ప్రధాన మంత్రి కార్యాలయం

బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియాతో ప్రధాన మంత్రి సమావేశం

Posted On: 04 SEP 2024 12:11PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఈ రోజున బందర్ సెరీ బెగవాన్ లోని ఇస్తానా నూరుల్ ఇమాన్  కు చేరుకున్నారు.  అక్కడ బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియా ప్రధాన మంత్రి కి స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు.

ఆయనకు ప్రధాన మంత్రి  ధన్యవాదాలు  తెలియజేస్తూ, భారత ప్రభుత్వ అధినేత ఒకరు బ్రూనై కి మొట్టమొదటిసారిగా ద్వైపాక్షిక పర్యటనకు రావడం ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రోత్సహించాలన్న భారత్ దృక్పథానికి అద్దం పడుతోందన్నారు.  భారత్   అనుసరిస్తున్న, ఇటీవలే పదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని పటిష్ట పరచడం కోసం భారత్ కనబరుస్తున్న నిబద్ధతకు అనుగుణంగా తన ఈ పర్యటన ఉందని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రకటించారు.  ద్వైపాక్షిక సంబంధాలను ఇప్పటి కన్నా ఎక్కువ భాగస్వామ్య స్థాయి కి తీసుకుపోతుండడాన్ని ఇద్దరు నేతలు ఆహ్వానించారు.  వారు రక్షణ, వ్యాపారం - పెట్టుబడి, ఆహార భద్రత, విద్య, శక్తి, అంతరిక్ష సంబంధిత సాంకేతిక విజ్ఞానం, ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, సంస్కృతిలతో పాటు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర ఆదాన ప్రదానాలు సహా అనేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఐసిటి, ఫిన్‌టెక్, సైబర్ రంగ భద్రత, నూతన సాంకేతికతలు, కొత్తగా రూపుదాల్చుతున్న సాంకేతికతలతో పాటు నవీకరణయోగ్య శక్తి వంటి రంగాలలో సహకారానికి గల అవకాశాలను వెతికి, ఆ దిశలో ముందుకు పోవడానికి వారు తమ అంగీకారాన్నితెలిపారు.  ప్రాంతీయ అంశాల పైన, ప్రపంచ అంశాల పైన ప్రధాన మంత్రి, సుల్తాన్ లు వారి వారి అభిప్రాయాలను ఒకరికి మరొకరు తెలియజెప్పుకొన్నారు.    ఉగ్రవాదం తాలూకు అన్ని రూపాలను, అభివ్యక్తీకరణలను నేతలు ఇద్దరు ఖండించారు.  ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించవద్దు, దానిని రూపుమాపాలంటూ దేశాలకు పిలుపును ఇచ్చారు.  ఆసియాన్ - భారత్  విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలపరచడం కోసం పరస్పరం ప్రయోజనకర రంగాల్లో కలిసికట్టుగా పని చేద్దామన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.  ఆసియాన్ సెంటర్ ఫర్ క్లయిమేట్ చేంజ్ కు ఆతిథ్యాన్ని ఇవ్వడంలోబ్రూనై దారుస్సలామ్ ప్రయాసలలో భారత్ తోడ్పడినందుకు భారత్ ను సుల్తాన్  ప్రశంసించారు.

ఉపగ్రహం, వాహక నౌకల కోసం టెలిమెట్రి, ట్రాకింగ్ లతో పాటు టెలికమాండ్ స్టేషన్ నిర్వహణలో సహకారానికి సంబంధించిన అంశంపై అవగాహన పూర్వక ఒప్పంద పత్రాల (ఎంఒయు)పై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్, బ్రూనై రవాణా, ఇన్ఫోకమ్యూనికేషన్స్ శాఖ మంత్రి శ్రీ పెంగిరన్ దాతో శంహరీ పెంగిరన్ దాతో ముస్తఫా లు సంతకాలు పెట్టి వాటిని ఒకరికి మరొకరు ఇచ్చి పుచ్చుకోవడాన్ని నేతలు ఇద్దరు తిలకించారు.  బందర్ సెరీ బెగావాన్ కు, చెన్నై కి మధ్య నేరుగా నడిచే విమాన సర్వీసు త్వరలోనే మొదలు కానున్న విషయాన్ని నేతలు స్వాగతించారు. చర్చలు ముగిసిన తరువాత ఒక సంయుక్త ప్రకటన ను ఆమోదించారు.

ప్రధాన మంత్రి గౌరవార్థం ఆధికారిక మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని సుల్తాన్  ఏర్పాటు చేశారు.

నేతలు ఇద్దరి మధ్య ఈ రోజు జరిగిన చర్చలు భారత్  - బ్రూనై  ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచనున్నాయి. భారత్ ను సందర్శించాల్సిందిగా సుల్తాన్ ను   ప్రధాన మంత్రి ఆహ్వానించారు.  ప్రధాన మంత్రి చరిత్రాత్మక పర్యటన భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’తో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల భారతదేశం దార్శనికత సంబంధిత కార్యాచరణను మరింత ప్రోత్సహించనుంది.



(Release ID: 2051876) Visitor Counter : 13