సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘వేవ్స్’ నిర్వహణ నేపథ్యంలో ‘‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్- సీజన్ 1’’ కింద 25 అంశాల్లో పోటీలకు


కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ శ్రీకారం
‘‘మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వం.. జీవన విధానాల
చిత్రణకు అద్భుత ఉపకరణం ఈ సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థ’’;

‘‘సృష్టికర్తల సామర్థ్యం పెంపు లక్ష్యంగా ప్రపంచస్థాయి
విశ్వవిద్యాలయం.. సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ కృషి’’;

‘‘చలనచిత్ర రంగంలో కొత్త సాంకేతికత-ఉపకరణాల వినియోగ పరిధి
విస్తృతం; తద్వారా 2-3 లక్షల కొత్త ఉపాధి అవకాశాలు సాధ్యమే’’

Posted On: 22 AUG 2024 8:11PM by PIB Hyderabad

   ప్రపంచ దృశ్య-శ్రవణ/వినోద సదస్సు (వేవ్స్) నిర్వహణ నేపథ్యంలో ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్- సీజన్ 1’లో భాగంగా 25 అంశాల్లో పోటీలను కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- శరవేగంగా పురోగమిస్తూ వృద్ధి పథంలో పయనిస్తున్న మన ఆర్థిక వ్యవస్థను ఈ పోటీలు ప్రతిబింబిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రూపంలో పూర్తిస్థాయి నవ్య సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థ ఊపిరి పోసుకున్నదని శ్రీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో సృష్టికర్తల తొట్టతొలి జాతీయ పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా ప్రకటించిన మేరకు దీనికి ప్రధానమంత్రి గుర్తింపు కూడా లభించిందని గుర్తుచేశారు.

 

 

సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల: అవకాశాలు.. మౌలిక సదుపాయాలు.. ఉద్యోగ సృష్టి

   మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వం.. జీవన విధానాల చిత్రణకు ఈ సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఒక అద్భుత ఉపకరణమని, దీనికి అపార సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు. సంప్రదాయ వైద్య విధానాలు, యోగా, మన వంటకాల వైవిధ్యం ప్రదర్శించడంలూ ఇదొక సృజనాత్మక సాధనమని పేర్కొన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నదని వివరించారు. అందువల్ల ఈ రంగంలో ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల లభ్యతకు భరోసా ఇవ్వాల్సి ఉందని కేంద్ర మంత్రి అన్నారు.

   సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థలో మరింత వృద్ధి సాధించే దిశగా అంతర్జాతీయ ప్రతిభా వికాస కార్యక్రమాల నిర్వహణతోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. మీడియా-వినోద రంగంలో సృష్టికర్తల సామర్థ్యం పెంపు లక్ష్యంగా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుసహా సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

 

చలనచిత్ర నిర్మాణంలో నవ్య సాంకేతికతల వినియోగం: ఉపాధి సృష్టి

   భారతదేశ బలాల్లో చలనచిత్ర నిర్మాణం కూడా ఒకటని శ్రీ అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆధునిక యుగంలో కొత్త సాంకేతికత-ఉపకరణాల వినియోగ పరిధి ఈ రంగంలో విస్తృతంగా ఉంటుందని, తద్వారా అపార ఉపాధి అవకాశాలు అందివస్తాయని ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తే దాదాపు 2-3 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని అంచనా వేశారు.

సామాజిక బాధ్యత

   అయితే, ఈ పురోగమనంలో మన సమాజానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త వహించాలని అప్రమత్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదని, పరిశ్రమ,  యావత్ సమాజంతోపాటు మనందరిపైనా సమష్టి బాధ్యత ఉందని కేంద్ర మంత్రి హెచ్చరించారు.

   ఈ రంగంలోని అపార సామర్థ్య సద్వినియోగంలో భాగంగానే ‘వేవ్స్’ నిర్వహణ బాధ్యతలు చేపట్టామని, భవిష్యత్తులో ఇదొక అసాధారణ నవలోకంగా ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు.

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో- సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, అదనపు కార్యదర్శి శ్రీమతి నీరజా శేఖర్, ‘ఫిక్కి’ డైరెక్టర్ జనరల్ శ్రీమతి జ్యోతి విజ్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘సిఐఐ’ జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ బీరెన్ ఘోష్ తదితరులున్నారు.

