ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భువనేశ్వర్, ఒడిశాలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధాని ప్రసంగం

Posted On: 17 SEP 2024 3:30PM by PIB Hyderabad

జై జగన్నాథ్!  

 

జై జగన్నాథ్!  

 

జై జగన్నాథ్!

 

ఒడిశా గవర్నర్ శ్రీ రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ మాంఝీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ జ్యుయేల్ ఓరమ్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, అన్నపూర్ణ దేవి గారు, ఒడిశా ఉపముఖ్యమంత్రి శ్రీ కె.వి.సింగ్ దేవ్, శ్రీమతి ప్రభాతీ పరీడా, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, దేశం నలుమూలల నుండి మనతో కలిసిన ఇతర మేధావులు, ఒడిశా సోదర, సోదరీమణులారా.

 

ఒడిశా-రో ప్రియ భాయి ఓ భౌనీ మానాంకు,  

 

మోర్ అగ్రిమ్ సారదీయ సుభెచ్చా. 

 

(ఒడిషాలోని నా ప్రియమైన సోదరులు, సోదరీమణులకు, 

 

రాబోయే శారదీయ నవరాత్రులకు నా శుభాకాంక్షలు.)

 

భగవాన్ జగన్నాథ్ కృపతో ఈ రోజు మళ్లీ ఒడిశా పవిత్ర భూమికి రావడానికి నాకు అవకాశం దొరికింది. జగన్నాథుని అనుగ్రహం ఉన్నప్పుడు, జగన్నాథుని ఆశీస్సులు కురిసినప్పుడు, జగన్నాథుడిని సేవించడంతో పాటు, ప్రజలకు కూడా సేవ చేసేందుకు పుష్కలంగా అవకాశం కలుగుతుంది. 

 

సహచరులారా,

 

ఈ రోజు దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలు గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు. ఈ రోజు అనంత చతుర్దశి పవిత్ర పర్వదినం కూడా. ఈ రోజే విశ్వకర్మ పూజ కూడా ఉంది. ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే, కృషినీ, నైపుణ్యాన్నీ విశ్వకర్మ రూపంలో పూజిస్తారు. నేను భారతీయులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

 

ఈ పవిత్రమైన రోజునే నాకు ఒడిశా తల్లులు-సోదరీమణుల కోసం సుభద్రా పథకం ప్రారంభించడానికి అవకాశం దొరికింది. ఇది కూడా మహాప్రభు కృపతోనే, సుభద్రా తల్లి పేరుతో పథకాన్ని ప్రారంభించి, స్వయానా ఇంద్రుడే తమ ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారని అనిపిస్తోంది.

 

నేడు దేశంలోని 30 లక్షలకు పైగా కుటుంబాలకు ఇక్కడ భగవాన్ జగన్నాథ్ పుణ్యభూమి నుండి, దేశవ్యాప్తంగా వివిధ గ్రామాలలో లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించాం. వీటిలో 26 లక్షల ఇళ్లు మన దేశంలోని గ్రామాల్లో, ఇంకా 4 లక్షల ఇళ్లు మన దేశంలోని వివిధ నగరాల్లో అందించాం. ఇక్కడ ఒడిశా అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంలో నేను మీ అందరికీ, ఒడిశా ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

 

సోదర సోదరీమణులారా,

 

ఒడిశాలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చాను. ఆ తర్వాత ఇది నా మొదటి పర్యటన. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే, ఒడిశా అభివృద్ధిలో ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని నేను ఎన్నికల సమయంలో మీకు వాగ్దానం చేసాను. ఇక్కడి గ్రామీణులు, పేదలు, దళితులు, ఆదివాసీలు, మన నిరుపేద కుటుంబాలు, మా తల్లులు, అక్కా-చెల్లెలు, యువతులు, మధ్యతరగతి ప్రజలు ఏవైతే కలలు కన్నారో, ఆ కలలన్నీ నెరవేరతాయన్నది నా విశ్వాసం. అలాగే భగవాన్ జగన్నాథ్ ఆశీస్సులు కూడా మనతో ఉన్నాయి. నేడు మీరు చూస్తున్నారు కదా... మేం చేసిన వాగ్దానాలు, అద్భుతమైన వేగంతో నెరవేరుతున్నాయి. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే భగవాన్ జగన్నాథ్ ఆలయం నాలుగు ద్వారాలు తెరుస్తామని చెప్పాం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భగవాన్ జగన్నాథ్ ఆలయ పరిసరాల్లోని మూసి వేసిన ద్వారాలను తెరిపించాం. అలాగే ఆలయ రత్న భండాగారాన్ని కూడా తెరిచాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజా సేవ కోసం రాత్రింబవళ్లు పని చేస్తోంది. మా మోహన్ గారు, కె.వి. సింగ్ దేవ్ గారు, సోదరి ప్రభాతీ పరీడా గారు అందరు మంత్రుల నాయకత్వంలో ప్రభుత్వం స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేస్తోంది. దీనికి గాను, నా మొత్తం బృందానికి, నా సహచరులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 

 

సహచరులారా,

 

ఈ రోజు మరో కారణం వలన కూడా ప్రత్యేకమైంది. నేడు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పాలను పూర్తి చేసుకుంటున్నది. ఈ కాలంలో పేదలు, రైతులు, యువత, మహిళా శక్తి సాధికారత కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. గడిచిన 100 రోజులలో పేదల కోసం 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నాం. గత 100 రోజుల్లో యువత కోసం 2 లక్షల కోట్ల రూపాయల పీఎం ప్యాకేజీని ప్రకటించాం. దీనివల్ల యువతకు చాలా లాభం చేకూరుతుంది. దీనిలో భాగంగా ప్రైవేట్ కంపెనీల్లో యువతకు మొదటి ఉద్యోగం కోసం మొదటి వేతనం ప్రభుత్వం అందజేయనుంది. ఒడిశా సహా దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు చేర్చాలని కూడా నిర్ణయించాం. కొన్నిరోజుల క్రితం 25,000 గ్రామాల అనుసంధానానికి పక్కా రోడ్లతో ప్రణాళికకు కూడా ఆమోదం లభించింది. దీని లాభం ఒడిశా గ్రామాలకు కూడా కలుగుతుంది. బడ్జెట్‌లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సుమారు రెండింతల బడ్జెట్ ను పెంచాం. దేశవ్యాప్తంగా సుమారు 60,000 గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను ప్రకటించాం. గడచిన 100 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప పెన్షన్ పథకాన్ని ప్రకటించాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి, మధ్య తరగతి వ్యాపారులకూ వారి ఆదాయపు పన్నులో కూడా రాయితీ కల్పించాం.

 

మిత్రులారా,

 

గత 100 రోజుల్లో ఒడిశా సహా దేశవ్యాప్తంగా 11 లక్షల కొత్త మహిళా లక్షాధికారులు తయారయ్యారు. ఇటీవలి కాలంలో రైతుల కోసం, ముఖ్యంగా ఉల్లి రైతుల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్నాం. విదేశీ నూనె దిగుమతులపై సుంకం పెంచాం. దాంతో దేశీయ రైతుల నుంచి నూనెగింజలనున అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. బాస్మతి రైస్ ఎగుమతిపై విధించిన సుంకాన్ని తగ్గించాం. దీని వల్ల బాస్మతి బియ్యం ఎగుమతికి ప్రోత్సాహం లభిస్తుంది. బాస్మతి పండించే రైతులకు ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచాం. దీని వల్ల దేశంలోని కోట్లాది రైతులకు సుమారు 2 లక్షల కోట్ల రూపాయల లాభం కలుగుతుంది. గడిచిన 100 రోజుల్లో అందరి ప్రయోజనాల కోసం ఇలాంటి అనేక కీలకమైన నిర్ణయాలను తీసుకున్నాం.

 

సహచరులారా,

 

