ప్రధాన మంత్రి కార్యాలయం
2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో స్పెయిన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్-స్పెయిన్ సంయుక్త ప్రకటన
Posted On:
28 OCT 2024 6:32PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో శాంచెజ్ 2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో భారత్ లో అధికారికంగా పర్యటించారు. అధ్యక్షుడు శాంచెజ్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల తర్వాత స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట రవాణా, సుస్థిర రవాణా శాఖ మంత్రి, పరిశ్రమలు, పర్యాటక శాఖ మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికార, వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించిందని, కొత్త ఉత్తేజాన్ని నింపిందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే కొత్త శకానికి నాంది పలికిందని ఇరువురు నేతలు పేర్కొన్నారు. 2017లో ప్రధాని మోదీ స్పెయిన్ పర్యటన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక కార్యకలాపాల నవీకరణను కొనసాగించాలని, రాజకీయ, ఆర్థిక, భద్రత, రక్షణ, ప్రజల మధ్య, సాంస్కృతిక సహకారం వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు తమ బృందాలకు సూచించారు.
అధ్యక్షుడు శాంచెజ్ కు సాంస్కృతిక బృందాలు ఘనంగా స్వాగతం పలికాయి. వడోదరలో ప్రధాన మంత్రి మోదీతో కలిసి నిర్వహించిన ప్రతినిధి స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఆయన ముంబయిని కూడా సందర్శించారు. అక్కడ ఆయన ప్రముఖ వ్యాపార నాయకులు, సాంస్కృతిక ప్రముఖులు, భారత చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించారు.
వడోదరలో ఎయిర్ బస్ (స్పెయిన్), టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సంయుక్తంగా నిర్మించిన సీ-295 విమానాల విడిభాగాల చివరి దశ కూర్పు కర్మాగారాన్ని అధ్యక్షుడు శాంచెజ్, ప్రధాని మోదీ సంయుక్తంగా ప్రారంభించారు. భారత్ లో తయారయ్యే మొత్తం 40 విమానాల్లో తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ295 విమానాన్ని 2026లో ఈ ప్లాంట్ విడుదల చేయనుంది. ఎయిర్ బస్ కూడా 'ఫ్లై-అవే' స్థితిలో 16 విమానాలను భారత్ కు అందిస్తోంది. వీటిలో 6 ఇప్పటికే భారత వైమానిక దళానికి అందించారు.
రాజకీయ, రక్షణ, భద్రతా సహకారం
1. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక, సుహృద్భావ ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షించారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి పునాది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్ట పాలన, న్యాయమైన సమానత్వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మరింత సుస్థిర భూగోళం, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ, మెరుగైన, సంస్కరించిన బహుళపక్ష వాదంలో ఉందని అంగీకరించారు. ఇరు దేశాల మధ్య సుస్థిర చారిత్రక సంబంధాలు, దీర్ఘకాల స్నేహం ఈ సహకారానికి కేంద్ర బిందువుగా నిలిచాయని వారు పేర్కొన్నారు.
2. క్రమం తప్పని ఉన్నత స్థాయి చర్చలు భాగస్వామ్యానికి బలాన్ని ఇస్తున్నాయని ఇరువురు నేతలు తెలిపారు. విదేశీ, ఆర్థిక, వాణిజ్య, రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య ప్రస్తుత ద్వైపాక్షిక సహకారం మంచి ఫలితాలను ఇస్తోందని వారు పేర్కొన్నారు. సైబర్ భద్రత, వాణిజ్యం, ఆర్థిక సమస్యలు, సంస్కృతి, పర్యాటకం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు సహా రక్షణ, భద్రత వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, వైవిధ్యపరచడానికి ఇరు దేశాల సంబంధిత మంత్రిత్వ శాఖలు / ఏజెన్సీల మధ్య క్రమం తప్పకుండా చర్చలు సాగాల్సిన ప్రాముఖ్యతను వారు స్పష్టం చేశారు.
3. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ పారిశ్రామిక సహకారానికి చిహ్నంగా సి-295 ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో సాధించిన పురోగతిపై ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఈ భాగస్వామ్యానికి అనుగుణంగా, స్పానిష్ రక్షణ పరిశ్రమ అధునాతన సామర్థ్యాలను, పోటీతత్వాన్ని, అలాగే 'మేక్ ఇన్ ఇండియా' చొరవ లక్ష్యాలకు దాని సహకారాన్ని గుర్తించి, ఇతర రంగాలలో కూడా భారత్ లో ఇలాంటి సంయుక్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని తమ తమ రక్షణ పరిశ్రమలకు సూచించారు.
ఆర్థిక,వాణిజ్య సహకారం
4. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల భాగస్వామ్యంలో ఇటీవలి సానుకూల పరిణామాలను అధ్యక్షుడు శాంచెజ్, ప్రధాని మోదీ స్వాగతించారు. పరస్పర సానుకూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల వాణిజ్యాల మధ్య మరింత బలమైన సంబంధాల కోసం పిలుపునిచ్చారు.
5. స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, సుస్థిరతపై అధ్యక్షుడు శాంచెజ్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశ వేగవంతమైన ఆర్థిక వృద్ధిపై అధ్యక్షుడు శాంచెజ్ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. వ్యాపారానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా ప్రశంసించారు. భారత్ లో ఉన్న సుమారు 230 స్పానిష్ కంపెనీల కార్యకలాపాల ద్వారా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి స్పెయిన్ అందిస్తున్న నిబద్ధతను అధ్యక్షుడు శాంచెజ్ వివరించారు. బహిరంగ నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు, ఇరు దేశాల్లో వ్యాపార అనుకూల పెట్టుబడులకు తమ బలమైన మద్దతును ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
6. పునరుత్పాదక ఇంధనాలు సహా ఇంధనం, అణు, స్మార్ట్ గ్రిడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య రక్షణ, ఆరోగ్య సేవలు, రైళ్లు, రోడ్లు, ఓడరేవులు, రవాణా వ్యవస్థ నిర్వహణ సహా ఆటోమోటివ్, రవాణా మౌలిక సదుపాయాలలో స్పానిష్ కంపెనీల నైపుణ్యాన్ని గుర్తించిన ఇరువురు నేతలు ఈ రంగాల్లో మరింత సహకారాన్ని స్వాగతించారు. భారత్, స్పెయిన్ లలో పరస్పర పెట్టుబడులను సులభతరం చేయడానికి 'ఫాస్ట్ ట్రాక్ మెకానిజం' ఏర్పాటును కూడా ఇరువురు నేతలు స్వాగతించారు.
7. 2023 లో జరిగిన ఇండియా-స్పెయిన్ 'జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్' (జెసిఇసి) 12 వ సదస్సులో సాధించిన పురోగతిని ప్రస్తావించిన ఇద్దరు నాయకులు 2025 ప్రారంభంలో స్పెయిన్ లో జెసిఇసి తదుపరి సమావేశాన్ని నిర్వహించడానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, పునరుత్పాదక ఇంధనం, సాంకేతికత, సుస్థిర మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని అన్వేషించవలసిన అవసరాన్ని వారు గుర్తించారు. పట్టణ సుస్థిర అభివృద్ధి పై అవగాహన ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసుకోగలమన్న విశ్వాసాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేశారు.
8. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల సహకారాన్ని పెంపొందించడానికి 2024 అక్టోబర్ 29న ముంబయిలో జరిగిన ఇండియా-స్పెయిన్ సీఈఓల ఫోరం, ఇండియా-స్పెయిన్ వాణిజ్య సదస్సును ఇద్దరు నేతలు స్వాగతించారు.
9. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆవిష్కరణ, స్టార్టప్ వ్యవస్థల కీలకమైన ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు గుర్తించారు. పరస్పర ప్రయోజనాల కోసం అటువంటి అన్ని అవకాశాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు. స్పెయిన్ లోని ‘రైజింగ్ అప్’ భారత్ లోని ‘స్టార్టప్ ఇండియా’ వంటి వ్యవస్థల ద్వారా భవిష్యత్తులో పరస్పర మార్పిడులను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఇరు దేశాల సంబంధిత ఏజెన్సీలను వారు ఉత్సాహపరిచారు.
10. రైలు రవాణా రంగంలో సహకారంపై కుదిరిన అవగాహన ఒప్పందం, కస్టమ్స్ లో పరస్పర సహకారంపై కుదిరిన సహకార ఒప్పందం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
11. ఆర్థిక, వ్యాపార అవకాశాలను, ఇరు దేశాల ప్రజల మధ్య అవగాహనను పెంపొందించడంలో పర్యాటక పాత్రను గుర్తించిన నేతలు దీనిని మరింత అభివృద్ధి చేయడానికి అంగీకరించారు. స్పెయిన్, భారత్ మధ్య నేరుగా విమానాల ఏర్పాటుకు విమానయాన సంస్థలు చూపుతున్న ఆసక్తిని ఇరువురు నేతలు స్వాగతించారు.
భారత్-స్పెయిన్ సంస్కృతి, పర్యాటక, కృత్రిమ మేధ సంవత్సరంగా 2026
12. భారత్, స్పెయిన్ మధ్య లోతైన సంబంధాలు, రెండు ప్రజల మధ్య దీర్ఘకాలిక మైత్రిని పరిగణనలోకి తీసుకొని, 2026 ను భారత్-స్పెయిన్ సంస్కృతి, పర్యాటకం, కృత్రిమ మేధ (ఏఐ) సంవత్సరంగా జరుపుకోవాలని ప్రధాని మోదీ, అధ్యక్షుడు శాంచెజ్ నిర్ణయించారు.
13. ఆ సంవత్సరంలో, ఇరు దేశాలు తమ మ్యూజియంలు, కళలు, జాతరలు, సినిమాలు, పండుగలు, సాహిత్యం, వాస్తునిపుణుల సమావేశాలు, చర్చలు, ఆలోచనా వర్గాలలో ఒకరి సాంస్కృతిక ఉనికిని ఒకరు పంచుకునే ప్రయత్నం చేస్తాయి.
14. అదేవిధంగా, పర్యాటక సందర్శనలను పెంచడం, పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆతిథ్యం, వాస్తుశిల్పం, వంటకాలు, మార్కెటింగ్, పట్టణ గ్రామీణ పర్యాటకం వంటి అనేక రంగాలలో అనుభవాలను పంచుకునే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెడతారు, ఇది రెండు దేశాలకు సామరస్యపూర్వక అభివృద్ధి, మెరుగుదలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
15. జీ20 న్యూఢిల్లీ నేతల ప్రకటనకు అనుగుణంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ని మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించడం, అనేక రంగాలలో దానిని సానుకూలంగా అమలు చేయడంలో భారత్, స్పెయిన్ కీలక పాత్ర పోషించవచ్చు. 2026 సంవత్సరంలో ఎఐ సానుకూల వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలో ఎఐ కొత్త పురోగతిని అమలు చేయడానికి ఆచరణాత్మకంగా అమలు చేయడానికి కలిసి పనిచేస్తాయి.
16. ఈ ప్రయత్నం ప్రాముఖ్యతకు గుర్తుగా రెండు దేశాలలో 2026 సంవత్సరం కార్యక్రమాలను అత్యంత సముచితమైన రీతిలో జరుపుకోవాలని సంబంధిత భాగస్వాములను ఇద్దరు నేతలు ఆదేశించారు.
సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు
17. దేశాలను మరింత దగ్గర చేయడంలో సాంస్కృతిక సంబంధాల ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు గుర్తించారు. భారత్, స్పెయిన్ దేశాల సంపన్నమైన, వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు.
రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సాంస్కృతిక మార్పిడి సుసంపన్నతను, వైవిధ్యాన్ని ముఖ్యంగా స్పానిష్ ఇండాలజిస్టులు, భారతీయ హిస్పానిస్టుల పాత్రను వారు ప్రశంసించారు. సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, మ్యూజియంలు, పండుగలలో ద్వైపాక్షిక మార్పిడిని ప్రోత్సహించేలా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై సంతకం చేయడాన్ని వారు స్వాగతించారు.
18. ఇరు దేశాల సంస్కృతులు, భాషల అధ్యయనంపై పెరుగుతున్న ఆసక్తిని ఇరువురు నేతలు ప్రశంసించారు. భారతదేశంలో ప్రాచుర్యం పొందిన విదేశీ భాషలలో స్పానిష్ ఒకటి. భారత్ - స్పెయిన్ సాంస్కృతిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలోనూ, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూటో సెర్వాంటెస్, వల్లడోలిడ్లోని కాసా డి లా ఇండియా వంటి రెండు దేశాల సాంస్కృతిక సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లోనూ పరస్పర ఆసక్తిని వారు దృఢంగా వ్యక్తం చేశారు.
19. వల్లడోలిడ్ విశ్వవిద్యాలయంలో హిందీ, భారతీయ అధ్యయనాలపై ఐసిసిఆర్ విభాగం ఏర్పాటును ఇరువురు నాయకులు స్వాగతించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కింద భారతదేశంలో విద్యా రంగంలో గుణాత్మక మార్పులను తీసుకువస్తోంది. ఈ సందర్భంగా భారతీయ విద్యా సంస్థలతో విద్యా, పరిశోధన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రముఖ స్పెయిన్ యూనివర్సిటీలకు ప్రధానమంత్రి శ్రీ మోదీ సూచించారు. జాయింట్/డ్యూయల్ డిగ్రీ, ట్విన్నింగ్ ఏర్పాట్ల ద్వారా సంస్థాగత సంబంధాలను, భారతదేశంలో బ్రాంచ్ క్యాంపస్ లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
20. ముంబయిలో స్పెయిన్-ఇండియా కౌన్సిల్ ఫౌండేషన్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన నాలుగో స్పెయిన్-ఇండియా ఫోరంలో అధ్యక్షుడు శాంచెజ్ కీలకోపన్యాసం చేశారు. భారత, స్పానిష్ పౌర సమాజాలు, కంపెనీలు, మేధో వర్గాలు, పాలనా యంత్రాంగాలు, విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలకు సహాయపడుతున్న ఈ సంస్థ విలువైన సేవలను నాయకులు గుర్తించారు. సభ్యుల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలోనూ, వారి పరస్పర విజ్ఞానాన్ని పెంచడానికి రెండు దేశాలను దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
21. ఐసిసిఆర్ స్పెయిన్ ప్రజలకు బహుమతిగా ఇచ్చిన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని వల్లడోలిడ్ వద్ద ఏర్పాటు చేయడాన్ని, ఠాగూర్ అనువదించిన రచనలను మాడ్రిడ్ లోని ఇన్ స్టిట్యూట్ సెర్వాంటెస్ వాల్ట్స్ లో ఉంచడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య పెరుగుతున్న సాంస్కృతిక సంబంధానికి నిదర్శనం.
22. 2023లో జరిగిన సెమిన్సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారత్ అతిథి దేశంగా ఉండటం, ప్రముఖ స్పానిష్ దర్శకుడు కార్లోస్ సౌరాకు ఐఎఫ్ఎఫ్ఐ సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం లభించడంతో సినిమా, ఆడియో విజువల్స్ రంగంలో పెరుగుతున్న సహకారంపై ఇరు పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. భారత్, స్పెయిన్ లోని పెద్ద చలనచిత్ర, ఆడియో-విజువల్ పరిశ్రమలపై దృష్టి సారించిన ఇరువురు నాయకులు, ఆడియో-విజువల్ కో-ప్రొడక్షన్ అగ్రిమెంట్ కింద ఇరు దేశాల మధ్య సహకార పరిధిని పెంచడానికి అంగీకరించారు. అలాగే ఆడియోవిజువల్ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడానికి, చలనచిత్రాల సహ-నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి ఒక సంయుక్త కమిషన్ ఏర్పాటును కూడా స్వాగతించారు.
23. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, దౌత్య కార్యాలయ(కాన్సులర్) సేవలను పెంపొందించడానికి స్పెయిన్ లోని బార్సిలోనాలో తొలి కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని, బెంగళూరులో స్పెయిన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు.
ఈయూ- భారత్ సంబంధాలు
24. భారత్- యూరోపియన్ యూనియన్ (ఈయూ) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల రక్షణ ఒప్పందం, భౌగోళిక సూచికల ఒప్పందం వంటి ఈయూ-ఇండియా మూడు అంశాల చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి తమ నిబద్ధతను ప్రధాని మోదీ, అధ్యక్షుడు శాంచెజ్ పునరుద్ఘాటించారు.
25. ఈయూ-ఇండియా అనుసంధాన భాగస్వామ్య (కనెక్టివిటీ పార్టనర్ షిప్) లక్ష్యాలను పూర్తిగా సాధించేందుకు తమ సహకారాన్ని విస్తరించడానికి, భారత్, యూరప్ ల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు భారత్- మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)-యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు (ఐఎంఈసీ) సామర్థ్యాన్ని గుర్తించడానికి వారు అంగీకరించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఇంధనం, లాజిస్టిక్స్, ఓడరేవులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో ప్రాంతీయ దేశాల మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను వారు అన్వేషించారు.
అంతర్జాతీయ అంశాలు
26. ఉక్రెయిన్ యుద్ధంపై నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడంతో సహా ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు,సూత్రాలకు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతి అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఘర్షణ పరిష్కారానికి చర్చల ప్రాముఖ్యతను, దౌత్యపరమైన ప్రాముఖ్యతను వారు వివరించారు. అలాగే సంఘర్షణకు సుస్థిరమైన, శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి భాగస్వాములందరి మధ్య చిత్తశుద్ధి అవసరమని స్పష్టం చేశారు. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, సంప్రదింపులు జరుపడానికి వారు అంగీకరించాయి.
27. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతను సాధించడానికి తమ దృఢమైన నిబద్ధతను వారు పంచుకున్నారు. పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి పై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. సంబంధిత వర్గాలన్నీ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. చర్చల ద్వారా, దౌత్యం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని వారు కోరారు. అక్టోబర్ 7, 2023 న ఇజ్రాయెల్ పై జరిగిన ఉగ్రవాద దాడులను ఇరువురు నాయకులు నిర్ద్వంద్వంగా ఖండించారు. గాజాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రాణనష్టం, మానవతా సంక్షోభం ఆమోదయోగ్యం కాదని, వీలైనంత త్వరగా అంతం కావాలని అంగీకరించారు. బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని, తక్షణమే కాల్పులు విరమించాలని గాజాలోకి సురక్షితంగా, నిరంతరం మానవతా సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తూ, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని అన్ని పక్షాలను కోరారు. ఇజ్రాయెల్ తో శాంతి, భద్రతతో పాటు ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా సభ్యత్వానికి మద్దతు ఇస్తూ, సురక్షితమైన, పరస్పరం గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ సార్వభౌమ, ఆచరణీయ, స్వతంత్ర రాజ్య స్థాపనకు దారితీసే రెండు దేశాల పరిష్కారాల అమలుకు తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
28. లెబనాన్ లో ఉద్రిక్తత, హింస, బ్లూ లైన్ వెంబడి భద్రతా పరిస్థితిపై ఇరు పక్షాలు తమ ఆందోళనను పునరుద్ఘాటించాయి. యుఎన్ ఎస్ సి తీర్మానం 1701 పూర్తి అమలుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ప్రధాన సైనిక సహకార దేశాలుగా, యుఎన్ఐఎఫ్ఐఎల్ పై దాడులను వారు ఖండించారు. శాంతి పరిరక్షకుల రక్షణ, భద్రత చాలా ముఖ్యమని, ఇందుకు ప్రతి ఒక్కరూ భరోసా ఇవ్వాలని వారు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించరాదని, దాని ఆదేశాల పవిత్రతను అందరూ గౌరవించాలని స్పష్టం చేశారు.
29. నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమం, సార్వభౌమాధికారం పట్ల పరస్పర గౌరవం, సమర్థమంతమైన ప్రాంతీయ సంస్థల మద్దతుతో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత, శాంతియుత సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌ను ప్రోత్సహించాలని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యుఎన్ సిఎల్ఒఎస్) 1982 కు అనుగుణంగా నిరంతర వాణిజ్యం, నావిగేషన్ స్వేచ్ఛ ప్రాముఖ్యతను వారు ప్రముఖంగా పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర సమాచార నిర్వహణ, పరిరక్షణ, సుస్థిరత, భద్రత, అభివృద్ధి లక్ష్యంగా సహకార ప్రయత్నాల కోసం ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ)లో పాల్గొనాలని స్పెయిన్ కు భారతదేశ ఆహ్వానాన్ని ఇరు పక్షాలు గుర్తించాయి. భారత్ ఇండో-పసిఫిక్ విజన్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం కోసం భారత్ దృక్పథానికి, వ్యూహం ఈయూ వ్యూహానికి మధ్య సారూప్యతను కూడా వారు గుర్తించారు.
30. భారత్, లాటిన్ అమెరికన్ ప్రాంతం మధ్య పెరుగుతున్న రాజకీయ,వాణిజ్య సంబంధాలు, స్పెయిన్ తో అది పంచుకునే చారిత్రక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను గుర్తిస్తూ, ఈ ప్రాంతంలో పెట్టుబడులు,అభివృద్ధి కోసం త్రైపాక్షిక సహకారానికి గల అపారమైన సామర్థ్యాన్ని ఇరువురు నాయకులు గుర్తించారు. లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాల బలోపేతానికి వేదిక కానున్న ఐబెరో-అమెరికన్ సదస్సులో అసోసియేట్ అబ్జర్వర్ గా చేరేందుకు భారత్ చేసిన దరఖాస్తును స్పెయిన్ స్వాగతించింది. 2026 లో స్పెయిన్ లో జరిగే ఐబెరో-అమెరికన్ సదస్సు ద్వారా ఈ ప్రక్రియను ఖరారు చేయడానికి ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయి, తద్వారా స్పెయిన్ ప్రో టెంపోర్ సెక్రటేరియట్ కార్యకలాపాలలో భారత్ చురుకుగా పాల్గొనవచ్చు.
అంతర్జాతీయ, బహుపాక్షిక సహకారం
31. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి), ఇతర బహుళపక్ష వేదికలతో సహా ఐక్యరాజ్యసమితిలో సహకారం, సమన్వయాన్ని పెంపొందించడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమం ప్రాముఖ్యతను వారు ప్రముఖంగా ప్రస్తావించారు. వర్తమాన వాస్తవాలను ప్రతిబింబించే బహుళపక్షవాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, యుఎన్ఎస్సితో సహా అంతర్జాతీయ సంస్థలను మరింత ప్రాతినిధ్యం, సమర్థమంతమైన, ప్రజాస్వామిక, జవాబుదారీ, పారదర్శకంగా మార్చడానికి ఇరు పక్షాలు నిబద్ధతను ప్రకటించాయి. 2031-32 కాలానికి స్పెయిన్ యూఎన్ఎస్సీ అభ్యర్థిత్వానికి భారత్ మద్దతు తెలపగా, 2028-29 కాలానికి భారత్ అభ్యర్థిత్వానికి స్పెయిన్ మద్దతు తెలిపింది.
32. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడానికి అవసరమైన వనరుల అంతరాన్ని పూడ్చడంలో సహాయపడే ప్రాధాన్యతా చర్యలను గుర్తించడానికి 2025 లో సెవిల్లా (స్పెయిన్) లో జరిగే ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ నాలుగో అంతర్జాతీయ సదస్సును ఒక కీలక అవకాశంగా ఇరువురు నాయకులు భావిస్తున్నారు.
33. అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) ముఖ్యమైన,సంక్లిష్టమైన సమస్యలను విజయవంతంగా, సమగ్రంగా పరిష్కరించిన జి 20 కి ఆదర్శవంతమైన అధ్యక్షత వహించినందుకు అధ్యక్షుడు శాంచెజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. జి-20 సదస్సుకు శాశ్వత ఆహ్వానిత హోదాలో చర్చలకు స్పెయిన్ అందించిన విలువైన సహకారాన్ని ప్రధాని మోదీ కొనియాడారు.
34. సుస్థిర ఇంధనాన్ని ప్రోత్సహించడంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ చర్యలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను వారు గుర్తించారు. పారిస్ ఒప్పందం నిర్దేశించిన ఉష్ణోగ్రత లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే వాతావరణ ఫైనాన్స్ పై కొత్త ఉమ్మడి పరిమాణాత్మక లక్ష్యంతో సహా ఒక ప్రతిష్టాత్మక ఫలితాన్ని సాధించడానికి బాకులో జరగనున్న వాతావరణ శిఖరాగ్ర సమావేశం (సిఓపి 29) లో కలసి పనిచేస్తామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావాల నేపథ్యంలో దేశాల శక్తి, అనుసరణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చర్యలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వారు వివరించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో అవగాహన ఒప్పందం త్వరగా ఖరారు కావాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. హరిత మార్పు దిశగా స్పెయిన్ నిబద్ధతను ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు. అంతర్జాతీయ సౌర కూటమిలోకి స్పెయిన్ ను స్వాగతించారు. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను గడువు సంవత్సరం కంటే చాలా ముందుగానే సాధించడంలో భారతదేశం సాధించిన పురోగతిని అధ్యక్షుడు శాంచెజ్ ప్రశంసించారు. వాతావరణ మార్పుల ఆందోళనలను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్త సమష్టి కృషి అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. జాతీయ పరిస్థితుల దృష్ట్యా మొదట అంతర్జాతీయ విశ్లేషణను పరిగణనలోకి తీసుకుని సిఒపి 28 ఫలితాలపై సానుకూలంగా స్పందించాలని నిర్ణయించారు.
35. సంసిద్ధత, అనుసరణ చర్యల ద్వారా దేశాలు, నగరాలు,సమాజాలు కరువుకు గురయ్యే అవకాశాలను తగ్గించడానికి దృఢమైన చర్యలను ప్రోత్సహించడానికి 2022 లో ప్రారంభించిన అంతర్జాతీయ కరువు నిరోధక కూటమి అయిన ఐడిఆర్ఏలో చేరాలని స్పెయిన్ భారతదేశాన్ని ఆహ్వానించింది.
36. ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లో, వ్యక్తీకరణల్లో ఇరువురు నేతలు నిర్ద్వంద్వంగా ఖండించారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని, ఉగ్రదాడులకు పాల్పడిన వారిని జాప్యం చేయకుండా శిక్షించాలని వారు పిలుపునిచ్చారు. అన్ని దేశాలు తమ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని ఉగ్రవాద ప్రయోజనాలకు ఉపయోగించకుండా నిరోధించడానికి తక్షణ, సుస్థిర, కోలుకోలేని చర్యలు తీసుకోవాలని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంబంధిత తీర్మానాలను దృఢంగా అమలు చేయాలని, అలాగే ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాన్ని (గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ) అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. యూఎన్ఎస్సీ నిషేధించిన అల్ ఖైదా, ఐసిస్/దాయిష్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, వాటి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద బాధితులకు, వారి సాధికారతకు మద్దతుగా స్పెయిన్ చేపట్టిన బహుళపక్ష కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు.
37. ఈ పర్యటన సందర్భంగా తనకు, తన ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం పలికినందుకు, సాదర ఆతిథ్యం ఇచ్చినందుకు అధ్యక్షుడు శాంచెజ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సమీప భవిష్యత్తులో స్పెయిన్ పర్యటన చేపట్టాల్సిందిగా శ్రీ మోదీని ఆహ్వానించారు.
***
(Release ID: 2069899)
Visitor Counter : 38
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam