ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెరుగుతున్న సవాళ్లకు అనుగుణంగా భారతదేశ పురోగతిని కొనసాగించుట, వేగవంతం చేయుటకు ప్రభుత్వ యంత్రాంగాలను పునరుద్ధరించి, బలోపేతం చేయు దిశగా ప్రత్యేక కృషి అవసరం – ఆర్థిక సర్వే 2023-24


కేంద్ర మంత్రిత్వ శాఖలలోని సీనియర్ ర్యాంక్‌లలోకి లేటరల్ ఎంట్రీ విధాన ప్రారంభాన్ని గుర్తించి, దాని విస్తరణకు సిఫార్సు చేసిన ఆర్థిక సర్వే

పాలసీ ఫలితాల స్థాయి, వేగాన్ని పెంచేందుకు జవాబుదారీతనం గల యంత్రాంగాలు, పద్ధతులు అవసరం - సర్వే

Posted On: 22 JUL 2024 3:24PM by PIB Hyderabad

మధ్యకాలిక ఔట్‌లుక్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వ్యూహం ఫలవంతం అయ్యేలా ప్రభుత్వ సామర్థ్యాలను పెంపొందించడం చాలా కీలకం. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో సమర్పించిన ఆర్థిక సర్వే 2023-24 ద్వారా ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొని భారతదేశ పురోగతిని కొనసాగించడం, వేగవంతం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాలను పునరుద్ధరించి వాటిని బలోపేతం చేయడం కోసం ప్రత్యేక కృషి అవసరం అని సర్వే పేర్కొన్నది. 2014 నుండి, భారతదేశం కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనలో అలాగే పౌరుల శ్రేయస్సు లక్ష్యంగా ప్రత్యక్ష ప్రయోజన పథకాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని, ఈ పరివర్తన ప్రయత్నాలలో సివిల్ సర్వీసెస్ ప్రధాన భూమిక పోషించినట్లు సర్వే తెలిపినది.

ఒక సమస్యను సులభంగా పరిష్కరించగల ఉప-విభాగాలుగా విభజించే మిషన్ కర్మయోగిని ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ సామర్థ్యాలను పెంపొందించడంలో గల సవాళ్లకు ప్రభుత్వం ధీటుగా స్పందించినట్లు సర్వే పేర్కొన్నది. కార్యాలయంలోని బాధ్యతలు, కార్మికుల సామర్థ్యాలను అనుసంధానించడం ద్వారా ఈ కార్యక్రమం సామర్థ్యాల పెంపు, మానవ వనరుల నిర్వహణ మధ్య అత్యావశ్యకమైన వారధిని రూపొందిస్తున్నట్లు సర్వే పేర్కొన్నది.

సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, సర్వీస్‌కు ముందు శిక్షణ, వృత్తిలో నిరంతర అభివృద్ధి పరంగా సివిల్ సర్వెంట్ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించేందుకు అవసరమైన నిర్దిష్ట సామర్థ్యాలను పెంపొందించేలా రూపొందించవచ్చని సర్వే పేర్కొన్నది. iGOT కర్మయోగి ప్లాట్‌ఫామ్ అనతి కాలంలోనే ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది, సివిల్ సర్వెంట్స్‌ వారికి అనుకూలమైన, అవసరమైన సామర్థ్య-నిర్మాణ మాడ్యూల్స్‌ యాక్సెస్ చేయడానికి, వారి సామర్థ్య అవసరాలు, అంతరాలను తెలుసుకోవడానికి, వారి విభాగాల గురించిన పరిజ్ఞానాన్ని, నేర్చుకున్న విషయాలను పంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.

ఇటీవలి కాలంలో, ప్రభుత్వం పారదర్శక ప్రక్రియ ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలలోని సీనియర్ ర్యాంక్‌లలోకి లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రారంభించడం మంచి విషయమని, అయితే దీనిని గణనీయంగా విస్తరించాల్సిన అవసరం ఉందని కూడా సర్వే స్పష్టం చేసింది. నైపుణ్యాలు, యోగ్యతలు, వైఖరులను రీఛార్జ్, రీబూట్ చేసేలా అన్ని స్పెషాలిటీలలోని సివిల్ సర్వెంట్‌లకు ప్రాథమిక, మిడ్-కెరీర్ శిక్షణను ప్రత్యేకంగా రూపొందించాలని సర్వే సూచించినది.

సీనియర్ భాద్యతలలో డిమాండ్‌లకు అనుగుణంగా, ఉత్పాదకంగా, ప్రయోజనకరంగా ఎదగడానికి పదవీ కాలం చాలా కీలకం. విధాన ఫలితాలను తగిన స్థాయిలో, వేగంతో రాబట్టేందుకు జవాబుదారీగా ఉండే యంత్రాంగాలు, పద్ధతులు అవసరం. లక్ష్యాలు, చర్యలను గురించి సంవత్సరం ప్రారంభంలో అలాగే చివరిలో - సీనియర్ స్థాయిలలో వార్షిక చర్చలు నిర్వహించడం - వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనానికి నాంది పలుకుతుందని సర్వే పేర్కొన్నది.

***


(Release ID: 2035453) Visitor Counter : 290