ప్రధాన మంత్రి కార్యాలయం

కేరళలో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి ఎస్ ఎస్ సి) ను సందర్శించిన ప్రధాన మంత్రి


సుమారు రూ.1800 కోట్ల విలువైన మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం
గంగన్ యాన్ పురోగతి పై సమీక్ష; వ్యోమగాములుగా ఎంపికైనవారికి 'వ్యోమగామి వింగ్స్ ‘ ప్రదానం

“కొత్త కాలచక్రంలో, భారతదేశం ప్రపంచ వ్యవస్థలో తన స్థలాన్ని నిరంతరం విస్తరిస్తోంది; ఇది మన అంతరిక్ష కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తుంది"

“నలుగురు వ్యోమగాములు కేవలంn నాలుగు పేర్లు లేదా వ్యక్తులు కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే నాలుగు శక్తులు “

" ఎంపికైన నలుగురు వ్యోమగాములు నేటి భారతదేశ విశ్వాసం, ధైర్యం, పరాక్రమం , క్రమశిక్షణకు ప్రతీకలు”

'40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు సమయం, కౌంట్ డౌన్, రాకెట్ మనదే‘

“భారత్ ప్రపంచంలోనే టాప్-3 ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది; అదే సమయంలో దేశ గగన్ యాన్ కూడా మన అంతరిక్ష రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది”.

“అంతరిక్ష రంగంలో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషిస్తోంది”

“అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయం శాస్త్రీయ బీజాలు నాటుతోంది”

Posted On: 27 FEB 2024 1:19PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురంలో విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి.ఎస్.ఎస్.సి)ని సందర్శించారు సుమారు రూ.1800 కోట్ల విలువైన మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఎస్ఎల్ వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పిఐఎఫ్); . మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో కొత్త 'సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ'; తిరువనంతపురంలోని వి.ఎస్.ఎస్.సి వద్ద 'ట్రైసోనిక్ విండ్ టన్నెల్' ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా గగన్ యాన్ మిషన్ పురోగతిని సమీక్షించిన మోదీ,  మిషన్ ద్వారా అంతరిక్షం లోకి వెళ్లేందుకు నియమితులైన నలుగురు వ్యోమగాములకు 'వ్యోమగామి వింగ్స్‘ ప్రదానం చేశారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వీరిలో ఉన్నారు. 

భారత్ మాతాకీ జై నినాదం తో  సభా ప్రాంగణం మారుమోగుతుండగా, ‘వ్యోమగాములకు నిలబడి అభినందనలు తెలపాలని‘ పిలుపు ఇస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ప్రతి దేశ అభివృద్ధి ప్రయాణంలో వర్తమానాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలను నిర్వచించే ప్రత్యేక క్షణాలు ఉన్నాయని, ఇది భూమి, గాలి, నీరు , అంతరిక్షంలో దేశం సాధించిన చారిత్రాత్మక విజయాలను ప్రస్తుత తరం గర్వించగల సందర్భం అని అన్నారు. అయోధ్య నుంచి తయారైన కొత్త 'కాలచక్రం' ప్రారంభం గురించి తాను చేసిన ప్రకటనను గుర్తు చేసిన ప్రధాని మోదీ, భారతదేశం ప్రపంచ క్రమంలో తన స్థలాన్ని నిరంతరం విస్తరిస్తోందని, దేశ అంతరిక్ష కార్యక్రమంలో దాని దృశ్యాలను చూడవచ్చని అన్నారు.

