సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 4.0లో సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ


ఈ ప్రచార ఉద్యమం స్వచ్ఛతను పెంచడంతో పాటు, అపరిష్కృత అంశాలపై అక్టోబరు
2-31 వరకు దృష్టి

Posted On: 19 SEP 2024 9:31AM by PIB Hyderabad

ప్రభుత్వంలో పరిష్కారం కాకుండా మిగిలివున్న అంశాలను కనీస స్థాయికి తీసుకు రావడంతో పాటు, స్వచ్ఛతను వ్యవస్థలో ఓ భాగంగా పాటిస్తూ ఉండాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి ప్రేరణను పొందిన సమాచార-ప్రసార శాఖ తన క్షేత్ర స్థాయి కార్యాలయాలతో పాటు అక్టోబరు 2-31వరకు ప్రత్యేక ప్రచారం 4.0లో పాల్గొనడానికి సన్నద్ధం అవుతోంది.  ఆ కాలంలో ఉత్తమ పద్ధతులను అనుసరిస్తూ స్వచ్ఛతను పెంచడం, దీర్ఘకాలంగా ఎక్కడివక్కడే మిగిలిపోయి ఉన్నటువంటి అంశాలను పరిష్కరించడం, కార్యాలయ భవనాల్లోని స్థలాలను మెరుగైన విధంగా ఉపయోగించుకొంటూ ఉండడంతో పాటు వివిధ వార్తాప్రసార మాధ్యమాల అండదండలతో ప్రజలలో చైతన్యాన్ని  ప్రోత్సహించడంపైన సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ శ్రద్ధ తీసుకోనుంది.

సమాచార- ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఈ నెల 6న ప్రసార మాధ్యమాల ముఖ్య అధికారులందరితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.  స్వచ్ఛత ప్రధాన కార్యక్రమాల నిర్వహణకు, పెండింగు పడ్డ అంశాలను చక్కబెట్టడానికి ఉద్దేశించిన ‘స్పెషల్ క్యాంపెయిన్ 4.0’  కు సంబంధించిన సన్నాహక చర్యలు ఎంతవరకు పురోగమించిందీ ఈ సమావేశంలో చర్చించారు. సంపూర్ణ ప్రభుత్వ దృక్పథంతో దేశవ్యాప్తంగా వేరు వేరు కార్యక్రమాలకు తగినంతగా ప్రచారాన్ని కల్పించడం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

స్పెషల్ క్యాంపెయిన్ 3.0

సమాచార-ప్రసార శాఖ ‘స్పెషల్  క్యాంపెయిన్ 3.0’ లో భారీ సఫలతను సాధించింది.  మొత్తం 1013 అవుట్ డోర్ క్యాంపెయిన్స్‌ నిర్వహించారు.  అంతేకాకుండా 1972 స్థలాలను గుర్తించి, వాటిని శుభ్రం చేశారు.  28,574 ఫైల్స్‌ ను వాటి అవసరం లేదని తెలుసుకొని, వాటిని వాటిని తీసి పారేశారు.  2.01 లక్షల కిలోల తుక్కును వదలించుకోవడంతో, రూ.3.62 కోట్ల ఆదాయం వచ్చింది.  ఈ మంత్రిత్వ శాఖ సార్వజనిక ఫిర్యాదులను పరిష్కరించడం, సిపిజిఆర్ఎఎమ్ఎస్  లో భాగంగా వచ్చిన సార్వజనిక ఫిర్యాదు దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు ఇతర కార్యసాధనలలో కూడా పెట్టుకొన్న లక్ష్యాన్ని 100 శాతం సాధించింది.

నవంబరు 2023 -ఆగస్టు 2024 మధ్యకాలంలో కార్యసాధనలు

పైన ప్రస్తావించిన కాలంలో,  స్వచ్ఛతను క్రమం తప్పక పాటిస్తూ ఉండాలన్న ప్రణాళికను పక్కాగా అనుసరించడంలోను, పెండింగు అంశాలను పరిష్కరించడంలోను సమాన చొరవను సమాచార - ప్రసార శాఖ కనబరచింది.

ఈ కాలంలో మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యసాధనలు ఈ కింది విధంగా ఉన్నాయి:

తుక్కును వదలించుకొనే ప్రక్రియలో రూ.1.76 కోట్ల ఆదాయం లభించింది.
మొత్తం 1.47 లక్షల కిలోల తుక్కును వదలించుకొన్నారు.
18,520 ఫైళ్లను నిరుపయోగమైనవిగా గుర్తించి, వాటిని తొలగించారు.
110 వాహనాలను ఇక మీదట ఉపయోగించ వద్దని నిర్ణయించారు.
2,422 స్థలాలను శుభ్రపరిచారు.
మొత్తం మీద 33,546 చదరపు అడుగుల స్థలాన్ని పునరుపయోగానికి వీలుగా ఖాళీ చేశారు.
మొత్తం 1,345 అవుట్ డోర్ క్యాంపెయిన్స్ ను నిర్వహించారు.
మంత్రిత్వ శాఖకు అందిన సార్వజనిక ఫిర్యాదులలో 3,044 ఫిర్యాదులను, 737 వినతులను పరిష్కరించారు.

 

****


(Release ID: 2056549) Visitor Counter : 58