ ఆయన వి జ్ఞప్తి చేశారు.
ముఖ్యమైన ఈ అంశానికి ప్రాధాన్యాన్నిస్తూ, దీనిని పరిశీలనకు స్వీకరించాల్సిందిగా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని కూడా మంత్రి కోరారు. ‘‘ఈ సవాలును పరిష్కరించడానికి నిష్కర్ష అయిన చట్టాలకు తోడు సంఘపరమైన సర్వసమ్మతి ఏర్పడాలి’’ అని ఆయన అన్నారు.
***
(Release ID: 2077990)
Visitor Counter : 10