 

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించిన సందర్భంగా చంద్రయాన్ విజయాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. "ఈ రోజు శివ-శక్తి కేంద్రం యావత్ ప్రపంచానికి భారతీయ పరాక్రమాన్ని పరిచయం చేస్తోంది", అని ఆయన అన్నారు. వ్యోమగాములుగా నియమితులైన నలుగురు గగన్ యాన్ ప్రయాణికుల పరిచయాన్ని చారిత్రాత్మక సందర్భంగా ఆయన అభివర్ణించారు. "వారు నలుగురు కేవలం పేర్లు లేదా వ్యక్తులు కాదు, వారు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే నాలుగు శక్తులు” అని ప్రధాన మంత్రి అన్నారు. '40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే, ఇప్పుడు సమయం, కౌంట్ డౌన్ తో పాటు రాకెట్ కూడా మనదే‘ అన్నారు. వ్యోమగాములను కలుసుకుని జాతికి పరిచయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని యావత్ దేశం తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు.

వ్యోమగాముల పేర్లను ప్రస్తావిస్తూ, వారి పేర్లు భారతదేశ విజయంతో కలిసిపోయాయని, అవి నేటి భారతదేశ  విశ్వాసం, ధైర్యం, శౌర్యం  క్రమశిక్షణకు ప్రతీక అని ప్రధాన మంత్రి అన్నారు. శిక్షణ పట్ల వారి అంకితభావం,  స్ఫూర్తిని ఆయన ప్రశంసించారు.  “వారు భారతదేశ అమృత్ తరానికి ప్రతినిధులు, వారు ఎన్నడూ వెనుదిరగరు,  అన్ని ప్రతికూలతలను సవాలు చేసే శక్తిని చూపుతారు” అన్నారు. ఈ మిషన్ కోసం ఆరోగ్యకరమైన శరీరం , ఆరోగ్యకరమైన మనస్సు ఆవశ్యకతను తెలియ చేస్తూ, ట్రైనింగ్ మాడ్యూల్ లో భాగంగా యోగా పాత్రను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘దేశ ప్రజల ఆకాంక్షలు, ఆశీస్సులు మీపై ఉన్నాయని‘ ప్రధాని మోదీ పేర్కొన్నారు. గగన్ యాన్ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇస్రోకు చెందిన స్టాఫ్ ట్రైనర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

నలుగురు వ్యోమగాముల శిక్షణకు అంతరాయం కలిగించే విధంగా ప్రముఖుల దృష్టి గురించి ప్రధాని కొన్ని ఆందోళనలను వ్యక్తం చేస్తూ, వ్యోమగాములు ఎలాంటి అంతరాయాలు లేకుండా శిక్షణ కొనసాగించేందుకు వారి కుటుంబాలు, ఇతరులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అధికారులు గగన్ యాన్ గురించి ప్రధానికి వివరించారు. గగన్ యాన్ లో చాలా పరికరాలు మేడ్ ఇన్ ఇండియావి కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ ప్రవేశించడంతో గగన్ యాన్ సన్నద్ధత సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు అంకితమైన ప్రాజెక్టులు కొత్త ఉద్యోగాలకు దారితీస్తాయని, భారతదేశ ప్రతిష్ఠను పెంచుతాయని ఆయన అన్నారు.

భారత అంతరిక్ష కార్యక్రమంలో నారీ శక్తి పాత్రను ప్రశంసిస్తూ, "అది చంద్రయాన్ అయినా గగన్ యాన్ అయినా, మహిళా శాస్త్ర వేత్తలు లేకుండా ఇలాంటి ప్రాజెక్టును ఊహించలేం" అని ప్రధాన మంత్రి అన్నారు. ఇస్రోలో 500 మందికి పైగా మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉన్నారని తెలిపారు.

యువ తరంలో  సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించే బీజాలు వేయడంలో భారత అంతరిక్ష రంగం పాత్ర కీలకమని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇస్రో సాధించిన విజయం నేటి పిల్లలలో శాస్త్రవేత్తగా ఎదగాలనే ఆలోచనను నాటిందని అన్నారు. "రాకెట్ కౌంట్ డౌన్ భారతదేశంలోని లక్షలాది మంది పిల్లలకు స్ఫూర్తినిస్తుంది,  ఈ రోజు కాగితపు విమానాలను తయారు చేసేవారు మీలాంటి శాస్త్రవేత్తలు కావాలని కలలు కంటున్నారు" అని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాన మంత్రి అన్నారు. యువత సంకల్పబలం దేశ సంపదను సృష్టిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయం దేశంలోని ప్రతి చిన్నారికి ఒక అభ్యాస అనుభవం అని, గత ఏడాది ఆగస్టు 23 న చంద్రయాన్ 3 ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడం యువతలో కొత్త శక్తిని నింపిందని ఆయన అన్నారు. "ఈ రోజును ఇప్పుడు అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం" అని ఆయన తెలియజేశారు, అంతరిక్ష రంగంలో దేశం సాధించిన వివిధ రికార్డులను వివరించారు.  తొలి ప్రయత్నంలో అంగారక గ్రహాన్ని చేరుకోవడం, ఒకే మిషన్ లో 100కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించడం, భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఆదిత్య ఎల్ 1 సోలార్ ప్రోబ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడం వంటి విజయాలను ఆయన ప్రస్తావించారు. 2024 మొదటి కొన్ని వారాల్లో ఎక్స్ పో-శాట్, ఇన్ శాట్-3డీఎస్ సాధించిన విజయాలను కూడా ఆయన ప్రస్తావించారు.

'మీరంతా భవిష్యత్ అవకాశాలకు కొత్త ద్వారాలు తెరుస్తున్నారు' అని ఇస్రో బృందం తో ప్రధాని మోదీ ఆన్నారు. రానున్న పదేళ్లలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు వృద్ధి చెంది 44 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రధాని అన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ గ్లోబల్ కమర్షియల్ హబ్ గా మారుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ మరోసారి చంద్రుడిపైకి వెళ్లనుంది. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించే కొత్త ఆకాంక్ష గురించి కూడా ఆయన తెలియజేశారు. వీనస్ కూడా రాడార్ లో ఉందని చెప్పారు. 2035 నాటికి భారత్ కు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా, "ఈ అమృత్ కాల్ లో, ఒక భారతీయ వ్యోమగామి భారతీయ రాకెట్ లో చంద్రుడిపై దిగుతాడు" అని ప్రధాని మోదీ అన్నారు. 2014కు ముందు దశాబ్దంతో గత పదేళ్లలో అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయాలను పోల్చిన ప్రధాన మంత్రి, దేశం కేవలం 33 ఉపగ్రహాలతో పోలిస్తే సుమారు 400 ఉపగ్రహాలను ప్రయోగించిందని, యువత ఆధారిత అంతరిక్ష స్టార్టప్ ల సంఖ్య రెండు లేదా మూడు నుండి 200కు పెరిగిందని పేర్కొన్నారు. వారు ఈ రోజు పాల్గొనడాన్ని  ప్రస్తావిస్తూ, వారి దార్శనికత, ప్రతిభ వారి వ్యవస్థాపకతను ప్రశంసించారు. అంతరిక్ష రంగానికి ఊతమిచ్చే అంతరిక్ష సంస్కరణలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.  అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడుల కోసం ఇటీవల ఆమోదించిన ఎఫ్ డి ఐ విధానాన్ని ప్రస్తావించారు. ఈ సంస్కరణతో ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష సంస్థలు ఇప్పుడు భారత్ లో తమను తాము స్థాపించుకోగలవని, యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించ గలవని  ప్రధాన మంత్రి అన్నారు.

వికసిత్ గా మారాలన్న భారతదేశ సంకల్పాన్ని ప్రస్తావిస్తూ, ఇందులో అంతరిక్ష రంగం పాత్రను ప్రధాన మంత్రి వివరించారు. “స్పేస్ సైన్స్ కేవలం రాకెట్ సైన్స్ మాత్రమే కాదు. ఇది అతిపెద్ద సామాజిక శాస్త్రం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వల్ల సమాజానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయం, వాతావరణ సంబంధిత, విపత్తు హెచ్చరికలు, నీటి పారుదల సంబంధిత, నావిగేషన్ మ్యాప్ లు, మత్స్యకారుల కోసం నావిక్ వ్యవస్థ వంటి ఇతర ఉపయోగాలను ఆయన ప్రస్తావించారు. సరిహద్దు భద్రత, విద్య, ఆరోగ్యం ఇంకా మరెన్నో అంతరిక్ష విజ్ఞాన ఇతర ఉపయోగాలను ఆయన వివరించారు.  "విక సిత్ భారత్ నిర్మాణంలో మీరందరూ, ఇస్రో, మొత్తం అంతరిక్ష రంగం పాత్ర ఎంతో ఉంది" అని ప్రధాన మంత్రి ముగించారు.

ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్, కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఇస్రో చైర్మన్ శ్రీ ఎస్.సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.

 నేపథ్యం

తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సందర్శన సందర్భంగా మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతో , దేశ అంతరిక్ష రంగాన్ని , దాని పూర్తి సామర్థ్యాన్ని సాకారం చేయాలన్న ప్రధాన మంత్రి దార్శనికతకు , ఈ రంగంలో సాంకేతిక, పరిశోధన , అభివృద్ధి సామర్థ్యాన్ని పెంచాలన్న ఆయన నిబద్ధతకు ఊతం లభించింది.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఎస్ఎల్ వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పిఐఎఫ్); . మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో కొత్త 'సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ'; తిరువనంతపురంలోని వి.ఎస్.ఎస్.సి వద్ద 'ట్రైసోనిక్ విండ్ టన్నెల్' ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. అంతరిక్ష రంగానికి ప్రపంచ స్థాయి సాంకేతిక సౌకర్యాలు కల్పించే ఈ మూడు ప్రాజెక్టులను సుమారు రూ.1800 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని పిఎస్ ఎల్ వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పిఐఎఫ్ ) పిఎస్ ఎల్ వీ ప్రయోగాల ఫ్రీక్వెన్సీని ఏడాదికి 6 నుంచి 15కు పెంచడానికి దోహదపడుతుంది. ఈ అత్యాధునిక సదుపాయం ప్రైవేటు అంతరిక్ష సంస్థలు రూపొందించిన ఎస్ ఎస్ ఎల్ వి, ఇతర చిన్న ప్రయోగ వాహనాల ప్రయోగానికి కూడా ఉపయోగపడుతుంది.

ఐ పి ఆర్ సి మహేంద్రగిరిలో కొత్త 'సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ' సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు  దశల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది, ఇది ప్రస్తుత ప్రయోగ వాహనాల పేలోడ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. 200 టన్నుల థ్రస్ట్ వరకు ఇంజిన్లను పరీక్షించడానికి లిక్విడ్ ఆక్సిజన్ , కిరోసిన్ సరఫరా వ్యవస్థలను కలిగి ఉంది.

వాతావరణ వ్యవస్థలో ఎగిరే సమయంలో రాకెట్లు, విమానాల క్యారెక్టరైజేషన్ కోసం ఏరోడైనమిక్ పరీక్షకు విండ్ టన్నెల్స్ అవసరం. వి.ఎస్.ఎస్.సి వద్ద ప్రారంభించబడుతున్న "ట్రైసోనిక్ విండ్ టన్నెల్" ఒక సంక్లిష్టమైన సాంకేతిక వ్యవస్థ, ఇది మన భవిష్యత్తు సాంకేతిక అభివృద్ధి అవసరాలను తీరుస్తుంది.

ప్రధాన మంత్రి తన పర్యటన లో గగన్ యాన్ మిషన్ పురోగతిని సమీక్షించడంతో పాటు ఇందులో పాల్గొనే వ్యోమగాములకు 'వింగ్స్ ' ప్రదానం చేశారు.  గగన్ యాన్ మిషన్ భారతదేశ మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయోగ కార్యక్రమం, దీని కోసం వివిధ ఇస్రో కేంద్రాల్లో విస్తృతమైన సన్నాహాలు జరుగుతున్నాయి.

 

 

***

DS/TS



(Release ID: 2009425) Visitor Counter : 146