ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన/ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం
Posted On:
16 SEP 2024 8:25PM by PIB Hyderabad
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
గుజరాత్ గవర్నర్ ఆచార్య శ్రీ దేవవ్రత్, ప్రజాదరణగల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు సి.ఆర్.పాటిల్, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గవర్నర్లు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులుసహా ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరసోదరీమణులారా!
మీరంతా ఎలా ఉన్నారు? కుశలమే కదా! మీరందరూ ఇవాళ నన్ను మన్నించాలి... ఎందుకంటే- చాలా రాష్ట్రాల నుంచి నా మిత్రులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో నేనిప్పుడు హిందీలో ప్రసంగిస్తాను. ఇక గుజరాత్‌లో హిందీతో సమస్యేమీ లేదని నా భావన... ఏమంటారు?
విఘ్ననాథుడైన గణేశ ఉత్సవాల నేపథ్యంలో యావద్దేశం నేడు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది. ప్రజలందరూ ఇంటింటా గణపతిని ప్రతిష్టించి మనసారా పూజించారు. అలాగే ఈ రోజు మిలాద్-ఉన్-నబీ కూడా. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పుడూ ఏదో ఒక పండుగ చేసుకుంటూనే ఉంటారు. ఈ వేడుకలలో భాగంగా భారత్‌లో ఎక్కడో ఒకచోట సదా ఏదో ఒక ప్రగతి ఉత్సవం సాగుతూనే ఉండటం సర్వసాధారణం. ఆ మేరకు ఇక్కడ నేడు సుమారు ₹8,500 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసుకున్నాం. వీటిలో రైల్వేలు, రహదారులు, మెట్రో సహా ఇతర ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. అయితే, ఇవాళ్టి విశేషం ఏమిటంటే- దేశవ్యాప్త పట్టణ అనుసంధానంలో తాజా మైలురాయి కానున్న ‘నమో రాపిడ్ రైలు’ రూపంలో గుజరాత్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మరోవైపు రాష్ట్రంలో వేలాది కుటుంబాలు నేడు స్వగృహ ప్రవేశం చేస్తున్నాయి. వేలాది కుటుంబాలకు తొలివిడత పక్కా ఇళ్ల నిధులు విడుదలయ్యాయి. ఇకపై మీరంతా మీ కొత్త ఇళ్లలో నవరాత్రి, దసరా, దుర్గాపూజ, ధన్‌తేరస్, దీపావళి వంటి ఎన్నెన్నో పండుగలను ఇదే ఉత్సాహంతో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీ కలలకు రెక్కలు తొడిగే ఇళ్లలోకి ప్రవేశిస్తున్న మీకందరికీ హృదయపూర్వక గృహప్రవేశ శుభాకాంక్షలు. ముఖ్యంగా తమ పేరిట గృహాల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వేలాది మహిళలకు నా ప్రత్యేక అభినందనలు. మొత్తంమీద ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ సాకారం కానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రజలకే కాకుండా దేశంలోని పౌరులందరికీ అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
ఈ ఉత్సాహపూరిత పండుగ వాతావరణం నడుమ నన్నొక సన్నటి వేదన సలుపుతోంది. ఈ ఏడాది ఒక్కసారిగా భారీ వర్షాలు ముంచెత్తడంతో గుజరాత్‌లోని చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి స్వల్ప వ్యవధిలో ఇంత విస్తృత, తీవ్ర వర్షపాతాన్ని మనం చూడాల్సి వచ్చింది. ఏదో ఒకచోట కాకుండా యావత్ గుజరాత్‌లో మూలమూలనా ఈ దుస్థితి ఏర్పడింది. ఫలితంగా మనలో చాలామంది ఆత్మీయులను కోల్పోయారు. ప్రాణ-ఆస్తి నష్టం భారీగా సంభవించింది. బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ ప్రకృతి బీభత్సంలో గాయపడి చికిత్స పొందుతున్న మిత్రులు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
మిత్రులారా!
ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశాక నేను మీతో కలవడానికి తొలిసారి గుజరాత్ వచ్చాను. ఇది నా పురిటిగడ్డ; నాకెన్నో జీవిత పాఠాలు నేర్పిన జన్మభూమి. మీ ప్రేమాభిమానాలు సదా నా మీద వర్షిస్తుంటాయి. ఒక కొడుకు సొంత ఇంటికి వచ్చినపుడు కుటుంబంలోని ఆత్మీయుల ఆశీస్సులతో అతనిలో నవ్యోత్తేజం ఉప్పొంగుతుంది. ఆ స్ఫూర్తితో అతనిలో ఉత్సాహం అవధులెరుగని ఎత్తులకు చేరుతుంది. అందుకే మీరంతా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మిత్రులారా!
నా మీద మీ అంచనాలు ఎలాంటివో నాకు తెలుసు... వివిధ ప్రాంతాల నుంచి నాకు పదేపదే సందేశాలు వస్తుంటాయి. మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించాక నేను వీలైనంత త్వరగా వచ్చి మిమ్మల్ని కలవాలన్నది మీ కోరిక. అది సహజమే! ఎందుకంటే- ఈ దేశంలో 60 ఏళ్ల తర్వాత ప్రజలు ఒక ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఎన్నుకుని చరిత్ర సృష్టించారు. ఆ విధంగా ఓ ప్రభుత్వానికి ప్రజాసేవ చేసే అవకాశం ముచ్చటగా మూడోసారి దక్కింది. భారత ప్రజాస్వామ్యంలో ఇదొక మహాద్భుత సంఘటన. కాబట్టి, ‘‘నరేంద్ర భాయ్ మా వాడు... వెంటనే గుజరాత్ వచ్చి మాకు ఆనందం కలిగించాలి’’ అని గుజరాత్ వాసులంతా కోరుకోవడం సర్వసాధారణం. మీ భావోద్వేగం అత్యంత సమంజసం... కానీ, ‘దేశమే ప్రధానం’ అనే సంకల్పంతో నన్ను ఢిల్లీకి పంపింది మీరే!
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నేను మీకు... అంటే- దేశ ప్రజలకు ఒక హామీ ఇచ్చాను. నా మూడోదఫా పదవీ కాలంలోని తొలి 100 రోజుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటానని వాగ్దానం చేశాను. ఆ హామీ నెరవేర్చేలా ఈ 100 రోజుల్లో ఏ అవకాశాన్నీ చేజారనివ్వకుండా రేయింబవళ్లు శ్రమించాను. నేను దేశంలోనే ఉన్నా విదేశీ పర్యటనకు వెళ్లినా, ఏమేం చేయాలో ప్రతిదీ చేస్తూ వచ్చాను తప్ప దేన్నీ అరకొరగా వదిలిపెట్టింది లేదు. కాబట్టే, గడచిన 100 రోజుల్లో ఎలాంటి శుభ పరిణామాలు చోటుచేసుకున్నాయో మీరంతా చూస్తూనే ఉన్నారు. అయితే, కొందరు మాత్రం నా మాటలను తేలిగ్గా తీసుకున్నారు... రకరకాల వాదప్రతివాదాలతో మోదీని హేళన చేశారు. అదంతా వారికెంతో సంతోషం కలిగించి ఉంటుంది. కానీ, ప్రజలంతా అవాక్కయ్యారు... ఆశ్చర్యపోయారు- ‘‘ఇంత హేళన చేస్తుంటే, అవమానిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు... ఎందుకు మౌనం వహించారు?’’ అనే ప్రశ్నలు మీలో తలెత్తి ఉంటాయి.
అయితే... నా గుజరాత్ సోదరసోదరీమణులారా!
మీరు గుండెల్లో పెట్టుకున్న ఈ మీ బిడ్డ- సర్దార్ పటేల్ పుట్టిన గడ్డమీద జన్మించిన వాడు. అందుకే ప్రతి హాస్యోక్తిని, హేళనను, అవమానాన్ని భరిస్తూ- ఈ 100 రోజులూ సంకల్ప నిబద్ధతతో నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. ఆ మేరకు జాతి ప్రయోజనాలు, ప్రజా సంక్షేమానికి తగిన విధానాల రూపకల్పన, నిర్ణయాల దిశగా సాగిపోయాను. ఈ కాలంలో ‘నా గురించి ఎవరేం మాట్లాడదలిచారో, ఎలా హేళన చేయాలనుకున్నారో అలా చేసుకోనీ’ అని నిర్ణయించుకున్నాను. వాళ్ల ఆనందం వాళ్లది... వదిలేస్తే పోతుందనుకున్నాను. వారెంత రెచ్చగొట్టినా మౌనమే సమాధానంగా మిన్నకుండిపోవాలని నిశ్చయించుకున్నాను. ఎన్ని చలోక్తులు విసురుతారో విసరనీ... ఆ ఎగతాళి, ఆ వెటకారం నన్ను అణుమాత్రమైనా కదిలించజాలదని, దేశ సంక్షేమంపై ఏకాగ్రతతో నా దారిలో నేను దృఢచిత్తంతో సాగిపోవాలని కృతనిశ్చయుడనయ్యాను.
