ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన... ప్రారంభోత్సవం.. జాతికి అంకితం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 02 OCT 2024 4:37PM by PIB Hyderabad

జోహార్!

      గౌరవనీయులైన జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్‌, కేంద్ర మంత్రిమండ‌లిలో నా సహ‌చ‌రురులు శ్రీ జుయ‌ల్ ఓరమ్‌, జార్ఖండ్ ప్రియ పుత్రిక అన్నపూర్ణా దేవి గారు, శ్రీ దుర్గాదాస్ ఉయికీ, ఈ నియోజకవర్గ ఎంపీ శ్రీ మనీష్ జైస్వాల్, రాంచీ ఎంపీ శ్రీ సంజయ్ సేథ్, కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఇత‌ర‌ ప్రజాప్రతినిధులు, నా సోదర‌ సోదరీమణులారా!

   జార్ఖండ్ ప్రగతి పయనంలో పాలుపంచుకునే భాగ్యం ఈవేళ  నాకు మరోసారి లభించింది. దీనికి కొద్ది రోజులముందే నేను జంషెడ్‌పూర్‌లో పర్యటించినప్పడు రాష్ట్రానికి సంబంధించి రూ.వందల కోట్ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించాను. అదే సమయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జార్ఖండ్‌లోని వేలాది పేదలకు పక్కా ఇళ్ల తాళాలు అందించాను. ఈ నేపథ్యంలో మళ్లీ కొన్ని రోజులకే రాష్ట్రానికి వచ్చాను. ఈవేళ  రూ.80,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన పూర్తయింది. ఇవన్నీ గిరిజన సంక్షేమం, సాధికారతకు ఉద్దేశించినవే. దేశవ్యాప్త గిరిజన సమాజ అభ్యున్నతిపై ప్రభుత్వ ప్రాధాన్యానికి ఇది తిరుగులేని నిదర్శనం. ఈ ప్రాజెక్టులన్నిటికీ సంబంధించి జార్ఖండ్ సహా దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

   నేడు పూజ్య బాపుజీ మహాత్మా గాంధీ జయంతి... గిరిజన సంక్షేమంపై ఆయన దార్శనికత, ఆలోచనలు దేశానికి అమూల్య సంపద. గిరిజనులు వేగంగా పురోగమిస్తేనే దేశం కూడా అంతే వేగంతో ముందడుగు వేస్తుందని మహాత్మా గాంధీ ప్రగాఢంగా విశ్వసించారు. అందుకు అనుగుణంగా నేడు మా ప్రభుత్వం గిరిజన అభ్యున్నతిపై ఎన్నడూలేని రీతిలో అత్యధిక శ్రద్ధ చూపడం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది. ఇందులో భాగంగా నేను కాసేపటి కిందటే కీలక పథకం ‘ధర్తీ ఆబా జ‌న్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్‌’ను ప్రారంభించాను. దీనికింద దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో సుమారు 63,000 గిరిజన ప్రాబల్యగల గ్రామాలను దాదాపు రూ.80,000 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ఈ గ్రామాల్లో సామాజిక-ఆర్థిక జీవన స్థితిగతుల మెరుగుదలకు కృషి కొనసాగుతుంది. తద్వారా దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా గిరిజన సోదరసోదరీమణులకు లబ్ధి కలుగుతుంది. వారందరితోపాటు ఈ కార్యక్రమం వల్ల జార్ఖండ్‌ గిరిజన సమాజం కూడా ఎంతో ప్రయోజనం పొందుతుంది.

మిత్రులారా!

   భగవాన్ బిర్సా ముండా జన్మించిన నేలపై ఈ పథకాన్ని ప్రారంభించడం నాకు అపరిమిత ఆనందంగా ఉంది. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఇంతకుముందు ఈ గడ్డమీదనే  ‘పిఎం-జన్మన్ యోజన’కు నేను శ్రీకారం చుట్టాను. ఈ నేపథ్యంలో 2024 నవంబరు 15న ‘గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం’ నాడు ఈ పథకం తొలి వార్షికోత్సవం చేసుకోబోతున్నాం. ఒకనాడు నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలకు ఈ పథకం వల్ల అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవేళ రూ.1300 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించాం. అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ఈ పథకం కింద మెరుగైన జీవనం దిశగా విద్య, వైద్యం, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

సోదరసోదరీమణులారా!