‘డిజైన్ ఇన్ ఇండియా-డిజైన్ ఫర్ ది వరల్డ్

   ఈ సందర్భంగా శ్రీ సంజయ్ జాజు ప్రసంగిస్తూ- భారత సృజనాత్మక పర్యావరణ వ్యవస్థ వృద్ధి/ఉన్నతీకరణ దిశగా కొనసాగుతున్న కృషిలో ఈ కార్యక్రమం ఓ కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ‘‘దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం నాటి తన ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ‘భార‌త్‌లో డిజైనింగ్‌-ప్ర‌పంచం కోసం డిజైనింగ్‌’ దార్శనికతను ఇది స్సఫ్టంగా ప్రతిబింబిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. మన దేశంలోగల అపార ప్రతిభాసామర్థ్యాలను ‘వేవ్స్’ ప్రపంచానికి రుజువు చేస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగాగల అత్యంత మేధావులు, ప్రతిభావంతులైన సృష్టికర్తలకు ఇది వేదిక కాగలదన్నారు. దీంతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి హాజరయ్యే దార్శనిక నాయకులు తమ విజ్ఞానాన్ని అందరితోనూ పంచుకునే అంతర్జాతీయ వేదికగానూ ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ మేరకు ఆలోచనల ఆదానప్రదానంతో సృజనాత్మకత హద్దులను చెరిపివేస్తుందని పేర్కొన్నారు.

‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ - సీజన్ 1’

   ఈ పోటీలకు ప్రముఖ పారిశ్రామిక సంఘాలు, సంస్థలు ఆతిథ్యమిస్తున్నాయి. యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్, గేమింగ్, సంగీతం, విజువల్ ఆర్ట్స్‌ సహా అనేక విభాగాల్లో వీటిని నిర్వహిస్తారు. ప్రధాన కార్యక్రమానికి ముందు ఈ పోటీలు పూర్తవుతాయి.

‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ - సీజన్ 1’ పోటీలు - నిర్వాహక సంస్థల జాబితా

  1. యానిమే ఛాలెంజ్ - మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
  2. యానిమేషన్ ఫిల్మ్ మేకర్స్ పోటీ - డ్యాన్సింగ్ ఆటమ్స్
  3. గేమ్ జామ్ - ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్
  4. ఎస్పోర్ట్స్ టోర్నమెంట్ - ఎస్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
  5. సిటీ క్వెస్ట్: షేడ్స్ ఆఫ్ భారత్ - ఇ గేమింగ్ ఫెడరేషన్
  6. హ్యాండ్‌హెల్డ్ ఎడ్యుకేషనల్ వీడియో గేమ్ డెవలప్‌మెంట్ - ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ
  7. కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్‌షిప్ - ఇండియన్ కామిక్స్ అసోసియేషన్
  8. యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ - ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ; విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్
  9. ఎక్స్ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ - వేవ్‌లాప్స్, ఎక్స్‌డిజి
  10. ఎఐ ఫిల్మ్ మేకింగ్ పోటీ - ఇన్‌విడియో
  11. ‘వేవ్స్’ ప్రోమో వీడియో ఛాలెంజ్ - ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్
  12. ట్రూత్ టెల్ హ్యాకథాన్ - ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్
  13. కమ్యూనిటీ రేడియో కంటెంట్ ఛాలెంజ్ - కమ్యూనిటీ రేడియో అసోసియేషన్
  14. థీమ్ సంగీత పోటీ - భారతీయ సంగీత పరిశ్రమ
  15. వేవ్స్ హ్యాకథాన్: అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా; యాడ్‌స్పెండ్ ఆప్టిమైజర్
  16. ‘వేవ్స్’ ఎఐ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ ఛాలెంజ్ - ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
  17. వేవ్స్ ఎక్స్‌ప్లోరర్ - ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
  18. రీల్ మేకింగ్ ఛాలెంజ్- ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
  19. ఫిల్మ్ పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ - నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా; నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
  20.  వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ క్రియేషన్ కాంటెస్ట్ - ఎవిటిఆర్ మెటా ల్యాబ్స్
  21. బ్యాటిల్ ఆఫ్ ద బ్యాండ్స్ - ప్రసార భారతి
  22.  సింఫనీ ఆఫ్ ఇండియా - ప్రసార భారతి
  23.  ఇండియా: ఎ బర్డ్స్ ఐ వ్యూ - బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
  24.  యాంటీ పైరసీ ఛాలెంజ్ - కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ
  25. ట్రైలర్ మేకింగ్ పోటీ - ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ

 

ఈ పోటీల్లో పాల్గొనే సృష్టికర్తల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం wavesindia.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

***



(Release ID: 2047891) Visitor Counter : 34