ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబరు 30, 31 లలో ప్రధాన మంత్రి గుజరాత్ పర్యటన ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకల్లో ప్రధాన మంత్రి


ఏక్తానగర్ లో రూ.280 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పథకాలు;

ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం, కొన్ని శంకుస్థాపనలు

‘ఆరంభ్ 6.0’లో 99వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 29 OCT 2024 3:35PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30, 31 తేదీలలో గుజరాత్‌లో పర్యటించనున్నారు.  అక్టోబరు 30న సాయంత్రం సుమారు 5:30 గంటలకు ప్రధాని కేవడియాలోని ఏక్తా నగర్ కు వెళ్తారు.  రూ.280 కోట్లకు పైగా విలువైన అనేక మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలలో పాలుపంచుకొంటారు.  సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో ఆయన, ‘ఆరంభ్ 6.0’ లో భాగంగా ఉన్న 99వ కామన్ ఫౌండేషన్ కోర్సు తాలూకు శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  అక్టోబరు 31న ఉదయం 7:15గంటలకు ప్రధాని ఏక్తా విగ్రహం వద్దకు చేరుకొని, పుష్పాంజలి సమర్పిస్తారు.  ఆ తరువాత, ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకల్లో పాల్గొంటారు.

ఏక్తా నగర్‌లో ప్రధాని వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతో పాటు కొన్నింటికి శంకుస్థాపన చేస్తారు.  ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో యాత్రికులకు సరికొత్త ఆహ్లాదకర అనుభూతులను పంచడంతో పాటు వాటికి సంబంధించిన సదుపాయాలను దీర్ఘకాలిక లక్ష్యంతో మెరుగుపరచడానికి చేపడుతున్నవి.

‘ఆరంభ్ 6.0’లో భాగం అయిన 99వ కామన్ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందుతున్న అధికారులను ఉద్దేశించి, ప్రధాన మంత్రి ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ కు ముందు రోజున ప్రసంగిస్తారు.  ‘‘ఆత్మనిర్భరత, వికసిత్ భారత్‌ల బాటలో ముందుకు సాగిపోతుండడం..’’ ఇదీ ఈ సంవత్సర కార్యక్రమంలో ముఖ్య ఇతివృత్తం.  ‘ఆరంభ్ 6.0’ తాలూకు 99వ కామన్ ఫౌండేషన్ కోర్సు అభ్యర్థులలో భారతదేశంలో 16 పౌర సేవల విభాగాలకు చెందిన 653 మంది శిక్షణ పొందుతున్న అధికారులే కాకుండా భూటాన్‌కు చెందిన 3 పౌర సేవల కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు కూడా ఉన్నారు.

అక్టోబరు 31వ తేదీన ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకలలో ప్రధాన మంత్రి పాల్గొంటారు.  ఈ సందర్భంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కు ప్రధాని పుష్పాంజలి సమర్పిస్తారు. సభికులు ‘ఏక్తా దివస్’ ప్రతిజ్ఞ స్వీకరించే కార్యక్రమంలో ప్రధాని పాలుపంచుకొంటారు.  ఏక్తా దివస్ కవాతును పరిశీలిస్తారు.  9 రాష్ట్రాలకు చెందిన 16 జట్లు, ఒక కేంద్రపాలిత ప్రాంత పోలీసు బృందం, 4 కేంద్ర సాయుధ పోలీసు బలగాల జట్లు, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సీసీ) బృందంతో పాటు ఒక సేనా బ్యాండ్ బృందం కూడా ఈ పరేడ్ లో పాల్గొంటాయి.  ఇదే కార్యక్రమంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) లోని ‘హెల్ మార్చ్’ దళం విన్యాసం, సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్)తో పాటు కేంద్ర రిజర్వు పోలీసు దళాల (సిఆర్‌పీఎఫ్)కు చెందిన మోటార్ బైక్ వీరులు, వీరాంగనలు ప్రదర్శించే సాహసకృత్యాలు, బీఎస్ఎఫ్ యోధుల భారతీయ యుద్ధవిద్య కళలు, బడి పిల్లలు నిర్వహించే పైప్ డ్ బ్యాండ్ షో,  భారత వాయు సేన (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో ‘సూర్య కిరణ్’ విమానాలు గౌరవాభివందనం చేస్తూ ఎగరడం తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణలు గా చోటుచేసుకోనున్నాయి.

 

****




(Release ID: 2069254) Visitor Counter : 35