ప్రధాన మంత్రి కార్యాలయం
మలేషియా ప్రధాని భారత పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన.
Posted On:
20 AUG 2024 4:45PM by PIB Hyderabad
ప్రధాని శ్రీ దాతో సెరి అన్వర్ ఇబ్రహీం,
ఇరు దేశాల ప్రతినిధి బృందాల సభ్యులకు,
మీడియా స్నేహితులకు,
నమస్కారాలు.
శ్రీ అన్వర్ ఇబ్రహీం గారూ, మలేషియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. నేను మూడో పర్యాయం అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో మీకు స్వాగతం పలికే అవకాశం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది.
స్నేహితులారా,
భారతదేశం, మలేషియాల బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. గత రెండేళ్లలో ప్రధాని శ్రీ అన్వర్ ఇబ్రహీం సహకారంతో ఇరు దేశాల భాగస్వామ్యం నూతన వేగాన్నీ, శక్తినీ పొందింది. ఈ రోజున మేం అన్ని రంగాలకు సంబంధించిన పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించాం. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరంగా ప్రగతిని సాధిస్తోందని మేం గమనించాం. భారతదేశం, మలేషియాల మధ్య వాణిజ్యపరమైన లావాదేవీలు భారత్ రూపాయిల్లోనూ, మలేషియా రింగిట్లలోనూ జరగవచ్చు. గత ఏడాది మలేషియానుంచి భారతదేశానికి 5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా పెంపొందించాలని ఈ రోజున మేం నిర్ణయించాం. ఆర్థిక సహకారం మరింత పెంపొందడానికి అవకాశముందని మేం విశ్వసిస్తున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు విస్తరించాలి. నూతన సాంకేతిక రంగాలైన సెమీకండక్టర్లు. ఫిన్ టెక్, రక్షణ రంగ పరిశ్రమలు, కృత్రిమ మేధ, క్వాంటమ్ మొదలైన వాటిలో పరస్పర సహకారం పెంపొందాలి. భారతదేశం, మలేషియాల దేశాల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని పున:సమీక్షించే పనిని వేగవంతం చేయాలని భావిస్తున్నాం.
డిజిటల్ సాంకేతిక రంగ సహకారంలో అంకుర సంస్థల వేదికను ఏర్పాటు చేయాలనీ, ఇందుకు అవసరమైన డిజిటల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం.
భారతదేశ యూపిఐనీ, మలేషియా పేనెట్ నీ అనుసంధానం చేసే పని జరుగుతోంది. ఈ రోజు నిర్వహించిన సీఇవో వేదిక నూతన అవకాశాలను ముందుకు తెచ్చింది. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి సంబంధించి నూతన అవకాశాలపై మేం చర్చించాం. తీవ్రవాద, ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఒకే తాటిపై నిలబడ్డాం.
స్నేహితులారా,
భారతదేశం, మలేషియా శతాబ్దాల తరబడి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నాయి. మలేషియాలో నివసిస్తున్న దాదాపు 30 లక్షల మంది ప్రవాస భారతీయులు ఇరు దేశాల మధ్య సజీవ వారధిగా ఉన్నారు. భారతీయ సంగీతం, ఆహారం, పండగల నుంచి తోరాన్ గేట్ దాకా మలేషియాలోని భారతీయులు ఈ స్నేహాన్ని ప్రేమగా కొనసాగిస్తున్నారు. గత ఏడాది మలేషియాలో నిర్వహించిన ‘పిఐవో దినం ’ విజయవంతంగా నిర్వహించారు. అది ప్రజాదరణ పొందిన కార్యక్రమం. మా నూతన పార్లమెంటు భవనంలో సెంగాల్ ను ఏర్పాటు చేసినప్పుడు ఆ చారిత్రక సందర్భం తాలూకా ఉద్వేగభరిత సంతోషం మలేషియాలో కూడా కనిపించింది. కార్మికుల ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఈ రోజున చేసుకున్న ఒప్పందం భారతీయ కార్మికుల నియామకాన్ని ప్రోత్సహిస్తోంది. అంతే కాదు అది వారి ప్రయోజనాలను కాపాడుతుంది. రాకపోకలు సాఫీగా సాగడానికి వీలుగా వీసా ప్రక్రియను సులభతరం చేశాం. విద్యార్థులకు ఉపకారవేతనాల్ని ఇవ్వడంపైనా, ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇవ్వడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం. అత్యాధునిక కోర్సులైన సైబర్ భద్రత, కృత్రిమ మేధలాంటి వాటి కోసం ఐటీఈసీ ఉపకారవేతనాల కింద మలేషియా కోసం వంద సీట్లను కేటాయిస్తున్నాం. మలేషియాలోని తుంకు అబ్దుల్ రహమాన్ యూనివర్సిటీలో ఆయుర్వేద ఛెయిర్ ఏర్పాటు చేస్తున్నాం. దీనితోపాటు మలయా యూనివర్సిటీలో తిరువళ్లువార్ ఛెయిర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రత్యేకమైన అడుగులు పడేందుకు సహకరించిన ప్రధాని శ్రీ అన్వర్ కు, ఆయన బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
స్నేహితులారా,
ఆసియాన్ లోను, ఇండో పసిఫిక్ ప్రాంతంలోనూ భారతదేశానికి మలేషియా ముఖ్యమైన భాగస్వామి. ఆసియాన్ కేంద్రీకరణకు భారతదేశం ప్రధాన్యతను ఇస్తోంది. భారతదేశం, ఆసియాన్ ల మధ్య ఎఫ్ టి ఏ సమీక్షను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు మేం అంగీకరించాం. 2025లో ఆసియాన్ అధ్యక్ష స్థానంలో మలేషియా కృషి విజయవంతం కావడానికి భారతదేశం తన సంపూర్ణ సహకారం అందిస్తుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం స్వేచ్ఛగా సముద్రయానం, విమానయానం చేయడానికి మేం నిబద్దులమై ఉన్నాం. అన్ని వివాదాలను శాంతియుతంగా పరిరక్షించుకోవాలన్న విధానానికి కట్టుబడి ఉన్నాం.
అత్యంత గౌరవనీయులైన మీకు,
భారతదేశంతో మీకున్న స్నేహ సంబంధాలపట్ల ఉన్న నిబద్ధతకు మా కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాను. మీ పర్యటన రాబోయే దశాబ్దంలో ఇరు దేశాల మధ్య ఉండాల్సిన సంబంధాలకు నూతన దిశానిర్దేశం చేసింది. అందరికీ మరొక్కసారి అభినందనలు.
***
(Release ID: 2047173)
Visitor Counter : 94
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam