కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సంక్షిప్త సందేశాల దుర్వినియోగానికి అడ్డుకట్ట: ట్రాయ్ ఆదేశాలు

Posted On: 20 AUG 2024 2:01PM by PIB Hyderabad

సంక్షిప్త సందేశ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత కార్యకలాపాల నుంచి వినియోగదారులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలంటూ భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం జారీ చేసిన ఆదేశాల ద్వారా, ఆయా సేవలందించే వారంతా కింది అంశాలను తప్పక ధ్రువీకరించాలని ట్రాయ్ స్పష్టంచేసింది:

  1. మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణ కోసం 140 సిరీస్‌లతో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్ ను సెప్టెంబర్ 30 నాటికి ఆన్‌లైన్ డీఎల్టీ వేదికలోకి తప్పనిసరిగా మార్చాలని సర్వీస్ ప్రొవైడర్లను ట్రాయ్  ఆదేశించింది.
  2. సెప్టెంబరు 1 నుంచి యూఆర్ఎల్, ఏపీకే, ఓటీటీ లింక్ లు లేదా తిరిగి ఫోన్ చేయాలంటూ కోరే నంబర్లున్న సంక్షిప్త సందేశాలను అనధికార నెంబర్ల నుంచి పంపించడాన్ని నిషేధించారు.
  3. అవసరమైనపుడు వాటిని పరిశీలించేందుకు వీలుగా, నవంబరు 1 నుంచి అన్ని సంక్షిప్త సందేశాల మూలాలూ గుర్తించదగినవిగా ఉండి తీరాలని ట్రాయ్ స్పష్టం చేసింది. అనధికార, లేదా గుర్తు తెలియని టెలి మార్కెటర్ల నుంచి వచ్చే సందేశాలను తిరస్కరిస్తారు.
  4. ప్రచార అంశాల కోసం టెంప్లేట్ల దుర్వినియోగాన్ని నిరోధించడంలో భాగంగా, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలను ట్రాయ్ ప్రకటించింది. పలు అంశాలకు సంబంధించి తప్పుడు కేటగిరీ కింద నమోదైన టెంప్లేట్లను నిషేధిత జాబితాలో చేరుస్తారు. ఆ చర్యలు పునరావృత్తమైతే సందేశాలు పంపకుండా నెల రోజుల పాటు నిలిపివేయవచ్చు.
  5. నిబంధనలు పాటించేలా చూడడం కోసం, డీఎల్టీలో నమోదైన అన్ని శీర్షికలు, పలు అంశాల టెంప్లేట్లు నిర్దేశిత మార్గదర్శకాలకు తప్పక కట్టుబడి ఉండాలి. అంతేకాకుండా, ఒకే అంశానికి సంబంధించిన టెంప్లేట్ ను వివిధ శీర్షికల కోసం వినియోగించలేరు.
  6. సందేశ కర్తలెవరైనా శీర్షికలు లేదా అంశాలవారీ టెంప్లేట్లను దుర్వినియోగం చేసినట్లు గుర్తిస్తే, ధ్రువీకరణ కోసం వారికి సంబంధించి అన్ని శీర్షికలు, టెంప్లేట్ల ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశించింది. ఆ దుర్వినియోగంపై సందేశకర్త చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాతే ప్రసార పునరుద్ధరణ జరుగుతుంది. డెలివరీ-టెలీమార్కెటర్లు ఆ దుర్వినియోగానికి కారణమైన సంస్థలను రెండు పనిదినాల్లోగా గుర్తించి నివేదించాలి. లేనిపక్షంలో తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ నిర్దేశాల కచ్చితమైన పాఠం కోసం భాగస్వాములు ట్రాయ్ వెబ్ సైట్ www.trai.gov.in లో అందుబాటులో ఉన్న నిర్దేశాలను గమనించవచ్చు.

సురక్షితమైన సంక్షిప్త సందేశ వ్యవస్థను నిర్మించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, మోసపూరిత కార్యకలాపాలను నివారించడానికి ట్రాయ్ ఈ చర్యలు తీసుకున్నది.

 
***


(Release ID: 2047180) Visitor Counter : 22