ఇప్పుడు నేనెంతో సంతోషిస్తున్నాను... ఎన్నో రకాల వెటకారాలు సహిస్తూ ఈ 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలన్నీ దేశంలోని ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి, సమాజంలోని ప్రతి వర్గానికి భరోసా ఇవ్వడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. ఈ 100 రోజుల్లో రూ.15 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల సమయంలో పేదల కోసం 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తామని నేను హామీ ఇచ్చాను. ఈ వాగ్దానం శరవేగంగా అమలవుతోంది. ఈ రోజున ప్రస్తుత కార్యక్రమంలో కూడా గుజరాత్‌లోని వేలాది కుటుంబాలకు పక్కా ఇళ్ల తాళాలు అందించాం. నిన్న నేను ఝార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లాను. అక్కడ కూడా వేలాది కుటుంబాలకు పక్కా ఇళ్లు స్వాధీనం చేశాం. గ్రామం, పట్టణమనే తేడా లేకుండా ప్రజలందరికీ మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడమే మా ధ్యేయం. పట్టణ మధ్య తరగతి ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయమైనా, వలస కార్మికులకు సరసమైన కిరాయితో అద్దె గృహవసతి కల్పన అయినా, కర్మాగారాల కార్మికులకు ప్రత్యేక గృహనిర్మాణ పథకాలైనా, దేశవ్యాప్తంగా ఉద్యోగినులకు కొత్త హాస్టళ్ల నిర్మాణమైనా ప్రభుత్వం ఆయా పథకాల కింద రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తోంది.
మిత్రులారా!
కొద్ది రోజుల కిందట పేద-మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాను. ఈ మేరకు దేశంలో 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికీ వార్షికాదాయంతో నిమిత్తం లేకుండా రూ.5 లక్షల రూపాయల దాకా ఉచిత చికిత్సకు నేనిచ్చిన హామీ నెరవేర్చాను. ఇప్పుడిక ఆ కుటుంబాల్లోని కొడుకులు-కూతుళ్లు తమ తల్లిదండ్రుల చికిత్స గురించి ఆందోళన చెందే పరిస్థితి లేదు. ఆ బాధ్యతను ఇకపై ఈ కొడుకు చూసుకుంటాడు!
మిత్రులారా!
ఈ 100 రోజుల్లో యువతకు ఉపాధి-స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి దిశగానూ కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తదనుగుణంగా రూ.2 లక్షల కోట్లతో ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. దీనిద్వారా 4 కోట్ల మంది యువతకు లబ్ధి కలుగుతుంది. ఇప్పుడు ఓ ప్రైవేటు కంపెనీ ఎవరికైనా తొలిసారి ఉద్యోగం ఇస్తే, వారి తొలి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. స్వయం ఉపాధి రంగంలో సరికొత్త విప్లవంతోపాటు పూర్తిగా విజయవంతమైన ‘ముద్ర’ పథకం కింద ఇచ్చే రుణ మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ఈ ఆర్థిక సాయం లోగడ రూ.10 లక్షలు కాగా, ఇప్పుడు 20 లక్షలకు పెరిగింది.
మిత్రులారా!
