ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్పాదకతను పెంచడానికి, వాతావరణాన్ని తట్టుకునే రకాల పంటలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ పరిశోధన వ్యవస్థపై ప్రత్యేక దృష్టి


అధిక దిగుబడినిచ్చే 109 కొత్త రకాల పంటలు, 32 కొత్త వాతావరణ అనుకూల రకాల పంటల విడుదల

వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సహకారం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన ఈ విధాన లక్ష్యం

Posted On: 23 JUL 2024 12:58PM by PIB Hyderabad

ఉత్పాదకతను పెంచడం, వ్యవసాయంలో స్థితిస్థాపకతను తీసుకురావడంలో భాగంగా వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, జాతీయ సహకార విధానం వంటి వివిధ చర్యలను 2024-25 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు.


వ్యవసాయ పరిశోధన రూపాంతరం

ఉత్పాదకతను పెంచడానికి, వాతావరణాన్ని తట్టుకునే రకాల పంటలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనా వ్యవస్థపై సమగ్ర సమీక్షను చేపడుతుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ రోజు పార్లమెంటులో 'కేంద్ర బడ్జెట్ 2024-25'ను ప్రవేశపెట్టిన  ఆర్థిక మంత్రి , ప్రైవేట్ రంగంతో సహా అన్ని రంగాలకు నిధులు అందజేస్తామని తెలిపారు. ఈ పరిశోధనల నిర్వహణను ప్రభుత్వం, ఇతర రంగాల నిపుణులు పర్యవేక్షిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. రైతుల సాగు కోసం 109 కొత్త అధిక దిగుబడి పంట రకాలు, 32 కొత్త వాతావరణ అనుకూల వంగడాలను విడుదల చేస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు.

ప్రకృతి వ్యవసాయం

వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రకృతి సేద్యం కోసం సహాయం అందిస్తామని, ఇందులో ధ్రువీకరణ, బ్రాండింగ్ మెకానిజం కూడా ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. శాస్త్రీయ సంస్థలు, ఆసక్తిగల గ్రామ పంచాయతీల ద్వారా అమలు చేస్తామని చెప్పారు. ఇందుకోసం 10 వేల బయో ఇన్ పుట్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాట్లు మంత్రి తెలిపారు.

జాతీయ సహకార విధానం

సహకార రంగం వ్యవస్థాగత, క్రమబద్ధమైన, సర్వతోముఖాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం జాతీయ సహకార విధానాన్ని ఆవిష్కరిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ విధానం లక్ష్యమని ఆర్ధిక మంత్రి చెప్పారు.

 

***
 


(Release ID: 2035811) Visitor Counter : 209