సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సిబ్బంది-ప్రజా సమస్యలు-పెన్షన్ల శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ బాధ్యతల స్వీకారం


‘‘ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో పదేళ్లుగా దేశంలో చేపట్టిన విప్లవాత్మక
పాలన సంస్కరణలు ఆయన ప్రస్తుత పదవీ కాలంలోనూ కొనసాగుతాయి’’;

తనపై ఎంతో నమ్మకంతో వరుసగా మూడోసారి ఈ పదవీ బాధ్యతలు
అప్పగించడంపై ప్రధానమంత్రికి డాక్టర్ జితేంద్ర సింగ్ కృతజ్ఞతలు

Posted On: 11 JUN 2024 12:14PM by PIB Hyderabad

   కేంద్ర సిబ్బంది-ప్రజా సమస్యలు-పెన్షన్ల శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ వరుసగా మూడోసారి ఇవాళ న్యూఢిల్లీలోని నార్త్ నార్త్ బ్లాక్‌లో ఉదయం 10 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘‘ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో పదేళ్లుగా దేశంలో చేపట్టిన విప్లవాత్మక పాలన సంస్కరణలు ఆయన ప్రస్తుత పదవీ కాలంలోనూ కొనసాగుతాయి’’ అని చెప్పారు.

 

కేంద్ర సిబ్బంది-ప్రజా సమస్యలు-పెన్షన్ల శాఖ సహాయ

మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్

అలాగే తనపై ఎంతో నమ్మకంతో వరుసగా మూడోసారి ఈ బాధ్యతలు అప్పగించడంపై ప్రధాని మోదీకి డాక్టర్ జితేంద్ర సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, లోక్‌సభకు జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సింగ్ 2014 నుంచి ఇదే శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తుండటం గమనార్హం.

పదవీ బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్‌కు కేంద్ర

సిబ్బంది-శిక్షణ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్.రాధా చౌహాన్ స్వాగతం

 

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వికసిత భారత్ స్వప్నం సాకారమయ్యేదాకా సంస్కరణలు కొనసాగుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా చేస్తున్న కృషికి దీన్ని కొనసాగింపుగా ఆయన పేర్కొన్నారు. తమ శాఖ విజయాలను ఉటంకిస్తూ- ప్రధానమంత్రి మోదీ దిశానిర్దేశం మేరకు గత పదేళ్లలో పాలనా సంస్కరణలు మార్గనిర్దేశం చేశాయని మంత్రి చెప్పారు. కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన సూత్రమే వీటికి స్ఫూర్తినిస్తున్నదని తెలిపారు. జీవన సౌలభ్యం కల్పన దిశగా పౌర కేంద్రక విధానాలకు ప్రాధాన్యం పెరుగుతున్నదని పేర్కొన్నారు. వితంతువులతోపాటు విడాకులు పొందిన కుమార్తెలకు పెన్షన్లు, వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుసంబంధిత నియమ-నిబంధనల్లో సంస్కరణలు, ఉద్యోగాలకు ఎంపికలో కోసం ఇంటర్వ్యూ ప్రక్రియకు స్వస్తి పలకడం, మారుమూల ప్రాంతాల ఔత్సాహికులకు సమాన అవకాశాల కల్పన, కాలంచెల్లిన పాత చట్టాలు, నిబంధనల రద్దు వంటి సంస్కరణల గురించి ఆయన గుర్తుచేశారు. పరిపాలన సంస్కరణలు, కర్మయోగి మిషన్ వంటివి గత రెండు దఫాల పాలన కాలంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల్లో కొన్ని మాత్రమేనని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఏర్పాటు చేసిన ‘సిపిగ్రామ్స్’ (CPGRAMS) వంటి వ్యవస్థ ప్రపంచానికే ఒక ఆదర్శమని ఆయన నొక్కిచెప్పారు.

   డాక్టర్ జితేంద్ర సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాలన సంస్కరణలు-ప్రజా సమస్యల విభాగం కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్, సిబ్బంది-శిక్షణ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్.రాధా చౌహాన్, ఇతర సీనియర్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

***



(Release ID: 2024502) Visitor Counter : 23