   జార్ఖండ్‌కు సంబంధించి ‘పిఎం-జన్మన్’ పథకం కేవలం ఒకేఒక ఏడాదిలో అనేక మైలురాళ్లను అధిగమించింది. ఈ మేరకు అత్యంత వెనుకబడిన 950కిపైగా గ్రామాల్లో ఇంటింటికీ నీటి సరఫరా పనులు పూర్తయ్యాయి. అలాగే 35 వన్-ధన్ వికాస కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అంతేకాదు... మారుమూల గిరిజన ప్రాంతాలకు మొబైల్ అనుసంధానం దిశగా కృషి కొనసాగుతోంది. ఈ ప్రగతి, ఈ మార్పు మన గిరిజన సమాజ  పురోగమనానికి సమానావకాశాలను చేరువ చేస్తుంది.

మిత్రులారా!

   నాణ్యమైన విద్యావకాశాల లభ్యత ద్వారానే మన గిరిజన సమాజ ప్రగతి సుగమం కాగలదు. ఆ వివేచనతోనే గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య ఆశ్రమ పాఠశాలలను మా ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ కృషిలో భాగంగానే నేడు 40 పాఠశాలలను ఇక్కడినుంచి  ప్రారంభించడంతోపాటు మరో 25 స్కూళ్లకు శంకుస్థాపన కూడా చేశాం. ఈ పాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాల కల్పన సహా  ఉన్నత ప్రమాణాలతో విద్యనందించడం కోసం ప్రతి పాఠశాల బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేశాం.

సోదరసోదరీమణులారా!

   మన కృషి స‌రైనదైతే సత్ఫలితాలు సాధ్యం. ప్రభుత్వ చేయూతతో గిరిజన యువత ముందడుగు వేస్తుందని, వారి శక్తిసామర్థ్యాలతో దేశం ప్రయోజనం పొందగలదని నేను  దృఢంగా విశ్వసిస్తున్నాను.

మిత్రులారా!

   నేనిప్పుడు సుదీర్ఘ ప్రసంగమేమీ చేయబోను... కాసేపట్లోనే ఇక్కడి నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలోగల గిరిజన సమాజం నిర్వహించే పెద్ద జాతరకు హాజరు కాబోతున్నాను. అక్కడ నా మనోభావాలను అందరితో పంచుకుంటూ మరింత ఆత్మీయ భాషణం చేయాలని భావిస్తున్నాను. కాబట్టి, ఈ ప్రభుత్వ కార్యక్రమ పరిమితిని గౌరవిస్తూ- నా ప్రసంగాన్ని త్వరగానే ముగిస్తాను. ఏదేమైనా, ఇలాంటి కార్యక్రమానికి ఇంత భారీగా ప్రజలు హాజరైనపుడు ‘ఆహా.. ఇదెంతో భారీగా జరిగింది!’’ అనే మాట వినిపించడం సహజం. వాస్తవానికి ఈ ప్రభుత్వ కార్యక్రమం కోసం స్వల్ప ఏర్పాట్లు మాత్రమే చేశారు. అతి పెద్ద కార్యక్రమం కాసేపట్లో మొదలు కాబోతూంది. ఇదే ఇంత భారీ కార్యక్రమం అనిపించినపుడు, అది మరెంత బ్రహ్మాండంగా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈవేళ నేను ఇక్కడ పాదం మోపగానే జార్ఖండ్‌లోని నా సోదరసోదరీమణుల అద్భుత ప్రేమాభిమానాలను చవిచూశాను. గిరిజన సమాజానికి మరింత సేవ చేయడంలో ఈ ప్రేమ, ఆదరణ నాకు ఎనలేని ఉత్తేజమిస్తాయి. ఈ స్పూర్తితో మరోసారి ఈ అభివృద్ధి పనులపై మీకందరికీ అభినందనలు,  హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడి కార్యక్రమానికి హాజరైన వారంతా అక్కడి జాతరకు తప్పక వస్తారని, ఇంకా అనేక అంశాలపై మాట్లాడే అవకాశం నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను.

జై జోహార్!


 

****


(Release ID: 2061497) Visitor Counter : 45