ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వివిధ రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం.. శంకుస్థాపన


ద్వారకా ఎక్స్‌‘ప్రెస్‌ వే పరిధిలో 19 కిలోమీటర్ల హర్యానా విభాగం ప్రారంభం;

ప్రధాని చేతులమీదుగా 2024 తొలి మూడు నెలల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం.. ప్రారంభం లేదా శంకుస్థాపన;
‘‘సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడమే మోదీ గ్యారంటీ’’;
‘‘ఈ 21వ శతాబ్దపు భారత్ దూరదృష్టి.. భారీ సంకల్పాలతో ముందుకెళ్తున్న దేశం’’;

‘‘ లోగడ ఆలస్యం ఒక జాఢ్యం.. నేడు ఆచరణ అవశ్యం.. అభివృద్ధి నిత్యసత్యం’’

Posted On: 11 MAR 2024 3:30PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన 112 జాతీయ ర‌హ‌దారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాప‌న చేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞాన మాధ్యమం ద్వారా దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు మమేకమయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ- అనేక ప్రధాన కార్యక్రమాలను ఢిల్లీలో నిర్వ‌హించే సంప్రదాయం మారిపోగా, నేడు దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో నిర్వ‌హిస్తుండటాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆధునిక అనుసంధానం దిశగా దేశం ఇవాళ మరో పెద్ద, కీలక ముందడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా మైలురాయి వంటి ద్వారకా ఎక్స్‌‘ప్రెస్‌ వే పరిధిలో 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా విభాగాన్ని జాతికి అంకితం చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఢిల్లీ-హర్యానాల మధ్య ప్రయాణానుభవం ఇక నిత్యం మెరుగ్గా ఉంటుందన్నారు. అంతేకాకుండా ‘‘వేగం పెంచే గేరు మార్పు వాహనాలకే కాకుండా ఈ ప్రాంత ప్రజల దైనందని జీవనానికీ వర్తిస్తుంది’’ అని చమత్కరించారు.

   ప్రాజెక్టుల అమలు వేగంలో మార్పును నొక్కిచెబుతూ- కొత్త సంవత్సరమైన 2024 తొలి మూడు నెలల్లోపే రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేయడం లేదా శంకుస్థాపన చేయబడ్డాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా నేడు వివిధ రాష్ట్రాల పరిధిలో రూ.1 లక్ష కోట్లకుపైగా విలువైన 100కుపైగా ప్రాజెక్టులను ప్రారంభించామని పేర్కొన్నారు. వీటిలో దక్షిణ భారతంలోని కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతంలోని ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి పనులున్నాయని తెలిపారు. అలాగే తూర్పు భారతంలో బెంగాల్, బీహార్ రాష్ట్రాలతోపాటు పశ్చిమ భారతంలోని మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన ప్రాజెక్టులు కూడా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో అమృత్‌సర్-భటిండా-జామ్‌నగర్ కారిడార్‌లో 540 కిలోమీటర్ల మేర పెంపుసహా బెంగుళూరు రింగ్ రోడ్ అభివృద్ధి కూడా అంతర్భాగంగా ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు.

   సమస్యలను అవకాశాలుగా మలచుకోవడంలో మార్పును ప్రముఖంగా ప్రస్తావిస్తూ- తద్వారా మౌలిక సదుపాయాల కల్పన తెచ్చిన పరివర్తనాత్మక ప్రభావాన్ని నేడు ప్రత్యక్షంగా చూస్తున్నామని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడంలోగల ప్రాముఖ్యాన్ని నొక్కిచెబుతూ, ఇది తమ పాలన విశిష్టతలలో కీలకమైదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ద్వారకా ఎక్స్‌‘ప్రెస్‌ వే నిర్మాణాన్ని ప్రధాని మోదీ ఉదాహరించారు. ఆటంకాలను అభివృద్ధికి బాటలుగా మార్చుకోవడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ఇప్పుడు ఎక్స్‌‘ప్రెస్‌ వే నిర్మితమైన ప్రదేశం ఒకనాడు ప్రమాదకరమైనదిగా పరిగణించబడిందని గుర్తుచేశారు. చీకటి పడితే ప్రజలు ఇటువైపు రావడానికి కూడా భయపడేవారని చెప్పారు. అయితే, ఇవాళ ఇది జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌) వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసే కీలక సంస్థలకు కేంద్రబిందువుగా మారుతుందని పేర్కొన్నారు.

   ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ నిర్మించిన ద్వారకా ఎక్స్‌‘ప్రెస్‌ వే వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ఇలాంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అనుసంధానం మెరుగుపడి, ఆర్థిక కార్యకలాపాల వేగం పెరుగుతుందని చెప్పారు. దీంతోపాటు ‘ఎన్‌సిఆర్‌’ మరింత మెరుగ్గా ఏకీకృతం కావడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. సకాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పూర్తిపై హర్యానా ప్రభుత్వం... ముఖ్యంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. వికసిత భారత్... వికసిత హర్యానాలకు కీలకమైన రాష్ట్రస్థాయి మౌలిక సదుపాయాల ఆధునికీకరణలో ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై తమ ప్రభుత్వ సమగ్ర దృక్పథాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. ద్వారకా ఎక్స్‌‘ప్రెస్‌ వే పరిధిలో మిగిలిన భాగంతోపాటు పరిసర ఎక్స్‌‘ప్రెస్‌ వేలు, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌‘ప్రెస్‌ వే తదితర ప్రధాన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయాలని ఆయన నిర్దేశించారు. కాగా, ఈ ప్రాంతంలో వాహన రాకపోకల రద్దీతోపాటు కాలుష్యం తగ్గింపు లక్ష్యంగా ఈ ప్రాజెక్టులతోపాటు మెట్రో లైన్ల విస్తరణ, అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం సాగుతుండటం గమనార్హం. ఈ మేరకు ‘‘ప్రస్తుత 21వ శతాబ్దపు భారత్ దూరదృష్టితో... భారీ సంకల్పాలతో ముందడుగు వేస్తున్న దేశం’’ అని ప్రధాని అభివర్ణించారు.

   మౌలిక సదుపాయాల అభివృద్ధి-పేదరిక నిర్మూలన మధ్యగల సంబంధాన్ని కూడా ప్రధానమంత్రి విడమరచి చెప్పారు. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రోడ్లు-డిజిటల్ అనుసంధానం గ్రామీణులకు కొత్త అవకాశాలను ఎలా సృష్టిస్తున్నదీ వివరించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలతో ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర రంగాల్లో అవసరమైన సేవలు గ్రామీణ భారతానికి అందివచ్చాయని, వాటితోపాటు కొత్త అవకాశాలు కూడా పుట్టుకొచ్చాయని తెలిపారు. ‘‘ఇటువంటి కార్యక్రమాలే గడచిన పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులను పేదరిక విముక్తులను చేయడంలో తోడ్పడ్డాయి. తద్వారా భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘‘దేశంలో వేగంగా సాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులు త్వరలోనే ప్రపంచంలో భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థికశక్తిగా మార్చగలవు’’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగిరపరచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు యువతకు అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని ఆయన నొక్కి చెప్పారు.

   ఈ సందర్భంగా సుదీర్ఘ కాలం స్తంభించిన అనేక ప్రాజెక్టులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తికావడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు తూర్పు పరిసర ఎక్స్‌‘ప్రెస్‌ వే (2008లో ప్రకటించగా 2018లో పూర్తి) పదేళ్లు, ద్వారకా ఎక్స్‌‘ప్రెస్‌ వే కూడా 20 ఏళ్లుగా స్తంభించినట్లు గుర్తుచేశారు. ‘‘ఇవాళ మా ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకైనా పునాది రాయి వేయడం ఎంత ముఖ్యమో... నిర్దేశిత గడువులో దాన్ని పూర్తిచేయడానికి అంతే ప్రాధాన్యం ఇస్తోంది. అంతే తప్ప దగ్గరలో ఎన్నికలున్నాయేమోననే ధ్యాస మాకుండదు’’ అన్నారు. అలాగే గ్రామాల్లో లక్షల కిలోమీటర్ల మేర ఆప్టిక్‌ ఫైబర్‌ లైన్లు, చిన్న నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణం, గ్రామీణ రహదారులు వంటి ప్రాజెక్టులు ఎన్నికల వేళతో సంబంధం లేకుండా పూర్తయ్యాయని గుర్తుచేశారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘లోగడ ఆలస్యం ఒక జాఢ్యం. కానీ, నేడు ఆచరణ అవశ్యం.. అభివృద్ధి నిత్యసత్యం’’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 9 వేల కిలోమీటర్ల హైస్పీడ్ కారిడార్‌ రూపకల్పనపై దృష్టి సారించామని, ఇందులో ఇప్పటికే 4 వేల కిలోమీటర్లు పూర్తయిందని చెప్పారు. అలాగే 2014లో 5 నగరాలకు పరిమితమైన మెట్రో నేడు 21 నగరాలకు విస్తరించిందని చెప్పారు. చివరగా- ‘‘ఇదంతా అభివృద్ధే లక్ష్యంగా సాగుతోంది. సదుద్దేశాలుంటే ఇలాంటి సత్ఫలితాలు సాధ్యం. కాబట్టి, రాబోయే ఐదేళ్లలో ప్రగతి వేగం అనేక రెట్లు ఇనుమడిస్తుంది’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్, శ్రీ క్రిషన్ పాల్, హర్యానా ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌతాలా తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   జాతీయ రహదారి నం.48 పరిధిలో ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య వాహన రాకపోకల రద్దీ తగ్గింపు లక్ష్యంగా చేపట్టిన మైలురాయి ప్రాజెక్టు ద్వారకా ఎక్స్‌‘ప్రెస్‌ వేలో హర్యానా విభాగాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ విభాగం 8 వరుసల రహదారి కాగా, 19 కిలోమీటర్ల హర్యానా విభాగాన్ని రూ.4,100 కోట్లతో నిర్మించారు. ఇందులో ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి రైల్-ఓవర్-బ్రిడ్జ్ (ఆర్ఒబి) వరకుగల 10.2 కిలోమీటర్ల ప్యాకేజీ, బసాయ్ ‘ఆర్ఒబి’ నుంచి ఖేర్కి దౌలా వరకు 8.7 కిలోమీటర్ల రెండో ప్యాకేజీ అంతర్భగంగా ఉన్నాయి. ఇది ఢిల్లీలోని ‘ఐజిఐ’ విమానాశ్రయం నుంచి గురుగ్రామ్ బైపాస్‌ రహదారిని నేరుగా అనుసంధానిస్తుంది.

   ప్రధానమంత్రి ప్రారంభించిన ఇతర ప్రధాన ప్రాజెక్టులలో నాంగ్లోయ్-నజఫ్‌గఢ్ రోడ్ నుంచి ఢిల్లీలోని సెక్టార్ 24 ద్వారక సెక్షన్ వరకు 9.6 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల పట్టణ విస్తరణ రహదారి-II ప్యాకేజీ 3; అలాగే ఉత్తరప్రదేశ్‌లో రూ.4,600 కోట్ల లక్నో రింగ్ రోడ్డు 3 ప్యాకేజీలు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌హెచ్‌-16 పరిధిలో రూ.2,950 కోట్లతో నిర్మించిన ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి విభాగం రహదారి; హిమాచల్ ప్రదేశ్‌లో రూ.3,400 కోట్లతో ఎన్‌హెచ్‌-21 పరిధిలో కిరాత్‌పూర్-నెర్‌చౌక్ విభాగం (2 ప్యాకేజీలు); కర్ణాటకలో రూ.2,750 కోట్లతో నిర్మించిన దోబస్‌పేట్-హెస్కోటే విభాగం సహా దేశవ్యాప్తంగా రూ.20,500 కోట్ల వ్యయంతో నిర్మించిన మరో 42 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.

   దేశవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.14,000 కోట్లతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల పరిధిలో బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌‘ప్రెస్‌వే 14 ప్యాకేజీలు; కర్ణాటకలో రూ.8,000 కోట్లతో ఎన్‌హెచ్‌-748ఎ పరిధిలోని బెల్గాం-హుంగుండ్-రాయచూర్ విభాగంలో 6 ఆరు ప్యాకేజీలు; హర్యానాలో రూ.4,900 కోట్లతో షామ్లీ-అంబాలా హైవే 3 ప్యాకేజీలు; పంజాబ్‌లో రూ.3,800 కోట్లతో అమృత్‌సర్-భటిండా కారిడార్‌ సంబంధిత 2 ప్యాకేజీలు సహా మొత్తం రూ.32,700 కోట్లతో ఇతర రాష్ట్రాల్లో 39 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

   ఈ ప్రాజెక్టులు జాతీయ రహదారి నెట్‌వర్క్ వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తాయి. అలాగే సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచడంతోపాటు ఉద్యోగ అవకాశాల సృష్టిసహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వ్యాపార-వాణిజ్యాలను ప్రోత్సహించడానికి తోడ్పడతాయి.

 


(Release ID: 2013500) Visitor Counter : 195