ఆర్థిక మంత్రిత్వ శాఖ
కొత్త నైపుణ్య కార్యక్రమాలు, ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న 2023-24 ఆర్థిక సర్వే .
నైపుణ్యాల కల్పనలో పరిశ్రమ ముందుండాలని పిలుపునిచ్చిన సర్వే
నైపుణ్యాలను అప్ గ్రేడ్ చేయటానికి అధిక వృద్ధి సంభావ్య రంగాలలో నైపుణ్యాభివృద్ధిని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలతో అనుసంధానించడం సహాయపడుతుందని తెలిపిన సర్వే
పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో ఏటా 78.51 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న సర్వే.
Posted On:
22 JUL 2024 2:37PM by PIB Hyderabad
అభ్యసన, నైపుణ్య ఫలితాలపై భారతదేశ విద్యా, నైపుణ్య విధానాలు లేజర్ వంటి దృష్టిని అవలంబించాలి, ఒకదానికొకటి అనుగుణంగా ఉండాలి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వే… మధ్యకాలికంగా ‘వికసిత భారత్-2047‘ సమిష్టి లక్ష్యాన్ని సాధించడానికి గుర్తించిన ఆరు ప్రధాన స్తంభాలలో ఇది ఒకటని తెలిపింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ఈపీ (నూతన విద్యా విధానం) 2020 మంచి ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తోందని పేర్కొన్న సర్వే, కొత్త నైపుణ్య కార్యక్రమాలు, ఇప్పటికే ఉన్న నైపుణ్య కార్యక్రమాలను మెరుగుపరచటం ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యతలుగా కొనసాగాలని పేర్కొంది.
విద్యా వ్యవస్థ, ముఖ్యంగా పాఠశాలల్లో విద్యావ్యవస్థ నిర్మించిన పునాదులపై నైపుణ్యాలను పొందుతారు. అందువల్ల మౌలికమైన అక్షరాభ్యాసం, సంఖ్యాశాస్త్రం, గ్రేడ్‌లకు అనుగుణంగా వచ్చే అభ్యసన ఫలితాలపై పాఠశాల విద్య దృష్టి సారించాలని సర్వే తెలిపింది. విద్యా సంస్థలతో కలిసి పరిశ్రమలు పనిచేయటం వల్ల వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందని, నైపుణ్య కల్పనలో పరిశ్రమ ముందడుగు వేయాలని సర్వే పిలుపునిచ్చింది. నైపుణ్య కల్పన బాధ్యతను కేవలం ప్రభుత్వానికే వదిలివేయరాదని, వాస్తవానికి ఈ విషయంలో పరిస్థితి వ్యతిరేకంగా ఉండాలని పేర్కొంది.
భారత యువత ఆకాంక్షలు, సామర్థ్యాలకు అనుగుణంగా ఉద్యోగ, వ్యవస్థాపక అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని 2023-24 ఆర్థిక సర్వే పేర్కొంది. అన్ని సామాజిక-ఆర్థిక వర్గాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తుల నిష్పత్తిలో గణనీయమైన మెరుగుదల ఉందని, 15-29 సంవత్సరాల వయస్సు గల యువతలో 4.4 శాతం మంది వృత్తి/సాంకేతిక శిక్షణ పొందారని, మరో 16.6 శాతం మంది అనధికారిక వనరుల ద్వారా శిక్షణ పొందారని సర్వే తెలిపింది.
నైపుణ్య డిమాండ్, పని స్వభావాన్ని మార్చేసే ఆటోమేషన్, వాతావరణ మార్పులపై చర్యలు.. ఉత్పత్తులు, సేవల డిజిటలైజేషన్ వంటి ప్రపంచ మెగాట్రెండ్స్ మధ్య విద్య, కార్మిక మార్కెట్లలో జరుగుతున్న మార్పులకు నైపుణ్యాభివృద్ధి కేంద్ర బిందువుగా ఉందని సర్వే పేర్కొంది. 28 సంవత్సరాల సగటు వయస్సుతో యువత ఎక్కువున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉపాధి నైపుణ్యాలతో కూడిన, పరిశ్రమ అవసరాలకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని పెంచటం ద్వారా భారతదేశం తన జనాభా డివిడెండ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది.
భారతదేశం తన యువ శ్రామిక శక్తి సామర్థ్యాన్ని గుర్తించడమే కాకుండా, ఇంత పెద్ద జనాభాకు నైపుణ్యంతో ముడిపడి ఉన్న సమస్యలను కూడా గుర్తించిందని సర్వే పేర్కొంది. అంతరాలను పూడ్చడం, పరిశ్రమ నిమగ్నతను మెరుగుపరచడం, క్వాలిటీ అస్యూరెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేయడం, సాంకేతికతను ఉపయోగించుకోవడం, అప్రెంటిస్షిప్ అవకాశాలను విస్తరించడం…నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపన విషయంలో జాతీయ విధానం(ఎన్‌పీఎస్‌డీఈ- నేషనల్ పాలసీ ఆన్ స్కిల్ డెవలాప్మెంట్ అండ్ ఎంటప్రిన్యూర్షిప్) దృష్టి పెడుతోంది. భారత్‌లో విద్య-ఉపాధి అంతరాన్ని పూడ్చే అపారమైన సామర్థ్యం కలిగి జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)తో కలిపి దీనికి ఉందని సర్వే పేర్కొంది.
శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత జనాభాలో అరవై ఐదు శాతం మంది 35 ఏళ్ల లోపు వారేనని, 51.25 శాతం మంది యువత ఉపాధి పొందుతున్నారని సర్వే పేర్కొంది. అయితే గత దశాబ్ద కాలంలో ఇది 34 శాతం నుంచి 51.3 శాతానికి మెరుగుపడిందని తెలిపింది.
వృద్ధికి, చేరికకు ఉత్పాదక ఉద్యోగాలు చాలా కీలకమని పేర్కొన్న ఈ సర్వే, భారతదేశ శ్రామిక శక్తిని దాదాపు 56.5 కోట్లుగా అంచనా వేసింద. ఇది 2044 వరకు పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. పెరుగుతున్న శ్రామిక శక్తి అవసరాలు తీర్చేందుకు భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో ఏటా దాదాపు 78.51 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని అంచనా వేసింది. ఏదేమైనా, ఇన్ని ఉద్యోగాలను సృష్టించడానికి, వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచచుతూనే వ్యవసాయం వెలుపల, ముఖ్యంగా వ్యవస్థీకృత తయారీ, సేవలలో ఉత్పాదక ఉద్యోగాలు వేగంగా వృద్ధి చెందడానికి పరిస్థితులను సృష్టించాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది.
రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్యక్రమాల కలయిక ద్వారా వివిధ నైపుణ్య కార్యక్రమాల ఫలితాలను గరిష్టంగా పెంచాలని, రెండు రంగాలకు మరింత ప్రయోజనం చేకూర్చే ఇతర ఉపాధి-కేంద్రీకృత కార్యక్రమాలను ఏకకాలంలో ఉపయోగించుకోవాలని సర్వే పిలుపునిచ్చింది. నైపుణ్యాలను మెరుగుపరచడానికి బొమ్మలు, దుస్తులు, పర్యాటకం, లాజిస్టిక్స్, జౌళి, చర్మ ఉత్పత్తులు వంటి అధిక వృద్ధికి అవకాశం ఉన్న రంగాల్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకంతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలను అనుసంధానం చేయడం సహాయపడుతుంది. అప్రెంటిస్షిప్‌లకు ప్రాచుర్యం కల్పించే విషయంలోనూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో వెసులుబాటు కల్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది.
***
(Release ID: 2035467)
Visitor Counter : 242