దేశంలో 3 కోట్ల మంది ‘లక్షాధికారి సోదరీమణుల’ను సృష్టిస్తానని తల్లులు-సోదరీమణులకు నేను హామీ ఇచ్చాను. ఇప్పటికే కొన్నేళ్లుగా కోటి మంది లక్షాధికారులయ్యారు. అయితే, నేను మూడోదఫా అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లోనే గుజరాత్ సహా దేశవ్యాప్తంగా 11 లక్షల కొత్తగా ఈ జాబితాలో చేరారని తెలిస్తే మీరెంతో సంతోషిస్తారని నాకు తెలుసు. ఇక నూనెగింజలు పండించే రైతుల కోసం తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెంచిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కన్నా ఎక్కువగా గిట్టుబాటయ్యేలా చూస్తాం. ఇందులో భాగంగా వంటనూనెల దిగుమతిపై సుంకాలు పెంచాం. సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి పంటలు సాగుచేసే రైతులకు ఈ నిర్ణయంతో ఎంతో మేలు కలుగుతుంది. దీంతో వంటనూనెల రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధం చేసే కార్యక్రమానికి ఊపునిస్తుంది. అలాగే బాస్మతి బియ్యం, ఉల్లిపై ఎగుమతి నిషేధాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది. దీనివల్ల విదేశాల్లో భారతీయ బియ్యం, ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగింది. తద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
మిత్రులారా!
దేశవ్యాప్తంగా రైల్వేలు, రహదారులు, రేవులు, విమానాశ్రయాలు, మెట్రోలకు సంబంధించి గడచిన 100 రోజుల్లో డజన్ల కొద్దీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. వీడియోలో చూపిన తరహాలో ఇది నేటి కార్యక్రమంలోనూ ప్రతిబింబిస్తుంది. గుజరాత్‌లో అనేక అనుసంధాన ప్రాజెక్టులు ప్రారంభం కాగా, మరికొన్నిటికి పునాదిరాయి పడింది. కొద్దిసేపటి కిందటే నేను ‘గిఫ్ట్ సిటీ’ స్టేషన్‌కు మెట్రోలో ప్రయాణించాను. ఈ సందర్భంగా చాలామంది తమ ప్రయాణ అనుభవాన్ని నాతో పంచుకున్నారు. అహ్మదాబాద్ మెట్రో విస్తరణపైనా వారంతా హర్షం ప్రకటించారు. దేశమంతటా అనేక నగరాల్లో మెట్రో సేవల విస్తరణకు ఈ 100 రోజుల్లో నిర్ణయాలు తీసుకున్నాం.
మిత్రులారా!
గుజరాత్‌కు మరో కారణంగానూ ఈ రోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే... అహ్మదాబాద్-భుజ్ మధ్య ‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’ ఇవాళ పరుగు తీయడం ప్రారంభించింది. ఈ రైలుతో నగరాల మధ్య నిత్యం ప్రయాణించే మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, విద్య కార్యకలాపాల్లోగల వారందరికీ ఇదెంతో సౌకర్యాన్నిస్తుంది. భవిష్యత్తులో దేశంలోని అనేక నగరాలు ‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’తో అనుసంధానం అవుతాయి.
మిత్రులారా!
గడచిన 100 రోజుల్లో వందే భారత్ రైళ్ల నెట్‌వర్క్ శరవేగంగా విస్తరించడం అద్భుతం. ఈ మేరకు 15కుపైగా కొత్త మార్గాల్లో ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. అంటే- 15 వారాల్లో సగటున ప్రతి వారం ఓ కొత్త ‘వందే భారత్ రైలు’కు పచ్చజెండా ఊపాం. ఇందులో భాగంగా నిన్ననే ఝార్ఖండ్ నుంచి నేను అనేక రైళ్ల తొలి ప్రయాణానికి శ్రీకారం చుట్టాను. ఇవాళ కూడా నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పుణె, ఆగ్రా కాంట్-బనారస్, దుర్గ్-విశాఖపట్నం, పుణె-హుబ్లీ మార్గాల్లో ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. వారణాసి-న్యూఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ రైలులో ఇప్పుడు 20 పెట్టెలున్నాయి. మొత్తంమీద దేశంలో ఇవాళ 125కుపైగా వందే భారత్ రైళ్లు నిత్యం మెరుగైన ప్రయాణానుభూతితో వేలాది ప్రయాణికులను వేగంగా గమ్యం చేరుస్తున్నాయి.
మిత్రులారా!
