ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి అధ్యక్షతన సెమీకండక్టర్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశం


డిజిటల్ యుగానికి మూలం సెమీకండక్టర్: ప్రధాని

'ప్రజాస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం మానవాళి సంక్షేమాన్ని నిర్ధారిస్తాయి'

వైవిధ్యమైన సెమీకండక్టర్ల సరఫరాలో విశ్వసనీయ భాగస్వామిగా మారే సామర్థ్యం భారత్‌కు ఉందన్న ప్రధాని

స్థిర విధాన పద్దతిని ప్రభుత్వం అనుసరిస్తుందన్న ప్రధాని

భారత్ కేంద్రంగా సెమీకండక్టర్ పరిశ్రమ మారడం పట్ల, పరిశ్రమకు అనుకూల వాతావరణం పట్ల అభినందనలు తెలిపిన సీఈఓలు

వ్యాపార వాతావరణంపై విశ్వాసం, పెట్టుబడులకు భారత్ అనువైన ప్రదేశం: పరిశ్రమ ఏకాభిప్రాయాన్ని తెలిపిన సీఈఓలు

ప్రస్తుతం భారత్‌లో ఉన్న అపార అవకాశాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదన్న సీఈఓలు

Posted On: 10 SEP 2024 8:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయన నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో సెమీకండక్టర్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ, సెమీకండక్టర్ ఎగ్జిక్యూటివ్ ల ఆలోచనలు వ్యాపారాన్నే కాకుండా భారత భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. రాబోయే కాలం సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తుందని, సెమీకండక్టర్లు డిజిటల్ యుగానికి పునాది అని అన్నారు. ఈ పరిశ్రమ ప్రాథమిక అవసరాలకు కూడా ఆధారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు.

ప్రజాస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం కలిసి మానవాళి సంక్షేమాన్ని నిర్ధారిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. సెమీకండక్టర్ రంగంలో భారత్, తన ప్రపంచ బాధ్యతను గుర్తిస్తూ ఈ మార్గంలో ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు.

సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమ్మిళితాభివృద్ధికి ఊతమివ్వడం, తయారీ, ఆవిష్కరణలలో పెట్టుబడులను ఆకర్షించడం వంటి అభివృద్ధి మూలస్తంభాల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వైవిధ్యమైన సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో  విశ్వసనీయ భాగస్వామిగా మారే సామర్థ్యం దేశానికి ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ ప్రతిభాపాటవాలు గురించి ప్రధాని  ప్రస్తావిస్తూ... సెమీకండక్టర్ పరిశ్రమకు సుశిక్షితులైన నైపుణ్య శక్తి అందుబాటులో ఉండేలా నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం అధిక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి సారించిందన్నారు. హైటెక్ మౌలిక సదూపాయాల పెట్టుబడులు పెట్టడానికి భారత్ గొప్ప మార్కెట్ అని అన్నారు. నేడు సెమీకండక్టర్ రంగ ప్రతినిధులు చూపుతున్న ఉత్సాహం ఈ రంగం కోసం ప్రభుత్వం మరింత కష్టపడేలా ప్రేరేపిస్తుందని ప్రధాని అన్నారు.

అంచనా వేయగల, స్థిరమైన విధాన నిర్ణయాలను భారత్ అనుసరిస్తుందని సంస్థల ప్రతినిధులకు ప్రధాని హామీ ఇచ్చారు. దేశం మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్‌లపై దృష్టి సారించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

సెమీకండక్టర్ రంగ వృద్ధి పట్ల దేశానికి ఉన్న నిబద్ధతను సీఈఓలు ప్రశంసించారు. నేడు జరిగిన పరిణామాలు అపూర్వమైనవని.., ఇందులో  సెమీకండక్టర్ రంగానికి చెందిన ప్రతినిధులందరిని ఒకే వేదిక మీదకు  తీసుకురావడం గొప్ప విషయం అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమ అపారమైన వృద్ధి, భవిష్యత్తు గురించి వారు మాట్లాడారు. సెమీకండక్టర్ పరిశ్రమ భారత్ కేంద్రంగా మారడం ప్రారంభించిందని..., ఈ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన పరిశ్రమలకు దేశంలో ఇప్పుడు అనువైన వాతావరణం ఉందని వారు పేర్కొన్నారు. భారతదేశానికి ఏది మంచిదో అది ప్రపంచానికి మంచిదని వారు తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు, సెమీకండక్టర్ రంగ ముడి పదార్థాలలో ప్రపంచ శక్తి కేంద్రంగా మారడానికి భారత్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉందని అన్నారు.

దేశంలో ఉన్న అనుకూల వ్యాపార వాతావరణాన్ని వారు ఈ సందర్భంగా ప్రశంసించారు. సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్ సుస్థిరంగా ఉందని చెప్పారు. భారత్ సామర్థ్యంపై తమకు అపారమైన నమ్మకం ఉందని, పెట్టుబడులు పెట్టడానికి దేశం అనువైన ప్రదేశం అని, పరిశ్రమలో ఏకాభిప్రాయం ఉందని వారు ఉద్ఘాటించారు. గతంలో కూడా ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేడు భారత్‌లో ఉన్న అపార అవకాశాలను గతంలో ఎన్నడూ చూడలేదని, భారత్‌తో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని అన్నారు.

ఈ సమావేశంలో ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్ల సంస్థలైన సెమీ, మైక్రాన్, ఎన్ఎక్స్‌పి, పిఎస్ఎంసి, ఐఎంఇసి, రెనెసాస్, టిఈపిఎల్, టోక్యో ఎలక్ట్రాన్ లిమిటెడ్, టవర్, సినాప్సిస్, కాడెన్స్, రాపిడస్, జాకబ్స్, జెఎస్ఆర్, ఇన్ఫినియోన్, అడ్వాంటెస్ట్, టెరాడైన్, అప్లైడ్ మెటీరియల్స్, లామ్ రీసెర్చ్, మెర్క్, సీజీ పవర్, కైనెస్ టెక్నాలజీల సీఈవోలు, అధిపతులు, ప్రతినిధులు పాల్గొన్నారు. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో, ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


 

***


(Release ID: 2053738) Visitor Counter : 53