ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
దేశంలో 8 కీలక జాతీయ హైస్పీడ్ రహదారి కారిడార్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం
దేశవ్యాప్తంగా రవాణా సామర్థ్యం మెరుగు..
రద్దీ తగ్గింపు.. అనుసంధానం పెంపు లక్ష్యం;
మొత్తం పొడవు 936 కి.మీ.. నిర్మాణ వ్యయం రూ.50,655 కోట్లు;
ఆగ్రా-గ్వాలియర్ మధ్య ప్రయాణ సమయంలో 50 శాతం ఆదా;
ఖరగ్ పూర్-మోరెగ్రామ్ కారిడార్‌తో పరివర్తనాత్మకం
కానున్న పశ్చిమ బెంగాల్.. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ;
కాన్పూర్ రింగ్ రోడ్డుతో పరిసర జాతీయ రహదారి నెట్‌వర్క్‌లపై రద్దీ తగ్గుదల;
రాయ్‌పూర్-రాంచీ కారిడార్ ద్వారా జార్ఖండ్.. ఛత్తీస్‌గఢ్ ప్రగతికి మార్గం సుగమం;
రేవుల మధ్య నిరంతర సంధానం.. రవాణా వ్యయం తగ్గింపు దిశగా గుజరాత్‌లో హైస్పీడ్ రోడ్ నెట్‌వర్క్ పూర్తికి థరాడ్-అహ్మదాబాద్ మధ్య కొత్త కారిడార్;
ఈశాన్య ప్రాంతానికి ఆటంకాల్లేని ప్రయాణం కోసం గువహటి రింగ్ రోడ్డు;
అయోధ్యకు ప్రయాణం ఇప్పుడు మరింత వేగవంతం;
పుణె-నాసిక్ మధ్య 8 వరుసల ఎలివేటెడ్ ఫ్లైఓవర్
కారిడార్ సెక్షన్‌తో తొలగనున్న రవాణా ఇక్కట్లు
Posted On:
02 AUG 2024 8:42PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సిసిఇఎ) దేశవ్యాప్తంగా రూ.50,655 కోట్ల వ్యయంతో 936 కిలోమీటర్ల పొడవైన 8 కీలక జాతీయ హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 4.42 కోట్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.
సంక్షిప్తంగా ప్రాజెక్టుల వివరాలు:
1. ఆగ్రా-గ్వాలియర్ 6 వరుసల కారిడార్:
ఈ ఆరు వరుసల పూర్తిస్థాయి సౌలభ్య-నియంత్రిత కారిడార్ పొడవు 88 కిలోమీటర్లు కాగా, మొత్తం రూ.4,613 కోట్లతో నిర్మాణం-నిర్వహణ-బదిలీ (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్-బిఒటి) ప్రాతిపదికన నిర్మాణం చేపడతారు. ఉత్తర-దక్షిణ కారిడార్ (శ్రీనగర్-కన్యాకుమారి) పరిధిలోని ఆగ్రా-గ్వాలియర్ విభాగంలో రవాణా సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచే దిశగా ప్రస్తుత 4 వరుసల జాతీయ రహదారికి ఈ ప్రాజెక్టు అనుబంధంగా ఉంటుంది. అలాగే ఉత్తరప్రదేశ్ (తాజ్‌మహల్, ఆగ్రా కోట తదితరాలు), మధ్యప్రదేశ్ ( గ్వాలియర్ కోట తదితరాలు) రాష్ట్రాల్లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలకు అనుసంధానం పెరుగుతుంది. మరోవైపు ఆగ్రా-గ్వాలియర్ మార్గంలో దూరం 7 శాతం, ప్రయాణ సమయం 50 శాతం ఆదా కావడంతోపాటు రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుంది.
ఈ 6 వరుసల ఆగ్రా-గ్వాలియర్ కొత్త రహదారిని ప్రణాళిక కిలోమీటర్ 0.000 (ఆగ్రా జిల్లా దేవరి గ్రామం వద్ద) నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా (గ్వాలియర్ జిల్లా సుసేరా గ్రామ సమీపం) 88-400 కిలోమీటరు వరకూ నిర్మిస్తారు. జాతీయ రహదారి-44 పరిధిలోని పరిధిలోని ప్రస్తుత ఆగ్రా-గ్వాలియర్ విభాగంలో ఓవర్ లే/బలోపేతం, ఇతర రహదారి భద్రత మెరుగుదల పనులు కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటాయి.
