ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర స్థితిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన దృష్ట్యా ఎం పాక్స్ పరిస్థితిపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్ష


ఎంపాక్స్ పై సన్నద్ధతను సమీక్షించడానికి ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

సత్వర గుర్తింపు కోసం నిఘాను మెరుగుపరచాలని సూచన

పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయాలి

వ్యాధి నిరోధక ప్రజారోగ్య చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

Posted On: 18 AUG 2024 7:42PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంపాక్స్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సలహా మేరకు ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా అధ్యక్షతన దేశంలో ఎంపాక్స్ సంసిద్ధత స్థితి, సంబంధిత ప్రజారోగ్య చర్యలను సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో ప్రబలిన ఎం పాక్స్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్ట్ 14న మరోసారి అంతర్జాతీయ ఎం పాక్స్ ప్రజా అనారోగ్య అత్యవసర స్థితిని ప్రకటించడం గమనార్హం. డబ్ల్యూహెచ్ఓ ఇంతకు ముందు చేసిన ప్రకటన ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 116 దేశాల్లో 99,176 కేసులు, 208 మరణాలు ఎంపాక్స్ కారణంగా నమోదయ్యాయి. అనంతరం కాంగోలో ఎం పాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని నివేదించింది. గతేడాది కేసులు భారీగా నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే గతేడాది మొత్తం కన్నా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈసారి 15,600 కేసులు నమోదు కాగా, 537 మంది ప్రాణాలు కోల్పోయారు. డబ్ల్యూహెచ్ఓ 2022లో అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటన చేసినప్పటి నుంచి భారత్ లో 30 కేసులు నమోదయ్యాయి. చివరి ఎంపాక్స్ కేసును గత మార్చిలో గుర్తించారు.

ప్రస్తుతానికి దేశంలో ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని ఉన్నతస్థాయి సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుత అంచనా ప్రకారం, విస్తృతంగా ప్రబలుతున్న ఈ వ్యాధి నిరంతర వ్యాప్తి తక్కువగా ఉంది.

ఎంపాక్స్ వ్యాధికి కారకమయ్యే సూక్ష్మ క్రిములు ఒక స్వీయ పరిమితికి లోబడి చలిస్తాయి. వీటి జీవన కాల పరిమితి సాధారణంగా  2-4 వారాల మధ్య ఉంటుందని ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శికి నిపుణులు తెలిపారు. ఎంపాక్స్ వ్యాధిగ్రస్తులు సాధారణంగా సహాయక వైద్య సంరక్షణతో కోలుకుంటారు. వ్యాధి గ్రస్తుడితో దీర్ఘకాలిక, సన్నిహిత సంబంధం ద్వారా ఎంపాక్స్ వ్యాపిస్తుంది. ఎక్కువగా లైంగిక మార్గం ద్వారా, రోగి శరీరం / గాయపడిన ప్రాంతాల నుంచి వెలువడే  ద్రవాల ద్వారా లేదా ఆ వ్యాధి సోకిన వ్యక్తి దుస్తులు/వస్త్రాల  ద్వారా ఇది ప్రబలుతోంది. గత వారం రోజుల్లో ఈ కింది చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య కార్యదర్శి తెలియజేశారు.

దేశంలో ప్రమాదాన్ని అంచనా వేయడానికి జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) ఆగస్టు 12న నిపుణుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్సీడీసీ గతంలో జారీచేసిన అంటువ్యాధి హెచ్చరికను నవీకరించి కొత్త పరిణామాలను పరిశీలిస్తున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆరోగ్య బృందాలకు అవగాహన కల్పించారు.
సోమవారం ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డిజిహెచ్ఎస్) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో 200 మందికి పైగా పాల్గొన్నారు. రాష్ట్రాల్లోని సమీకృత వ్యాధి నిఘా కార్యక్రమ (ఐడీఎస్పీ) విభాగాలు, ప్రవేశ నౌకాశ్రయాలతో పాటు రాష్ట్ర స్థాయి ఆరోగ్య అధికారులకు ఈ విషయంపై అవగాహన కల్పించారు.

నిఘా పెంచాలని, కేసులను సత్వరమే గుర్తించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా ఆదేశించారు. ముందస్తు రోగ నిర్ధారణ కోసం పరీక్ష ప్రయోగశాలల యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 32 ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వ్యాధి నివారణ, చికిత్సకు సంబంధించిన ప్రోటోకాళ్లను భారీగా ప్రచారం చేయాలని డాక్టర్ పి.కె. మిశ్రా ఆదేశించారు. వ్యాధి సంకేతాలు, లక్షణాలపై ఆరోగ్య సంరక్షకుల్లో అవగాహన కల్పించాలని, నిఘా వ్యవస్థకు సకాలంలో సమాచారం అందించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. పాల్, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ కార్యదర్శి శ్రీ అపూర్వచంద్ర, ఆరోగ్య పరిశోధన కార్యదర్శి డా. రాజీవ్ బహల్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీ కృష్ణ ఎస్ వత్స,  సమాచార ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, హోంశాఖ కార్యదర్శి శ్రీ గోవింద మోహన్, ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

 

***


(Release ID: 2046618) Visitor Counter : 79