అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav g20-india-2023

2040లో అంటే మరో 15 ఏళ్లలో భారతీయుడు చంద్రుడిపై అడుగు పెడతాడు: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


జాబిల్లిపై చంద్రయాన్-3 దిగిన చరిత్రాత్మక సందర్భంగా, తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం



తారస్థాయిలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ, వచ్చే దశాబ్దానికి 44 బిలియన్ డాలర్లు: సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్



2040 నాటికి సొంత స్పేస్ స్టేషన్, చంద్రునిపై అడుగుపెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న భారత్



జాతీయ అంతరిక్ష దినోత్సవం: ఆరు దశాబ్దాల అంతరిక్ష విజయాలను వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 23 AUG 2024 3:40PM by PIB Hyderabad

తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, అణుశక్తి శాఖ సహాయ మంత్రి, అంతరిక్ష, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ  2040లో అంటే రానున్న పదిహేనేళ్లలో భారతీయుడు చంద్రుడిపై అడుగు పెట్టనున్నట్లు తెలిపారు.
 

దిల్లీలోని భారత్ మండపం వేదికగా గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో డాక్టర్ జితేంద్ర సింగ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సాధించిన అసాధారణ విజయాలను, దేశ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు.

చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన చరిత్రాత్మక సందర్భం ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిందనీ, అంతరిక్ష అన్వేషణలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిందనీ డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

23 ఆగస్టు 2023న దేశవ్యాప్తంగా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని, చంద్రయాన్-3 జాబిల్లిపై దిగిన ప్రాంతానికి 'శివశక్తి పాయింట్' అని నామకరణం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘‘జాబిల్లిని తాకడం, మనసుల్ని తాకడం- భారత అంతరిక్ష ప్రయాణ గాథ' అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు.

గత ఆరు దశాబ్దాల్లో భారతదేశం- పౌరుల మనస్సును గెలుచుకోవడంతోపాటు చంద్రుడిని కూడా చేరుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విజయవంతమైన మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆస్ట్రోశాట్, చంద్రయాన్ -2, చంద్రయాన్ -3 ప్రయోగం, రాబోయే ఆదిత్య-ఎల్ 1 సోలార్ మిషన్, ఎక్స్ రే ఖగోళ మిషన్ అయిన ఎక్స్ పోశాట్ తో సహా గత దశాబ్దంలో సాధించిన గణనీయమైన పురోగతిని మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.

55 ఏళ్ల కిందట 1969లో అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన సమయంలో భారత్ తన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిందని జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించడానికి కారణమైన శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఆయన కొనియాడారు.

శాస్త్రీయ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి, భారతదేశ శాస్త్రీయ సమాజపు సామర్థ్యాన్ని వెలికితీయడానికి 2014 నుండి ప్రధాని మోదీ అందించిన విధానపరమైన మద్దతు, నాయకత్వాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించిన తర్వాత అంతరిక్ష అంకురాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దాదాపు 300కు చేరువలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే దశాబ్దంలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 8 బిలియన్ డాలర్ల నుంచి 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పిన అంచనాలను ఆయన ప్రస్తావించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగాన్ని బంధనాల నుంచి విముక్తం చేసి ప్రజలకు మరింత చేరువయ్యేలా చేశారని డా. జితేంద్ర సింగ్ అన్నారు. శ్రీహరికోటలో చంద్రయాన్ -3 ప్రయోగాన్ని 5 వేల మందికి పైగా ప్రేక్షకులు, దాదాపు వేయి మంది మీడియా సిబ్బంది ప్రత్యక్షంగా వీక్షించడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

స్పేస్ విజన్ 2047లో భాగంగా, 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) ప్రారంభం, 2040 నాటికి భారతీయ వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టడం ఉంటాయని డా. జితేంద్ర సింగ్ వివరించారు. లో ఎర్త్ ఆర్బిట్ లో మానవ సంచారంతో మొదలయ్యే అంతరిక్ష యాత్ర స్వదేశీ అంతరిక్ష కేంద్రంలో భారతదేశ శాస్త్రీయ కార్యకలాపాలకు విస్తరిస్తుందని, ఇది మరింత చంద్రునిపై అన్వేషణకు దారితీస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

అంతరిక్ష రవాణా, ప్లాట్ ఫాంలు, గ్రౌండ్ స్టేషన్లలో భారత్ పూర్తి సామర్థ్యాలను డాక్టర్  జితేంద్ర సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. అంతరిక్ష రంగంలో దేశం స్వావలంబనలో కీలకమైన అంశంగా పేర్కొన్నారు. చేపల పెంపకం, వ్యవసాయం, సహజ వనరుల నిర్వహణ, విపత్తు నిర్వహణ, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటి రంగాలపై అంతరిక్ష అనువర్తనాల ప్రభావాన్ని ఆయన తెలిపారు. ఇవన్నీ భారతదేశ అంతరిక్ష పురోగతి నుండి ప్రయోజనం పొందినట్లు తెలిపారు.

దేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఈ కార్యక్రమం భారతదేశ అంతరిక్ష ప్రయాణం, దాని భవిష్యత్తు ప్రయత్నాల గురించి పౌరులలో మరింత అవగాహన ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుందని డా. జితేంద్ర సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 2048541) Visitor Counter : 98