ఆర్థిక మంత్రిత్వ శాఖ

మూలధన లాభాల పన్ను సరళీకరణ, హేతుబద్ధీకరణ


స్వల్పకాలిక మూలధన లాభాలపై 20 శాతం పన్ను, దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను


ఆస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల మినహాయింపు పరిమితి ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెరుగుదల

Posted On: 23 JUL 2024 1:10PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2024-25 కేంద్ర బడ్జెట్‌లో మూలధన లాభాల పన్ను సరళీకరణ, హేతుబద్ధీకరణ చేపట్టారు. 

 

బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాని ప్రకారం కొన్ని ద్రవ్యపరమైన ఆస్తుల విషయంలో స్వల్పకాలిక లాభాలపై ఇకపై 20 శాతం పన్ను ఉంటుంది. అదే సమయంలో ఇతర అన్ని ద్రవ్యపరమైన ఆస్తులు, ద్రవ్యేతర ఆస్తులకు ఇప్పటివరకు ఉన్న పన్ను రేటే వర్తిస్తుంది.
 

అన్ని ద్రవ్యపరమైన, ద్రవ్యేతర ఆస్తుల విషయంలో దీర్ఘకాలిక లాభాలపై 12.5 శాతం పన్ను రేటును మంత్రి ప్రతిపాదించారు. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాల ప్రయోజనాల కోసం కొన్ని ద్రవ్యపరమైన ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.

 

లిస్టైన ద్రవ్యపరమైన ఆస్తుల విషయంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయాన్ని.. లిస్టు కానీ ద్రవ్యపరమైన ఆస్తులు, ద్రవ్యేతర ఆస్తులన్నింటిని విషయంలో రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయాన్ని దీర్ఘకాలంగా వర్గీకరించనున్నట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు.

హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా లిస్ట్‌ కానీ బాండ్లు, డిబెంచర్లు, డెట్ మ్యూచువల్ ఫండ్లు, మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు ఇప్పటికే ఉన్న రేట్ల వద్ద మూలధన లాభాలపై పన్ను విధించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 

 

***



(Release ID: 2036021) Visitor Counter : 19