ఆర్థిక మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా భారత్ ను నిలపడంలో మా కృషి


ఉద్యోగాలను సృష్టిస్తుంది, పెట్టుబడులను ఉత్తేజపరుస్తుంది, ఇతర రంగాలకు ఆర్థిక అవకాశాలు అందిస్తుంది: శ్రీమతి నిర్మలా సీతారామన్

విష్ణుపాద ఆలయ కారిడార్, మహాబోధి ఆలయ కారిడార్ సమగ్రాభివృద్ధికి సహకరిస్తాం; ప్రపంచస్థాయి యాత్ర, పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దుతాం

Posted On: 23 JUL 2024 12:45PM by PIB Hyderabad

“దేశాన్ని బలమైన అభివృద్ధి, సర్వతోముఖ శ్రేయస్సు పథంలోకి తీసుకువెళ్లడానికి ప్రజలు మా ప్రభుత్వానికి అద్వితీయమైన అవకాశం కల్పించారు” అని 2024-25 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.

బడ్జెట్ ప్రసంగంలో పర్యాటకంపై మాట్లాడుతూ ‘‘పర్యాటకం మన నాగరికతలో ఎల్లప్పుడూ ఒక భాగం. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా నిలిపే దిశగా మా చర్యలు ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయి, పెట్టుబడులను ఉత్తేజపరుస్తాయి, ఇతర రంగాలకు ఆర్థిక అవకాశాలను అందిస్తాయి’’ అని కేంద్రమంత్రి అన్నారు.

గయలోని విష్ణుపాద ఆలయం, బీహార్ లోని బోధగయలో ఉన్న మహాబోధి ఆలయాలకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘కాశీవిశ్వనాథ ఆలయ కారిడార్ తరహాలో విష్ణుపాద ఆలయ కారిడార్, మహాబోధి ఆలయ కారిడార్లను సమగ్రంగా అభివృద్ధి చేసి, వాటిని ప్రపంచస్థాయి యాత్ర, పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దడంలో తోడ్పాటు అందిస్తాం’’ అని ఆమె ప్రకటించారు.

హిందువులు, బౌద్ధులు, జైనుల్లో రాజగిర్కు అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని; జైన దేవాలయాల సముదాయంలోని 20వ తీర్థంకరుడు మునిసువ్రత ఆలయం ప్రాచీనమైనదని తన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సప్తర్షి లేదా ఏడు వేడినీటి బుగ్గలతో ఏర్పడిన  వెచ్చని నీటి బ్రహ్మకుంద్ పవిత్రమైనదని కూడా ఆమె చెప్పారు. రాజగిర్ కోసం సమగ్రాభివృద్ధి కార్యక్రమం చేపడతామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

నలంద విశ్వవిద్యాలయానికి పునర్వైభవం తీసుకురావడంతో పాటు, దానిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని ఆమె తెలిపారు.

ఒడిషా ప్రకృతి అందాలు, ఆలయాలు, స్మారకాలు, హస్తకళా నైపుణ్యం, వన్యప్రాణి అభయారణ్యాలు, సహజ ప్రకృతి దృశ్యాలు, సహజమైన బీచ్లు దానిని అంతిమ పర్యాటక గమ్యస్థానంగా నిలిపాయని కేంద్ర మంత్రి అన్నారు. “వాటి అభివృద్ధికి మా ప్రభుత్వం సహకరిస్తుంది” అని ఆమె చెప్పారు.

 

***



(Release ID: 2035795) Visitor Counter : 10