హోం మంత్రిత్వ శాఖ
జాతీయ పరిశోధనా సంస్థ ఎన్ఐఏ ఆధ్వర్యంలో రేపు ప్రారంభమయ్యే ‘ఉగ్రవాద వ్యతిరేక సదస్సు-2024’ లో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభోపన్యాసం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృతనిశ్చయంతో ప్రభుత్వం... సమస్య పట్ల కఠిన వైఖరి
ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో నిమగ్నమైన సాంకేతిక, న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, సంస్థల కలయికకు వేదికగా మారిన వార్షిక సమావేశాలు. జాతీయ భద్రత, ఉగ్రవాద సవాళ్ళ గురించి చర్చలు
ఏకోన్ముఖ ప్రభుత్వం సూత్రాన్ని అనుసరిస్తూ ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సంయుక్త చర్యలు, వివిధ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయ సాధన కీలకాంశాలు
Posted On:
06 NOV 2024 6:21PM by PIB Hyderabad
జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్ఐఏ) ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘ఉగ్రవాద వ్యతిరేక సదస్సు-2024’ లో కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభోపన్యాసం చేస్తారు. సదస్సు రేపు (నవంబర్ 7న) న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉగ్రవాదాన్ని రూపుమాపాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం, సమస్య పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది.
గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న వార్షిక సమావేశాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో నిమగ్నమైన వివిధ సంస్థల మేధోమథనానికి వేదికగా మారాయి. సాంకేతిక, న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులూ, సంస్థలూ పాల్గొనే ఈ సమావేశాల్లో, జాతీయ భద్రతాంశాలు, ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే సవాళ్ళను గురించి చర్చిస్తారు.
ఏకోన్ముఖ ప్రభుత్వం సూత్రాన్ని అనుసరిస్తూ, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాల్గొనే వివిధ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయ సాధన, తద్వారా సంయుక్త చర్యల దిశగా కృషి, సమావేశాల్లో కీలకాంశాలుగా ఉన్నాయి. భవిష్యత్తుకు అవసరమైన విధానాల రూపకల్పన కూడా చర్చల్లో భాగమవనుంది.
ఉగ్రవాద వ్యతిరేక పరిశోధనల్లో నేరారోపణ పద్ధతులు, ఆవిర్భవిస్తున్న న్యాయ సంబంధిత అంశాలు సహా అనేక ముఖ్యమైన అంశాలపై రెండు రోజుల సమావేశాలు దృష్టి సారిస్తాయి. సమస్యను ఎదుర్కోవడంలో మెరుగైన పద్ధతుల వినిమయం, నూతన సాంకేతికత విసిరే సవాళ్ళు, అందించే అవకాశాల గురించిన చర్చలు, అంతర్జాతీయ సహకారం, ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా గల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, తగిన వ్యూహాల ద్వారా ఉగ్రచర్యల ఆట కట్టించడం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమైన వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ పోలీస్ అధికారులు, కేంద్రీయ సంస్థలు, విభాగాల అధికారులు, న్యాయ, ఫోరెన్సిక్, సాంకేతిక నిపుణులు సమావేశాలకు హాజరవుతారు.
(Release ID: 2071357)
Visitor Counter : 4