సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రేక్షకుల ఈలలూ, చప్పట్లే... నాకు స్ఫూర్తి 55 ఇఫీలో ఖుష్బూ సుందర్ తో శివకార్తికేయన్
చెదరని విశ్వాసం, నిరంతర శ్రమ, నిజాయితీ... ఇదే నా ప్రయాణం
ఎంత తిరిగినా..మళ్లీ గూటికి రావడం ముఖ్యం... యువతకు సందేశం
గోవాలోని కళా అకాడమీ... హాలు మొత్తం ఆహూతులతో నిండిపోయింది. ఇంతలో తమిళ సూపర్ స్టార్ శివకార్తికేయన్ రానే వచ్చారు. ఈలలతో, చప్పట్లతో హాలు మారుమోగిపోయింది. తెరపై కావచ్చు... తెర వెనుక కావచ్చు... శివకార్తికేయన్ రాక- ఓ పెద్ద పండగ.
చిన్నగా ప్రారంభమైన శివకార్తికేయన్ ప్రయాణం... తమిళనాట సూపర్ స్టార్ గా ఎదగడంలో- పట్టువదలని విశ్వాసం, సినిమాపట్ల ఉన్న తపన, సాధించాలన్న లక్ష్యం ఉన్నాయి. 55వ భారత చలన చిత్రోత్సవం సందర్భంగా నటి, రాజకీయవేత్త అయిన ఖుష్బూ సుందర్ తో ఎలాంటి అరమరికలూ లేకుండా తన సినిమా ప్రయాణం గురించీ, తన జీవితం గురించీ, నటుడుగా ఎదగడం గురించీ మాట్లాడారు శివకార్తికేయన్.
‘‘మొదటి నుంచీ సినిమా అంటే నాకు ప్రాణం. ప్రేక్షకుల్ని అలరించాలన్నది నా కోరిక’’ అంటూ తన మనసులోని మాట చెప్పారు శివకార్తికేయన్. ‘‘అందువల్ల టీవీ యాంకర్ గా కెరియర్ ప్రారంభించాను. దీని నుంచి సినిమాలోకి ప్రవేశించడానికి అవకాశం లభించింది. దీనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాను’’ అని చెబుతూ తన కెరియర్ తొలి రోజుల గురించి కూడా ప్రస్తావించారు.
‘‘ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కాలేజీలో మా ప్రొఫెసర్లను అనుకరిస్తూ మిమిక్రీ చేసేవాడిని. తర్వాత వాళ్లను క్షమించమని అడిగేవాడిని. అయితే వాళ్లు మాత్రం నన్ను ప్రోత్సహించారు. ఈ టాలెంట్ ను సరిగా వాడుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు’’ అని కార్తికేయన్ ఆనాటి రోజుల్ని గుర్తు చేశారు.
హఠాత్తుగా తన తండ్రి చనిపోవడం జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. ‘‘నాన్న చనిపోవడంతో నేను కుంగిపోయాను. కానీ ప్రేక్షకుల ఈలలూ, చప్పట్లూ నాకు ఒక ఔషధంలా పని చేశాయి’’ అని వెల్లడించారు. తాను తట్టుకుని నిలబడానికి తన అభిమానులు అందించిన ప్రోత్సాహమే కారణమని స్పష్టం చేశారు.
నిజాయితీ, మొక్కవోని దీక్ష... శివకార్తికేయన్ ను ఈ స్థాయికి తెచ్చాయంటూ ఖుష్బూ సుందర్ మెచ్చుకున్నారు. ఆ మాట నిజమేనని ఒప్పుకుంటూ... ‘‘ఒకవైపు సామాన్యుడిలా ఉంటూనే...అందరిలో ఒకడిలా కాకుండా భిన్నంగా ఉండేందుకు ప్రయత్నించేవాడిని. జీవితం అనే ప్రయాణం గతుకుల మయం. కానీ లక్ష్యం వైపు సాగిపోతుంటే... ఇవన్నీ మాయం అవుతాయి. ఇక నేను సాధించేది లేదన్న ఆలోచన వచ్చినపుడు అన్నీ వదిలేద్దాం అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ నా అభిమానులు చూపించిన ప్రేమ నన్ను ఆ పని చేయనివ్వలేదు’’
మిమిక్రీ ఆర్టిస్టుగా మొదలైన శివకార్తికేయన్ ప్రయాణం.. టీవీ వ్యాఖ్యాతగా, నేడు- తమిళ సినీ పరిశ్రమ సెలబ్రెటీల్లో ఒకడిగా నిలబెట్టింది. నిజానికి శివకార్తికేయన్ కేవలం నటుడు మాత్రమే కాదు... నేపథ్య గాయకుడుగా, పాటల రచయితగా, నిర్మాతగా ఎన్నో నైపుణ్యాలు ఆయన సొంతం. కెరియర్ విషయంలో అవకాశాలను ఎలా అందిపుచ్చుకున్నదీ చెప్పారు శివకార్తికేయన్. ‘‘కెరియర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి ప్రాజెక్టునీ నేను ఆమోదించాను. కానీ... ఇప్పుడో, స్టోరీలే నన్ను వెదుక్కుంటూ వస్తున్నాయి. ఆసల్యంగానైనా... అర్థవంతమైన పాత్రలనే చేస్తున్నట్లు చెబుతూ... డాక్టర్, డాన్, ఇటీవల వచ్చిన ‘అమరన్’ లో రియల్ లైఫ్ వార్ హీరో- ముకుంద్ వరదరాజన్ పాత్రను పోషించిన సంగతిని గుర్తుచేశారు.
హాస్యాన్ని ఒక మార్గంగా ఎంచుకోవడం గురించి చెబుతూ...‘‘టీవీ నుంచి సినిమాకి మారిపోవడం అంత తేలికేం కాదు. హాస్యాన్ని ఎంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని అనుకున్నాను. బుల్లితెర కావచ్చు, పెద్ద తెర కావచ్చు. ప్రేక్షకులను మైమరచిపోయేలా చేసేది హాస్యమే’’ అని చెప్పారు.
యువత గురించి మాట్లాడుతూ.. ‘‘స్వేచ్ఛా విహంగంలా విహరించండి... ఎక్కడికి వెళ్లినా మళ్లీ గూటికి రావడం ముఖ్యం. నా వరకూ నా గూడు నా కుటుంబమే. ప్రయాణంలో స్పష్టత తప్పనిసరి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటారు’’ అని అన్నారు. లక్షలాది మందిని కదిలించే ఒక అసాధారణమైన నటుడి కథ చుట్టూ ఈ కార్యక్రమం నడిచింది. తపన, కష్టాలను ఎదిరించి పోరాడటం, కన్న కలల్ని నిజం చేసుకోవడంలో- మధ్యతరగతి నుంచి వచ్చిన శివకార్తికేయన్... తమిళ సినిమా కీర్తి కిరీటంగా మారడం అనేక మందికి స్ఫూర్తిదాయకం.
***
(Release ID: 2076347)
Visitor Counter : 11