ప్రధాన మంత్రి కార్యాలయం
దీపావళి సందర్భంగా గుజరాత్ కచ్ లో భద్రతా సిబ్బందినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
31 OCT 2024 9:00PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
దేశం సరిహద్దుల్లోని సర్ క్రీక్ వద్ద, కచ్ నేలపై... దేశ సాయుధ దళాలు, సరిహద్దు భద్రతా దళాలకు చెందిన మీ అందరితో కలిసి దీపావళి జరుపుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! నిజానికి మీతో కలిసి పండుగ జరుపుకోవడం నా సంబరాన్ని రెట్టింపు చేస్తోంది. ప్రతి దీపావళీ ప్రత్యేకతను కలిగిందే అయినప్పటికీ, ఈ దీపావళి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 500 సంవత్సరాల తదనంతరం శ్రీరాములవారి విగ్రహం అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించిన విషయం మీకు తెలుసు. భారతమాత సేవకు అంకితమైన ప్రతి సైనికుడికి నా మనఃపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సేవను గుర్తిస్తూ, కృతజ్ఞతలు తెలిపే 140 కోట్ల మంది దేశప్రజల శుభాకాంక్షలు కూడా నా అభినందనల్లో మిళితమై ఉన్నాయని మీకు తెలుసు!
మిత్రులారా, మాతృభూమికి సేవ చేసే అవకాశం లభించడం అరుదైన, అపురూపమైన వరం. అయితే దేశరక్షణ బాధ్యత ఎంతమాత్రం సులభమైనది కాదు. మాతృభూమిని తమ సర్వస్వంగా భావించే వారికి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కార్యమిది. భారతమాత ధీర పుత్రుల, పుత్రికల త్యాగనిరతి, అంకితభావాలకి ఇది ప్రతీక. హిమాలయాల్లోని గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, హిమానీ నదాలు, ఎముకలు కొరికే చలి రాత్రులు, మంటలు రేపే ఎడారి వేడి , భగభగలాడే భానుడి ప్రతాపం, ఇసుక తుఫానులు, సవాళ్ళు విసిరే చిత్తడి నేలలు, అల్లకల్లోల పరిస్థితుల సముద్రాలూ… ఏవీ మన సైనికుల ప్రస్థానాన్ని ఆపలేవు. దేశభక్తి అనే ఉక్కుకవచం తొడుక్కున్న మన వీర సైనికులు ఎటువంటి వెరపు లేక ముందుకు సాగుతూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తారు, వారి పాలిట సింహస్వప్నాలవుతారు. తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ అదరక బెదరక నిలిచే వారిని ఓడించడం ఎవరివల్లా కాదని మిమ్మల్ని చూసినవారు గ్రహిస్తారు. మీ అచంచలమైన సంకల్పబలం, మొక్కవోని ధైర్యసాహసాలూ దేశంలో శాంతిభద్రతలకి దన్నుగా ఉంటూ రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచం మిమ్మల్ని భారత్ పరాక్రమానికి సూచకంగా చూస్తే, శత్రువులు వారి కుటిలమైన పథకాలను వమ్ము చేసే వారిగా మిమ్మల్ని చూస్తారు. మీరు ఉత్సాహంతో గర్జించినప్పుడు, ఉగ్రశక్తులు భయంతో గజగజలాడతాయి. మన సైన్యం, సాయుధ బలగాల ప్రతాపం ఎంతటిదో తలుచుకుంటే హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. ఎటువంటి సవాళ్ళు ఎదురైనా మన సైనికులు వెన్నుచూపక తమ పరాక్రమాన్ని చూపుతారన్న విషయం ఎంతో నిబ్బరాన్ని కలిగిస్తుంది.
మిత్రులారా, ఇక్కడ కచ్ తీరానికి దగ్గరలో నిలబడి, మన నావికాదళం గురించి ముచ్చటించుకోవడం సముచితమే కదూ! గుజరాత్ తీరప్రాంతం దేశానికి తిరుగులేని ఆస్తి, దాంతో శత్రువులు ఈ సరిహద్దుని భారత వ్యతిరేక కుట్రలు సాగించేందుకు కేంద్రంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ సార్వభౌమత్వానికి ప్రతీక అయిన సర్ క్రీక్ ఇక్కడ కచ్‌లో ఉంది. గతంలోనూ ఈ ప్రాంతాన్ని రణరంగంగా మార్చే ప్రయత్నాలు జరిగాయి. చాలాకాలంగా సర్ క్రీక్‌పై శత్రువుల డేగకన్ను పడిందని మనకి తెలుసు. కానీ రక్షణగా మీరున్నారనన్న భరోసా దేశానికి స్థైర్యాన్నిస్తుంది. 1971 యుద్ధంలో మీరిచ్చిన తిరుగులేని జవాబుని మన శత్రువులు మర్చిపోయే ప్రసక్తే లేదు, అందుకే మన నావికాదళం కాపుకాస్తున్న సర్ క్రీక్, కచ్‌లవైపు చూసేందుకు ఎవరూ సాహసించలేరు.
మిత్రులారా, దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం కూడా వదిలేందుకు సిద్ధపడని ప్రభుత్వం నేడు పాలన సాగిస్తోందని మీకు గుర్తుచేస్తున్నాను. ఒకప్పుడు దౌత్యం ముసుగులో మోసపూరిత విధానాల ద్వారా సర్ క్రీక్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను దేశ స్వరాన్ని బలంగా వినిపించాను. ఈ ప్రాంతానికి నేను రావడం ఇది తొలిసారి కాదు. ఎంతో సుపరిచితమైన ఈ ప్రాంతాల్లో అనేకసార్లు విస్తృతంగా పర్యటించాను. ఇప్పుడు దేశ బాధ్యతలు నిర్వర్తించే హోదాలో ఉన్న మేము, మన బలగాలకు అనుకూలమైన విధానాలను రూపొందిస్తున్నాం. శత్రువుల ప్రగల్భాలను ఖాతరు చేయక, మన బలగాల సంకల్పం మీదే పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాం.
మిత్రులారా, 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మన సాయుధ దళాలకు అత్యాధునిక వనరులను సమకూరుస్తున్నాం. ప్రపంచంలోని అగ్ర సైన్యాలకు దీటుగా మన సైన్యాన్ని సన్నద్ధం చేస్తున్నాం. రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో C295విమాన తయారీ కేంద్రాన్ని ప్రారంభించాం. విక్రాంత్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ వంటి 'మేడ్ ఇన్ ఇండియా' రక్షణ సామగ్రిని కలిగి ఉన్న మనం, సొంత జలాంతర్గాములని కూడా ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఒక వంక తేజస్ యుద్ధ విమానాలు మన వైమానిక దళాన్ని బలోపేతం చేస్తుండగా, మరోవైపు 5వ తరం యుద్ధ విమానాల అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఒకప్పుడు ఆయుధాల దిగుమతులపై ఆధారపడిన దేశంగా భావించిన భారత్, ఇప్పుడు ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది. గత 10 ఏళ్లలో మన రక్షణ ఎగుమతులు ముప్పై రెట్లు పెరిగాయని మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను.
మిత్రులారా, ప్రభుత్వ ఆలోచనలను సాకారం చేయడంలో మన సాయుధ బలగాల సహకారం కీలకమైనది. ముఖ్య నిర్ణయాల్లో తమ వంతు పోషించే భద్రతా దళాలు, ఇకపై దిగుమతి చేయనవసరం లేని 5,000 సైనిక సామగ్రి జాబితాను రూపొందించినందుకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు ఈ నిర్ణయం ఊపునిచ్చింది.
మిత్రులారా, ఆధునిక యుగపు యుద్ధాల్లో డ్రోన్ సాంకేతికత కీలకమైన వనరుగా మారింది. ప్రస్తుత సంఘర్షణల్లో ఈ సాంకేతికతను ఎంత విస్తృతంగా వినియోగిస్తున్నారో మనం చూస్తున్నాం. నిఘా, గూఢచర్యం, సమాచార సేకరణ, వ్యక్తులు లేదా ప్రాంతాల్ని గుర్తించడంలో డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. మామూలుగా చేరుకోలేని ప్రాంతాలకు అవసరమైన సరుకులను చేరవేయడంలో సహాయపడే డ్రోన్లు, ఆయుధాలుగా కూడా పనిచేయడం విశేషం. మరోవైపు సంప్రదాయ గగన రక్షణ వ్యవస్థలకు డ్రోన్‌లు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. దీన్ని గుర్తించిన భారత్, డ్రోన్ టెక్నాలజీతో సాయుధ బలగాలను బలోపేతం చేస్తోంది. త్రివిధ దళాల కోసం ప్రభుత్వం ప్రెడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేస్తోంది. మరోవైపు డ్రోన్‌ల మోహరింపునకు అనువైన వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. అనేక అంకుర పరిశ్రమలు సహా వివిధ దేశీయ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించి సంపూర్ణ స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్‌లను అభివృద్ధి పరచడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.
మిత్రులారా, నేడు యుద్ధాల స్వభావం మారింది... సరికొత్త భద్రతా సవాళ్ళు పుట్టుకొస్తున్నాయి. రాబోయే కాలంలో సంఘర్షణలు మరింత సంక్లిష్టంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, త్రివిధ సాయుధ దళాలు, భద్రతా బలగాల సామర్థ్యాలను ఏకీకృతం చేయవలసిన అవసరముంది. ఈ చర్య వల్ల, ప్రధానంగా త్రివిధ దళాల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. సైన్యం, వైమానిక దళం, నావికాదళం అంటూ విడి పేర్లతో పిలిచినా, ఈ దళాలు ఉమ్మడి విన్యాసాలు చేస్తున్నప్పుడు, విడివిడిగా కాక ఏకశక్తిగా కనిపిస్తాయని నేను అప్పుడప్పుడూ వ్యాఖ్యానించడం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ నూతన దృష్టికోణంతో, మన సాయుధ బలగాలను బలోపేతం చేసే లక్ష్యంతో త్రివిధ దళాల ప్రధానాధికారిని నియమించాం. మనమిప్పుడు సమీకృత కమాండ్ వైపు అడుగులు వేస్తున్నాం. ఈ కమాండ్ కోసం సిద్ధమైన నిర్దిష్ట యంత్రాంగం ద్వారా రక్షణ దళాల మూడు విభాగాలలో మెరుగైన సమన్వయం సాధ్యపడుతుంది.
మిత్రులారా... “నేషన్ ఫస్ట్, నేషన్ ఫస్ట్” అన్నదే మా నినాదం, మా విధానం! దేశం సరిహద్దుల వద్దనే ప్రారంభమవుతుంది కాబట్టి పొలిమేరల వద్ద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మా ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా మారింది. లద్దాక్, అరుణాచల్ ప్రదేశ్‌లలో వ్యూహాత్మకంగా కీలకమైన రహదారులు సహా 80,000 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించిన సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ), గత దశాబ్ద కాలంలో సుమారు 400 భారీ వంతెనలను కూడా నిర్మించింది. ఎటువంటి విపరీత వాతావరణ పరిస్థితుల్లోనైనా అనుసంధానాన్ని నిలిపి ఉంచే మారుమూల ప్రాంతాల సొరంగ మార్గాలు ఎంత ముఖ్యమైనవో మీకు తెలుసు. వాటిని మన సాయుధ దళాల వినియోగించుకుంటాయి. గత 10 సంవత్సరాల్లో అటల్, సెలా వంటి కీలక సొరంగ మార్గాలను పూర్తి చేసిన బీఆర్ఓ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాల పనిని వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.
మిత్రులారా... సరిహద్దు గ్రామాలను "చిట్టచివరి గ్రామాలు" గా భావించే దృక్పథాన్ని మార్చదలిచాం. అందుకే వాటికి “తొలి గ్రామాలు” అనే పేరునిచ్చాం . ‘వైబ్రంట్ విలేజ్’ పథకం ద్వారా ఈ ‘తొలి గ్రామాల’కు అందించే ప్రోత్సాహం వల్ల, అభివృద్ధి చెందిన ఆయా సరిహద్దు గ్రామాలు చైతన్యవంతమైన భారత్ కి తొలి ఆనవాళ్ళుగా నిలుస్తాయి.
అపారమైన పర్యాటక అవకాశాలని కల్పించే సహజ వనరులకు మన పొలిమేరలు నెలవు. ఈ విషయంలో మనమెంతో అదృష్టవంతులం. ఈ సామర్థ్యాన్ని మనం సరైన పద్ధతిలో వినియోగించుకోగలిగితే సీమ గ్రామాల్లో నివసించే వారికి కొత్త అవకాశాలు లభించి వారి జీవితాలు మెరుగుపడతాయి. వైబ్రంట్ విలేజ్ ప్రచారం ద్వారా ఈ పరివర్తనను మనం కళ్ళారా చూస్తున్నాం. గతంలో "చిట్టచివరి గ్రామాలు" అని పిలిచే మీ సమీప ఊళ్ళలో ఇప్పుడు సీ-వీడ్ (మసాలా దినుసుగా వాడే రాతిపువ్వు - సముద్రం వద్ద పెరిగే మొక్క) సహా అనేక పరిశ్రమలు ప్రారంభమవడాన్ని మీరు గమనించే ఉంటారు. అంటే, సరికొత్త ఆర్థిక రంగం ఆవిర్భవిస్తున్నట్లే కదా! ఇక, పర్యావరణానికి లాభం చేకూర్చే లక్ష్యంతో తీరప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. సరిగ్గా ధోర్డో 'రణ్ణ్ ఉత్సవ్' దేశవిదేశల్లోని పర్యాటకులని ఏ విధంగా ఆకర్షిస్తోందో, అదే విధంగానే మడ అడవులని చూసేందుకు వచ్చే పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వారి పాలిట కచ్ సరిహద్దు గ్రామాలు స్వర్గధామంగా మారుతాయి... ఆ అద్భుతాన్ని మీరే స్వయంగా చూస్తారు.
మిత్రులారా... ఈ ఆశయ సాకారం కోసం మన మంత్రులు సరిహద్దు వైబ్రంట్ గ్రామాలను సందర్శిస్తూ, ఆయా గ్రామాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో దేశ ప్రజల్లో ఈ ప్రాంతాలపై ఆసక్తి, ఉత్సుకత పెరిగింది.
మిత్రులారా... జాతీయ భద్రతకు సంబంధించిన ఒక అంశాన్ని గురించి మనం ఎక్కువగా చర్చించుకోం. అదే ‘సరిహద్దు పర్యాటకం’. గొప్ప వారసత్వ సంపద, అద్వితీయమైన ధార్మిక స్థలాలు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన కచ్ ఇందుకు ఎంతో అనువైనది. సముద్ర జీవులు, తీర ప్రాంత వృక్షజాలానికి ఆటపట్లైన కచ్, గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ మడ అడవులను విస్తరించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టింది. గత సంవత్సరం ప్రారంభించిన ‘మిష్ఠీ’ యోజన ఈ దిశగా పని చేస్తోంది.
మిత్రులారా, వేలాది సంవత్సరాలుగా చెక్కుచెదరక నిలబడ్డ దేశ సుస్థిరతకు ధోలావీర గొప్ప ప్రతీక. ఇటీవల యునెస్కో గుర్తింపు లభించిన ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కనిపించే సింధు లోయ నాగరికత అవశేషాలు, వేల ఏళ్ళ క్రితం ఎంత కచ్చితమైన ప్రణాళికతో నగరం నిర్మితమయ్యిందో తెలుపుతాయి. సముద్రానికి కొద్ది దూరంలో ఉన్న లోథాల్ వంటి వాణిజ్య కేంద్రాలు ఒకప్పుడు దేశ ఆర్థిక రంగంలోముఖ్య పాత్ర పోషించాయి. ఇక లఖ్‌పత్ లో గురునానక్ దేవ్ జీ పాదముద్రలు ఉన్నాయి. కచ్‌లోని కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం, మాతా ఆషాపురా ఆలయం, కాలా దుంగర్ కొండపై దత్తాత్రేయ స్వామి ఆలయం, రణ్ణ్ ఉత్సవ్, సర్ క్రీక్ మనోహరమైన దృశ్యాలు వంటి ప్రాంతాలు పర్యాటకులని విశేషంగా ఆకర్షించేవే. వీటిని సందర్శించేందుకు పర్యాటకులకు వారం రోజుల సమయం కూడా తక్కువే అవుతుంది. ఒక్క కచ్ జిల్లాలోని ఇన్ని దర్శనీయ స్థలాలు ఉండగా, ఉత్తర గుజరాత్ సరిహద్దులో ఉన్న నాడబెట్‌లో కూడా పర్యాటక అవకాశాలు ఉన్నట్లు గమనించాం. ఈ అవకాశాలన్నింటినీ మనం వినియోగించుకోవాలి. దేశంలోని వివిధ ప్రాంతాల పర్యాటకులు వేరే ప్రదేశాలను సందర్శించినప్పుడు వారు ఆయా ప్రాంతాలను కలిపే అనుసంధానకర్తలవుతారు. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచే వీరు దేశ ఐక్యతను చాటుతారు. తమ ఊర్లకు తిరిగి వెళ్ళినప్పుడు ఈ స్ఫూర్తికి సజీవ ఉదాహరణలుగా ఉంటూ జాతీయ భావనకు గట్టి పునాది వేస్తారు. అందుకే మనం కచ్ తదితర సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి పరచవలసి ఉంది. మన సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి వల్ల కొత్త సౌకర్యాలు ఏర్పడతాయి. అవి స్థానికంగా ఉన్న సైనికులకు అందుబాటులోకి వస్తాయి.
మిత్రులారా... మన దేశం జవజీవాలతో తొణికిసలాడే విలక్షణ శక్తి. తల్లి భారతిగా మన నీరాజనాలందుకుంటున్న జనని. మన సైనికుల త్యాగం, అంకితభావం వల్లనే ఈనాడు దేశం సురక్షితంగా ఉంది. సైనికుల నిబద్ధతపైనే పౌరుల భద్రత ఆధారపడి ఉంటుంది… సురక్షితమైన దేశం మాత్రమే పురోగమిస్తుంది. అభివృద్ధి చెందిన దేశం కల సాకారానికి మీరే రక్షకులు. పౌరులు మీపై ఉంచిన విశ్వాసం కారణంగానే జాతి పురోభివృద్ధిలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. మీ ధైర్యసాహసాలే దేశాభివృద్ధికి పెట్టని కోట అని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు! ధన్యవాదాలు! భారత్ మాతా కీ జై అని నాతో గొంతు కలపండి ! మాతా కీ జై! మాతా కీ జై! మాతా కీ జై! వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం!
***
(Release ID: 2072246)
Visitor Counter : 29