2. ఖరగ్ పూర్-మోరేగ్రామ్ 4 వరుసల కారిడార్:
ఈ నాలుగు వరుసల కారిడార్ పొడవు 231 కిలోమీటర్లు కాగా, మొత్తం రూ.10,247 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ విధానం (హెచ్ఎఎం)లో నిర్మిస్తారు. ఖరగ్ పూర్-మోరేగ్రామ్ మధ్య రవాణా సామర్థ్యం 5 రెట్లు పెంపుతోపాటు ప్రస్తుత 2 వరుసల జాతీయ రహదారికి ఈ కారిడార్ అనుబంధంగా ఉంటుంది. ఒకవైపు పశ్చిమబెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు, మరోవైపు ఈశాన్య రాష్ట్రాల మధ్య రాకపోకలను ఇది సమర్థంగా అనుసంధానిస్తుంది. అలాగే ఖరగ్ పూర్-మోరేగ్రామ్ మార్గంలో సరకు రవాణా వాహనాల ప్రయాణ సమయం 9-10 గంటల నుంచి 3-5 గంటలకు ఆదా కావడంతోపాటు రవాణా వ్యయం తగ్గుతుంది.
3. థరాడ్-దీసా-మెహసనా-అహ్మదాబాద్ 6 వరుసల కారిడార్:
ఈ ఆరు వరుసల కారిడార్ పొడవు 214 కిలోమీటర్లు కాగా, మొత్తం రూ.10,534 కోట్లతో నిర్మాణం-నిర్వహణ-బదిలీ (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్-బిఒటి) పద్ధతిలో నిర్మిస్తారు. ఇది
గుజరాత్ రాష్ట్ర పరిధిలో కీలకమైన అమృత్ సర్-జామ్ నగర్ కారిడార్, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే మార్గాలను అనుసంధానిస్తుంది. తద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ పారిశ్రామిక ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ప్రధాన ఓడరేవు (జెఎన్‌పిటి, ముంబైసహా ఇటీవల మంజూరు చేసిన వడవాన్ పోర్టు)లకు వెళ్లే సరకు రవాణా వాహనాలకు నిరంతర అనుసంధానం కల్పిస్తుంది. మరోవైపు రాజస్థాన్ (మెహ్రాన్ గఢ్ కోట, దిల్వారా ఆలయం తదితరాలు), గుజరాత్ (రాణి కా వావ్, అంబాజీ ఆలయం తదితరాలు) రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలను కూడా అనుసంధానిస్తుంది. అలాగే థరాడ్-అహ్మదాబాద్ మధ్య దూరం 20 శాతం, ప్రయాణ సమయం 60 శాతం ఆదా కావడంతోపాటు రవాణా వ్యయం తగ్గుతుంది.
4. నాలుగు వరుసలతో అయోధ్య రింగురోడ్డు
ఈ నాలుగు వరుసల రింగురోడ్డు పొడవు 68 కిలోమీటర్లు కాగా, రూ.3,935 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానం (హెచ్ఎఎం)లో నిర్మిస్తారు. అయోధ్య నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు ‘‘నం.27 (ఈస్ట్-వెస్ట్ కారిడార్), నం.227 ఎ, బి; నం.330, నం.330 ఎ, నం.135 ఎ’’లపై రద్దీని ఈ రింగ్ రోడ్డు తగ్గిస్తుంది. తద్వారా రామ మందిర సందర్శకుల రాకపోకలు వేగంగా సాగే వీలుంటుంది. ఈ రింగురోడ్డువల్ల లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య విమానాశ్రయంతోపాటు నగర ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు నిరంతరరాయ అనుసంధానం లభిస్తుంది.
5. రాయ్‌పూర్-రాంచీ కారిడార్ పరిధిలో పాతాళ్ గావ్-గుమ్లా 4 వరుసల విభాగం:
రాయ్‌పూర్-రాంచీ కారిడార్ పరిధిలో 137 కిలోమీటర్ల 4 వరుసల పాతాళ్ గావ్-గుమ్లా విభాగం రహదారిని రూ.4,473 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ విధానం (హెచ్ఎఎం)లో నిర్మిస్తారు. దీనివల్ల గుమ్లా, లోహర్దగా, రాయగడ్, కోర్బా, ధన్‌బాద్ గనుల ప్రాంతాలుసహా రాయ్‌పూర్, దుర్గ్, కోర్బా, బిలాస్‌పూర్, బొకారో, ధన్‌బాద్ ప్రాంతాల్లోని పారిశ్రామిక, తయారీ రంగ మండళ్ల మధ్య అనుసంధానం పెరుగుతుంది.
ఈ రింగురోడ్డు జాతీయ రహదారి-43 పరిధిలోని 4 వరుసల పాతాళ్ గావ్-కున్ కున్-ఛత్తీస్ గడ్/జార్ఖండ్ సరిహద్దులోని-గుమ్లా-భార్దా విభాగంలోగల అమా గ్రామం వద్ద జాతీయ రహదారి -130 ఎ చివరినుంచి మొదలై రాయ్‌పూర్-ధన్‌బాద్ ఆర్థిక కారిడార్ లో భాగంగా భార్దా గ్రామ సమీపాన పాల్మా-గుమ్లా రోడ్ చైనేజ్ 82+150 వద్ద ముగుస్తుంది.
6. ఆరు వరుసల కాన్పూర్ రింగ్ రోడ్డు:
ఈ ఆరు వరుసల రింగురోడ్డు పొడవు 47 కిలోమీటర్లు కాగా- ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మోడ్ (ఇపిసి) కింద దీన్ని రూ.3,298 కోట్లతో నిర్మిస్తారు. దీనిద్వారా కాన్పూర్ నగరం చుట్టూ 6 వరుసల జాతీయ రహదారి వలయం పూర్తవుతుంది. జాతీయ రహదారి నం.19, స్వర్ణ చతుర్భుజి, ఎన్ హెచ్ నం.27-ఈస్ట్ వెస్ట్ కారిడార్, ఎన్ హెచ్ నం.34 సహా కొత్తగా నిర్మించే లక్నో-కాన్పూర్ ఎక్స్ ప్రెస్ వే, గంగా ఎక్స్ ప్రెస్ వే వంటి ప్రధాన జాతీయ రహదారులపై సుదూర వాహన రాకపోకలను నగరం వైపు నుంచి మళ్లించడానికి ఈ రింగురోడ్డు వీలు కల్పిస్తుంది. తద్వారా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య సరకు రవాణా సదుపాయాల సామర్థ్యం మెరుగవుతుంది.
ఈ ఆరు వరుసల కొత్త రింగురోడ్డు డిజైన్ చైనేజ్ (సిహెచ్) 23+325 నుంచి ప్రారంభమై విమానాశ్రయ సంధాన రోడ్డు (పొడవు 1.45 కి.మీ) సహా డిజైన్ చైనేజ్ 68+650 (పొడవు 46.775 కి.మీ) వరకూ వెళ్తుంది.
7. ఉత్తర గువహటి (4 వరుసల) బైపాస్, ప్రస్తుత గువహటి బైపాస్ వెడల్పు/ మెరుగుదల:
ఈ నాలుగు వరుసల రింగురోడ్డు పొడవు 121 కిలోమీటర్లు కాగా... బిల్డ్-ఆపరేట్-టోల్ (బిఒటి) పద్ధతిలో రూ.5729 కోట్లతో మూడు విభాగాల్లో నిర్మిస్తారు. ఈ మేరకు 4 వరుసల ఉత్తర గువహటి బైపాస్ (56 కి.మీ), ఎన్ హెచ్ నం.27పై ప్రస్తుత 4 వరుసల బైపాస్ రోడ్డు (8 కి.మీ) 6 వరుసలకు విస్తరణ, ఎన్ హెచ్ నం.27పై ప్రస్తుత బైపాస్ రోడ్డు (58 కి.మీ) మెరుగుగల ఇందులో భాగంగా ఉంటాయి. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మపుత్ర నదిపై భారీ వంతెన కూడా నిర్మిస్తారు. ఈశాన్య ప్రాంత ముఖద్వారమైన జాతీయ రహదారి 27 (ఈస్ట్-వెస్ట్ కారిడార్)పై సాగే సుదూర వాహన రాకపోకల గువహటి రింగురోడ్డు నిరంతరాయ అనుసంధానం కల్పిస్తుంది. అలాగే గువహటి చుట్టూగల ప్రధాన జాతీయ రహదారులపై రద్దీ కూడా తగ్గుతుంది. ఈ ప్రాంతంలోని ప్రధాన నగరాలు/పట్టణాలైన- సిలిగురి, సిల్చార్, షిల్లాంగ్, జోర్హాట్, తేజ్పూర్, జోగిగోఫా, బార్పేటలను ఈ రింగురోడ్డు కలుపుతుంది.
8. పుణె సమీపాన 8 వరుసల నాసిక్ ఫతా-ఖేడ్ ఎలివేటెడ్ కారిడార్:
నాసిక్ ఫతా నుంచి పుణె సమీపంలోని ఖేడ్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన ఈ 8 వరుసల ఎలివేటెడ్ జాతీయ హైస్పీడ్ కారిడార్‌ను రూ.7,827 కోట్ల వ్యయంతో బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (బిఒటి) పద్ధతిలో నిర్మిస్తారు. దీనిద్వారా పుణె-నాసిక్ మధ్య ఎన్ హెచ్-60 పరిధిలోని చకన్, భోసరి తదితర పారిశ్రామిక కూడళ్ల నుంచి నిరంతరాయ రాకపోకలకు హైస్పీడ్ అనుసంధానం లభిస్తుంది. అలాగే పింప్రి-చించ్వాడ్ పరిసరాల్లో తీవ్ర వాహన రాకపోకల రద్దీ కూడా తగ్గుతుంది.
నాసిక్ ఫతా నుంచి ఖేడ్ వరకు రెండు వైపులాగల ప్రస్తుత రహదారిని 4/6 వరుసలుగా ఉన్నతీకరిస్తారు. దీంతోపాటు టైర్-1 వద్ద 8 వరుసల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ (పికెజి-1: కి,మీ 12.190 నుంచి 28.925; పికెజి-2: కి.మీ 28.925 నుంచి 42.113 వరకు) నిర్మిస్తారు.
నేపథ్యం:
దేశ ఆర్థిక శ్రేయస్సుతోపాటు పౌర జీవన నాణ్యతను మెరుగుపరచడంలో మౌలిక సదుపాయాల కల్పన పాత్ర కీలకం. ఇందుకోసం వెచ్చించే ప్రతి రూపాయి జీడీపీ వృద్ధి 2.5-3.0 రెట్లు అధికంగా నమోదయ్యేలా ప్రభావితం చేయగలదు.
దేశ సమగ్ర ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాల ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారుల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో 2013-14నాటికి 0.91 లక్షల కిలోమీటర్లుగాగల జాతీయ రహదారుల పొడవు నేడు 1.46 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. అలాగే గత పదేళ్లలో రహదారుల నిర్మాణ వేగం కూడా గణనీయంగా పెరిగింది. అలాగే దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణానుమతులు, వేగం కూడా ఎంతగానో పెరిగాయి. ఉదాహరణకు 2004-14 నాటికి దాదాపు 4,000 కి.మీ.గా ఉన్న ఎన్ హెచ్ కాంట్రాక్టుల సగటు వార్షిక వేగం 2014-24 మధ్య 11 వేల కిలోమీటర్లకు... అంటే- 2.75 రెట్లు పెరిగింది. అలాగే జాతీయ రహదారుల సగటు వార్షిక నిర్మాణం కూడా 2004-14నాటి 4,000 కిలోమీటర్ల స్థాయినుంచి 2014-24కల్లా 9,600 కిలోమీటర్లకు... అంటే- 2.4 రెట్లు పెరిగింది. జాతీయ రహదారులపై ప్రైవేటు రంగ భాగస్వామ్యం సహా మూలధన పెట్టుబడులు 2013-14లో రూ.50,000 కోట్లు కాగా, 2023-24 నాటికి దాదాపు రూ.3.1 లక్షల కోట్లకు.. అంటే- 6 రెట్లు పెరిగాయి.
మునుపటి రోజుల్లో స్థానిక రద్దీ దృష్ట్యా మాత్రమే ప్రాజెక్ట్-ఆధారిత అభివృద్ధి విధానం అనుసరించేవారు. దీంతో పోలిస్తే నేడు సుస్థిర ప్రమాణాలు, వినియోగదారు సౌలభ్యం, రవాణా సామర్థ్యం పెంపు వంటి పలు అంశాలపై నిశిత దృష్టితో నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా కారిడార్ ఆధారిత జాతీయ రహదారి మౌలిక సదుపాయాల కల్పన విధానాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ విధానం ద్వారా 2047 నాటికి భారత్ 30 ప్లస్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందగలదు. తదనుగుణంగా జిఎస్‌టిఎన్, టోల్ డేటా ప్రాతిపదికన శాస్త్రీయ రవాణా అధ్యయనంతో 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ జాతీయ కారిడార్ల నెట్‌వర్క్ గుర్తించబడింది.
***
(Release ID: 2041213)
Visitor Counter : 124
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam