ప్రధాన మంత్రి కార్యాలయం

అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


భారత-ఉక్రెయిన్ భాగస్వామ్యం మరింత పటిష్ఠం చేసుకునే చర్యలపై చర్చించిన నేతలు

ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భారతదేశం అనుసరిస్తున్న వైఖరిని పునరుద్ఘాటించిన పిఎం; సంఘర్షణల పరిష్కారానికి చర్చలు, దౌత్యం అనుసరించాలని పిలుపు

శాంతియుత పరిష్కారం సాధించేందుకు భారత్ తన పరిధిలో చేయగలిగిన ప్రతీ ఒక్క పని చేస్తుందని నొక్కి చెప్పిన పిఎం

ఉక్రెయిన్ ప్రజలకు భారతదేశం మానవతాపూర్వక సహాయం కొనసాగించడాన్ని ప్రశంసించిన అధ్యక్షుడు జెలెన్ స్కీ


Posted On: 20 MAR 2024 6:19PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు మాననీయ వోలదిమిర్ జెలెన్ స్కీతో టెలిఫోన్ లో సంభాషించారు.

విభిన్న రంగాల్లో భారత-ఉక్రెయిన్  భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు గల అవకాశాలపై ఉభయ నాయకులు చర్చించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ గురించి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భారతదేశం అనుసరిస్తున్న వైఖరిని పిఎం పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యమే మన ముందున్న దారి అని పిలుపు ఇచ్చారు.

సంఘర్షణలో ఉన్న వర్గాల సమస్యల పరిష్కారానికి సత్వర, శాంతియుత పరిష్కారానికే భారత్ మద్దతు ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు. శాంతియుత పరిష్కార సాధన కోసం భారతదేశం తనకు అందుబాటులో ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తుందని ఆయన చెప్పారు.

ఉక్రెయిన్  ప్రజలకు భారతదేశం మానవతాపూర్వక సహాయం కొనసాగించడాన్ని అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశంసించారు.

వీలైనప్పుడల్లా పరస్పరం సంభాషించుకునేందుకు ఇరువురు నాయకులు అంగీకరించారు.



(Release ID: 2015881) Visitor Counter : 53