గుజరాత్ ప్రజలుగా సమయం విలువ అమూల్యమనే వాస్తవం మాకు బాగా తెలుసు. ఇది మనకు ‘అమృత కాలం’... అంటే భారత్‌కు స్వర్ణ కాలం. రాబోయే 25 ఏళ్లలో మనం దేశాన్ని పురోగమన పథంలో నడపాలి. ఇందులో గుజరాత్ పాత్ర గణనీయం కాగా, రాష్ట్రం తయారీ రంగంలో ఇప్పటికే ప్రధాన కూడలిగా మారుతోంది. దేశంలో మెరుగైన అనుసంధానంగల రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఈ నేపథ్యంలో గుజరాత్‌తోపాటు భారత్‌కు ఈ రాష్ట్రం తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ సి-295 రవాణా విమానం ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. అలాగే సెమీకండక్టర్ మిషన్‌లోనూ గుజరాత్ ముందంజలో ఉండటం అసాధారణం. మరోవైపు ఇక్కడ పెట్రోలియం, ఫోరెన్సిక్స్ లేదా ఆరోగ్యశ్రేయస్సు వంటి రంగాల్లో కొన్ని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఆధునిక పాఠ్యాంశాల అధ్యయనానికి గుజరాత్ అద్భుత అవకాశాలు కల్పించగలదు. వీటితోపాటు విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. సంస్కృతి నుంచి వ్యవసాయం దాకా యావత్ ప్రపంచంలో గుజరాత్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మనం లోగడ ఊహించని పంటలు, ధాన్యాలను గుజరాత్ నేడు విదేశాలకు ఎగుమతి చేస్తోంది. మరి ఇదంతా ఎవరు సుసాధ్యం చేశారు? గుజరాత్‌లో ఈ ప్రగతిశీల పరిణామం తెచ్చిందెవరు?
మిత్రులారా!
ఇదంతా కఠోరంగా శ్రమించే గుజరాత్ ప్రజల ఘనత. ఈ ప్రగతిశీల పరిణామానికి కర్తలు వారే. గుజరాత్ అభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమించిన తరం దాటిపోతోంది. ఇక ఈ మైలురాయి నుంచి నవతరం గుజరాత్‌ను కొత్త శిఖరాలకు చేర్చాలి. ఎర్రకోట పైనుంచి ఇటీవలి ప్రసంగంలో భారత్‌లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతను నేను ప్రస్తావించడం మీకు గుర్తుండే ఉంటుంది. మనం ‘ఎగుమతి నాణ్యత’ అంటున్నామంటే దేశీయంగా ఆ నాణ్యత ఉండదనే అర్థం వస్తుంది. కానీ, ఈ ఆలోచన ధోరణి నుంచి మనం విముక్తం కావాలి. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులకు గుజరాత్ మారుపేరన్న ప్రతిష్టను సముపార్జించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మిత్రులారా!
భారత్ నేడు సరికొత్త సంకల్పాలతో ముందడుగు వేస్తున్న తీరు చూసి, ప్రపంచం మన దేశాన్ని కొనియాడుతోంది. ఇటీవల పలు దేశాల్లో వివిధ కీలక అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం నాకు లభించింది. ఆయా సందర్భాల్లో యావత్ ప్రపంచం భారత్‌ను ఎంతగా గౌరవిస్తున్నదో మీరు కూడా చూసే ఉంటారు. భారత్‌ను, భారతీయులను ప్రతి దేశం ముక్తకంఠంతో స్వాగతిస్తోంది. భారత్‌తో సత్సంబంధాలకు అన్ని దేశాలూ ఆసక్తి చూపుతున్నాయి. ఎక్కడైనా సంక్షోభం లేదా సమస్య ఉన్నపుడు ఆపన్న హస్తం కోసం ప్రజలు భారత్‌వైపే చూస్తారు. భారత్ ప్రజలు మూడోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తీరు, దేశం శరవేగంగా పురోమిస్తున్న తీరు మనపై ప్రపంచం అంచనాలను మరింత పెంచాయి. మాపై 140 కోట్ల మంది పౌరుల చెక్కుచెదరని నమ్మకమే నన్ను సగర్వంగా నిలబెట్టింది. మన దేశం శక్తిసామర్థ్యాలపై ప్రపంచానికి భరోసా ఇచ్చింది. భారత్‌పై అంతర్జాతీయంగా ఇనుమడిస్తున్న విశ్వాసం మన రైతులకు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నమ్మకం పెరిగేకొద్దీ నిపుణులైన మన యువతకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఎగుమతులు పెరగడంతోపాటు దేశంలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ను తమ గమ్యంగా ఎంచుకుంటారు.
సోదరసోదరీమణులారా!
భారతీయులంతా ఒకవైపు దేశానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలని కోరుకుంటూనే దేశ సామర్థ్యం పెంచడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు గుండెలనిండా ప్రతికూల భావనగల కొందరు దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా దేశ సమైక్యతపై దాడి చేస్తున్నారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా 500కుపైగా సంస్థానాలను విలీనం చేశారు. అయితే, నేడు అధికార దాహంతో కొందరు వ్యక్తులు భారత్‌ను ముక్కలు చేయాలని చూస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి ప్రవేశపెడతామని వీరిప్పుడు చెబుతుండటం మీరు వినే ఉంటారు. అంటే- అక్కడ రెండు రాజ్యాంగాలు-రెండు చట్టాల పాలన విధానాన్ని మళ్లీ తేవాలన్నది వారి ప్రయత్నం. ఆ మేరకు కొన్ని వర్గాలను బుజ్జగించడంలో ఎంతకైనా తెగించడానికి సిద్ధమయ్యారు. ద్వేషభావన నిండిన ఈ వ్యక్తులు భారత్ పరువు తీయడంలో ఏ అవకాశాన్నీ విడవడం లేదు. వారు గుజరాత్‌ను కూడా నిరంతరం లక్ష్యం చేసుకుంటున్నారు. కాబట్టి, రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తతతో ఇలాంటి వ్యక్తులపై నిఘాపెట్టాలి.
మిత్రులారా!
దేశం ‘వికసిత భారత్’గా రూపొందే క్రమంలో ఇటువంటి శక్తులను భారత్ తిప్పికొడుతుంది. భారత్ ఇక వెనుదిరిగి చూసుకునే పరిస్థితి లేదు. మనం దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ ప్రతి భారతీయుడికీ గౌరవప్రదమైన జీవితాన్నిచ్చేందుకు కృషి చేయాలి. ఈ విషయంలోనూ గుజరాత్ అగ్రభాగాన ఉంటుందని నాకు తెలుసు. మనం నిర్విరామ కృషితో ప్రతి లక్ష్యాన్నీ సాధించగలం. మీరు నాకిస్తున్న ఉత్సాహం, ఆశీస్సులు నాలో కొత్త శక్తి నింపుతున్నాయి. ఈ మేరకు మరింత స్ఫూర్తితో జీవిస్తాను... నా జీవితంలో అనుక్షణం మీ కోసం.. మీ కలల సాకారం కోసం అంకితం చేస్తాను. మీ అందరి శ్రేయస్సు.. విజయం.. సంకల్ప సిద్ధి తప్ప నాకు మరే ఆకాంక్ష, ఆశయం లేవు. భారత ప్రజలైన మీరే నా ఆరాధ్యదైవాలు. మీ సేవకు నా జీవితాన్ని అంకితం చేసి, మీ ఆరాధనలో నన్ను నేను సమర్పించుకోవాలన్నది నా నిర్ణయం. అందుకే మిత్రులారా! నా జీవితం మీ కోసమే... నా పోరాటం మీ కోసమే... నా సర్వస్వం మీ సేవకే... నన్ను ఆశీర్వదించండి. కోట్లాది ప్రజల ఆశీస్సులతో 140 కోట్ల మంది భారతీయుల కలల సాకారం దిశగా నేను సరికొత్త విశ్వాసం, ఉత్సాహం, ధైర్యంతో జీవిస్తాను. నాపై అసమాన ప్రేమాదరాలతో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. నేను చాలా కాలం తర్వాత నిన్న గుజరాత్‌కు వచ్చాను. అయినప్పటికీ, మీ ప్రేమాభిమానాలు అపారం... అందుకే నా సంకల్పం మరింత దృఢంగా మారింది. కొత్త ప్రణాళికలు, కొత్త సౌకర్యాలు, కొత్త అవకాశాలు కలిసివస్తున్న నేపథ్యంలో మీకందరికీ మరోసారి నా అభినందనలు.
ఇప్పుడు నాతో గళం కలపండి... ‘భారత్ మాతా కీ జై!’ పిడికిళ్లు బిగించి రెండు చేతులూ పైకెత్తి దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా నినదించండి...
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
అనేకానేక ధన్యవాదాలు
***
(Release ID: 2057126)
|