ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వియత్నాం దేశాధ్యక్షుడు, అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి తూ లాం తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ

Posted On: 24 SEP 2024 12:17AM by PIB Hyderabad

ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’ సమావేశాల నేపథ్యంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియత్నాం దేశ అధ్యక్షుడు, అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తూ లాం తో ఈ నెల 23న సమావేశమయ్యారు.  
తూ లాం చేపట్టిన అదనపు పదవీ బాధ్యతలకు అభినందనలు తెలిపిన మోదీ, భారత్ వియత్నాంల మైత్రీ బంధం బలోపేతానికి ఉమ్మడి కృషి కొనసాగగలదని ఆకాంక్షించారు.

ఈ నెల ప్రారంభంలో వియత్నాంలో సంభవించిన ‘యాగి’ తుపాను వల్ల కలిగిన అపార నష్టం పట్ల మోదీ సానుభూతి తెలిపగా, ‘ఆపరేషన్ సద్భావ్’ ద్వారా సరైన సమయానికి భారత్ అందించిన  అత్యవసర మానవతా సహాయానికి  అధ్యక్షుడు తూ లాం కృతజ్ఞతలు తెలియచేశారు.

పరస్పర విశ్వాసం, అవగాహన, పరస్పర ఆసక్తికర అంశాలు పునాదిగా ఇరుదేశాల మధ్య సంప్రదాయ, సాంస్కృతిక బంధాలూ, పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్య  ప్రాముఖ్యాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ఆగస్టులో వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ భారత్ రాకను గుర్తు చేసిన మోదీ, రెండు దేశాల మధ్య పరస్పర సహకారం, సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యాలని ముందుకు తీసుకువెళ్ళేందుకు తీసుకోవలసిన చర్యల గురించి తూ లాం తో చర్చించారు. ఇండో-పసిఫిక్ సహా అనేక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలను చర్చించిన ఇరువురు నేతలూ, అంతర్జాతీయ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉమ్మడి  ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించారు.


(Release ID: 2058157) Visitor Counter : 79