హోం మంత్రిత్వ శాఖ

అధికార భాష పార్ల‌మెంట‌రీ క‌మిటీ అధ్య‌క్షునిగా కేంద్ర హోం, స‌హ‌కార‌శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తిరిగి ఏక‌గ్రీవ ఎన్నిక

హిందీ భాష‌ను ప్రాంతీయ భాష‌ల‌ హితంగా త‌యారు చేయాల‌నే ల‌క్ష్యంతో మ‌నంద‌రం కృషి చేయాలి: శ్రీ షా

ఏ ప్రాంతీయ భాష‌తోనూ పోటీప‌డ‌కుండా, హిందీ భాషకు ఆద‌ర‌ణ‌ పెంచాలి: శ్రీ అమిత్ షా

వివిధ భాషల పదాలను హిందీలోకి చేర్చి, హిందీని సుసంపన్నం చేసి, మరింత సరళంగా మార్చిన శ్రీ మోదీ ప్ర‌భుత్వం

దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలన్నీ 2047 నాటికి భారతీయ భాషల్లోనే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాల‌నే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం : శ్రీ అమిత్ షా

పిల్ల‌ల ప్రాథమిక విద్యాబోధ‌న‌ మాతృభాష‌లో సాగితే వారు ఇత‌ర భార‌తీయ భాష‌ల‌ను సులువుగా నేర్చుకుంటారు: శ్రీ అమిత్ షా

1000 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన‌ భాషకు కొత్త జీవం పోసి, ఆదరణ పెంచి, స్వాతంత్య్ర ఉద్యమ దార్శనికుల కలను నెరవేర్చాలి : శ్రీ అమిత్ షా

Posted On: 09 SEP 2024 8:19PM by PIB Hyderabad

అధికార భాషా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా కేంద్ర హోం, సహకార శాఖ‌ల‌ మంత్రి శ్రీ అమిత్ షా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అధికార భాషపై పార్లమెంటరీ కమిటీని పునర్నిర్మించేందుకు న్యూఢిల్లీలో కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో శ్రీ అమిత్ షా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శ్రీ అమిత్ షా 2019 నుంచి 2024 వరకు ఈ కమిటీకి అధ్య‌క్షునిగా పనిచేశారు. తనను మళ్లీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అధికార భాష పార్లమెంటరీ కమిటీ సభ్యులందరికీ కేంద్ర హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన‌ హోంమంత్రి , గత 75 సంవత్సరాలుగా  అధికార భాషను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని, అయితే గత 10 సంవత్సరాలలో ఆ కృషి చేసే ప‌ద్ధ‌తిలో కొంచెం మార్పు వచ్చిందని అన్నారు. హిందీని అధికార భాషగా అంగీకరించాలంటే , ప్రభుత్వ కార్య‌క్ర‌మాల్లో ప్రోత్సహించాలంటే  హిందీ భాష‌ స్థానిక భాషల‌తో పోటీ పడకూడదని  శ్రీ కేఎం మున్షీ,  శ్రీ  ఎన్జీ అయ్యంగార్ నిర్ణయించారని తెలిపారు. ప‌లువురితో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాత‌నే వారు ఆ నిర్ణ‌యం ప్ర‌క‌టించార‌ని హోంమంత్రి వివ‌రించారు.

 శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, గ‌త ప‌దేళ్ల‌లో హిందీ భాష అన్ని స్థానిక భాషల స్నేహితునిగా మారడానికి వీలుగా కమిటీ నిరంతరం కృషి చేసింద‌ని, హిందీ  ఏ భాష‌కూ పోటీ కాద‌ని  శ్రీ అమిత్ షా అన్నారు.  స్థానిక భాష మాట్లాడేవారు ఎవ‌రికైనా స‌రే న్యూనతా భావాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయ‌న సూచించారు. హిందీ భాష‌ను అంద‌రి ఏకాభిప్రాయం, అంగీకారంతో అధికార‌ భాషగా అంగీకరించాలని అన్నారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన త‌ర్వాత‌  దేశ భాషలోనే పాలన జరగడం చాలా ముఖ్యమని, ఈ విషయంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేశామని కేంద్ర హోంమంత్రి ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. శబ్దకోష్‌ని సృష్టించామని, విద్యాశాఖ సహకారంతో స్థానిక భాషల నుంచి  హిందీలోకి  వేలాది పదాలను తీసుకొచ్చామ‌ని ఆయన తెలిపారు. హిందీలో పర్యాయపదాలు అందుబాటులో లేని పదాలు చాలా ఉన్నాయని ఆయ‌న అన్నారు. అయితే ఇతర భాషల నుంచి చాలా పదాలను హిందీభాష‌లోకి తీసుకోవ‌డం ద్వారా, హిందీని సుసంపన్నం, సుల‌భ‌త‌రం చేయడమే కాకుండా, ఆయా ప్రాంతీయ భాష‌ల‌కు,  హిందీ మధ్య సంబంధాన్ని బలోపేతం చేశామ‌ని ఆయ‌న అన్నారు.

సాంకేతిక ప్రాతిపదికన, 8వ షెడ్యూల్‌లోని అన్ని భాషలను త‌నంత‌తానుగా(ఆటోమేటిగ్గా) అనువదించే సాఫ్ట్‌వేర్‌ను అధికార భాషా శాఖ అభివృద్ధి చేస్తోందని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ పని పూర్తయిన తర్వాత, హిందీ అంద‌రి ఆమోదం పొందుతుందని ,ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో వినియోగ వేగం పెరుగుతుంద‌ని హోం మంత్రి వివ‌రించారు.  గత 5 ఏళ్లలో ఎంతో కష్టపడి ప‌ని చేయ‌డం జ‌రిగింద‌ని , గతంలో ఎన్నడూ లేనివిధంగా క‌మిటీ త‌యారు చేసిన‌ మూడు పెద్ద సంపుటాల నివేదికను రాష్ట్రపతికి ఇచ్చామని తెలిపారు. ఈ వేగాన్ని  కొనసాగించాలని హోంమంత్రి అన్నారు.

 మ‌నం చేస్తున్న కృషికి సహకారం, ఆమోదం అనేవి రెండు ప్రాథమిక పునాదులు కావాలని కేంద్ర హోం మంత్రి అన్నారు. 2047లో నిర్వ‌హించే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి మన దేశ పాల‌నా కార్యక్ర‌మాలన్నీ భారతీయ భాషల్లో నిర్వ‌హించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగాలన్నారు.  1000 ఏళ్ల చరిత్ర ఉన్న హిందీ భాషకు నూత‌న అస్థిత్వాన్ని అందించాలని, హిందీ భాష‌ను అంద‌రూ ఆమోదించేలా చూడాల‌ని, స్వాతంత్య్ర సమరయోధులు మిగిల్చిన కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు అంద‌ర‌మూ కృషి చేయాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.

1000 సంవత్సరాల నాటి హిందీ భాషకు నూత‌న అస్థిత్వం క‌ల్పించి, ఆదరణ పెంచి, స్వాతంత్య్ర ఉద్యమ దార్శనికుల కలను నెరవేర్చాలని హోంమంత్రి అన్నారు. శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్రీ లోకమాన్య తిలక్, మహాత్మాగాంధీ, శ్రీ లాలా లజపతిరాయ్, శ్రీ సి.రాజగోపాలాచారి,  శ్రీ కేఎం మున్షీ,  శ్రీ సర్దార్ పటేల్ వంటి స్వాతంత్య్ర సమరయోధులు  హిందీ మాట్లాడని రాష్ట్రాల నుంచి వ‌చ్చార‌ని , అయితే వారందరూ మన దేశంలో రాష్ట్రాల‌ మధ్య కమ్యూనికేషన్ మాధ్యమంగా పనిచేసే ఒక‌ భాష ఉండాలి అనే విషయాన్ని గ్రహించారని హోం మంత్రి అన్నారు. . అందుకే ప్రధాని శ్రీ న‌రేంద్ర‌ మోదీ తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో పిల్లల ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని ప్ర‌త్యేకంగా నిర్ణ‌యించిన‌ట్టు హోం మంత్రి తెలిపారు.పిల్లలు త‌మ మాతృభాషను నేర్చుకున్నప్పుడు, వారు దేశంలోని అనేక భాషలతో కనెక్ట్ అవుతార‌ని శ్రీ అమిత్ షా వివ‌రించారు.


మున్షీ-అయ్యంగార్ కమిటీ ఆధ్వర్యంలో  ప్రతి 5 సంవత్సరాలకు ఒక భాషా కమిషన్ ఏర్పాటు చేయాలని , ఆ క‌మిటీ భాషా వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించార‌ని,  అయితే ఆ విష‌యాన్ని మ‌రిచిపోయామ‌ని శ్రీ అమిత్ షా అన్నారు. ఏ భారతీయ భాషతోనూ పోటీ పడకుండా హిందీకి ఆదరణ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హిందీ భాష‌ ఇప్పుడు ఉపాధి, సాంకేతికతతో ముడిపడి ఉందని, ఆధునిక‌ సాంకేతికతలను హిందీ భాషతో అనుసంధానించడానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని హోం మంత్రి అన్నారు.  కొత్త విద్యా విధానంలో అన్ని మాతృభాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేశామని, ఈ విధానాన్ని ఈ కమిటీ మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆయ‌న అన్నారు. హిందీని అధికార భాషగా ఆమోదించి ఇది 75వ సంవత్సరమని, ఈ సందర్భంగా ఢిల్లీలోని భారత మండపంలో భారీ సదస్సును నిర్వహిస్తున్నామని శ్రీ అమిత్ షా తెలిపారు.  అధికార భాషల చట్టం, 1963, సెక్షన్ 4లోని నిబంధనల ప్రకారం అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ 1976లో ఏర్పాటైంది. ఈ కమిటీలో 30 మంది పార్లమెంటు సభ్యులు వుంటారు. అందులో 20 మంది లోక్‌సభ సభ్యులు కాగా,  మిగ‌తా 10 మంది రాజ్యసభ సభ్యులు.
 
పార్ల‌మెంట‌రీ క‌మిటీలో స‌భ్యులుగా నూత‌నంగా నియ‌మితులైన రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌స‌భ్యులు కూడా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట‌రీ క‌మిటీ అధికారుల‌తోపాటు, కార్య‌ద‌ర్శి శ్రీమ‌తి అన్షూలి ఆర్య నేతృత్వంలో అధికార భాష విభాగం అధికారులు కూడా ఈ స‌మావేశానికి హాజ‌రయ్యారు.

 

*****



(Release ID: 2053418) Visitor Counter : 9