ఏ దేశం అయినా, ఏ రాష్ట్రం అయినా, అభివృద్ధి చెందాలంటే దాని సగం జనాభా అంటే మన నారీశక్తి సమాన భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలి. అందుకే, మహిళల అభివృద్ధి, పెరుగుతున్న మహిళల శక్తి సామర్థ్యాలు ఒడిశా అభివృద్ధికి కీలకం అవబోతున్నాయి. ఇక్కడ భగవాన్ జగన్నాథ్ తోపాటు దేవీ సుభద్రా ఉనికి కూడా మనకు ఇదే విషయం చెబుతుంది, ఇదే నేర్పిస్తుంది. నేను ఇక్కడ సుభద్ర రూపంలో ఉన్న మా తల్లులు, అక్కలు, చెల్లెమ్మలకు ఆత్మీయ నమస్కారం తెలుపుతున్నాను. బీజేపీ ప్రభుత్వం, తొలినాళ్లలోనే, సుభద్రా పథకాన్ని మా తల్లులు, అక్కలకు బహుమానంగా ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ పథకం ఒడిశాలో 1 కోటి కంటే ఎక్కువ మంది మహిళలకు లబ్ధి చేకూర్చుతుంది. ఈ పథకంలో భాగంగా, మహిళలకు మొత్తం 50,000 రూపాయల నగదు అందుతుంది. ఈ డబ్బు సమయానుకూలంగా మీకు వస్తుంది. ఈ మొత్తం నేరుగా తల్లుల-అక్కల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాం. మధ్యవర్తులు ఎవరూ ఉండరు. నేరుగా మీ ఖాతాలోకే సొమ్ము వస్తుంది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్ట్‌తో కూడా ఈ పథకాన్ని అనుసంధానించాం. ఈ డిజిటల్ కరెన్సీని సోదరీమణులంతా డిజిటల్ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. దేశంలో డిజిటల్ కరెన్సీకి సంబంధించి ఇదే మొదటి పథకం. దీన్ని అమలు చేయడంలో ఒడిశా మహిళలందరికీ, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుభద్రా యోజన మా తల్లి, అక్కా చెల్లెమ్మలను శక్తిమంతం చేయాలనీ, దేవీ సుభద్రా దయతో ఈ పథకం విజయవంతం కావాలని నా ప్రార్థన.

 

సోదర సోదరీమణులారా,

 

సుభద్రా యోజనను ఒడిశాలో ప్రతి తల్లి, అక్క, చెల్లెమ్మకు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేక యాత్రలు నిర్వహిస్తున్నట్లు నాకు చెప్పారు. ఇందుకోసం ప్రతి మహిళకు అవగాహన కల్పిస్తున్నారు. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, లక్షలాది బీజేపీ కార్యకర్తలు కూడా ఈ సేవా కార్యక్రమంలో జోరుగా పనిచేస్తున్నారు. ఈ ప్రజా అవగాహన కార్యక్రమానికి గాను ప్రభుత్వానికి, పరిపాలనకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎంపీలకు, లక్షలాది కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

సహచరులారా,

 

భారతదేశంలో మహిళా సాధికారతకు ప్రతిబింబం అయిన మరో పథకం - ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’. ఈ పథకం కారణంగా చిన్న గ్రామాల్లో కూడా ఆస్తులు మహిళల పేరుపై ఉంటున్నాయి. ఈ రోజే దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల కుటుంబాల గృహ ప్రవేశం జరిగింది. ఇప్పటివరకు మా ప్రభుత్వపు మూడవ సారి పదవీ కాలంలో కొన్ని నెలలే అయినప్పటికీ, ఇంత తక్కువ కాలంలోనే 15 లక్షల కొత్త లబ్ధిదారులకు ఇవాళ అంగీకార పత్రాలను అందచేశాం. 10 లక్షలకు పైగా లబ్ధిదారులకు వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ అయింది. ఈ శుభ కార్యం కూడా మేం ఒడిశా మహాప్రభు ఉండే ఈ నేల నుండి ప్రారంభించాం, దీనిలో పెద్ద సంఖ్యలో నా ఒడిశా పేద కుటుంబాలు కూడా ఉన్నాయి. నేడు పక్కా ఇళ్లు పొందిన లక్షల కుటుంబాలకు, లేదా పక్కా ఇల్లు పొందడం ఖాయం అయిన కుటుంబాలకు ఇది జీవితంలో ఒక కొత్త ఆరంభం, నిశ్చితమైన ఆరంభం.

 

సహచరులారా,

 

ఇక్కడకు రాకముందు, నేను ఒక గిరిజన కుటుంబ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ కుటుంబానికి వారి ‘కొత్త ప్రధాని ఆవాసం’ లభించింది. ఆ కుటుంబం చూపిన ఆనందం, వారి ముఖాల్లో కన్పించిన సంతోషం, నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఆ గిరిజన కుటుంబం, నా సోదరి, ఆనందంతో నాకు పాయసం తినిపించింది. నేను పాయసం తినేటప్పుడు, సహజంగానే నాకు నా తల్లి గుర్తుకువచ్చింది. ఎందుకంటే నా తల్లి జీవించి ఉన్నప్పుడు నేను ప్రతి పుట్టినరోజుకి అమ్మ ఆశీస్సులు తీసుకునేవాడిని. అమ్మ నా నోట్లో బెల్లం పెట్టేది. కానీ నేడు అమ్మ లేదు. కానీ ఒక గిరిజన తల్లి నాకు పాయసం తినిపించి పుట్టిన రోజు ఆశీర్వాదం ఇచ్చింది. ఈ అనుభవం, ఈ భావన నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సంతోషకరమైన అనుభవం. గ్రామీణ పేద, దళితులు, అణగారిన, గిరిజన సమాజాల్లో ఈ మార్పు, వారి సంతోషమే నాకు మరింత కష్టపడటానికి శక్తినిస్తుంది.

 

మిత్రులారా,

 

ఒడిశా, అభివృద్ధి చెందిన రాష్ట్రం కావడానికి అవసరమైన ప్రతి వనరులను కలిగి ఉంది. ఇక్కడ యువత ప్రతిభ, మహిళల శక్తి , సహజ వనరులు, పరిశ్రమల అవకాశాలు, పర్యాటకంలో అపార అవకాశాలు — ఇక్కడ లేనిది ఏదైనా ఉందా? గత 10 సంవత్సరాలలో కేవలం కేంద్రంలోనే అధికారంలో ఉండి, ఒడిశా మాకు ఎంతటి ప్రాధాన్యత కలిగిన రాష్ట్రమో నిరూపించాం. పది సంవత్సరాల కిందట కేంద్రం నుండి ఒడిశాకు ఎంత నిధులు వచ్చేవో, ఇప్పుడు దాని కంటే మూడింతలు ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఇప్పుడు ఒడిశాలో గతంలో అమలు చేయని పథకాలు అమలు కావడం నాకు సంతోషంగా ఉంది. ఆయుష్మాన్ పథకం కింద ఒడిశా ప్రజలు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. ఇదే కాదు, ఇప్పుడు కేంద్రం 70 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులకు కూడా 5 లక్షల రూపాయల వైద్యం ఉచితంగా అందిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి ఏదైనా కావొచ్చు, కానీ మీ ఇంట్లో ఎవరికైనా 70 సంవత్సరాలు పైబడితే, వారి వైద్యం బాధ్యతను మోదీ తీసుకుంటాడు. లోకసభ ఎన్నికల సమయంలో మోదీ మీకు ఈ హామీ ఇచ్చారు, ఇప్పుడు మోదీ తన హామీని నిలబెట్టుకున్నాడు.

 

సహచరులారా,

 

పేదరికానికి వ్యతిరేకంగా బిజెపి చేసిన ప్రస్థానం వల్ల ఒడిశాలో నివసిస్తున్న దళిత, అణగారిన గిరిజన సంఘాలు అతిపెద్ద ప్రయోజనం పొందాయి. ఆదివాసీ సమాజం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పరచడం, వారికి భూమి, అడవి, వనరులపై హక్కులు కల్పించడం, ఆదివాసీ యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా ఒడిశా ఆదివాసీ మహిళను భారతదేశ గౌరవ రాష్ట్రపతిగా నియమించడం వంటి పనులు మొదటిసారి మేమే చేశాం.

 

సోదరులారా,

 

ఒడిశాలో ఎన్నో ఆదివాసీ ప్రాంతాలు, ఎన్నో గిరిజన సమూహాలు ఎన్నో తరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన గిరిజన సమాజం కోసం 'ప్రధానమంత్రి జన్-మన్ యోజన' ను ప్రారంభించింది. ఒడిశాలో ఇలాంటి 13 గిరిజన సమాజాలను గుర్తించారు. జన్-మన్ యోజన కింద ఈ సమాజాలకు అభివృద్ధి పథకాల ప్రయోజనాన్ని అందించడం జరుగుతోంది. గిరిజన ప్రాంతాలను ‘సికల్ సెల్ అనీమియా’ బారి నుండి విముక్తి కలిగించడానికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. గత 3 నెలల్లో ఈ కార్యక్రమంలో భాగంగా 13 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ చేయబడ్డారు.

 

సోదర సోదరీమణులారా ,

 

ఈ రోజు మన దేశం సంప్రదాయ నైపుణ్యాల పరిరక్షణపై విపరీతమైన దృష్టి పెట్టింది. మన దేశంలో వేల సంవత్సరాల కిందట నుండి కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు,శిల్పులు ఉన్నారు. ఇలాంటి 18 వృత్తులను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా ‘విశ్వకర్మ పథకం’ ప్రారంభమైంది. ఈ పథకంపై ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు 20 లక్షల మంది ఇందులో పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పథకం కింద విశ్వకర్మ స్నేహితులకు శిక్షణ ఇవ్వబడుతోంది. ఆధునిక పనిముట్లు, సాధనాలు కొనుగోలు చేయడానికి వేల రూపాయలు అందజేస్తున్నారు. అలాగే, తక్కువ వడ్డీ రుణాలను ఎటువంటి గ్యారంటీ లేకుండా బ్యాంకుల నుండి అందజేపిస్తున్నారు. పేదలకు ఆరోగ్య భద్రతతో పాటు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం, వారి జీవితాల్లో వస్తున్న ఈ మార్పులు అభివృద్ధి చెందిన భారతదేశానికి నిజమైన బలంగా నిలుస్తాయి. 

 

సహచరులారా,

 

ఒడిశాకు చాలా పెద్ద తీరప్రాంతం ఉంది. ఇక్కడ ఎన్నో ఖనిజ వనరులు, సహజ వనరులు ఉన్నాయి. ఈ వనరులను ఒడిశాకున్న సామర్థ్యంగా మలచాలి. వచ్చే 5 సంవత్సరాలలో రోడ్, రైల్వేల ద్వారా ప్రయాణ సౌకర్యాల్ని పెంచాలి. ఈ రోజు కూడా, ఇక్కడ రైలు రోడ్డు సంబంధిత అనేక ప్రాజెక్టులను ప్రారంభించాం. నేడు నాకు లాంజిగఢ్ రోడ్-అంబోద్లా -డోయికాలూ రైల్వే లైనును దేశానికి అంకితం చేయడం గౌరవంగా ఉంది. లక్ష్మీపూర్ రోడ్- సింగారాం- టిక్రీ రైల్వే

 

లైన్ కూడా నేడు దేశానికి అంకితం చేస్తున్నాం. అలాగే డెంకనాల్ -సదాశివపూర్-హిండోల్ రోడ్ రైల్వే లైన్ కూడా నేడు ప్రారంభమైంది. పరదీప్ నుంచి ప్రయాణ సౌకర్యాల్ని పెంచడానికి ఈ రోజు చాలా పనులు ప్రారంభించాం. నాకు జైపూర్-నవరంగ్‌పూర్ కొత్త రైల్వే లైన్ శంకుస్థాపన చేసే అవకాశం కూడా కలిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఒడిశా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. పూరి నుండి కోణార్క్ రైల్వే లైనుపై కూడా త్వరలోనే వేగంగా పనులు ప్రారంభమవుతాయి. హైటెక్ ‘నమో భారత్ రాపిడ్ రైల్’ కూడా చాలా త్వరలోనే ఒడిశాకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఆధునిక మౌలిక సదుపాయాలు ఒడిశా కోసం కొత్త అవకాశాల మార్గాలను తెరవనున్నాయి.

 

మిత్రులారా,

 

ఈ రోజు సెప్టెంబర్ 17న దేశం హైదరాబాద్ విముక్తి దినోత్సవాన్ని కూడా జరుపుకుంటోంది. స్వతంత్రం తర్వాత మన దేశం ఎదుర్కొన్న పరిస్థితులు, విదేశీ శక్తులు దేశాన్ని అనేక ముక్కలుగా విడదీసేందుకు చేసిన ప్రయత్నాలను, అధికారం కోసం దేశాన్ని ముక్కలు చేసేందుకు అవకాశవాదులు ఎలా సిద్ధమయ్యారో మనం గుర్తు చేసుకోవాలి. అప్పటి పరిస్థితుల్లో సర్దార్ పటేల్ ముందుకు వచ్చి అసాధారణ సంకల్పంతో దేశాన్ని ఏకం చేశారు. హైదరాబాద్‌లో భారత వ్యతిరేక ఛాందసవాద శక్తులను విజయవంతంగా అణిచివేసి, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను విముక్తి చేసారు. అందువల్ల హైదరాబాద్ విముక్తి దివస్, కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, ఇది దేశ సమైఖ్యతకు, దేశం పట్ల మన బాధ్యతలకు ఓ ప్రేరణ అని కూడా చెప్పవచ్చు.

 

సహచరులారా,

 

ఈ ముఖ్యమైన రోజున దేశాన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్న సవాళ్లను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజు మనం గణపతికి వీడ్కోలు పలుకుతున్నప్పుడు, నేను దీనికి సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. గణేష్ ఉత్సవం మన దేశానికి కేవలం విశ్వాసానికి సంబంధించిన పండుగ మాత్రమే కాదు. మన దేశ స్వాతంత్య్రంలో గణేష్ ఉత్సవం కూడా పెద్ద పాత్ర పోషించింది. అప్పట్లో ఆంగ్లేయులు దేశాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తూ, జాతుల పేరిట కొట్లాటలు సృష్టించడం, సమాజంలో ద్వేషం నింపడం ద్వారా 'విభజించి పాలించు' అనే అస్త్రాన్ని వారు ఉపయోగించారు. ఆ సమయంలో లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రజా ఉత్సవాలుగా మార్చి, భారతదేశ ఆత్మను మేలుకొలిపారు. కుల, వర్గ వివక్షకు అతీతంగా ఎదుగుతూ, మన మతం మనం ఏకం కావాలని బోధిస్తుంది, గణేష్ ఉత్సవం దీనికి చిహ్నంగా మారింది. నేటికీ గణేష్ ఉత్సవం జరిగినప్పుడు అందరూ అందులో పాల్గొంటారు. ఎటువంటి తేడా లేకుండా, సమాజం ఒకే శక్తిగా నిలుస్తుంది.

 

సోదర సోదరీమణులారా, 

 

'విభజించి పాలించు' అనే విధానాన్ని అనుసరించిన ఆంగ్లేయులకు అప్పట్లో గణేశ్ ఉత్సవం ఎప్పుడూ ఇబ్బంది పెట్టేది. ఈ రోజుల్లో కూడా, సమాజాన్ని విభజించి, చీల్చడంలో ఇష్టపడే అధికార దాహం గల కొందరికి గణేశ్ పూజ సమస్యగా మారింది. మీరు గమనించి ఉండవచ్చు... కాంగ్రెస్, దాని కూటమి గత కొన్ని రోజులుగా అలజడితో ఉంది. ఎందుకంటే నేను గణపతి పూజలో పాల్గొన్నాను. ఇంకా, వారి ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో, అక్కడ , వీరు మరింత పెద్ద అపరాధం చేశారు. వీళ్ళు ఏకంగా, భగవాన్ గణేశ్ విగ్రహాన్నే జైల్లో పెట్టారు. దేశం మొత్తం ఆ చిత్రాలను చూసి షాక్‌కు గురైంది. ఈ ద్వేషపూరిత ఆలోచన, సమాజంలో విషం నింపే ఈ మానసికత మన దేశానికి చాలా ప్రమాదకరమైనది. అందుకే ఇలాంటి ద్వేషపూరిత శక్తులను మనం ముందుకు వెళ్లనీయకూడదు.

 

మిత్రులారా,

 

కలిసికట్టుగా మనం ఇంకా ఎన్నో పెద్ద విజయాలను సాధించాల్సి ఉంది. మన దేశాన్ని, ఒడిశాను విజయపథంలోకి తీసుకెళ్లాలి. ఒడిశా ప్రజల మద్దతుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. మోదీ ఆశ, భారతదేశం మొత్తం ఒడిశాను ‘బంగారు ఒడిశా ’ అని అనాలి. రాబోయే కాలంలో ఈ అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మరొక్కసారి మీ అందరికి హృదయపూర్వక అభినందనలు. నాతో పాటు చెప్పండి.. 

 

జై జగన్నాథ్!  

 

జై జగన్నాథ్!  

 

జై జగన్నాథ్!  

 

భారత మాతాకీ జై!  

 

భారత మాతాకీ జై!

 

ధన్యవాదాలు.


(Release ID: 2057677) Visitor Counter : 49