ప్రధాన మంత్రి కార్యాలయం
టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ఫోన్‌లో ప్రధాని మోదీ అభినందన
Posted On:
30 JUN 2024 2:06PM by PIB Hyderabad
ఐసిసి టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత పురుషుల జట్టుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో జట్టు సభ్యులు విలక్షణ ప్రతిభ, నైపుణ్యం, పట్టుదల ప్రదర్శించారంటూ శ్రీ మోదీ కొనియాడారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘ఇవాళ భారత క్రికెట్ జట్టుకు ఫోన్ చేసి, మాట్లాడాను. టి20 ప్రపంచకప్‌లో వారి విలక్షణ విజయానికి అభినందనలు తెలిపాను. ఈ టోర్నమెంటులో వారు ఆద్యంతం అద్భుత నైపుణ్యం, పట్టుదల ప్రదర్శించారు. వారి దీక్షాదక్షతలు ప్రతి క్రీడాకారుడికీ అంతులేని స్ఫూర్తినిస్తాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అలాగే టోర్నమెంటు మొదలైనప్పటినుంచి అకుంఠిత దీక్షతో తిరుగులేని విజయాలు సొంతం చేసుకోవడం ప్రతిభ, నైపుణ్యం, పట్టుదల ప్రదర్శించిన జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి, జట్టు ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్‌లను ప్రశంసిస్తూ సందేశాలు పంపారు:
‘‘ప్రియమైన రోహిత్ శర్మ @ImRo45 మీరు ప్రతిభకు నిలువెత్తు రూపంగా నిలిచారు. మీ దూకుడైన ఆలోచన దృక్పథం, బ్యాటింగ్, నాయకత్వం భారత జట్టుకు కొత్త కోణాన్ని జోడించాయి. టి20 క్రికెట్‌కు మీరు వీడ్కోలు ప్రకటించినా ఈ పోటీల్లో ‘హిట్ మ్యాన్’’ మీ మారుపేరును అనేకసార్లు నిజం చేశారు. అందుకే క్రికెట్ ప్రేమికులంతా కలకాలం మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా స్మరించుకుంటారు. ఇవాళ మీతో మాట్లాడటం నాకెంతో సంతోషం కలిగించింది’’ అని పేర్కొన్నారు. అలాగే...
‘‘ప్రియమైన విరాట్ కోహ్లి @imVkohli మీతో నా సంభాషణ ఆనందదాయకం. తుది పోరులో అసలుసిసలు ఇన్నింగ్స్‌తో మీరు భారత బ్యాటింగ్ శ్రేణిని అద్భుతంగా ఉత్సాహపరిచారు. అన్నిరకాల క్రికెట్ ఫార్మాట్లలో మీ ఆటతీరుతో మెరుపులు మెరిపించా. టి20 క్రికెట్‌కు మీరు రిటైర్మెంట్ ప్రకటించినా, నవతరం ఆటగాళ్లకు మీరు సదా స్ఫూర్తిప్రదాతగా నిలుస్తారన్నది నా దృఢ విశ్వాసం.
ఇక రాహుల్ ద్రావిడ్ శిక్షణను కొనియాడుతూ- ’’శిక్షకుడుగా రాహుల్ ద్రావిడ్ పయనం భారత క్రికెట్ విజయానికి బాటలు వేసింది. మొక్కవోని చిత్తశుద్ధి, వ్యూహాత్మక ప్రణాళికలు-సూచనలతో అసలుసిసలు ప్రతిభకు సానబెట్టి, జట్టును పరివర్తనాత్మకంగా తీర్చిదిద్దారు. భవిష్యత్తరాలకు స్ఫూర్తినిచ్చే రీతిలో తనవంతు పాత్ర పోషించిన ఆయనకు కృతజ్ఞతలు. ఈ ప్రపంచ కప్ సాధనకు ప్రేరకుడై యావద్దేశాన్ని ఆయన ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు. ఆయనను అభినందించడం నాకూ ఎనలేని సంతోషాన్నిస్తోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2029843)
Visitor Counter : 55
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam