ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తొలి బోడోలాండ్ మహోత్సవ్ ను ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

శాంతిని పరిరక్షించడానికి, చైతన్యభరిత బోడో సమాజాన్ని ఆవిష్కరించడానికి

భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని మేళవించే ఒక మహా కార్యక్రమమిది


ప్రధాని నాయకత్వంలో 2020లో బోడో శాంతి ఒప్పందంపై సంతకాలైన తరువాత పునరుత్థాన అధ్యాయాన్ని ఓ సంబరంలాగా జరుపుకోవడానికే ఈ మహోత్సవ్

Posted On: 14 NOV 2024 4:10PM by PIB Hyderabad

ప్రప్రథమ ‘బోడోలాండ్ మహోత్సవ్‌’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజున అంటే ఈ నెల 15న, సాయంత్రం దాదాపు 6:30 గంటలకు న్యూ ఢిల్లీలోని ఎస్ఏఐ ఇందిరా గాంధీ క్రీడా భవన సముదాయంలో ప్రారంభించనున్నారు.  ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

బోడోలాండ్ మహోత్సవ్‌ను రెండు రోజుల పాటు.. ఈ నెల 15న, 16న.. నిర్వహిస్తున్నారు.  శాంతి పరిరక్షణ సూచకంగా, చైతన్య భరిత బోడో సమాజాన్ని ఆవిష్కరించడానికి భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి పెద్ద పీటను వేస్తూ వివిధ కార్యక్రమాలకు వేదికగా ఈ మహోత్సవ్ ఉంటుంది.  ఒక్క బోడోలాండ్ లోనే కాకుండా అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్ లతో పాటు, ఈశాన్య ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న బోడో ప్రజలందరినీ ఒక్క తాటి మీదకు తేవడం ఈ ఉత్సవం లక్ష్యం.  ‘సమృద్ధ భారత్ ఆవిష్కారానికి శాంతి, సామరస్యాలు’.. ఇవి ఈ మహోత్సవ్‌ ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతోంది.  బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్  (బీటీఆర్)లోని బోడో సముదాయం, ఇంకా ఇతర సముదాయాల సంపన్న సంస్కృతి, భాష, విద్య.. ఈ అంశాలపై మహోత్సవం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.  దీనితో పాటు, బోడోలాండ్ సంస్కృతి, భాషల విశిష్ట వారసత్వాన్ని, అక్కడి పరిసరాలలోని జీవ వైవిధ్యాన్ని ఈ మహోత్సవం కళ్ళకు కట్టనుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చురుకైన నాయకత్వంలో 2020 లో బోడో శాంతి ఒప్పందం కుదిరిన తరువాత ఆ ప్రాంతం మళ్ళీ పుంజుకున్న సరళిని ఈ మహోత్సవంలో ఓ పండుగలా జరుపుకోనున్నారు. దశాబ్దాల పాటు సంఘర్షణలు, హింస, చెలరేరగి బోడోలాండ్ లో అపార ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో ఆ దురవస్థను శాంతి ఒప్పందం పరిష్కరించడమే కాక, ఇతరత్ర శాంతి ఒడంబడికలకు ఓ ఉత్ప్రేరకంలా కూడా పనిచేసింది.

‘‘సంపన్న బోడో సంస్కృతి, సంప్రదాయాలు, ఇంకా సాహిత్యం భారతీయ వారసత్వానికి, సంప్రదాయాలకు అందిస్తున్న తోడ్పాటు’’ అంశంపై నిర్వహించే కార్యక్రమం ఈ మహోత్సవ్ లో ప్రధానాంశంగా ఉండబోతోంది.  బోడోల విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యంలపై చర్చోపచర్చలు ఈ కార్యక్రమంలో చోటుచేసుకోనున్నాయి.  ‘‘జాతీయ విద్యా విధానం 2020 పథనిర్దేశకత్వంలో మాతృభాష మాధ్యమంలో విద్యాబోధనకు ఉన్న అవకాశాలు, సవాళ్ళు’’ అంశంపైన సైతం మరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  బోడోలాండ్ ప్రాంతంలో ‘‘పర్యటన రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సంస్కృతి, పర్యటన మాధ్యమాల ద్వారా ‘చైతన్యశీల బోడోలాండ్’ నిర్మాణంలో స్థానిక సంస్కృతి పాత్ర’’ అంశం పై ఒక సమావేశాన్ని, చర్చను నిర్వహించనున్నారు.  

 

అయిదు వేల మందికి పైగా కళా రంగ ఔత్సాహికులు ఈ మహోత్సవ్‌లో పాలుపంచుకోనున్నారు.  వారిలో బోడోలాండ్ ప్రాంతానికి చెందిన వారే కాక, అసోం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, , నేపాల్, భూటాన్ వంటి ఇరుగు పొరుగు దేశాలకు చెందిన వారు కూడా తరలిరానున్నారు.

 

***


(Release ID: 2073524) Visitor Counter : 13