ప్రధాన మంత్రి కార్యాలయం
జమైకా ప్రధానితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
01 OCT 2024 6:35PM by PIB Hyderabad
గౌరవ ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్,
ఇరు దేశాల ప్రతినిధులకు, మీడియా సహచరులకు,
నమస్కారం!
ప్రధానమంత్రి శ్రీ హోల్నెస్, ఆయన ప్రతినిధి బృందాన్ని భారత్‌కు స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. ఇది ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. అందుకే ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యముంది. చాలా కాలంగా ప్రధాని హోల్నెస్ భారతదేశానికి మిత్రులుగా కొనసాగుతున్నారు. చాలా సార్లు ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది. ఆయనను కలిసిన ప్రతిసారీ భారత్‌తో సంబంధాల బలోపేతం పట్ల ఆయనకు గల నిబద్ధతను ఆయన ఆలోచనల ద్వారా నేను గ్రహించాను. ఆయన పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా మొత్తం కరీబియన్ ప్రాంతంతో మన బంధాన్ని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
భారత్, జమైకా సంబంధాలు మన భాగస్వామ్య చరిత్ర, ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, ఇరుదేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. మన భాగస్వామ్యం - కల్చర్, క్రికెట్, కామన్వెల్త్, క్యారికోమ్ (కరీబియన్ కమ్యూనిటీ, కామన్ మార్కెట్) అనే నాలుగు ‘సీ’ల మేలైన కలయికగా ఉంది. నేటి సమావేశంలో, మేం అన్ని రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించాం. అలాగే అనేక కొత్త కార్యక్రమాలను గుర్తించాం. భారత్, జమైకా మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరుగుతున్నాయి. జమైకా అభివృద్ధి ప్రయాణంలో భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన, నిబద్ధత గల అభివృద్ధి భాగస్వామిగా ఉంది. ఈ దిశలో మా ప్రయత్నాలన్నీ జమైకా ప్రజల అవసరాలకు అనుగుణంగా సాగుతున్నాయి. ఐటీఈసీ, ఐసీసీఆర్ ఉపకారవేతనాల ద్వారా జమైకా ప్రజల నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణానికి తోడ్పాటునందిస్తున్నాం.
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చిన్న పరిశ్రమలు, జీవ ఇంధనం, ఆవిష్కరణలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో మా అనుభవాన్ని జమైకాతో పంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. రక్షణ రంగంలో జమైకా సైన్యానికి శిక్షణ అందిస్తూ, వారి సామర్థ్యాలను పెంపొందించే దిశగా మేం ముందుకుసాగుతాం. వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం మా ఉమ్మడి సవాళ్లుగా ఉన్నాయి. మేం ఐక్యంగా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో ఏకాభిప్రాయంతో ఉన్నాం. అంతరిక్ష రంగంలో మా విజయవంతమైన అనుభవాన్ని జమైకాతో పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది.
మిత్రులారా,
నేటి సమావేశంలో, మేం అనేక ప్రపంచ, ప్రాంతీయ సమస్యలను కూడా చర్చించాం. అన్ని ఉద్రిక్తతలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం ఐక్యంగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా అన్ని ప్రపంచ సంస్థల సంస్కరణ అత్యవసరమని భారత్, జమైకాలు భావిస్తున్నాయి. ఈ సంస్థల ఆధునికీకరణ కోసం కలిసికట్టుగా కృషిని కొనసాగిస్తాం.
మిత్రులారా,
భారత్, జమైకాలు విస్తారమైన మహాసముద్రాలతో వేరు చేయబడి ఉన్నా, మా మనస్సులు, సంస్కృతులు, చరిత్రలు బలంగా ముడిపడి ఉన్నాయి. దాదాపు 180 ఏళ్ల క్రితం భారత్ నుంచి జమైకాకు వలస వెళ్లిన ఇక్కడి ప్రజలు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలకు బలమైన పునాదులు వేశారు. నేడు, జమైకాను స్వదేశంగా భావిస్తున్న సుమారు 70,000 మంది భారతీయ మూలాలు మన భాగస్వామ్య వారసత్వానికి సజీవ ఉదాహరణగా నిలుస్తాయి. వారిని ఆదుకుని అండగా నిలిచిన ప్రధాన మంత్రి హోల్నెస్, ఆయన ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన యోగా, బాలీవుడ్, జానపద సంగీతాన్ని జమైకా ఆదరిస్తున్న విధంగానే, జమైకాకు చెందిన "రెగే", "డ్యాన్స్‌హాల్" భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి. నేటి సాంస్కృతిక వినిమయ కార్యక్రమం మన పరస్పర సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నది. ఢిల్లీలోని జమైకా హైకమిషన్ ఎదురుగా ఉన్న రహదారికి "జమైకా మార్గ్" అని పేరు పెట్టాలని నిర్ణయించాం. ఈ రహదారి రాబోయే తరాలకు మన శాశ్వత స్నేహం, సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది.
క్రికెట్‌ను ఇష్టపడే దేశాలుగా, మన ఇరుదేశాల సంబంధాలకు క్రీడలు బలమైన, ముఖ్యమైన అనుసంధానంగా ఉన్నాయి. "కోర్ట్నీ వాల్ష్" అద్భుత ఫాస్ట్ బౌలింగ్ అయినా లేక "క్రిస్ గేల్" దూకుడైన బ్యాటింగ్ అయినా, భారత ప్రజల్లో జమైకన్ క్రికెటర్ల పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. క్రీడారంగంలో పరస్పర సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడం గురించి కూడా మేం చర్చించాం. నేటి చర్చల ఫలితాలు ఇరు దేశాల సంబంధాలను "ఉసేన్ బోల్ట్" కంటే వేగంగా ముందుకు నడిపిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.
గౌరవ జమైకన్ ప్రధానికి,
వారి ప్రతినిధి బృందానికి మరోసారి సాదర స్వాగతం పలుకుతున్నాను.
ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో మాట్లాడారు.
***
(Release ID: 2060985)
Visitor Counter : 59
Read this release in:
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam